జాతీయ వార్తలు

బలవంతంగా రుద్దలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ చట్టాన్ని బలవంతంగా రాష్ట్రాల చేత అమలు చేయించలేరని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. పౌర చట్టంపై కేరళ వామపక్ష ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తలెత్తిన వివాదంపై స్పందించిన కాంగ్రెస్ నాయకత్వం ‘ఈ చట్టంపై కేంద్రంతో విభేదించే అధికారం రాష్ట్రాలకు ఉంది. సుప్రీం కోర్టులోని ఈ వ్యవహారం తేలేవరకు రాష్ట్రాలు తమకున్న హక్కును చాటిచెప్పవచ్చు’ అని తెలిపింది. పౌర చట్టాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని, పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టాన్ని నిరాకరించే అధికారం రాష్ట్రాలకు లేదని తమ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశం వివిధ రాష్ట్రాల సమాహారమన్న వాస్తవాన్ని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల గవర్నర్లు విస్మరించకూడదని ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని 131వ అధికరణ కింద తమకున్న హక్కును వినియోగించుకుని రాష్ట్రాలు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించగలుగుతాయని ఆయన అన్నారు. గతంలో కూడా కేంద్రంతో తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునేందుకు రాజ్యాంగంలోని 131 అధికరణ కింద కర్నాటక, బిహార్, రాజస్తాన్ తదితర రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించిన విషయాన్ని సుర్జేవాలా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 131వ అధికరణ కింద సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు పౌర చట్టాన్ని వ్యతిరేకించే అధికారం రాష్ట్రాలకు ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటం సాహసోపేతంగా నిర్భయంగా ముందుకు సాగుతుందని, రాజకీయ పార్టీలు, రాష్ట్రాలు కృతనిశ్చయంతో ఈ చట్టంపై తమ పోరును సాగిస్తాయని ఆయన తెలిపారు. అయితే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలు రాష్ట్రాల గవర్నర్లు చేస్తున్న ప్రకటనలు సమాఖ్య రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని సుర్జేవాలా పేర్కొన్నారు. పౌర చట్టంపై కేరళ ప్రభుత్వం తనను సంప్రదించకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించడంపై ఆ రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే.
'చిత్రం... కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా