తెలంగాణ

సిఎం బస్సుకు విద్యార్థుల బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 8: హరితహారం కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అడుగడుగునా నిరసన సెగలు ఎదురయ్యాయి. చౌటుప్పల్ మార్కెట్ యార్డులో నూతన గోదాంలను ప్రారంభించి మొక్కను నాటి గుండ్రాంపల్లి హరితహారం కార్యక్రమానికి బయలుదేరారు. మార్కెట్ యార్డు నుండి బస్సు బయలుదేరగానే ఆకస్మాత్తుగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు బస్సుకు అడ్డం పడి ప్లకార్డులతో నినాదాలకు దిగారు. చౌటుప్పల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, కెజి టూ పిజి ఉచిత విద్యను అమలు చేయాలని నినాదాలు చేశారు. వెంటనే ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి పోలీసు బలగాలతో వారిని చెదరగొట్టి బస్సును అక్కడి నుండి పంపించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేయగా నిరసనగా కార్యకర్తలు హైవేపై బైఠాయించారు. వారిని కూడా పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల అరెస్టును నిరసిస్తూ నేడు జిల్లా వ్యాప్త నిరసనలకు జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ పిలుపునిచ్చింది. ఇంకోవైపు సీఎం కెసిఆర్ గుండ్రాంపల్లి వద్ద మొక్కను నాటి హరితహారాన్ని ప్రారంభించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. సీఎం ప్రసంగాన్ని ప్రారంభించగానే హౌసింగ్ ఉద్యోగులు ప్లకార్డులు ధరించి సీట్ల నుండి లేచి నినాదాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. హౌసింగ్ శాఖను యథావిధిగా కొనసాగించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు వారిలో ఎనిమిది మందిని అరెస్టు చేసి చిట్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించి సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

టి.పిసిసి అధికార
ప్రతినిధి రాజీనామా?
ఆలంపూర్ ఎమ్మెల్యే అలక
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జులై 8: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధికార ప్రతినిధుల నియామకం వివాదస్పదంగా మారింది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇటీవల 23 మంది అధికార ప్రతినిధులను నియమించారు. దీనిపై చాలా మంది నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాఉండగా తనకు తెలియకుండా తన నియోజకవర్గానికి చెందిన విజయ్ కుమార్‌ను ఎలా నియమిస్తారంటూ ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇదివరకే అసంతృప్తి గళం వినిపించారు. దీంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంపత్‌ను బుజ్జగించే బాధ్యతను టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్కమార్కకు అప్పగించారు. భట్టివిక్రమార్క జరిపిన ఫలితాలు ఫలించలేదు. చివరకు విజయ్ కుమార్ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని, దానిని ఆమోదించాల్సిందిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి లేఖ పంపించినట్లు పార్టీ పిఆర్‌వో హరిప్రసాద్ మీడియాకు ఆ లేఖ ప్రతులను విడుదల చేశారు. నిజానికి విజయ్ కుమార్ రాజీనామా చేశారా? లేక చేయలేదా? అనే మీమాంస ఇంకా కొనసాగుతూనే ఉన్నది.
లోపాలు సవరించుకున్న కాలేజీలను
కౌనె్సలింగ్ జాబితాలో చేర్చాలి
జెఎన్‌టియుకి హైకోర్టు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 8: జెఎన్‌టియు బృందాల తనిఖీతో లోపాలను సరిదిద్దుకున్న ఇంజనీరింగ్ కాలేజీలను ఎమ్సెట్ కౌనె్సలింగ్ జాబితాలో చేర్చాలని హైకోర్టు శుక్రవారం జెఎన్‌టియు హైదరాబాద్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఆదేశాలను జస్టిస్ చల్లా కోదండరామ్ జారీ చేశారు. తనిఖీ బృందాలు చేసిన సిఫార్సుల మేరకు లోపాలను సరిదిద్దుకున్నామని, తమ కాలేజీలను తెలంగాణ ఎమ్సెట్ కౌనె్సలింగ్ జాబితాలో చేర్చాలంటూ కొన్ని కాలేజీ యజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశాయి. ఈ కేసును నాలుగు వారాలపాటు హైకోర్టు వాయిదా వేసింది. ఈ అంశంపై జెఎన్‌టియు హైదరాబాద్ నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

ఖరీఫ్ సాగు
45 శాతమే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 8: వర్షాలు సకాలంలో కురుస్తున్నప్పటికీ ఖరీఫ్ సీజన్‌లో సాధారణ పంటలు సగం మేరకే సాగవుతున్నాయ. ఆహార ధాన్యాల సాగులోనూ అదే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో సాధారణ పంటలసాగు కోటి 8 వేల ఎకరాలు కాగా, ప్రస్తుతం 48.92 లక్షల ఎకరాలు మాత్రమే 45 శాతం మాత్రమే సాగు అయినట్టు వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అలాగే ఆహార ధాన్యాల సాధారణ సాగు 48.70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 17.84 లక్షల ఎకరాలు (42శాతం) సాగు అయినట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. పప్పు ధాన్యాల సాధారణ సాగు విస్థీర్ణం 10.10 లక్షల ఎకరాలకు గాను 8.58 లక్షల ఎకరాలు (97శాతం) సాగు అయినట్టు పేర్కొన్నారు. ఖరీఫ్‌లో 24.65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయాల్సి ఉండగా, జూలై 6వ తేదీ వరకు లక్ష 75 వేల ఎకరాలు (7 శాతం) మాత్రమే నాట్లు పడినట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. పత్తిసాగు చేయడం వల్ల ఏటా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దానికి ప్రత్యామ్నాయంగా సోయాబిన్‌ను సాగు చేయాలని వ్యవసాయశాఖ సూచించినప్పటికీ రైతులు ఏ మాత్రం పట్టించుకోకుండా 20.82 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్టు పేర్కొన్నారు. సోయాను కేవలం 5.95 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేసినట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్‌లో 61 శాతం సాగు చేయగా, అతి తక్కువగా నల్లగొండ జిల్లాలో 28 శాతం మాత్రమే సాగు చేసినట్టు వ్యవసాయశాఖ పేర్కొంది.
ప్రజారోగ్యం పట్టని సర్కారు : రావుల

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జులై 8: ప్రజా ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో 13 మందికి కంటి చూపు పోయిందని టి.టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు వికటించి 13 మంది నిరుపేదలు చూపు కోల్పోతే ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ స్పందించలేదని రావుల శుక్రవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. రాష్టప్రతులు కూడా లోగడ హైదరాబాద్‌లో నేత్ర వైద్యం చేయించుకున్న ఘన చరిత్ర ఉంటే, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో వైద్యులు, సిబ్బంది, పాలకవర్గం, ఫార్మసీల విభాగాలు ఒకరిపై ఒకరు నేరాన్ని నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. శస్త్ర చికిత్స పరికరాలు సరిగ్గా స్టెరిలైజ్ చేయలేదని, ఔషదాలలో ఫంగస్ చేసిందని ఇలా పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయని అన్నారు. చూపు కోల్పోయిన బాధితులకు పరిహారాలు, జీవనాధారం, వారి సహాయకులకు చేదోడు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు. నీటి లభ్యత లేకపోవడంతో ఆపరేషన్లు బంద్ అనే శీర్షికలతో పత్రికల్లో వార్తలు వచ్చాయని, ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని రావుల విమర్శించారు.

చిరుతలను చంపిన కేసులో
మరో ఇద్దరి అరెస్టు
కొత్తగూడెం, జూలై 8: ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం అబ్బుగూడెం అటవీప్రాంతంలో విషప్రయోగంతో రెండు చిరుత పులులను హతమార్చిన సంఘటనలో మరో ఇద్దర్ని అరెస్టు చేయడంతోపాటు పులిగోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు రామవరం రేంజ్ అధికారి జి మధుసూధన్ తెలిపారు. కొత్తగూడెంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసులో ఇప్పటికే సత్యం, మంగయ్య, శివలను అరెస్ట్ చేయగా కోర్టు రిమాండ్ విధించిందన్నారు. తాజాగా శుక్రవారం ఆశయ్య, లక్ష్మారెడ్డిలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో అధిక వర్షపాతం

హైదరాబాద్,
మెదక్ మినహా

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 8: మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో మినహా రాష్టవ్య్రాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. ఖరీఫ్ సీజన్ మొత్తం 713 మిల్లీ మీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా ఇప్పటి వరకు 220 మిమీ వర్షపాతం నమోదు అయింది. మెదక్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అయినట్టు వాతారణవరణ శాఖ పేర్గొంది. ఉత్తర తెలంగాణ కంటే దక్షణ తెలంగాణలో అధిక వర్షపాతం నమోదు అయింది. ఉత్తర తెలంగాణలో 21 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, దక్షణ తెలంగాణలో 52 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 121 శాతం అధికంగా వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ నుంచి జూలై మొదటి వరకు సాధారణ వర్షపాతం 191 మిమీ కురవాల్సి ఉండగా 227.1 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా ఆదిలాబాద్‌లో సాధారణ వర్షపాతం 250.7 మిమీ కాగా శుక్రవారం నాటికి (జూలై 8) 263.3 మిమీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 149 మిమీ కాగా 131.5 మి.మి వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో 217 మిమీ సాధారణ వర్షానికిగాను 229.4 మి.మి వర్షపాతం నమోదు అయింది. ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం 215.3 మిమీ కాగా 367.7 మిమీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణ వర్షపాతం 127.6 మిమీ కాగా 152.9 మిమీ వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో సాధారణ వర్షపాతం 188.4 మిమీ కాగా 147.5 మిమీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లాలో సాధారణ వర్షపాతం 137.2 మిమీ కాగా 171.4 మిమీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం 231.3 మిమీ కాగా 250.8 మిమీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలో సాధారణ వర్షపాతం 153.9 మిమీ కాగా 153.3 మి.మి వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలో సాధారణ వర్షపాతం 211.8 మిమీ కాగా 262.9 మి.మి వర్షం కురిసింది. హైదరాబాద్‌లో సాధారణం కంటే 12 శాతం తక్కువగా, మెదక్ జిల్లాలో సాధారణం కంటే 22 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.