క్రీడాభూమి

తాహిర్ స్పిన్ మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బసెటెర్ (సెయింట్ కీట్స్ అండ్ నెవిస్), జూన్ 16: ఇమ్రాన్ తాహిర్ స్పిన్ మాయ వెస్టిండీస్‌తో జరిగిన ట్రై సిరీస్ గ్రూప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు 139 పరుగుల తేడాతో విజయాన్ని సాధించిపెట్టింది. తాహిర్ తొమ్మిది ఓవర్లు బౌల్ చేసి, 45 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. హషీం ఆమ్లా శతకంతో రాణించడంతో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లకు 343 పరుగుల భారీ స్కోరును సాధించింది. అసాధ్యంగా కనిపిస్తున్న లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ తాహిర్ దెబ్బకు విలవిల్లాడి, 38 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌటైంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు ఆమ్లా, క్వింటన్ డికాక్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 33.1 ఓవర్లలో 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. 99 బంతులు ఎదుర్కొని, 13 ఫోర్ల సాయంతో 110 పరుగులు చేసిన ఆమ్లాను సునీల్ నారైన్ క్యాచ్ అందుకోగా కీరన్ పోలార్డ్ అవుట్ చేశాడు. ఆ వెంటనే డికాక్ కూడా పెవిలియన్ చేరాడు. అతను 103 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 71 పరుగులు చేసి జెరోమ్ టేలర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫస్ట్, సెకండ్ డౌన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ మోరిస్, ఫఫ్ డు ప్లెసిస్ కూడా చక్కటి ఆటను ప్రదర్శించారు. వీరిద్దరూ జట్టు స్కోరును 200 పరుగుల మైలురాయిని దాటించారు. మోరిస్ 26 బంతుల్లోనే 40 పరుగులు చేసి కార్లొస్ బ్రాత్‌వెయిట్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు జొనథాన్ కార్టర్‌కు దొరికిపోయాడు. ఎబి డివిలియర్స్ 19 బంతుల్లో 27 పరుగులు చేసి కీరన్ పోలార్డ్ బౌలింగ్‌లో జాన్సన్ చార్లెస్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 343 పరుగులు సాధించగా, ఫఫ్ డు ప్లెసిస్ 73, జీన్ పాల్ డుమనీ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
దక్షిణాఫ్రికాను ఓడించడానికి భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన విండీస్‌కు ఆండ్రె ఫ్లెచర్, జాన్సన్ చార్లెస్ శుభారంభాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. మొదటి వికెట్‌కు 69 పరుగులు జోడించిన వీరి భాగస్వామ్యాన్ని ఇమ్రాన్ తాహిర్ దెబ్బతీశాడు. ఫర్హాన్ బెహర్డియన్ క్యాచ్ అందుకోగా అవుటైన ఫ్లెచర్ 30 బంతుల్లో 21 పరుగులు చేశాడు. మరికొద్ది సేపటికే చార్లెస్ కూడా వెనుదిరిగాడు. 41 బంతుల్లో 49 పరుగులు చేసిన అతనిని ఫఫ్ డు ప్లెసిస్ క్యాచ్ పట్టగా తబ్రాయ్ షంసీ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత విండీస్ కోలుకోలేకపోయింది. ఒకదాని తర్వాత మరొకటిగా వికెట్లు కూలాయి. డారెన్ బ్రేవో (11), మార్లొన్ శామ్యూల్స్ (24), డనెష్ రాందీన్ (11) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో విండీస్ ఆశలు ఆవిరయ్యాయి. కీరన్ పొలార్డ్ (20), జాసన్ హోల్డర్ (19), సునీల్ నారైన్ (18 నాటౌట్) కొంత సేపు దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. కానీ, వారి శ్రమ ఫలించలేదు. కార్లొస్ బ్రాత్‌వెయిట్, సులేమాన్ బెన్ సున్నాకే అవుట్‌కాగా, జెరోమ్ టేలర్ 16 పరుగులు చేసి ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో విండీస్ ఇన్నింగ్స్ 204 పరుగులకే ముగిసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును స్వీకరించిన తాహిర్ 45 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టగా, తర్బాజ్ షంసీ 41 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు.
***
ఏడు వికెట్లు తీసిన
ఇమ్రాన్ తాహిర్
* ఇమ్రాన్ తాహిర్ వనే్డల్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని చేరిన దక్షిణాఫ్రికా బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. ఇంతకు ముందు మోర్న్ మోర్కెల్ 59 వనే్డల్లో ఈ ఫీట్ సాధించగా, తాహిర్ 58వ మ్యాచ్‌లోనే వంద వికెట్లను పూర్తి చేశాడు. వనే్డ చరిత్రలో ఇది నాలుగో అత్యుత్తమ ప్రదర్శన. సక్లెయిన్ ముస్తాక్ 53, స్టువర్ట్ బ్రాడ్ 54, బ్రెట్ లీ 55 మ్యాచ్‌ల్లో ఈ లక్ష్యాన్ని చేరి, మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. తాహిర్ నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు.
ఆమ్లా 23వ సెంచరీ: హషీం ఆమ్లా కెరీర్‌లో 23వ వనే్డ సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వనే్డ ఇంటర్నేషనల్ శతకాలను చేసిన వారిలో అతనికి రెండో స్థానం లభించింది. ఎబి డివిలియర్స్ 24 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా, 21 సెంచరీలు చేసిన హెర్చెల్ గిబ్స్ ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచాడు.
నంబర్ వన్ స్థానానికి దక్షిణాఫ్రికా: ఇలావుంటే, విండీస్‌పై భారీ విజయాన్ని నమోదు చేసిన దక్షిణాఫ్రికా వనే్డ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటి దాకా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మొదటి రెండు స్థానాల్లో ఉండేవి. దక్షిణాఫ్రికా అగ్రస్థానాన్ని ఆక్రమించడంతో, ఆ రెండు జట్లు రెండు, మూడు స్థానాలకు పడిపోయాయి.

సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 4 వికెట్లకు 343 (హరీం ఆమ్లా 110, క్వింటన్ డికాక్ 71, క్రిస్ మోరిస్ 40, ఫఫ్ డు ప్లెసిస్ 73, కీరన్ పోలార్డ్ 2/64, జెరోమ్ టేలర్ 1/72, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 1/69).
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 38 ఓవర్లలో 204 ఆలౌట్ (ఆండ్రె ఫ్లెచర్ 21, జాన్సన్ చార్లెస్ 49, మార్లొస్ శామ్యూల్స్ 24, సునీల్ నారైన్ 18 నాటౌట్, ఇమ్రాన్ తాహిర్ 7/45, తర్బాజ్ షంసీ 2/41).

చిత్రం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తాహిర్,
హషీం ఆమ్లా