కడప

కడప జిల్లాలో నేడు కేంద్ర కరవు బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 8: 2015 ఖరీఫ్‌లో వర్షాభావం పరస్థితుల దృష్ట్యా పంట పూర్తిగా చేతికి అందకపోవడంతోపాటు, పూర్తిస్థాయిలో పంట పొలాలు సాగుచేయనున్నందున కరవు పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర బృందం బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ కెవి.రమణ మంగళవారం పేర్కొన్నారు. ఈ కరవు పరిస్థితిని అంచనావేసేందుకు కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమశాఖ జాయింట్ సెక్రటరీ పి.షకీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీమ్ జిల్లాలో పర్యటిస్తుందని ఆయన తెలిపారు. ఈ కేంద్ర కరవు బృందంలో కేంద్ర అధికారి అఖిలేష్ కామల్ టీమ్ లీడర్‌గా గణేష్‌రామ్, సోవరణ్‌సింగ్ సభ్యులుగా వ్యవహరించి క్షేత్రస్థాయిలో పర్యిటిస్తారని ఆయన చెప్పారు. కరవు బృందం బుధవారం ఉదయం 10గంటలకు చేరుకుని ఉదయం 11గంటల నుంచి రాత్రి 7గంటల వరకు కలెక్టర్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమై జిల్లా పరిస్థితులను తెలుసుకుంటారని కలెక్టర్ అన్నారు.
10న కేంద్ర వరద బృందం రాక
ఇటీవల సంభవించిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను, రోడ్లను వివిధ ప్రాంతాల్లో గురువారం కేంద్ర వరద బృందం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ కెవి.రమణ మంగళవారం విలేకర్లతో పేర్కొన్నారు. నలుగురు సభ్యులతో కూడిన ఇంటర్ మినిస్ట్రీరియల్ కేంద్ర బృందం గురువారం ఉదయం 10గంటలకు జిల్లాలోభారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారన్నారు. ఈ బృందంలో వ్యవసాయ మంత్రిత్వశాఖ పంటలు, విత్తనాల విభాగ డైరెక్టర్ ఎస్‌ఎం కొల్హర్‌కర్, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ డిప్యూటీ కార్యదర్శి ఎంఎస్ రేఖాచౌహాన్, గోదావరి సర్కిల్ ఉన్నతాధికారి డికె రెడ్డి, ఆర్థికశాఖ డిప్యూటీ కార్యదర్శి హరిమిశ్రాలు గురువారం ఉదయం 10గంటలకు చేరుకుని జిల్లాలో వర్షాలు సంభవించిన నష్టాలను పరిశీలించి అనంతరం సమావేశం ఏర్పాటుచేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారని ఆయన తెలిపారు.

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేందుకే
జన చైతన్యయాత్రలు
సిద్దవటం,డిసెంబర్ 8: సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాయా లేదా అని తెలుసుకునేందుకే జన చైతన్యయాత్రలు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఏర్పాటుచేశారని మండల టిడిపి అధ్యక్షుడు మల్లు సంజీవరెడ్డి, ఎంపిపి ఆర్.నరసింహారెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ జవహర్‌బాషాలు అన్నారు. మండలంలోని పొన్నవోలు గ్రామ పంచాయతీలో మంగళవారం అధ్యక్షుడి నేతృత్వంలో జన చైతన్యయాత్ర జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి కానుకగా అర్హులైందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ప్రజలకోసం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతమాత్రం అందుతున్నాయని తెలుసుకునేందుకే యాత్రలు ఏర్పాటు చేశారన్నారు. పేద ప్రజలకోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సంఘం అధ్యక్షుడు జగదీష్‌కుమార్‌రెడ్డి, ఉప మండలాధ్యక్షుడు దశరధరామానాయుడు, నేతలు ప్రతాప్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

రూ.3కోట్ల పెట్టుబడులు వర్షార్పణం
సిద్దవటం, డిసెంబర్ 8: అల్పపీడన ద్రోణితో ఎడతెరతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రైతులు దాదాపు రూ.3 కోట్లకు పైగా పెట్టుబడులు నష్టపోయినట్లు బాధిత రైతులు వాపోయారు. నవంబర్ మాసంలో 561మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గత 15 సంవత్సరాల నుంచి వర్షం నమోదు కావడం ఇదే ప్రధమం. సాగులో ఉన్న వరిధాన్యం మోసులువచ్చాయి. మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో వరి పంట దెబ్బతింది. సాధారణ పంటలు, ఉద్యాన పంటలుకలిపి దాదాపు 1309 ఎకరాలలో నష్టపోయినట్లు అధికారులు సర్వేలో వెల్లడించారు. సిద్దవటం, బద్వేల్, అట్లూరు మండలాలకు చెందిన నాలుగు సర్వే బృందాలు మూడు రోజులు మండలంలో పంట నష్టంపై సర్వే నిర్వహించారు. లింగంపల్లె పంచాయతీలో 106 ఎకరాలలో వరి పంట నష్ట పోగా కడపాయపల్లె 39 ఎకరాలు, పోన్నవోలు 320 ఎకరాలు, టక్కోలు 72 ఎకరాలు, మాచుపల్లె 96 ఎకరాలు, జ్యోతి 120 ఎకరాలు, వంతాటిపల్లె 152 ఎకరాలు, ఎస్ రాజంపేట 53 ఎకరాలు, మూలపల్లె 58 ఎకరాలు, సిద్దవటం 20 ఎకరాలు, జంగాలపల్లె 74 ఎకరాలు, పెద్దపల్లె పంచాయతీ 5 ఎకరాలు వరి పంట దెబ్బతింది. ఉద్యాన తోటలు 145 ఎకరాలు దెబ్బతిన్నాయని తహశీల్దార్ మహబూబ్‌జాన్ తెలిపారు. వరి, ఉద్యాన తోటలు కలిపి దాదాపు రూ.3 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనాలు తయారు చేశారు. వరి 1159 ఎకరాలలో దెబ్బతిన్న పంటకు రూ.2.31కోట్లు, 145 ఎకరాలలో ఉద్యాన తోటలకు రూ.70 లక్షలు నష్టం వాటిల్లింది. వరి పంటకు ఎకరాకు 6వేలు మాత్రమే మంజూరు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

రాష్ట్ర అభివృద్ధే టీడీపీ ధ్యేయం

పెండ్లిమర్రి,డిసెంబర్ 8: సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమని కమలాపురం ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన చైతన్య యాత్రలో భాగంగా మండలంలోని పెండ్లిమర్రి, చెర్లోపల్లి గ్రామాలలో జన చైతన్య యాత్రలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బడుగు, బలహీన వర్గాలకు చేయూతనిస్తూ అభివృద్ధి బాటలో నడిపిస్తుందని, అలాగే వికలాంగులకు రూ.1500లు పింఛన్లు ఇస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంత మేరకు లబ్ధి చేకూరుతున్నాయో అన్న ఆలోచనతో చంద్రబాబునాయుడు జన చైతన్య యాత్రలను ఏర్పాటు చేశారన్నారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ, రైతులకు రుణమాఫీ కార్యక్రమాలను పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ నెల 11న జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చి బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ ఎస్పీ గంగిరెడ్డి, టీడీపీ సర్పంచులు అన్నమయ్య, లక్ష్మీరెడ్డి,టీడీపీ నాయకులు సత్యమారెడ్డి, బాలక్రిష్ణరెడ్డి, పొలతల చైర్మెన్ శంకర్‌రెడ్డి, కమిటీ సభ్యులు బాలగురవయ్య, మార్కెట్ కమిటీ సభ్యులు ఈశ్వర్‌రెడ్డి, చెన్నయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

సిఎం పర్యటన విజయవంతం చేయండి
కడప,డిసెంబర్ 8: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈనెల 11న జిల్లా పర్యటన సందర్భంగా ఆ పర్యటనను విజయవంతం చేయాలని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు, మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్యకర్తలకు తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన నేతలు, ప్రముఖుల సమావేశంలో బాబు కార్యక్రమాలను నేతలకు తెలియజేశారు. సిఎం ఉదయం 10.30గంటలకు హెలికాప్టర్ ద్వారా జిల్లా పోలీసు కార్యాలయం చేరుకుని, 10.40గంటలకు నగరంలో పర్యటిస్తూ ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి అనంతరం ర్యాలీతో మున్సిపల్ స్టేడియం చేరుకుంటారు. మున్సిపల్ స్టేడియంలో 1.30గంటల వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొని, అనంతరం 1.50గంటలకు విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో 2గంటలకు గన్నవరం వెళ్తారని ఆయన పేర్కొన్నారు. బాబు కార్యక్రమాలు విజయవంతానికి ప్రతి నియోజకవర్గం నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. జన చైతన్యయాత్రలో భాగంగా బాబు పర్యటన జిల్లాలో ఉండటం ప్రజల అదృష్టమని నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

28న వైవియూకు నాక్ బృందం రాక
కడప,డిసెంబర్ 8: యోగి వేమన విశ్వవిద్యాలయానికి ఈనెల 28,29,30వ తేదీన నాక్ కమిటీ బృందం రాకతో ఈమారైనా అక్రిడిటేషన్ మంజూరై జాతీయస్థాయి విశ్వవిద్యాలయంగా గుర్తింపు రాగలదని విశ్వవిద్యాలయ అధికారులు భావిస్తున్నారు. నాక్ బృందం వస్తుండటంతో యూనివర్శిటీలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రధాన అధిపతులు, అధ్యాపకులు, అకాడమిక్ కన్సల్టెంట్లు, పరిశోధకులు, బోధనేతర సిబ్బంది, నాక్ పరిశీలించే విభాగాలకు తుది మెరుగులు దిద్దుతూ ప్రత్యేకించి పరిశోధన విభాగాలపై దృష్టిపెట్టారు. గత ఏడాది నాక్ బృందం పర్యటించినా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించకపోవడంతోపాటు అక్రిడిటేషన్ మంజూరు కాలేదు. నాక్ బృందం వైవియూను పరిశీలిస్తే నిధుల కొరత లేకుండా గ్రేడ్‌లతోపాటు వైవియూకు గతంలో లభించిన అక్రిడిటేషన్ తోపాటు విశ్వవిద్యాలయానికి మహర్దశ వస్తుందని అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి. నాక్ బృందం వైవియూ సందర్శిస్తే అభివృద్ధితో పాటు యూనివర్శిటీ రికార్డులు, భవనాలు పరిశీలించి ఇప్పటి వరకుజరిగిన పరిశోధనలపై లోతుగా అధ్యయనం చేయనున్నారు. దీంతో వైవియూ అధికారులు తమ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. వైవియూ ఉపకులపతిగా బేతనభట్ల శ్యామ్‌సుందర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యూనివర్శిటీపై సమగ్రంగా అధ్యయనం చేసి అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న బొటానికల్ గార్డెన్ అభివృద్ధి, నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా బాలుర హాస్టళ్లు, బాలికల హాస్టళ్లు, యూనివర్శిటీ ప్రాంగణం పచ్చదనాన్ని ఉట్టి పడేలా వివిధ రకాల మొక్కలను పెంపకం చేయిస్తున్నారు. ఈ మొక్కలు సందర్శకులతోపాటు ప్రముఖులు, విద్యార్థులందరినీ ఆకర్షిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ఈనెల 28, 29,30వ తేదీల్లో నాక్ కమిటీ బృందం వస్తుంది. ఈ బృందంలో దేశంలోని వివిధ యూనివర్శిటీలకు చెందిన అధికార్లను కేంద్ర ప్రభుత్వం (యుజిసి) , యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నియమించింది. వైవియూకు వచ్చే బృందంలో ఒరిస్సా రాష్ట్రంలోని బరంపూర్ విశ్వ విద్యాలయం మాజీ ఉపకులపతి రాజనీతి శాస్త్ర ఆచార్యులు ఆదిత్య ప్రసాద్‌పాది, ఈయన బృందానికి చైర్మెన్ గా వ్యవహరిస్తారు. మంగళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బైరప్ప, సభ్యులు కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. గురుతేజ్ బహుదూర్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ ఆచార్యులు పిఎస్ గ్రోవర్, డెహరడోన్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భౌతికశాస్త్రం ఆచార్యులు కులదీప్‌కుమార్‌రైనా, పశ్చిమబెంగాల్ బుద్వాన్ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆచార్య అరవిందకుమార్‌దాస్, గురునానక్ విశ్వవిద్యాలయం ఆచార్య హెచ్‌ఎస్.నందూ, బెంగళూరు విశ్వ విద్యాలయం రాజనీతి శాస్త్ర మాజీ ఆచార్యులు పిఎస్ జయరామ్ తదితరులతోపాటు పలు విభాగాల ఆచార్యులు కమిటీ బృందంలో యూనివర్సిటీని సందర్శించనున్నారు. మొత్తం మీద ఈ ఏడాది గ్రేడింగ్‌లో వైవియుకు స్థానం దక్కి జాతీయస్థాయి గుర్తింపు దక్కుతుందని అందరూ ధీమాగా ఉన్నారు.

జన చైతన్యయాత్రల్లో
మామఅల్లుళ్ల పోటాపోటీ.!
కడప,డిసెంబర్ 8: తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన చైతన్య యాత్రలో భాగంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు)లు మామ, అల్లుళ్లు పోటాపోటీగా ఈ యాత్రలో పర్యటిస్తున్నారు. సతీష్‌కుమార్‌రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ ప్రభుత్వసంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి తనదైన శైలిలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. అలాగే తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు వాసు కడప పార్లమెంట్‌పై ప్రత్యేక దృష్టిసారించి గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి లోటు ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ పెద్ద ఎత్తున నేతలను వెంటపెట్టుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుంటూ పర్యటిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆ ఇరువురు నేతలు పర్యటనలు చేసే తరహాలోనే చైతన్యయాత్రలు నిర్వహిస్తూ ప్రధమ, ద్వితీయ, తృతీయ శ్రేణులను కలుపుకుని స్థానికంగా విభేధాలున్న నేతలను సర్దుబాటు దిశగా ఇరువురు నేతలు పర్యటనలు చేస్తున్నారు. వీరి పర్యటనల్లో రేషన్‌కార్డులు, పక్కాగృహాలు, వివిధ రకాల పెన్షన్ల సమస్యలు కోకొల్లలుగా వస్తున్నాయి. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం చివరిరోజు కావడంతో తమ పర్యటనలో వస్తున్న దరఖాస్తులన్నింటినీ సంబంధిత అధికారులకు స్వయంగా నేతలే అందజేస్తున్నారు. ఏరోజుకారోజు వచ్చిన దరఖాస్తులను క్రిందిస్థాయి కార్యకర్తల ద్వారా సంబంధిత అధికారులకు పంపుతున్నారు. పలు గ్రామాల్లో వౌళిక సదుపాయాలు సంబంధిత ప్రాంతాల్లో కోరుతుంటే వాటి పరిష్కారం దిశగా ప్రజలకు హామీలు ఇస్తున్నారు. అంతేగాకుండా జన్మభూమి కమిటీల్లో కూడా పనిలో పనిగా వారు పర్యటిస్తున్న ప్రాంతాల్లో స్థానికంగా ఇచ్చిన నేతల సిఫార్సుల మేరకే ఎంపికకు నేతలు కసరత్తు చేస్తున్నట్లుతెలిసింది. మొత్తంమీద జన చైతన్యయాత్రలను ఒక పక్క విజయవంతం చేసుకుంటూ మరోపక్క క్షేత్రస్థాయిలోకి నేతల నుంచి ప్రజలను కలుపుకుంటున్నారు.

మహిళా సంక్షేమమే టిడిపి ధ్యేయం
కడప,డిసెంబర్ 8: గత ప్రభుత్వాలు మహిళల అభ్యున్నతి, సంక్షేమాన్ని గాలికి వదలడంతోపాటు మహిళలకు రక్షణ కరువైందని తెలుగుదేశం ప్రభుత్వం పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో పెద్దపీట వేసి మహిళా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన జన చైతన్యయాత్రలో నేతలు పేర్కొన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), రాష్టప్రరిశీలకుడు హరిబాబు తదితరులు నగరంలో ఎన్‌జిఓ కాలనీ, అప్సర థియేటర్, మృత్యుంజయకుంట, అంబేద్కర్ కాలనీ, వైఎస్ నగర్, ఆర్టీసీ బస్టాండు తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సుబ్బలక్షుమ్మ ఆధ్వర్యంలో జన చైతన్యయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మహిళా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజెబుతూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా వినియోగించుకోవాలని అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ప్రభుత్వ పథకాలు పొందాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే పంపిణీ జరుగుతున్నాయని మహిళలు ఆర్థికంగా రాణించినప్పుడే దేశాభివృద్ధితోపాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వారన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థిగా బాగాలేకపోయినా అభివృద్ధి, ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేయడంలో పట్టువదలని విక్రమార్కుడిలాగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని వారు గుర్తు చేశారు. అలాగే మహిళలు రాజకీయంగా ఎదుగుదలకు చంద్రబాబు పెద్ద పీట వేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ ఎస్.ఏ.ఖలీల్‌బాష, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.హరిప్రసాద్, నగర అధ్యక్షుడు ఎస్.హరీంద్రనాధ్, డివిజన్ ఇన్‌ఛార్జ్ రమేష్, రాష్ట్ర కార్యదర్శి ఎస్.గోవర్దన్‌రెడ్డి, మైనార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు విఎస్ అమీర్‌బాబు, జెడ్పి మాజీ ఉపాధ్యక్షుడు జి.లక్ష్మిరెడ్డి, టిడిపి నాయకులు దుర్గాప్రసాద్, సుభాన్‌బాష, శశికుమార్, జిలానీ బాష, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సుధాకర్ యాదవ్, జలతోటి జయకుమార్, సిఎస్ నాసర్ అలీ, కార్యకర్తలు పాల్గొన్నారు.