విజయనగరం

బహిరంగ మలవిసర్జన నిర్మూలన సాధ్యమయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 22: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన సంపూర్ణ బహిరంగ మలవిసర్జన నిర్మూలన విజయనగరం పట్టణంలో సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. విజయనగరంలో బహిరంగ మలవిసర్జన యధేచ్ఛగా జరుగుతోంది. స్వచ్ఛ్భారత్‌కి ప్రాధాన్యత ఇచ్చే అశోక్‌గజపతిరాజు బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు కృషి చేస్తున్నప్పటికీ మున్సిపల్ పాలకవర్గసభ్యులు, అధికారులలో చలనం కనిపించడం లేదు. ఈ కారణంగానే పట్టణంలో 40శాతం వరకు బహిరంగ మలవిసర్జన జరుగుతోంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి బహిరంగ మలవిసర్జన జరగకూడదని, బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలను ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపల్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పట్టణంలో ఇంతవరకు 70 శాతానికి మించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు జరగలేదు. మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులు ఉండగా, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల కోసం 3,155 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1863 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యక్తి మరుగుదొడ్ల నిర్మాణానికి ఒక్కొక్క దానికి కేంద్రప్రభుత్వం నాలుగు వేల రూపాయలు, రాష్ట్రప్రభుత్వం 11వేల రూపాయలు రాయితీతో కూడిన ఆర్థికసాయాన్ని అందిస్తోంది. మున్సిపల్ పాలకవర్గసభ్యులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల మరుగుదొడ్ల నిర్మాణం ముందుకు సాగడంలేదు. ఈనెల 25వతేదీలోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ఈ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) మేనేజింగ్‌డైరెక్టర్ పి.చినతాతయ్యలు ఆదేశించారు. అయితే నిర్థేశించిన గడువులోగా మరుగుదొడ్ల నిర్మాణాలు జరగకపోవడంతో మున్సిపల్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం పట్టణంలో 75 నోటిఫైడ్ మురికివాడలు, మరో 25 నాన్ నోటిఫైడ్ మురికివాడలు ఉన్నాయి. ఈ మురికివాడల్లో చాలామందికి వ్యక్తిగత మరుగుదొడ్లులేవు. ఖాళీస్ధలాలు, ప్రధాన కాలువలను మలవిసర్జన కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న కణపాక వాసులు జాయింట్‌కలెక్టర్ నివాస ప్రాంతం, అంబేద్కర్ కల్యాణ మండపం, గ్రామీణ సహకార నీటి విభాగం కార్యాలయాలకు ముందు ఉన్న కాలువల్లో బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు కలెక్టరేట్ అధికారులు, మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. అదేవిధంగా జొన్నగుడ్డి, లంకాపట్నం, అంబేద్కర్ కాలనీ, అశోక్‌నగర్, పూల్‌భాగ్‌కాలనీ, హుకుంపేట, బుంగవీధి, కొత్తపేట గొల్లవీధి ప్రాంతాలలో నేటికీ బహిరంగ మలవిసర్జన జరుగుతోంది. ప్రజలలో చైతన్యం తీసుకురావల్సిన పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పట్టణంలో మరుగుదొడ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యతలను స్లమ్ లెవెల్ ఫెడరేషన్ (ఎస్‌ఎల్‌ఎఫ్) సభ్యులకు అప్పగించడం వల్ల ప్రభుత్వ లక్ష్యంగా నీరుగారుతోంది. చాలాచోట్ల మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకుండా విడతల వారీగా అందించే డబ్బును కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు ఒత్తిడి మేరకు ఎస్‌ఎల్‌ఎఫ్ సభ్యులు డ్రా చేసినట్లు తెలిసింది. ఇటీవల ప్రత్యేక బృందాల తనిఖీలో ఈ విషయం బయటపడటంతో గుట్టుచప్పుడు కాకుండా తిరిగి మున్సిపాలిటీకి చెల్లించారు. కొంతమంది కౌన్సిలర్లు చేతివాటం ప్రదర్శించడం వల్ల తాము ఇబ్బందులు పడవల్సి వచ్చిందని ఎస్‌ఎల్‌ఎఫ్ సభ్యులు వాపోయారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణను ఆంధ్రభూమి వివరణ కోరగా పట్టణంలో అక్టోబర్ 2వ తేదీనాటికీ 80 శాతం వరకు బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలను ప్రకటిస్తామని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే మరుగుదొడ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని చెప్పారు.