కడప

కోటి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 23: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ భూములు, రైతుల భూముల్లో కోటి మ్కొలు నాటేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆదేశించారు. వనం - మనం కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కలెక్టర్ గట్టి చర్యలు తీసుకుని జిల్లా వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, అన్ని ప్రభుత్వశాఖల అధికారులు ప్రత్యేకించి ఫారెస్టుశాఖ అధికారులు, సిబ్బంది విజయవంతం చేస్తున్నారు. కడప నగర పాలకం, జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు, ప్రభుత్వకార్యాలయాల్లో, ప్రతి ప్రాంతంలో మొక్కలు నాటాలన్నారు. అలాగే పార్కులు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతలు మొక్కలునాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ, పలుప్రాంతాల్లో ప్రజలను భాగస్వాములుచేసి మొక్కలు నాటించాలన్నారు. అలాగే ప్రభుత్వ బంజరుభూములు, అటవీప్రాంత సమీపంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, కాలువల పరివాహక ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నారు. అలాగే రైతులు తమ పొలాలవద్ద నిరుపయోగ స్థలాల్లో పొలాల సరిహద్దుల్లో మొక్కలు నాటుతున్నారు. అటవీశాఖ, సోషల్ ఫారెస్టు అధికారులు, సిబ్బంది జిల్లాకు కావాల్సిన మొక్కలను సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నారు. కానుగ, వేప, చింత, టేకు, చందనం తదితర వివిధ రకాల మొక్కలతోపాటు ఉద్యానవనశాఖ వివిధ రకాల పండ్లమొక్కలు రైతులకు పంపిణీ చేస్తున్నారు. ప్రతి విద్యాసంస్థల ప్రాంగణాల్లో గతంలో ఎన్నడూ నాటని మొక్కలు ఈ ఏడాది నాటుతున్నారు. పురపాలక సంఘాల్లో నాటిన మొక్కలకు నీటి సౌకర్యానికి కూడా పుష్కలంగా అందించేందుకు బాధ్యతలు తీసుకున్నారు. అధికారులు గతంలో ఎన్నడూ ఈ తరహాలో చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది మాత్రం కోటి మొక్కలు నాటి కనీసం 50శాతం మొక్కలకన్నా రక్షణ కల్పిస్తే జిల్లాలో పచ్చదనానికి కొరత ఉండకపోవడంతోపాటు వర్షాలు కూడా విరివిగా కురుస్తాయి.

సైకిలెక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ.!

ఆంధ్రభూమి బ్యూరో
కడప,జూలై 23: జిల్లాలోని ప్రొద్దుటూరు వైకాపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి అల్లుడు, చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బి.నరేష్‌కుమార్‌రెడ్డి సైకిలెక్కేందుకు రంగం సిద్ధం కావడంతో ఇక రమణారెడ్డి ఎటువైపు పయనిస్తారోనని జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రమణారెడ్డి రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా అందరికీ సుపరిచితులు, రాయలసీమ కోసం గతంలో ఉద్యమం కూడా నడిపారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్నారు. రమణారెడ్డి సమకాలీకులు, రాజ్యసభ మాజీ సభ్యులు, రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి, మైదుకూరు కాంగ్రెస్‌నేత డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి తదితర టిడిపి నేతలు పార్టీలోకి ఆహ్వానిస్తూ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మైసూరారెడ్డి మాత్రం విజయదశమి లోపు పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. డిఎల్ అనుచరులంతా తెలుగుదేశంపార్టీలో చేరుతారని, అయితే ఆపార్టీ నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని ఆయన అనుచరవర్గం డిమాండ్ చేస్తున్నారు. ఇక రమణారెడ్డి విషయానికొస్తే ఆయన ఎన్‌టి రామారావు హయాంలో తెలుగుదేశంపార్టీలో ఒక వెలుగువెలిగారు. ఆయన తనయుడు, ఆయన సతీమణి ఆయన స్వగ్రామం సర్పంచ్‌లుగా, ఆయన తనయుడు ప్రస్తుతం ప్రొద్దుటూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. రమణారెడ్డి అల్లుడు, మదనపల్లె మున్సిపల్ మాజీ చైర్మన్, కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం చేరుతున్న నేపధ్యంలో ఆయన మామ రమణారెడ్డి కూడా పార్టీలో చేరుతారని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా కావడం, జిల్లాలో వైకాపాకు చెందిన బలమైన నేతలందర్నీ టిడిపిలోకి చేర్చుకోవడానికి అధిష్ఠానం ఒక పక్క ఆలోచిస్తుంటే మరో వైపు జిల్లా నేతలు కూడా వైకాపా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. రమణారెడ్డి తెలుగుదేశం పార్టీలో ప్రవేశిస్తే ప్రొద్దుటూరులో పార్టీ బలోపేతమై 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలిచేందుకు సుగమం అవుతుంది.

