డైలీ సీరియల్

దూతికా విజయం-71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరభద్రుణ్ణి ఏవిధంగానైనా సరే తన శయన మందిరంలోకి తీసుకొని రావాలని రాణి ఆజ్ఞ. తాను ఎన్ని కష్టాలు పడి, ఎన్ని అవస్థలపాలై ఇతన్ని పట్టుకొచ్చినా ఆమె పట్టించుకోదు; తన ఆజ్ఞ ప్రకారం అంతా సక్రమంగా జరిగిందా లేదా అనేదే రాణి చూసేది. నిజానికి ఈ భాగోతమంతా వినేందుక్కూడా రాణికి విసుగనిపిస్తుంది. కాకపోతే ఇన్ని క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించి విజయాన్ని సాధించినందుకు మరింత అధికంగా తనను అభినందించవచ్చు; మెచ్చుకొని హెచ్చుగా చూడవచ్చు- అంతే!
రాణి వీరభద్రుణ్ణి కోరిందేగాని, ‘పరమ పవిత్రుడైన వీరభద్రుడు!’ అని సూచించనూ కూడా లేదు. ఆ మాటకొస్తే కలుషితం కానిదాన్ని ప్రకృతే నిర్దేశించలేదు. ప్రతి జన్మకూ రెండు రక్తాలు కలిసే ఉన్నది కదా! ఆకాశం నుంచి వానగా విడుదలైన నీరు సైతం, భూమి మీద పడకముందే అనేక రేణువులతో కలిసి వస్తున్నది. బంగారం వంటి లోహరాజం మట్టి లో కలిసి లభిస్తున్నది. దాన్ని వెలికిలాగి, మట్టిలో నుండి విడదీసుకొని, కొలిమిలో కాల్చి, ఇతర పదార్థాలను తొలగిస్తేకాని అసలు లోహం చేజిక్కటం లేదు. అందుకని ఈ వీరభద్రుడు పరమ పవిత్రుడే కావలసిన అవసరం ఎంతమాత్రమూ ఉండనవసరంలేదు. ఇంత స్వచ్ఛమైన బంగారాన్ని ఉపగించాలంటే, దాన్ని మళ్లీ తక్కువ రకం లోహంతో కలపందే లొంగదు కదా!
ఇక తాను ఎంగిలిచేసి రాణికి సమర్పించటమనే ప్రశ్న వస్తే కావాలని తానీ పని చేయటంలేదు. అవసరమై అనుసరిస్తూన్నది.
స్వాప్నవికాసనుభూతిలో తా నొక స్థితిలో వీరభద్రుని పొందు కోరింది కూడాను. అంటే తనకు తెలియకుండానే తన రుూ కోర్కె తనలో లోతుగా పాతుకున్నది. దాన్ని జయించానని అనుకుంటున్నదే కాని, అంతరాంతరాల్లో దానిదే పై చెయ్యి అయిందేమో?
ఇప్పుడీ వీరభద్రుణ్ని కొల్లగొట్టడం తన వంతయితే, తన భాగానికి రావలసినదాన్ని కూడా రాబట్టుకోవడంలో అక్రమం ఏమున్నది?
రాణీ తనూ ఒక కంచాన తిని, ఒక మంచాన పరుండిన ప్రియసఖులు. ఒకరినొకరు అపార్థం చేసుకోవలసిన అవసరం లేదు కదా, ఈ సందర్భంలో భాగస్వాములై ఆ స్నేహాన్ని మరింత బలవత్తరం చేసుకున్న వారౌతారు!
ఐతే తనతో సహకరించి వీరభద్రుడు తనను అనుసరించాలి. శారీరకంగా తాను అతన్ని రాణివాసం దాకా మోయలేదు కదా! బరువైన ఈ రెండడ్ల బండిని లాగేందుకు తానొక పశువైతే, వీరభద్రుడు రెండోకాడిని, మెడకు వేసుకోవలసినవాడు. దారికి అడ్డం పడకుండా అక్కడ కాపలావాణ్ణి ఆకట్టుకోవడం అదివరకే జరిగింది!
ఇక రుూ పశువులు రెండూ సవ్యంగా ఉండి రుూ బండిని ఈడవవలసి ఉన్నది. అంతేకాని ఒకటి ఒక పక్కకూ, ఇంకోటి ఇంకో పక్కకు లాగితే ఒకదానిమీద మరోటి విరోధం పూని, ఒకదాన్ని మరోటి ఎదుర్కొని పోరాడినట్లు త్వరలోనే అలసిపోయి కూలబడాల్సిందే తప్ప బండి ముందుకు సాగేందుకు ఎలాంటి అవకాశమూ ఉండదు.
అదీగాక ఈ విధంగా ఉభయులూ కలిసి భారాన్ని ఎదుర్కొన్నట్లయితే బండి గాడి తప్పుతుంది. అప్పుడు దాన్ని లాగటం దుర్లభం. కనుక బండి చక్రాలు సరిగ్గా గాడిలో పడేట్టు చూడటంలోనే సౌలభ్యాన్ని సాధించవచ్చు. అందుకే తాను తంటాలు పడాలి కూడాను. చక్రాలు గాడిలో ఉంటే తేలిగ్గానే గాక, వేగంగా కూడా బండి ముందుకు సాగుతుంది. ఉభయులకూ అనవసరపు శ్రమ తప్పుతుంది.
