నెల్లూరు

నవ్యచైతన్యం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతులిత బలరాముడు, ఆడినమాట తప్పనివాడు అందరికీ అండగా నిలుచువాడు ఇలా వింటూంటే ఆ తల్లి ఎంతో గర్వపడిపోతోంది.
అది ఒక సభ, ఆ సభలో అనేకానేక విద్యలు నేర్పిన ఆరితేరిన వారి గురించి ప్రస్తావనలు వచ్చాయి. ఆ నిండు సభలో, జనం నిండిన సభా ప్రాంగణంలో మెల్లగా మూలనక్కిన నాగమ్మ ఇదంతా గమనిస్తోంది.
నాగమ్మ జీవితం కాచి వడపోసిన నవీన భారతావని - ఆ వనిత వితంతురాలు కాక మునుపే సంసారాన్ని ఈదటానికి అవతరించిన వీరవనిత.
అది ఒక సమూహ సంసారాల గూడ. ఒకరి మనసులు ఇంకొకరితో కలసి, కలసిపోయిన సంసారాల నావలు.
ఒక ఇంట్లో కారం తిన్న పసిపాప ఏడిస్తే ఆ పది కుటుంబాల్లో కన్నీరొస్తవి. భర్తతో ఊసులాడే సమయం చిక్కక చంటిదాన్ని మోదినావే కనకం? అని పక్క గుడిసెలో ఉన్న ఒకక్క అంటే అవును మరి ఆకలేస్తే ఆకులో ఉన్న సాదకం తినేదాక ఊరుకున్నావు కదటే చెల్లెలా? ఇలా పరాచికాలు ఆడుకున్నా, చికాకులు పరాకులు లేని చీకూ చింతా వైపు చవిచూడని అమాయక జనపదులు వారు.
పది కుటుంబాలే కానీ, వందమంది పైగా నివసించే కుటుంబ సమూహాలు అవి. కష్టసుఖాలు కలసి పంచుకునే కలాసీలు.
ఇటీవల గేటు సమస్యలు వచ్చినవి.. వారందరిలోనూ ఒకటే తంట. అందిరిలోనూ ఒకే రకమైన చర్చ - ‘‘గేటు, గ్లోబు - రోబో ప్రొక్లైన్లతో ఇళ్లు కొడతారంట, ఒక యేటుతోనే నూరు కొంపలు కూలతాయంట ఉన్న రోడ్డు చాలదంట, ఎడల్పు చేయాలంట ఈరినందర్నీ ఏడకో తరలిస్తరంట’’ ఇలా ఏవేవే ఆ కుటుంబ పెద్దల్లో కలతతో కూడిన చర్చలు.
ఆ వీధి నాయకుడు పార్టీ పెద్ద మనుషులను తీసుకొని వచ్చి మధ్యవర్తిత్వం చేయాలని ప్రయత్నించాడు. కానీ నూరు ఆవాసాలు వారికై వారు తొలగించుకోవడానికి ఇష్టపడలేదు. ఇంటికి ఐదువేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇప్పిస్తానన్నాడు. ‘‘ఇది ఏ పాటికి? ఇంటిలో తట్టాబుట్టా సర్దుకుని పోవడానికి దారి ఖర్చులకే సరిపోదు అని’’ ఒక పెద్దయ్య అంటే, మూలనున్న ముసలమ్మ అంటుంది ‘‘ఇక్కణ్ణుంచి లేపేస్తే, వేరే ఊరు చివర ఇస్తే ‘‘మళ్లాగూడు ఎట్లా కడతావురో’’ కొడకా! ఆ ఐదువేలకు నేనొల్ల’’ అని ఖరాఖండిగా చెబుతుంది.
ఈ రకంగా ఆ జనపదులతో సాగిన తీవ్రమైన మానసిక పోరాటం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అనే తపన - ఆలోచనగా మారి, ఆవేశం ఉద్రేకం ఇవి ఉనికికే ముప్పు అని ఒకరిలో ఒకరు అనుకుని ఇదే సమస్య ఆ గూటి చిలకల గుసగుసలై ఒక సంఘశక్తిగా మారింది. ఎన్నో ప్రజావాణి అర్జీల సమస్యల సాధికారతకు రూపుదాల్చింది.
కడగండ్లతో కాపురాలు చేయలేక, నవీన భారతంలో నాగరికత వైపు తొంగి చూద్దామనుకున్న ఆయా సంత కుటుంబాల్లో ఉన్న ఆవాసాలను వదిలి, సుదూర ప్రాంతాలకు వలస పోవలసి వస్తుందేమోనని, స్నేహాలు పోయి, బంధుబళిగకూడి, కుటుంబాలు కూలిపోతాయోమోలనే విషాదఛాయలు అలుముకున్నాయి.
నైతికంగా, నిజాయితీగా, ఎవరి కూలీ వారే తెచ్చుకున్నా, పండగ పబ్బం కలిపి జరుపుకునే ఆనందం కోల్పోతున్నామనే భావం ఆశనిపాతంలా ఆవరించింది. దిశానిర్దేశనం కనపడలేదు.
పదిరోజులైంది సర్కారు వారి డప్పులు మ్రోగాయి. యిల్లు కూలుస్తాం అనే అరుపుల మోతలు మైకుల్లో వినిపించాయి. లాఠీలతో మోదుతారనే కేకలు ఆ వాడ, ఈ వాడ ‘తుఫాన్ గాలి శబ్దాల్లా’, ‘ఎగిరి క్రిందపడుతున్న రేకుల చప్పుళ్లా’ అందరినీ కలవరపెట్టాయి.
నిరాశ్రయులైతే చదువుకునే పిల్లల గతేంటి? ఆసుపత్రి చికిత్సకు ఎదురుచూసే అమ్మ, నాన్న పరిస్థితేంటి ఇలా అనేక రకాలుగా బాధాతప్త హృదయాలుగా మరో ఐదురోజులు వెళ్లదీశారు.
ఎట్టకేలకు ఒక పరిష్కారం చిక్కింది.
అందరిలోకి తెలివైన సులోచనమ్మ చేసిన ఆలోచన సరియైనదే అని అందరూ భావించారు. ఇద్దరు కొడుకులున్న నాగమ్మ ‘‘చిన్న కొడుకు పట్నంలో చదువుతూ యింకా ఒక సంవత్సరం కాలం ముగిస్తే ఒక పెద్ద నౌఖరీ వస్తుందనే ఏకరూప భావ వ్యక్తీకరణం చేయించగలిగింది’’ అందరిచేత.
అయితే, ఇప్పుడు మనకొచ్చేదేంటంట అని తలపాగా యువకుడు లేచి తల ఎగరేసి ప్రశ్నించాడు. ఇంకొకడు కట్టుకున్న లుంగీ పైకి ఎగమడుస్తూ - ‘ఆ’ ఆయన సదివి, మనకు ఒరగనిచ్చేదేంటంట’’ ఇలా ఎవరికి తోచినట్టువారు విరుపులు విరిచారు.
ఇదంతా గమనిస్తున్న ఇద్దరు ముగ్గురు వయసులో పిన్నవారు సులోచనమ్మా ‘‘నీవు సెప్పేదీ సెప్పవే!’’ ఆళ్లమాటలకేంగానీ, అని అంటూ కొనసాగింపచేశారు.
సులోచనమ్మ ఆ జనపదంలోని ఓ కుటుంబ యజమాని కూతురు బి. ఏ. వరకు చదివి స్తోమత లేక చదువు ఆపుచేసుకుంది.
తల్లి చిన్ననాడే వ్యాధితో చనిపోయింది. తండ్రి మంచం మీద మనిషి. హేతుబద్దంగా ఆలోచిస్తుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మళ్లీ యిల్లు కట్టుకోవాలంటే, డబ్బు వెచ్చించి కొనాల్సి వచ్చిన ఇసుక, కాంక్రీటు, చిప్స్, నీళ్లు ఇన్నింటి గురించి చక్కగా ఆలోచించి నిబద్ధతతో ఒక రూపకల్పన చేసి సర్కారీ ఆఫీసులకు అర్జీలు పంపగలదు.
సంతకాలు నేర్పించిన ఆధునిక అక్షరజ్యోతి, ఆ ధైర్యంతో ఆ ప్రస్తావన చేసింది. ‘ఆ’ ఇంతకీ ఆ పట్నవాసం కుర్రోడి గురించి నీకెందుకొచ్చింది ఆలోచన అని పిన్ని వరుస అయిన ఒక అమ్మలక్క ప్రశ్నిస్తే ‘ఆ’ ఏముందిలే, ఈయమ్మ సదుకుందిగా, సదువు....అని ఇంకొకమ్మ తనదైన ఈసడింపుతో సులోచనమ్మను తప్పు పట్టింది.
ఐతే, సులోచన మనసులో ఏ విధమైన మారుభావం తలెత్తలేదు. యింకా పూర్తిగా మాట్లాడకుండానే అందరూ కలిసి ఒకే సమస్యపై పలురకాలుగా వాదించుకుంటున్నారు. కాబట్టి ఆమె మాటకు అడ్డొచ్చారు. ఏవేవో మాట్లాడుతారు అని సర్దుబాటు చేసుకొంది సులోచనమ్మ. అంతలోనే సులోచన చెబ్తోంది, ఓరి సన్నాసుల్లారా! మీకు బాడీ బరువేగానీ, బుద్ధి బరువులేదర్రా, అమ్మలక్కలు చెప్పిందల్లా వింటార్రా!
నే చెప్పేదీ ‘‘పట్నంలో చదివే నాగమ్మ కొమరుడి గురించి కాదర్రా.. ఇటీవల ‘రైతుబంధు’ అవార్డు పొందిన పెద్దోడు గంగయ్య గురించేరా’’ అని అంటోంటే, అందరూ కూడా అలాగా! అని తల ఊపుతోంటే, అదో పెద్ద మీటింగ్‌లా మండల సచివాలయంలా అక్కడున్న సభికులందరూ పార్టీలో గెలుపొందినవార్లలో ఇస్తున్న ప్రశంసలను సంకలనం చేస్తూ కాగితం కలం పట్టుకుని నిర్ణయాలు వ్రాస్తున్న సులోచనమ్మ ముక్తాయింపు చేసింది.
ఇదంతా నాగమ్మ దూరం నుంచే గమనిస్తూ చింపిరి జుట్టును వెనక్కి తీసుకుంటూ, ఆశ్చర్యంగా, సులోచనమ్మ వంక, ఇతర సంఘ సభ్యుల వంక యింకా యింకా ఆతృతగా చూస్తూ గుండెలనిండా ఆనందాన్ని నింపుకుంటూ, తన గుండెదీపం యింకా ఆరకుండా ఇద్దరు కుమాళ్లు రెండు చేతులు పెట్టి నిలబెడతారనే ఆశల పల్లకిని వ్యక్తం చేయడాన్కి సంసిద్ధురాలైంది.
అయితే ప్రస్తుత ప్రధాన సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడాన్కి ఈ ఇద్దరు కుమార్లు తీసుకునే చర్యలు గురించి, ఎవరికి వారే ఊహిస్తూ సులోచనమ్మ చేతికి ‘స్పీకరు’ ఇచ్చారు.
‘ఆశావహుల మధ్య హంసవిలాసం’ లాగా సులోచన ఈ క్రింది విధంగా తీర్మానించింది.
1) అందరం కలసి ‘‘ ఈ గూళ్ళూ ఖాళీ చేయం, ‘‘ ఈ వాడ వదిలేది లేదు’’ అని ముక్తకంఠంతో పలకడం.
2) ‘‘సర్కారీ పన్నులు చెల్లించడానికి మేము సన్నద్ధులమే’’
3) మేము పండించిన పంట చేరవేయడాన్కి ఈ మార్గమే హద్దు
4) రహదారులు ఏర్పాటుచేసుకోండి. కానీ ఈ దారిని మాకు వదిలేయండి
5) వేరే చదువులు మాకొద్దు. ఉన్న చదువు పాడుచేయొద్దు
6) కలుషిత వాతావరణంలోనికి ఆరోగ్యకరమైన మా జీవితాన్ని నెట్టొద్దు
యిలా సులోచనమ్మ చేసిన తీర్మానాలపై ఏకీకృతం అయింది. అప్పుడే పట్నం నుంచి దిగిన చంద్రయ్యకు ఇది తనకు జరిగే స్వాగత కుసుమాంజలి అయింది. ఆహ్లాదంతో, గంగయ్య చంద్రయ్యలిద్దరితో ‘‘మేముంటాం..మేముంటాం’’ బలరాముల్లా ఉంటారు అని సులోచనమ్మ ఔచిత్యాన్ని పొగడ్తూ, నాగమ్మ ఔదార్యాన్ని మెచ్చుకుంటూ ఆమెను వేదిక మీదకు తీసుకొచ్చి ఆమె నిర్భయత్వాన్ని మాతృత్వాన్ని అందర్కీ తెలియజేస్తూ స్ర్తి శక్తిని వారి చమత్కారాన్ని విశే్లషించారు.
సామాజిక స్పృహతో, ఒక సంఘటిత శక్తిగా నిలబడడాన్ని సామూహికంగా పోరాడి సమస్యలు సాధించుకోవడానికి ఆ గ్రామకంఠాలలో ఏర్పడి వారి సంస్థను రిజిష్టరు చేయించుకున్నారు. జరిగే వ్యతిరేక మార్పును ఎదిరించి ఆపుకున్నారు. ఒక సంస్థ ఏర్పాటు చేశారు.
ఆ సంస్థకు ‘‘నాగమ్మ సొసైటీ పేరు’’ తీర్మానించారు. నాగమ్మ నిశే్చష్ఠురాలైంది. ఆనందోల్లాసితురాలైంది. గుండె ఆగినంత పనైంది. కొడుకు ఒళ్లో వాలిపోయింది. ఆ సంస్థకు నాగమ్మ మెమోరియల్ సొసైటీగా నామకరణం చేశారు. పట్నవాసం చదువు వృథాపోనియ్యలేదు. ఆమె నేత్రాలు దానం చేశాడు. తన తల్లి ఆస్తిపాస్తులతో, సంపాదనతో అక్కడే తన ఇంట్లోనే చంద్రయ్య ఆసుపత్రి నిర్మించాడు. ఆమె పేరు సార్థకం చేశాడు. సామాజిక స్పృహను కనపరిచాడు. ఆ ఆసుపత్రికి, గంగయ్య మేనేజరు. ఇప్పుడు సులోచనమ్మ ఉద్యోగస్తురాలు ఆ ఆసుపత్రి రిసెప్షనిస్ట్.
ఇప్పుడు వాళ్ల ఆలోచనా విధానమే వేరు. ఇలా ఎందరో నిర్భాగ్యులు ఈ రీతిగా సంపాదనాపరులు అలాగే ఎందరికో వైద్యం - వైవిధ్యభరితమైన జీవితం. ‘బతుకు జట్కాబండి’లో నుండి బ్రతికే విధానం నేర్చిన సామూహిక కుటుంబ జీవనం.

- రాయప్రోలు లక్ష్మీరామకృష్ణ
నెల్లూరు. చరవాణి : 0861-2306211

స్పందన

రాంబాబు-బామ్మ కథ బాగుంది
గతవారం మెరుపులో మదనపల్లె నుండి డాక్టర్ జ్ఞానేశ్వరు గారు రాసిన రాంబాబు-బామ్మ కథ చాలా బాగుంది. ఓ కథల పిచ్చి వున్న మనుమడిని బామ్మ మార్చిన విధం బాగుంది. బామ్మ మాటలు విన్న రాంబాబు కథల నుండి దృష్టి మరల్చి ఉద్యోగం సంపాదించడం, రిటైర్‌మెంటు అయిన తరువాత కథను రాద్దామనుకుని బామ్మ మాటలు గుర్తొచ్చి ఆగిపోవడం వంటి సంఘటలను బాగా తీర్చిదిద్దారు. కథ మొత్తం ఎక్కడా బోరింగ్ లేకుండా చెప్పదలచుకున్న విషయాన్ని రచయిత చక్కగా చెప్పగలిగారు. అయితే కథలో కేవలం రాంబాబు-బామ్మ మధ్యనే సంభాషణలు సాగాయి. మరో రెండు,మూడు పాత్రలతో కథను మరింత పొడిగించి వుంటే బాగుండేదేమో. కథలు రాయడం ఒక్కటే కాదు బతకడానికి ఏదైనా చెయ్యాలి అనే సందేశంతో రాసిన కథ బాగుంది.
- కోన సుబ్బారావు, కనిగిరి
- ఐతా కేశవకుమారి, అధ్యాపకురాలు, నెల్లూరు
- సూరి వెంకటరెడ్డి, రేణిగుంట

సైనికులపై పూలజల్లు
జమ్మూ-కాశ్మీర్ భారత సరిహద్దులో కంటిపై రెప్పవాల్చకుండా దేశానికి రక్షణ కవచంలా కాపలా కాస్తున్న సైనికులకు గతవారం మెరుపులో కవితల రూపంలో పూలజల్లు కురించిన రచయితలకు ధన్యవాదములు. ప్రతి కవిత దేనికదే ప్రత్యేకంగా సాగింది. నిత్యశ్రామికుడు అంటూ పీసపాటి సంపత్‌కుమార్ రాసిన కవితలోని ప్రతిలైను సైనికుడికి పాదాభివందనం చేసింది. ఏమిచ్చి తీర్చుకోగలం నీ రుణం సైనికుడి గొప్పతనాన్ని ఎలుగెత్తిన చాటింది. అలాగే ఖబడ్దార్ అంటూ ఉగ్రమూకలను హెచ్చరించిన అవ్వారు శ్రీ్ధర్‌బాబు కవిత గుండెల్లో చైతన్యాన్ని నింపింది. మోపూరు పెంచలనరసింహం గారి జైజవాన్ కవిత నిడివి చిన్నదైనా గొప్పభావాన్ని కళ్లకు చూపింది. సంస్కృతి స్తంభాలు అనే కవితలో వైవిధ్యాన్ని చూపిన పల్లాపు రాము గారికి ధన్యవాదములు. మొత్తంగా గత ఆదివారం భారత సైనికులకు కవితల వర్షంలో సైనికులను ముంచెత్తారు.
-శ్రీకిరెడ్డి ధనుంజరెడ్డి, నెల్లూరు
- వాసిలి అన్నపూర్ణ, కావలి
- హేమ, సిఎస్ పురం

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

పుస్తక సమీక్ష

పరిశోధనా గ్రంథం మహిళ

ఒంగోలుకు చెందిన ప్రముఖ న్యాయవాది, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డి సమాజంలో లోతుగా అధ్యయనం చేసి శోధించి పరిశోధించి రచించిన దీర్ఘవ్యాసం మహిళ. స్ర్తి పుట్టుక, సమాజంలో ఆమె స్థానం, నిర్వహించాల్సిన బాధ్యతలు వంటి ఎన్నో అంశాల మూలలు కూడా కనుక్కొని తన ప్రతిభతో ఒకచోట క్రోడీకరించి అందించిన మహిళ పుస్తకం నిజంగా ఆధునిక సమాజానికి ఎంతో ఉపయుక్తం. ఇది పరిశోధనా గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఇందులోని అంశాలను ఉన్నత తరగతులకు పాఠ్యాంశంగా చేర్చితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఆద్యంతం నవ్యత గోచరించే ‘మహిళ’లో ప్రముఖులతో రాయించే ముందుమాటకు మంగళం పాడడం కూడా కొత్త పోకడగా చెప్పుకోవచ్చు. తన భావాలకు వివిధ అంశాలు జోడించి రాసిన దీర్ఘవ్యాసం మహిళలో ఎన్నో అద్భుత అంశాలు మన కళ్లముందుంచారు రచయిత.
స్ర్తి, పురుషజాతుల పుట్టుక, ప్రాచీన హిందూ సమాజంలో మహిళ ఏవిధంగా ఉండేది. ఇప్పటి సమాజానికి అనుగుణంగా ఏవిధంగా మార్పుకోరుకుంటూ వచ్చింది రచయిత కూలంకషంగా వివరించారు. ‘కొన్ని శతాబ్దాల కిందట మహిళ పరిస్థితి దయనీయమైందని నేడు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కాలగమనంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు మార్పుచెందడం, స్ర్తివిద్య, స్వావలంబన ఆస్తులు, హక్కులు సంపాదన ఇత్యాదులు కలగడంవల్ల స్ర్తి చైతన్యవంతురాలైంది. బలం పుంజుకుంది’ అని రచయిత సూటిగా చెప్పారు. మహిళలు రక్షణ, హక్కులు, ఉద్యమాలంటూ వివిధ విభాగాలుగా ఏర్పరచి మహిళాభ్యుదయాన్ని కాంక్షిస్తూ రచయిత చక్కని సమాచారాన్ని పాఠకులకు అందించారు.
చివరగా
నాలోని ఆడతనాన్ని కాక, అమ్మతనాన్నిచూడు
ఆయుష్షుపోసుకుంటావు
నాకున్న ఐశ్వర్యాన్ని కకా, అనురాగాల్ని వెతుకు
ఆనందాన్నందుకుంటావు
నాపై ఆధిపత్యాన్ని కాక సహకారాన్ని సంపాదించు
విజేతవవుతావు అని పెండ్యాల గాయత్రి మనోభావాల్ని ఉంటంకిస్తూ
సృష్టిలో స్ర్తి సగం అంటూ ఆమెకు గౌరవప్రదంగా పదిలపరిచే నిర్ణయం ఆవశ్యం. రెండోసగం విలువనూ గౌరవాన్ని కాపాడే బాధ్యత స్ర్తి తీసుకోవాలి స్ర్తి వ్యక్తిత్వం గల వ్యక్తి, పురుషుడు విలువలున్న వ్యక్తి సమాజంలో ప్రకృతి సంపదల వినియోగంలో జీవన విధానానికి అతగినట్టు ఎవరి బాధ్యతను వారు గౌరవప్రదంగా నిర్వహించడం వల్ల సమానతను సామీప్యతను సాధించొచ్చు అని రచయిత ముగించడం ముదావహం.

- గౌతమి
9347109377

ప్రతులకు
అన్ని విశాలాంధ్ర పుస్తకశాలలు మరియు
బి.హనుమారెడ్డి
న్యాయవాది, రాజాపానగల్ రోడ్డు, ఒంగోలు. చరవాణి : 94402 88080

మనోగీతికలు

అఖండ
మానవఘోష
రాత్రి అనుభవించిన కలలన్నింటికీ
ఆత్మముద్రని అద్ది
యథాతధంగా కళ్లదీపాల్ని వెల్గించుకుని
నడవకపోతే ఎట్లా
నడుస్తున్నంతసేపూ గొంతులోని దుఃఖాన్ని
స్రవించుకున్నాక
నీకు ఎదురుపడ్డ మనిషితో మాట్లాడకుంటే ఎట్టా
అపరిమితకాలాన్నంతా కళ్లలో నింపుకుని
కెరటాల హోరుని అనుభవిస్తున్న హృదయాన్ని ఓదార్చుకుని
కాంతి రసాయనాన్ని అరచేతులకి పూసుకుని
ఎదురయిన వాడితో కరచాలనం గావించకుంటే ఎలా
ఆత్మశ్రేణి నుంచి అపరిమితంగా కదిలితేనే కదా
నిలువెత్తు మనిషి గురుత్వకేంద్రాన్ని దర్శించగలిగేది
కలత నిదుర నుంచి మనిషిని పెకిలించి
వైభవశిఖరాన్ని అతన్ని ఎక్కించి
శరీర ధ్వజస్తంభానికి జీవాన్ని కల్గించాలంటే
ముందుగా నీవే వాడిని పలుకరించాలి కదా
పలకరింపులంటే పెదవుల పువ్వులు విచ్చుకుని
మాటల పుప్పొడిని రాల్చుకోవడం కాదు
వర్షపు నీటిలో కాగితం పడవ విహారమూ కాదు
మొదలూ చివరా లేని సంభాషణా కాదు
పలకరింపులంటే..దీపధారివై ఎదుటివాడికి మార్గమవటం
నీ దగ్గర మిగిలిన నాలుగు చుక్కల సంతోషాన్ని
ఒకే సరళ రేఖ మీద ఎదురెదురుగా నిలబడి
నిర్భయంగా అతని దోసిట్లో ప్రేమగా నింపడం

శరీరమూ, రూపమూ దాని మీద వస్త్రాన్ని
పలకరించడం కాదు
వాడి దుఃఖ కేంద్రాన్ని తాకి మలయసంకెళ్లని తుంచడం
అఖండ మానవ ఘోషని శిల్పం చేసి
అతని ముందు నిలబెట్టడం
ఆత్మని అభిషేకించి శరీరంలోకి
పునఃప్రవేశపెట్టడం
ప్రాణప్రక్రియ అనేది నిరంతరం జరిగేది.. కానీ
ఒక్క క్షణంలో మొత్తం దేహాన్ని
మోక్షపు నడకలోకి నెట్టగల్గినదే పలకరింపు

దేహమండలంలోని గదుల గొళ్లాలన్నీ తెగ్గొట్టి
ఆత్మసముద్రంలోని నీటితో శరీర కలశాన్ని
అభిషేకించి
మార్మికశాంతతని మెడలో పూలదండగా
వేయడమే పలకరింపు
ముందుగా నీవే పలకరించకుంటే
నిన్ను మనిషిగా నిజమానవునిగా
గుర్తించటం ఎట్లా
ఏమో నీవు నిదురలేచిన వెంటనే
నిద్రామందిరపు అద్దంలో నిన్ను నీవు చూస్కుని
కన్నీటి మొత్తం ఒక్కసారి తెంపుకుని
శరీరాన్ని కోల్పోయి సంచరిస్తున్నావేమో..
ఎవరికి తెలుసు..
నీకై నీవే ప్రాణాన్ని తోడుకుని
చీకటినే వరంగా స్వీకరించి
మృతసంవేదనాపరుడవై తిరుగాడుతున్నావేమో
అందుకే..పలకరింపనేది నీతోనే మొదలవ్వాలి
ఎందుకంటే..
ముందుగా నీవు అసలు పలకరిస్తేనే కదా
నువ్వు మనిషివన్నట్లు తెల్సేది..!

- ఖాదర్ షరీఫ్ షేక్
సోమశిల. చరవాణి : 9441938140

అందమైన నువ్వు
నువ్వు
బాపు గీసిన బొమ్మవు కావు
అడవిబాపిరాజు అందానివి కావు
మదనుని వింటి శరానివి కావు
నింగిన మెరిసిన హరివిల్లు కావు
అయినా ఎంత బాగుంటావు నా కళ్లకు
పలకరించే కళ్లు
మురిపించే నవ్వు
ఓదార్చే చేతులు
లాలించే ఒడి
నీ సొంతమైనప్పుడు
సరితూగగలవా
మఖలో పుట్టి పుబ్బలో పోయే
తళుకు బెళుకుల అందాలు
నీలో నేనున్నప్పుడు
నువ్వే నేనైప్పుడు
నీ ప్రతి కదలికలోనూ
పులకింతల కవ్వింతలే
ఎటువైపు చూసిన కనిపించేది
నా అందమైన నువ్వే..!

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- రాయప్రోలు లక్ష్మీరామకృష్ణ