అంధులు ఉన్నత విద్య అభ్యసించాలి

ఆంధ్రభూమి బ్యూరో
కడప,జూలై 23: జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చిన దేవుడు అంధులకు దివ్యదృష్టిని ప్రసాదించారని ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిని అధిరోహించి జీవితంలో స్థిరపడాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ అంధుల ఉన్నత పాఠశాలలో అంధ విద్యార్థులకు రేడియో పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ దేవుడు అంధులను దివ్యదృష్టితోపాటు మనో ధైర్యాన్ని ప్రసాదించారన్నారు. విద్యనభ్యసిస్తే జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చిన అధికమించగలరన్నారు. ప్రభుత్వ అంధుల పాఠశాలలో నాణ్యమైన విద్యను బోధించి విద్యార్థులను మంచి మెరికలుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. గత ఏడాది జరిగిన 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో వందశాతం అంధ విద్యార్థులు సాధించారని కొనియాడారు. ఇందుకుగాను ఆ పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. లూరుూబ్రెయిలీ లిపితో కూడిన అధునాతన కొత్త కంప్యూటర్లను సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. పాఠశాలలో వర్షం వస్తే పాఠశాల ఆవరణలో వర్షం నీరు నిల్వ ఉంటుందని కలెక్టర్ దృష్టికి ఆపాఠశాల సిబ్బంది నివేదించగా ఇంజనీరును పాఠశాలకు పంపి నీరు నిలువలేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఏలోటు లేకుండా వౌలిక వసతులను కల్పిస్తామన్నారు. పాఠశాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పాఠశాల సిబ్బంది సాంబశివునికి తెలిపారు. రేడియో ద్వారా ప్రపంచంలో జరిగే అన్ని విషయాలను తెలుసుకోవచ్చునని వినోదం కూడా కలుగుతుందన్నారు. రేడియోతో పాటు అంధ విద్యార్థులకు ఇయర్ ఫోన్స్ కూడా పంపిణీ చేస్తే ఇతరులకు ఇబ్బంది లేకుండా రేడియోను ఉపయోగించుకునే అవకాశముందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో విద్యార్థులు ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని అదే స్ఫూర్తితో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలునాటి సంరక్షించుకోవాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగయ్య మాట్లాడుతూ పాఠశాల 1949లో ప్రారంభమైందని ఇక్కడ చదివి వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నారన్నారు. పాఠశాలలో 2006లో సరఫరాచేసిన కంప్యూటర్లు ప్రస్తుత కాలానికి అనుగుణంగా పనిచేయడం లేదని, అలాగే పాఠశాలలో చిన్న చిన్న వౌలిక వసతులు అవసరమున్నాయని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తొలుత కలెక్టర్ లూయిబ్రెయిలీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం 54 మంది విద్యార్థినీ విద్యార్థులకు రేడియోలను కలెక్టర్ చేతులమీదుగా పంపిణీ చేశారు. అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా కార్యకర్త వాణి రమణారావు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చెట్లను సంరక్షించడం మనందరి బాధ్యత
కడప,(క్రైమ్)జూలై 23: మొక్కలను నాటి సంరక్షించడం మనందరి బాధ్యత అని కడపలో 10లక్షల మొక్కలు నాటాలని నగర పాలకసంస్థ కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక బిల్టప్ సమీపంలో ఉన్న హోలిట్రినిటీ హైస్కూల్‌లో చెట్టు-నీరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన కమిషనర్ అక్కడి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా గౌరవ అతిధిగా హాజరైన డా.రంగనాథరెడ్డి మాట్లాడుతూ మానవాళి ప్రాణరక్షణకు మొక్కలు ప్రాణవాయువును ఇస్తాయన్నారు. పర్యావరణ పరిరక్షణ సమితి అధినేత సిద్దయ్య మాట్లాడుతూ ఇప్పటికి 500 మొక్కలు నాటామని అందరి సహకారంతో 5వేలు నాటుతామన్నారు. పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ ఆంథోనిరాజు మాట్లాడుతూ చెట్లు-నీరు కార్యక్రమంలో తమ సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహేష్, ఉపాధ్యాయులు భాస్కర్‌రెడ్డి, సుధాకర్, విమల, మెస్సీ జార్జి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఘనంగా భారతీయ మజ్దూర్ సంఘ్ షష్టబ్ది ఉత్సవాలు

కడప,(కల్చరల్)జూలై 23: భారతీయ మజ్దూర్ సంఘ్ షష్టబ్ది ఉత్సవాలు శనివారం కడపలో ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు, కార్మికులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీ నగర కార్పొరేషన్ వరకు సాగింది. ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా ప్రధానకార్యదర్శి కెవి లక్ష్మినారాయణరెడ్డి మాట్లాడుతూ 1955 జూలై 23న బిఎంఎస్‌ను దత్తోపంత్‌జీ స్థాపించారని, దేశంలోనే నెంబర్ 1 ట్రేడ్ యూనియన్‌గా ఆవిర్భవించేందుకు కృషి చేశారన్నారు. దాదాపు కోటి సభ్యత్వంతో కార్మికులకు బిఎంఎస్ సేవలు అందిస్తోందన్నారు. ఈనెల 23న 1955లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి రోజు ఆవిర్భవించిందన్నారు. దత్తోపంత్‌జీ నిరంతర పర్యటన, శ్రద్ధతో యూనియన్‌ను భారతదేశమంతా వ్యాపించేందుకు చేశారన్నారు. ఏర్పడిన 12 సంవత్సరాలు తర్వాత 1967వ సంవత్సరంలో 541 యూనియన్లు 2లక్షల 46వేల మంది సభ్యత్వంతో ఢిల్లీలో ప్రథమ మహాసభలు నిర్వహించి రామ్‌నరేష్‌జీ అధ్యక్షులుగా, దత్తోమంత్ ప్రధానకార్యదర్శిగా మొదటి జాతీయ కార్యవర్గం ఎన్నుకోబడిందన్నారు. 1984వసంవత్సరం జాతీయ యూనియన్ వెరిఫికేషన్‌లో 12లక్షల 11వేల 355 మంది సభ్యత్వంలో రెండవ అతి పెద్ద కార్మిక సంఘంగా అవతరించిందన్నారు. ఈకార్యక్రమంలో బిఎంఎస్ జిల్లా అద్యక్షుడు విపి రమేష్‌కుమార్, మున్సిపల్ మజ్దూర్ సంఘ్ కడపశాఖ జి.జయరామ్, ఏపిజిబిడబ్ల్యుఓ ప్రధానకార్యదర్శి వెంగల్‌రెడ్డి, బిపిఇయు కార్యదర్శి జివి సుబ్బారెడ్డి, ఆర్టీసి రాష్ట్ర ప్రధానకార్యదర్శి చౌడూరు ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలు
తుంగలో తొక్కిన బిజెపి

కడప,(కల్చరల్)జూలై 23: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి వ్యూహాత్మక ద్రోహం తలపెట్టిందని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు పేర్కొన్నారు. శనివారం సిపిఎం జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి బుగ్గవంకలో పడేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపి విడిపోయిన సందర్భంలో ప్రత్యేక హోదా ఇస్తామని పది సంవత్సరాలు పాటు అన్ని రకాల పన్నురాయితీలు కల్పిస్తామని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని బిజెపి ప్రభుత్వం హామీల వర్షం కురిపించిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా మాటమార్చి నమ్మక ద్రోహానికి పాల్పడిందన్నారు. కడప జిల్లాకు, రాయలసీమకు విభజన చట్టంలో అనేక హామీలు ఇచ్చారని, కడపకు ఉక్క్ఫ్యుక్టరీ, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామని బూటకపు వాగ్దానాలు చేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రప్రభుత్వంపై వత్తిడి తేవడంలో విఫలమయ్యారని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందేనని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లును బిజెపి అడ్డుకోవడం సరికాదని తక్షణమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. శవయాత్రలో సిపిఎం నాయకులు బాలచెన్నయ్య, శేఖర్, ఓబయ్య, హరి, సావంత్‌సుధాకర్, పాపిరెడ్డి, మగ్బుల్‌బాషా, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు, ఓబులేసు, ప్రమోద్, రమణయ్య, జమీలా, లక్ష్మిదేవి, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం

రాయచోటి, జూలై 23: రాయచోటి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎంతకైనా, ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. రాయచోటి నియోజకవర్గానికి వెలిగల్లు, శ్రీనివాసపురం రిజర్వాయర్లు రెండు కళ్లు లాంటివన్నారు. ఆ ప్రాజెక్టులతో పాటు, నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధి పనులను, కార్యక్రమాలను, అవసరమైనటువంటి పలు పథకాలను తన తండ్రి గడికోట మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ, తన హయాంలోనూ చేయించడం సంతోషంగా గర్వంగా ఉందన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ వెలిగల్లు ప్రాజెక్టు ఆయకట్టుదారుల సమావేశంలో నీటిని త్వరగా విడుదల చేస్తామనడం ఆనందంగా ఉందన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు నిర్మాణపు పనులు ఎప్పుడో పూర్తయినా, ఒప్పందం లేకపోయినా ఇటీవల ఎంపీ మిథున్‌రెడ్డి తన సొంత డబ్బులను సుమారు రూ.30 లక్షలు వెచ్చించి, కాలువల్లో నీళ్లు సరఫరా అయ్యేలా చేయడం అభినందనీయమన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు కాలువలలో ఒక అడుగులోతు మట్టి ఎత్తివేయాలని ఇంజనీరింగు అధికారులు కోరడంతో ఈ విషయాన్ని తాను ఎంపీ మిథున్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆ పనులను చేపట్టేందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని సమకూర్చి ఇచ్చిన మిథున్‌రెడ్డికి ఈ ప్రాంత రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. గాలివీడు, లక్కిరెడ్డిపల్లె ప్రధాన కాలువ ఉన్నంత వరకు నీటితో చెరువులన్నిటినీ నింపవచ్చని కాలువకు ఎటువంటి ఆటంకాలు కల్పించకపోతే హసనాపురం, గంగనేరు, దినె్నపాడు చెరువులకు నీరిచ్చే అవకాశం ఉందన్నారు. వీలైనంత త్వరితగతిన శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెలిగల్లు కాలువ పనులను పూర్తి చేసి కుడికాలువకు త్వరగా నీళ్లు వదిలేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అధికారులను కోరారు.

