అక్షరాలోచన

మార్పిడి చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలన ముక్కివాసన కొడుతున్న
లియో టాల్‌స్టాయ్ ‘వార్ అండ్ పీస్’
చేతిలోకి తీసుకుని దులుపుతుంటే-
జాలరి వలలోంచి చటుక్కున మళ్లీ
నీళ్లలోకి దూకిన చేపపిల్లల్లా
రెండు పాత బస్సు టిక్కెట్లు జారి
నా కాళ్ల వేళ్ల మీద పడ్డాయి.
పాతికేళ్ల నాటి పాపాయిలవి!
రెంటిలో ఒకటి నాది
మరొకటి కచ్చితంగా నీదే!
మన డిగ్రీ చివరి సంవత్సరపు చివరి రోజు
మన ఆఖరి ప్రయాణపు సావనీర్‌లు.
ఎర్ర ఓణీ, పుచ్చపూల పరికిణీలో నువ్వు!
వెనుక హుక్సుల బుట్ట జాకెట్టు!
నీ ఒంటి జడలో మధ్యాహ్నానికి మిగలపండిన
సన్నజాజి పూల తీపి అత్తరులు!
ఒక్క సీటుపై మనిద్దరం-
ఎవరెస్ట్‌ను అధిరోహించిన టెన్సింగ్ నార్కేలా
అందని చందమామను ఛేదించిన ఆర్మ్‌స్ట్రాంగ్‌లా
నీ పక్కన నేను!
నా చేతిలో ఇపుడు రెండు టికెట్లు
గతించిన కాలపు జ్ఞాపకాలకు కటౌట్లు!
వాటిపైన ఉన్న ‘నుండి’... ‘వరకు’...
అప్పుడర్థం కాలేదు వాటి అర్థం!
‘జీవితం’ స్టేజీ నుండి ‘జీతం’ స్టేజీ వరకని!
ఎక్కేటపుడు నువ్వున్నావు
దిగేటప్పుడు నేనూ లేను!
ఇదిగో ‘నీ’ టికెట్టును నాతోనే, నాలోనే ఉంచుకుని
నా టికెట్‌ని మరొక గుండెకు గుచ్చుదామనుకున్నా!
ఓ... నో! ఇదిగో ఇక్కడ క్రింద చూడు-
‘మార్పిడి చెల్లదు’

-వేణు మరీదు 98486 22624