మంచితో విషయం తాగించవచ్చు. చెడుతో అమృతం తాగించలేమనే సిద్ధాంతం తనకు తెలియనిదా? దాన్నిప్పుడు ప్రయోగించవలసిన సమయం కూడాను.
తానీ కార్యాన్ని సాధించలేకుంటే రాణి మనశ్శాంతి శాశ్వతంగా భంగమై తన పట్ల అగ్గిమీద గుగ్గిలమే అవుతుంది. చెప్పటం ఎంత తేలికో, చేయటం అంత కష్టం, చేసినదాన్ని తప్పులు పట్టి ‘అలా ఎందుకు చేయలేదు- అలా ఎందుకు ప్రవర్తించలేదూ?’ అని సవాళ్ళు వేయటం రాణి వంతయితే, తృప్తికరమన సంజాయిషీలు చెప్పుకోవటం తనవంతవుతుంది. తాను ఎంత మంచి తర్కంతో వివరంగా విశదీకరించినా రాణికి తృప్తి ఉండదు. ఈ రభసంతా తన పరాజయ కారణంగానే తనను ముంచెత్తుతుంది. పోతే విజయ సాధనకు కంకణం కట్టిన ధీరచిత్తులు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, ఎదురొడ్డి పోరాడి గెలవాలేకాని పిరికిపడి వెన్నిచ్చి పారిపోతారా?
రాణి దూరాన వున్న ఫలాన్ని కోరింది. కాని తాను దగ్గరికొచ్చి చూస్తే ఇదొక పచ్చికాయగా కనిపిస్తోంది. పిచ్చికాయేమో కూడా తనకూ ఇంకా నిశ్చయంగా తెలియదు. పిచ్చికాయ కాకున్నా, పచ్చిదాన్ని రాణికి ఎలా అర్పించటం? చెట్టునే పండాలంటే చాలాకాలం పడుతుంది. ఈలోగానే ఇంకెవరన్నా తన్నుకుపోవచ్చు. లేదా పక్షులు పొడుచుకుని తినవచ్చు. కనుక తాను ఈ పచ్చిదాన్ని కోసి లోతుగా పాతి, మాగేసి పక్వమవటాన్ని వేగపరిచి, తీసుకొనివెళ్తే రాణి ఎంతో సంతోషిస్తుంది. కనుక రాణి కోరిన రూపానికి దీన్ని మార్చటమనే బాధ్యత తన భుజస్కంధాలమీద ఉన్నది.
‘స్వార్థమే పరమార్థం’ అన్నదాన్ని గాఢమైన నమ్మకంతోనే ఈ మానవాళి దైనందిన జీవితాన్ని గడుపుతున్నది. వీరభద్రునిలో ఎంత స్వార్థమున్నదని కాదు తాను ఆలోచించేది. దానికో కొలపాత్ర ఎక్కడున్నది? దాన్ని ప్రయోగించే సమయమూ, సందర్భమూ రావాలి కదా!
తాను అర్థించినదానికి ఒక విలువ కట్టాడతను. ఎవరి వస్తువును వారు ఎదుటి వ్యక్తిని బట్టీ, తాహతను బట్టీ వెల చెపుతారు కదా! ఈ వ్యాపారంలో ఎంత ఎక్కువ రాబట్టేందుకు వీలున్నదో చూసే పాచిక పారుతుందేమోనని ప్రయత్నిస్తారు. ఇప్పుడు సరిగ్గా వీరభద్రుడు తన వెలను నిర్ణయించాడు; బేరసారాలు లేవని ఖచ్చితంగా చెప్పేశాడు.
ఇష్టమైతే తానా వెల చెల్లించి కొనుక్కోవాలి లేదా తోక ముడుచుకోవాలి, అంతే! ఇంతకన్నా అత్యధికంగా అతను కోరనందుకు తను సంతోషించి, ఇదే చౌక అనుకోవాలి. తాను ఈ వెల చెల్లించగలిగి ఉండీ, అమూల్యమని భావించిన దాన్ని వదిలేసి వొట్టి చేతులతో వెళ్ళటం అవివేకమే అవుతుంది కదా!
స్వార్థాన్ని ద్వేషిస్తాం కాని అదే లేకుంటే ఈ ప్రపంచానికి ఒక్క క్షణం గడుస్తుందా? వీరభద్రుని స్వార్థం తనకు నష్టదాయకంగా ఉన్నది కనుక, తను చికాకు పడుతున్నది కానీ, తన స్వార్థాన్ని సాధించదలచుకొని వేసిన ఈ పథకంలో తనకెంత న్యాయం వున్నదో, అదేవిధంగా అతని దృష్టిలో వీరభద్రుని స్వార్థంలో కూడా అంతే న్యాయం ఉన్నదని, తాను ఎందుకు అంగీకరించరాదు?
ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేందుకు ఒక సుళిసూత్రం ఉన్నది. తానున్న స్థితిలో ఆ వ్యక్తిని ఉంచి, ఆ వ్యక్తి స్థానంలో తానున్నట్టు ఊహించుకోగలిగితే అది కదళీపాకంగానే తెలిసి వస్తుంది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు