క్రైమ్ కథ

మారిన గమ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇంత దాకానే నీకు లిఫ్ట్ ఇవ్వగలను’ హైవే రోడ్ మీద కారుని ఆపి డ్రైవర్ చెప్పాడు.
క్రిస్ట్ఫర్ తను ప్రేమించిన సూని కలవడానికి, పెళ్లి చేసుకోడానికి న్యూయార్క్ నించి బయలుదేరాక ఎక్కిన నాలుగో కారు అది. అందులోంచి తన సూట్‌కేస్‌తో దిగిన క్రిస్ట్ఫర్ కారు వెళ్లిపోయినా కదల్లేదు. మళ్లీ లిఫ్ట్ ఇవ్వమని కోరుతూ కుడిచేతి బొటన వేలుని పైకెత్తి చూపిస్తూ అక్కడే నిలబడ్డాడు. చాలా కార్లు ఆగలేదు. అతను సమీపంలోని రెస్ట్‌రెంట్‌లోకి నడిచాడు. సూకి ఫోన్ చేసి తను ఎంత దాకా వచ్చాడో చెప్పాడు. శాండ్‌విచ్ తిని, బీర్ తాగుతూండగా ఓ వ్యక్తి అడిగాడు.
‘ఎటు?’
‘వెస్ట్‌కి’ క్రిస్ట్ఫర్ చెప్పాడు.
‘సరే. నాతో రా. నేను మా నాన్న దగ్గరకు వెళ్తున్నాను. నేను పద్దెనిమిది ఏళ్ల క్రితం ఆయన్ని వదిలి, ఇల్లు వదిలి వెళ్లిపోయాను. మళ్ల మొదటిసారి వెళ్తున్నాను. అభిప్రాయ భేదాలు’
వెయిట్రెస్‌ని పిలిచి చెప్పాడు.
‘హలో గ్లామరస్. బిల్’
ఆమెకి తన బిల్‌తోపాటు పెద్ద టిప్‌ని ఇచ్చాడు.
‘్థంక్స్’ ఆమె ఆనందంగా చెప్పింది.
ఇద్దరూ బయటకి వచ్చారు. ఆ ఓపెన్ టాప్ స్పోర్ట్స్ కారు వెనుక సీట్లో తన సూట్‌కేస్‌ని ఉంచి క్రిస్ట్ఫర్ తలుపు తెరిచి డ్రైవర్ సీట్ పక్కన పేసెంజర్ సీటులో కూర్చున్నాడు.
‘ఎక్కడ నించి?’ అతను అడిగాడు.
‘ఈస్ట్ నించి?’
‘గమ్యం?’
‘వెస్ట్‌కి’
‘లాస్ ఏంజెలస్‌కా?’
‘కావచ్చు’ క్రిస్ట్ఫర్ జవాబు చెప్పాడు.
‘నా పేరు ఛార్లెస్ హస్కిల్’ అతను చెప్పాడు.
‘క్రిస్ట్ఫర్’
‘చాలా దూరం వచ్చావు. హిచ్‌హైకింగ్ తేలిక కాదు కదా?’
‘అది ఎడ్యుకేటింగ్’
‘పెళ్ళైందా?’
అతను జవాబు చెప్పలేదు.
‘ఏం చేస్తూంటావు?’
‘మా అమ్మ కొత్త వాళ్లతో మాట్లాడద్దంది’
‘నీకు డ్రైవింగ్ వచ్చా?’
‘వొచ్చు. మీకు నిద్ర వస్తే చెప్పండి. నేను చేస్తాను’ క్రిస్ట్ఫర్ చెప్పాడు.
‘ఆడవాళ్లకి లిఫ్ట్ ఇవ్వకూడదు. వాళ్లంతా డబ్బు మనుషులు. నీకు ముందు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి పొగరుబోతు. ఐశ్వర్యాన్ని మాత్రమే పూజించే వ్యక్తి. అలాంటి ఆడవాళ్లని పది లక్షల మందిని చూశాను. నేను చిన్నప్పుడే మా ఇంట్లోంచి పారిపోయాను. మళ్లీ వెళ్లలేదు. ఆకలిగా ఉంది. ఏదైనా తిందాం’
నాలుగు గంటల తర్వాత కారుని ఓ రెస్ట్‌రెంట్ పార్కింగ్ లాట్‌లో ఆపాడు. ఇద్దరూ కారు దిగి రెస్ట్‌రెంట్ గుమ్మం దాకా వెళ్లాక తన దగ్గర డబ్బు లేకపోవడంతో క్రిస్ట్ఫర్ చెప్పాడు.