సోలార్‌తో పర్యావరణానికి ఎలాంటి సమస్య ఉండదు

గాలివీడు, జూలై 23: మండలంలో వెలిగల్లు, తూముకుంట గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్‌ప్లాంటు ద్వారా ఎలాంటి పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కాలేదని నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం సోలార్ భూసేకరణపై తహశీల్దార్ భవానీతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్‌తో ఎలాంటి రేడియేషన్ సమస్య ఉండదని రైతులు గ్రామస్తులు ఇలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. బొగ్గు నీటితో ఉత్పన్నమయ్యే విద్యుత్‌తో పోలిస్తే సోలార్ విద్యుత్ ద్వారా పర్యావరణ కాలుష్యం అసలే ఉండదని సురక్షితమన్నారు. వెలిగల్లు, తూముకుంట గ్రామాల్లో గ్రామస్తులు డీకేటీ రైతులు సమన్వయంతో సహకరిస్తే భూసేకరణ కార్యక్రమం పూర్తయి సోలార్ పనులు వెంటనే చేపట్టగలమన్నారు. జిల్లాలో మైలవరం మండలంలో 95 శాతం భూములు ప్రభుత్వ భూములైనందున భూసేకరణ కార్యక్రమం పూర్తయి సోలార్ పనులు ప్రారంభించామన్నారు. అనంతపురం జిల్లా నంబులపూలికుంట మండలంలో ప్రస్తుతం 250 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం జరుగుతోందన్నారు. ఈ మండలంలోని సోలార్ భూములకు పరిహారం ఏప్రిల్ నెలలో జిల్లా కలెక్టర్‌కు రూ.20 కోట్లు అందజేశామన్నారు. మరో రూ.20 కోట్లు భూసేకరణ పూర్తయిన వెంటనే చెల్లిస్తామన్నారు. తహశీల్దార్ సోలార్ భూములు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన వెంటనే భూసేకరణ పనులు పూర్తవుతాయన్నారు. అనంతరం వెంటనే సోలార్ పనులు ప్రారంభిస్తామన్నారు.
సోలార్‌కు భూములిస్తాం
వెలిగల్లు గ్రామంలో ఏర్పాటు చేయు సోలార్ భూములకు భూములిస్తామని శనివారం తహశీల్దార్ భవానీకి డీకేటీ భూముల రైతులు వినతిపత్రం సమర్పించారు. కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని, ఇలాంటి అపోహాలు నమ్మవద్దని తహశీల్దార్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ చిట్టిబాబు, ఆర్‌ఐ వినీత్‌కుమార్‌రెడ్డి, సీనియర్ సహాయకులు రాణాప్రతాప్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వీరభద్రప్పనాయుడు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

29న నగర పాలక వనమహోత్సవం

కడప,(టౌన్)జూలై 23: నగర పాలక పరిధిలో పచ్చదనాన్ని నెలకొల్పేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సంకల్పించినట్లు ఆయన అన్నారు. శనివారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో వనమహోత్సవం పై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లక్ష మొక్కలు నాటాలని సంకల్పించినట్లు తెలిపారు. వర్షాకాలంలో వాతావరణం అనుకూలంగా ఉన్నందున మొక్కలు త్వరగా పెరుగుతాని నాటిన మొక్కలు బాధ్యతతో సంరక్షించాలన్నారు. సామాజిక వన విభాగం డిఎఫ్‌ఓ నరసింహులు మాట్లాడుతూ రెండు అడుగుల లోతులో గుంతలు సిద్ధం చేసుకున్నాక మొక్కలు తీసుకెళ్లినాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్‌లీడర్ జికె విశ్వనాధరెడ్డి, కార్పొరేటర్లు రామలక్ష్మణరెడ్డి, చల్లా రాజశేఖర్, శివకోటి, ప్రసాదరెడ్డి, విజయలక్ష్మి, బాబు, సురేష్, రాజశేఖరరెడ్డి, చైతన్య, బి.పద్మావతి, డిఇఇ శ్రీనివాసులు, మున్సిపల్ ఇంజనీర్ చెన్నకేశవరెడ్డి, నాగానందయ్య, ఆర్‌ఐ వెంకటరామిరెడ్డి, షాహిద్, శ్రీనివాసులు, యుబిఎస్ విభాగం కో-ఆర్డినేటర్లు గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.

త్వరితగతిన ఎస్సీ,ఎస్టీ కేసులు పరిష్కరించాలి

కడప,(కల్చరల్)జూలై 23: త్వరిత గతిన ఎస్సీ,ఎస్టీ కేసులు పరిష్కరించాలని అధికారులను జెడ్పి చైర్మన్ గూడూరు రవి కోరారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో జరిగిన విజిలె న్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ఆర్డీఓ చిన్నరాముడు, డిఎస్పీలు అశోక్‌కుమార్, షౌకత్ అలీ, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి దళితులకు న్యాయం చేయాలన్నారు. ఆధారాలు సేకరించే సమయంలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించాలన్నారు. ఎస్సీ,ఎస్టీ హాస్టళ్లలో వౌలిక సదుపాయాలు లేవని అక్కడ పనిచేసే వార్డెన్లు సరిగా విధులకు హాజరుకావడం లేదన్నారు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందిస్తూ బయోమెట్రిక్ విధానం అమలుపరుస్తున్నామని, అవకతవకలు జరిగే అవకాశం లేదన్నారు. చాలా ప్రాంతాల్లో దళితులకు శ్మశాన వాటికలు లేవని, పెండ్లిమర్రి మండలంలో ఎస్సీ,ఎస్టీ కేసులు ఎక్కువగా ఉన్నాయని వీటిని తక్షణం పరిష్కరించాలన్నారు. ఆర్డీవో చిన్నరాముడు మాట్లాడుతూ కడప పరిధిలో హిందు, ముస్లిం,క్రైస్తవులకు శ్మశాన వాటికల కోసం సబ్ జైల్ సమీపంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. దీనిపై ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ అక్కడి స్థలం అనుకూలంగా లేదని దూరమవుతుందని, అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. కడప డిఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కేసులపై అమిట్‌మెంట్ యాక్టుప్రకారం ఆధారాలు సేకరిస్తున్న సమయంలో వీడియోలు చిత్రీకరిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా కేసులు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అవ్వారు మల్లికార్జున, సిపి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కేసుల పరిష్కారంలో
జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి

కడప,(లీగల్)జూలై 23: రాష్ట్రంలోనే లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులు, న్యాయవాదులు సహకరించాలని జిల్లా ప్రధాన జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. శనివారం ఆమె జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకు కేసుల్లో రుణగ్రస్తుల కేసులను ఎక్కువసంఖ్యలో ఆగస్టు 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో కృషి చేయాలని న్యాయవాదులు, ఇన్సురెన్స్ అధికారులు అందరి సహకారంతో కోర్టుకురాని కేసులు, పెండింగ్‌లో ఉన్న కేసులు, చెక్‌బౌన్స్ కేసులు పరిష్కరించేందుకు అధికారులు లిస్టును తయారుచేసి వారికి నోటీసులు పంపి రుణగ్రస్తులకు లోను మొత్తాన్ని తగ్గించుటలో బ్యాంకు అధికారులు వెసులుబాటు కల్పించాలన్నారు. అలాగే లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్న కేసుల్లో ఎవరైనా డబ్బుల మొత్తం చెల్లించకుంటే ఎడ్యుక్యూషన్ పిటీషన్‌ను దాఖలు చేసుకునే తీర్పును సుప్రీం కోర్టు ఇచ్చిందని ఆమె తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కేసులు పరిష్కారంలో సహాయ సహకారాలు అందించి రాష్ట్రంలోనే కడప జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించి కీర్తి తెచ్చుకోవాలన్నారు. న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ప్రసా ద్, న్యాయవాదుల సంఘం అధ్యక్షు డు రాఘవరెడ్డి, బ్యాంకు అధికారులు, లీగల్ అడ్వైజర్ న్యాయవాదులు శ్యాం సుందర్, రామగంగిరెడ్డి, ప్రసాద్, రామస్వామిశర్మ పాల్గొన్నారు.

ప్రజల మోసం చేస్తున్న చంద్రబాబు

చక్రాయపేట, జూలై 23: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెబుతూ అమలు కాని హామీలను ఇస్తూ మోసం చేస్తూ ముందుకు వెళ్తున్నారని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలంలో గడప గడపా వైకాపా కార్యక్రమాన్ని పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రం నుంచి ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రారంభం చేశారు. తొలుతగా ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గండి క్షేత్రం, అద్దాలమర్రి, మారెళ్లమడక గ్రామాల్లో గడప గడపా వైకాపా కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి పింఛన్ అందలేదని, నిరుద్యోగ భృతి అధికమైందని పలువరు వారికి నివేదికలు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీ ప్రజలకు రుణమాఫీ అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తామని కల్లిబొల్లి మాటలు చెబుతున్నదని, రుణపత్రాన్ని బ్యాంకు వద్దకు తీసుకెళ్లినా రెండో విడత రుణమాఫీ కాకపోవడంతో వారు ఇలాంటి మోసపూరిత పనులు ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి శంకర్‌రెడ్డి, జిల్లా గ్రీవెన్స్‌సెల్ ప్రధాన కార్యదర్శి ప్రసాదరావు, సర్పంచులు సంజీవరెడ్డి, పార్థసారథిరెడ్డి, మోహన్, గఫూర్, యూత్ కన్వీనర్ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.