‘నేను ఇక్కడ వేచి ఉంటాను. మీరు వెళ్లి తిని రండి’
‘కమాన్. నువ్వు ఆకలిగా ఉండటం నాకు ఇష్టం లేదు’
అతను రెస్ట్‌రెంట్లో తన తండ్రి గురించి మాట్లాడిన దాన్ని బట్టి, ఆయన్ని వదిలి వెళ్లాననే అపరాధ భావం హస్కిల్ మాటల్లో తోచింది. హస్కిల్ బిల్ చెల్లించాక బయటికి వచ్చారు. మళ్లీ బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లాక హస్కిల్ అడిగాడు.
‘నాకు నిద్ర వస్తోంది. నీకు?’
‘లేదు. నేను డ్రైవ్ చేస్తాను’
ఇద్దరూ సీట్లు మారాక క్రిస్ట్ఫర్ డ్రైవ్ చేయసాగాడు. దారిలో కార్లో పెట్రోల్‌ని కొట్టించుకున్నారు. క్రమంగా అతనికి కూడా నిద్ర రాసాగింది. దాన్ని బలవంతంగా ఆపుకుని డ్రైవ్ చేయసాగాడు.
* * *
వర్షం మొదలవడంతో క్రిస్ట్ఫర్ కారుని ఆపి తల తిప్పి సీట్‌కి తలని ఆన్చి నిద్రపోయే హస్కోతో చెప్పాడు.
‘మిస్టర్ హస్కిల్. లేవండి. వర్షం పడుతోంది’
అతను కారు ఆపి దిగి, ఆ కార్ టాప్‌ని మూసేసే ప్రయత్నం చేశాడు. కాని చేతకాకపోవడంతో మళ్లీ పిలిచాడు.
‘మిస్టర్ హస్కిల్! వర్షం. ఈ టాప్‌ని ఎలా పైకి నెట్టడం?’
అడుగుతూ అతను కూర్చున్న వైపు తలుపుని తెరిచాడు. తక్షణం అతను సీట్లోంచి కింద బురదలోకి పడిపోయాడు. అతని నాడిని పరీక్షించి మరణించాడని గ్రహించాడు. తన గమ్యం మారిందని ఆ క్షణంలో అతనికి తెలీదు.
వెంటనే తను చిక్కుకున్న పరిస్థితి అతనికి అవగతం అయింది. హస్కిల్ ఆ కార్లో మరణించాడు. తనే అతన్ని చంపాడని పోలీసులు నమ్ముతారు. వెంటనే అతనికి పారిపోవడం మంచిదనిపించి వెనక సీట్లోని తన సూట్‌కేస్‌ని అందుకున్నాడు. నాలుగు అడుగులు వేశాక అతనికి ఇంకో ఆలోచన కలగడంతో ఆగిపోయాడు. రెస్ట్‌రెంట్‌లోని వెయిట్రెస్, పెట్రోల్ బంక్‌లోని కుర్రాడు తనని చూశారు. తన గురించి పోలీసులకి వారు చెప్తారు. వెంటనే సూట్‌కేస్‌ని మళ్లీ యథాస్థానంలో ఉంచి హస్కిల్ శవాన్ని రోడ్డు పక్కకి లాక్కెళ్లాడు. కార్లో కూర్చుని దాన్ని స్టార్ట్ చేయబోయే ముందు ఫ్యూయల్ నీడిల్ మీద అతని దృష్టి పడటంతో అందులోని పెట్రోల్ ఇంకో వంద మైళ్లు మాత్రమే వస్తుందని తెలిసింది. ఆ తర్వాత?
క్రిస్ట్ఫర్ కారు దిగి హస్కిల్ జేబులు వెదికి పర్స్‌ని తీసుకుని తెరిచి చూశాడు. డ్రైవింగ్ లైసెన్స్, ఏడు వందల అరవై ఎనిమిది డాలర్లు కనిపించాయి. అంత ఖరీదైన కారు యజమాని తను ధరించిన లాంటి చవక దుస్తులు ధరించడు అని పోలీసులు తనని ఆపచ్చు. అతని దుస్తులని తను ధరించి తనవి అతనికి తొడిగాడు. తన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పర్స్‌ని కూడా అతని జేబులో ఉంచాడు. తన సూట్‌కేస్‌ని కూడా అతని పక్కన ఉంచి కారెక్కాడు. ఇప్పుడు ఎవరైనా అతని శవాన్ని కనుగొన్నా అంతా తన శవం అనుకుంటారు.
* * *
తలుపు మీద ఎవరో కొడుతున్న చప్పుడికి మోటెల్ గదిలో పడుకున్న క్రిస్ట్ఫర్‌కి మర్నాడు ఉదయం మెలకువ వచ్చింది.
‘ఎవరది?’ కొద్దిగా భయంగా అడిగాడు.
‘బ్రేక్‌ఫాస్ట్ తెచ్చాను’ ఓ ఆడకంఠం వినిపించింది.
‘ఇప్పుడు కాదు. ఇంకో అరగంట తర్వాత’ చెప్పాడు.
‘మీ గుమ్మం బయట ట్రేని వదిలి వెళ్తున్నాను’
అతను త్వరగా డ్రెస్ చేసుకున్నాడు. అతనికి తన జేబులో ఓ ఉత్తరం కనిపించింది. అది హస్కిల్ తండ్రి అతన్ని ఇంటికి రమ్మని కోరుతూ రాసిన ఉత్తరం. ఆ మోటెల్ నించి బయలుదేరాడు.
ఓ చోట పెట్రోల్ బంక్‌లో ఆగినప్పుడు నేల మీద సూట్‌కేస్‌తో ఎవరైనా లిఫ్ట్ ఇస్తారని ఎదురుచూస్తూ నిలబడ్డ పాతికేళ్లలోపు యువతి కనపడింది. లిఫ్ట్ దొరక్క పడే అవస్థ అతనికి అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి ఆమెకి వినపడేలా చెప్పాడు.
‘కావాలంటే లిఫ్ట్ ఇస్తాను’
వెరా తన సూట్‌కేస్‌ని అందుకుని అతని కారు వైపు నడిచింది.
‘నా పేరు వెరా’ కారు బయలుదేరాక చెప్పింది.
‘ఎంత దూరం?’
‘మీరు ఎంత దూరం?’ వెరా ఎదురుప్రశ్న వేసింది.
‘లాస్ ఏంజెలెస్’
‘నేను ఫీనిక్స్‌కి’
దాదాపు పాతికేళ్లుండే ఆమె అందంగా ఉందని అనుకున్నాడు. కాని ఎయిర్‌హోస్టెస్‌ల అందం కాదు. భార్యకి ఉండాల్సిన అందం అని కూడా అనుకున్నాడు. ఆమె కారు బయలుదేరిన ఐదు నిమిషాలకి సీట్‌కి ఆనుకుని నిద్ర పోయింది. తను కొన్ని గంటల్లో లాస్‌ఏంజెలెస్‌కి చేరుకుని కారుని ఎక్కడైనా వదిలేశాక ఈ పీడకల అంతం అవుతుంది. అంత పెద్ద ఊళ్లో ఎవరూ తన కోసం వెదకరు.
మేలుకున్న కొద్దిసేపటికి వెరా అడిగింది.
‘ఎక్కడైనా ఆపు. ఆకలి వేస్తోంది’
కొద్ది క్షణాల తర్వాత అకస్మాత్తుగా అడిగింది.
‘ఈ కారుని ఎక్కడ దొంగిలించావు?’
‘ఏమిటి?’
‘ఈ కారు యజమాని నాకు తెలుసు. అతని పేరు మిస్టర్ ఛార్లెస్ హస్కిల్’ ఆమె గట్టిగా అడిగింది.
‘నేనే ఛార్లెస్ హస్కిల్‌ని. నేను అది రుజువు చేయగలను. నా డ్రైవింగ్ లైసెన్స్‌ని కావాలంటే చూడచ్చు’ క్రిస్ట్ఫర్ జవాబు చెప్పాడు.
‘నువ్వు నన్ను మోసం చేయలేవు. నాకు అతను వ్యక్తిగతంగా తెలుసు. అతను మొన్న నాకు లిఫ్ట్ ఇచ్చాడు’
హస్కిల్ తనకి చెప్పిన యువతి ఈమే అయి ఉండచ్చు అని అనుకున్నాడు. సరిగ్గా ఆమెనే తను ఎక్కించుకోవడం తన దురదృష్టం! అతను జరిగింది చెప్పాడు.
‘ఇది నమ్మదగ్గదిగా లేదు. నువ్వు అతన్ని చంపి ఈ కారుని దొంగిలించి ఉంటావు. నేను ఈ విషయంలో నోరు మూసుకుని ఉంటానని అనుకుంటున్నావా?’ వెరా గద్దించింది.
‘నేను చెప్పింది నిజం. నువ్వు అనుకుంటున్నట్లుగా హంతకుడ్ని కాను. దయచేసి నా దారిన నన్ను వదులు’ క్రిస్ట్ఫర్ అర్థించాడు.
‘అతని నించి ఎంత కొట్టేసావు?’
‘ఏడు వందల అరవై ఎనిమిది డాలర్లు అతని పర్స్‌లో ఉన్నాయి’
‘అతని దగ్గర మూడు వేల డాలర్ల కట్టని చూశాను. నీకన్నా అతను నాకు బాగా తెలుసు. నువ్వు చిల్లర హంతకుడివి’
‘నేను హంతకుడ్ని కాను’
‘నాకు నీకన్నా హస్కిల్ ప్రియమైనవాడు కాడు’
‘నీ చేతి మీది రక్కులు చూశాను’
‘పోలీసులు ఈ కార్‌ని ఆపితే ఎవరు దీని యజమాని అని అడుగుతారు’
‘అది నాకు తట్టలేదు’
‘ఎల్ ఏకి చేరాక ఈ కారుని అమ్మేద్దాం. ఓనర్‌షిప్ పేపర్ల మీద ఫొటో ఉండదు. దీనికి రెండు వేల డాలర్ల దాకా రావచ్చు. నాకు కొంత పర్సంటేజ్ ఇస్తావా?’ వెరా అడిగింది.
‘ఇస్తాను’ క్రిస్ట్ఫర్ చెప్పాడు.
‘మంచిది. వంద శాతం నాకు కావాలి. థాంక్ యూ. నేను షాపింగ్ చేయాలి. అంతదాకా నువ్వు నన్ను అంటిపెట్టుకునే ఉండాలి. లేదా...’ హెచ్చరిక ధ్వనించే కంఠంతో చెప్పింది.
వారి కారు ఎల్ ఏకి చేరుకున్నాక ఓ మోటెల్‌లో మిస్టర్ అండ్ మిసెస్ ఛార్లెస్ హస్కిల్ పేర గదిని తీసుకుని ఆమెతో చెప్పాడు.
‘కార్ ఆ పేరు మీద ఉంది కాబట్టి ఆ పేరనే గది తీసుకోవడం మంచిది. ఇంకో పేరుతో గది తీసుకోవడం నాకు వింతగా ఉంది’
సూట్‌లోకి వెళ్లాక వెరా దాన్ని చూసి చెప్పింది.
‘నేను లోపల బెడ్‌రూంలో పడుకుంటాను. నువ్వు ముందు గదిలో సోఫాలో పడుక్కో’
ఆ రాత్రి అతను హోటల్ సూట్‌లోంచి బయటకి వెళ్లకుండా వెరా తాళం వేసి తాళం చెవిని తన దగ్గరే దాచుకుంది. మర్నాడు కార్‌ని అమ్మేసి వెరాకి డబ్బు ఇచ్చేశాక ఇంక ఎవరి దారి వారిది అని క్రిస్ట్ఫర్ అనుకున్నాడు.
* * *
‘పదహారు వందల డాలర్లు’ సెకండ్ హేండ్ కారు డీలర్ చెప్పాడు.
‘జోక్ చేస్తున్నావా?’ వెరా గద్దిస్తూ అడిగింది.
ఆ కారు చుట్టూ తిరిగి చూసి మళ్లీ చెప్పాడు.
‘పద్దెనిమిది వందల ఏభై. అంతకు మించి ఒక్క సెంట్ కూడా ఇవ్వను. ఇష్టం ఉంటే ఓనర్‌షిప్ కాగితాలతో నా ఆఫీస్ గదిలోకి రండి. ఈలోగా మా మెకానిక్ ఇంజన్‌ని ఓసారి తనిఖీ చేస్తాడు’
క్రిస్ట్ఫర్ డేష్ బోర్డ్‌లోంచి ఆ కాగితాలు తీసుకుని దిగి అతని వెంట వెళ్తూ వెరాకి చెప్పాడు.
‘నీ వైపు గ్లవ్స్ కంపార్ట్‌మెంట్‌లో విలువైనవి ఏమైనా ఉన్నాయేమో చూడు’
అతను ఆ కాగితాన్ని పరిశీలించి చూసి అడిగాడు.
‘న్యూయార్క్‌లో కొన్నారా?’
‘అవును’
‘ఏ టైప్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు?’
‘ఇన్సూరెన్స్ కాగితాలు మీకు ఇచ్చిన కాగితాల్లో లేవా?’
‘లేవు. ఏ టైప్ ఇన్సూరెన్స్?’ డీలర్ మళ్లీ అడిగాడు.
‘గుర్తు లేదు’
‘పోనీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పేరు చెప్పండి. వివరాలు కనుక్కోవడం పెద్ద కష్టం కాదు’
క్రిస్ట్ఫర్ తను చిక్కుల్లో పడ్డాడని గ్రహించాడు. యజమానికి ఇన్సూరెన్స్ కంపెనీ పేరు తెలీకుండా ఉంటుందా? తలుపు తెరచుకుని లోపలకి వచ్చిన వెరా అడిగింది.
‘సంతకం చేశావా?’
‘లేదు’ క్రిస్ట్ఫర్ జవాబు చెప్పాడు.
‘మేం మనసు మార్చుకున్నాం. అమ్మడం లేదు. పద’
క్రిస్ట్ఫర్ ఆమె వెంట నడిచి వెళ్లి కార్లో కూర్చుని చెప్పాడు.
‘నేను ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండగా సమయానికి వచ్చి నన్ను కాపాడావు’
‘ఇందులో నాకు ఈ పేపర్ కనిపించింది. ఛార్లెస్ హస్కిల్ తండ్రి హాస్పిటల్‌లో నిమోనియాతో గత మూడు వారాలుగా కోమాలో ఉన్నాట్ట. ఏకైక కొడుకు హస్కీల్‌ని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారుట. ఈ వార్త చదివే అతను తండ్రి దగ్గరికి బయలుదేరి ఉంటాడు. అతను జీవించి ఉంటే కోటిన్నర డాలర్లకి వారసుడు అయ్యేవాడు. నువ్వు హస్కీల్‌లా వెళ్లి ఆ డబ్బుకి వారసుడు అవచ్చు’
‘అసాధ్యం. నేను ఆ పిచ్చి పని చేయను. తండ్రి కొడుకుని గుర్తు పట్టలేడా?’
‘ఆయన కోమాలో ఉన్నాడు. అదీగాక గత ఇరవై ఏళ్ల నించి హస్కీల్‌ని ఎవరూ చూడలేదు. నీ డ్రైవింగ్ లైసెన్స్ ఈ వార్త చదివి తీసుకున్న కొత్తది కాదు. పదిహేనేళ్ల క్రితంది. కాబట్టి నిన్ను ఎవరూ అనుమానించరు’
‘సారీ. సహేతుకమైంది ఏదైనా చేస్తాను. కాని నేను ఇలాంటి దుర్మార్గపు పని చేయను. నువ్వు వేరే ఎవర్నైనా నీ మాట వినేవాడిని చూసుకోవచ్చు. ఒకవేళ ఆయన మరణించకపోతే?’ క్రిస్ట్ఫర్ అడిగాడు.
‘తప్పక పోతాడు. లేదా అది నాకు వదులు. మనం సరిగ్గా ప్రవర్తిస్తే ఆ డబ్బు మనదవుతుంది’
* * *
‘నేను ఒకవేళ పట్టుపడితే హస్కీని చంపిన నేరం నా మీదకి వస్తుంది. పద్దెనిమిది వందల ఏభై డాలర్లు, ప్లస్ ఐదు వందల డాలర్లు చాలా ఎక్కువ. దాంతో తృప్తి పడు’ ఆ రాత్రి హోటల్ గదిలో క్రిస్ట్ఫర్ చెప్పాడు.
‘కాని నేను కూడా దీంట్లో ఉన్నాను. నీకు శిక్ష పడితే నాకూ పడుతుంది. మనం ఇద్దరిలో ఎవరూ పట్టుపడరు’ ధైర్యం చెప్పింది.
‘నీకు మరణశిక్ష వేయరు. నువ్వు చెప్పినవన్నీ నేను చేశాను. నేను పిచ్చివాడ్ని కాను. ఇది మాత్రం చేయలేను. నువ్వు నన్ను ఈ గదిలో ఖైదీలా బంధించడం నాకు నచ్చలేదు’
‘అదే నీ ఆఖరి నిర్ణయమా?’
‘అవును’
‘నేను పోలీసులకి ఫోన్ చేసి హస్కీల్ శవం ఎక్కడుందో, నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పాను’ రిసీవర్ అందుకుని చెప్పింది.
‘నీకు అర్థం కావడంలేదు. హస్కీల్‌గా నాకు నా మతం కాని, నా తల్లి పేరు కాని, నా మిత్రుల పేర్లు కాని, ఎక్కడ చదివానో, ఏం చదివానో కాని... అతని గురించి ఎవరు ఏం అడిగినా ఒక్కటీ తెలీదు. దయచేసి నన్ను విడిచిపెట్టు’
ఆమె రిసీవర్ అందుకుని అడిగింది.
‘పోలీసులకి ఫోన్ చేసి చెప్పనా?’
‘చెప్పు’
ఆమె ఓ నంబర్ని డయల్ చేసి అడిగింది.
‘హలో? హాలీవుడ్ పోలీస్‌స్టేషన్? నేను మీకు...’
తక్షణం ఫోన్ హుక్‌ని నొక్కి లైన్‌ని కట్ చేసి చెప్పాడు.
‘మనం మాట్లాడదాం’
‘నువ్వు మాట్లాడాల్సింది ఒకటే. సరేనా? కాదా?’
‘నా సమస్యని అర్థం చేసుకో...’
‘నా జీవితంలో ఎవరైనా నాకు నో చెప్తే ఊరుకోను. సరేనా? కాదా?’ క్రోధంగా మళ్లీ అడిగింది.
‘నో’
ఆమె లేచి టెలిఫోన్ పరికరంతో బెడ్‌రూంలోకి నడిచి తలుపు మూసుకుంది.
‘పోలీసులకి డయల్ చేస్తున్నాను. వారు కొద్ది నిమిషాల్లో వచ్చాక తలుపు తెరుస్తాను’
వెరా డయల్ చేసే శబ్దం విన్నాడు. ఫోన్ పరికరం నించి వైర్‌ని తెంపడానికి దాన్ని పట్టుకుని బలంగా లాగాడు. లాగుతూనే ఉన్నాడు. కాని అది చేతికి ఊడి రాలేదు. కొద్దిసేపు ప్రయత్నించాక దాన్ని వదిలేసి బెడ్‌రూం తలుపు మీద బాదుతూ అరిచాడు.
‘వెరా... వెరా’
తలుపు తోస్తే అది తెరుచుకుంది. లోపల మంచం మీద పడుకున్న వెరా అచేతనంగా కనిపించింది. అతని గుండె ఝల్లుమంది. ఆమె మెడ చుట్టూ ఫోన్ వైర్ బిగుతుగా చుట్టుకుని ఉంది. ఆమె ఊపిరి ఆగిందని గ్రహించాక ‘నేను హంతకుడ్ని’ అన్న ఆలోచన కలిగింది. ‘కాని నేను పట్టుబడే దాకా కాదు’ అనే ఇంకో ఆలోచన కూడా కలిగింది. తను కావాలని చంపలేదు. అది ప్రమాదకరమైన మరణం అని చెప్పినా పోలీసులు, జ్యూరీ సభ్యులు నమ్మరు.
తన పేరు ఎవరికీ తెలీదని, ఆ గది ఛార్లెస్ హస్కీల్ పేర తీసుకోబడిందని, తాము వచ్చిన కారు కూడా అదే పేరు మీద ఉందని అతనికి గుర్తుకు వచ్చింది. అతను ఆమె హేండ్‌బేగ్ లోంచి ఆ గది తాళం చెవిని తీసుకుని తలుపు తెరచుకుని బయటికి నడిచాడు. ఇక తను లాస్ ఏంజెలెస్‌కి తిరిగి ఎన్నడూ రాలేడు. లాస్ ఏంజెలెస్‌లోని తను ప్రేమించిన సూకి జరిగిందని చెప్పలేడు. ఆమెని ఇక పెళ్లి చేసుకోలేడు. న్యూయార్క్‌కి తిరిగి వెళ్లాలి. హస్కీల్ ఇందులోకి తనని లాగాడు. అతనే తనని తిరిగి ఇందులోంచి బయటపడేశాడు. హస్కిల్ తన జీవితానే్న మార్చేశాడు.
ప్రస్తుతానికి తప్పించుకున్నాడు. కాని ఏదో రోజు తన ఇంటి తలుపుని తట్టడం వింటాడు. తెరిస్తే బయట పోలీసులు. ‘మీరు మాతో రావాలి’ అని పిలుస్తారు. అలాంటి రోజు తన జీవితంలో భవిష్యత్‌లో కాచుకుని ఉందని క్రిస్ట్ఫర్ దిగులుగా అనుకున్నాడు.

(మార్టిన్ గోల్డ్ స్మిత్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి