విజయవాడ

అమర్ ప్రేమ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫీస్ పనిమీద రాజమండ్రి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళుతూ మా కజిన్ శ్రీ వల్లి అక్క వాళ్లింటికి వెళ్లాను. వెళ్లగానే ఓ షాకింగ్ న్యూస్ చెప్పి, బావురుమంది అక్క. అదేమిటంటే వాళ్ల అబ్బాయి అమర్ ఇంటర్మీడియట్ చదివే ఒక అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయి తిరస్కరించటంతో భగ్నప్రేమికుడై దరిమలా సైకోగా మారాడుట.
తనకు దక్కని ఆ పిల్ల మరెవరికీ దక్కరాదనీ, ఆ పిల్లని చంపి తనూ ఆత్మహత్య చేసుకుంటాననీ నిత్యం బెదిరిస్తున్నాడుట. అక్కా, బావా కొడుకుకి రకరకాలుగా నయానా భయానా నచ్చచెప్పి చూశారు. అయినా వాడు పట్టు విడవలేదు. అన్నంతపనీ చేసి, పోలీసు కేసులో ఇరుక్కొని, భవిష్యత్తును పాడుచేసుకుంటాడేమోనని భయపడుతున్నారు. కన్నప్రేమ అంటే అంతేనేమో? ఆ అమ్మాయికి జరగబోయే హాని కంటే కొడుకు జీవితం నాశనం అవుతుందనే బెంగ ఎక్కువగా వున్నట్లుంది. నాకు వాళ్లని చూస్తే జాలేసింది, కోపం వచ్చింది. ఆపైన ఏమైపోతారోనని భయం కూడా కలిగింది.
అమర్ ఇంటికి వచ్చిన తరువాత, నేరుగా విషయం ప్రస్తావించకుండా పిచ్చాపాటీ మాట్లాడుతున్నట్లుగానే చాలా సమాచారం రాబట్టాను. వాడికి ప్రేమపిచ్చి బాగా ముదిరి పాకాన పడింది. నేనంటే వాడికెంతో ఇష్టం. అయినా నా మాట కూడా వినే స్థితిలో లేడని అర్థమయింది.
నా బుర్ర చురుగ్గా పని చేసింది. పరోక్ష మార్గంలో ప్రయత్నిద్దామని తీవ్రంగా ఆలోచించాను. అమర్‌ని దగ్గరకి పిలిచి ‘మా యాడ్ ఏజెన్సీలో చాలా ప్రాజెక్టులు పెండింగ్ వున్నాయి. ఇచ్చిన సమయంలోపు పూర్తి కాకపోతే ఆర్డర్లు వెనక్కిపోతాయి. ఇది నాకు జీవన్మరణ సమస్య. నువ్వు నాకు సాయం చేయరాదూ!’ అని అడిగాను.
అసలే చిరాగ్గా ఉన్న అమర్ ‘మావయ్యా! ఇప్పుడు నాకు ఉద్యోగం చెయ్యాలని లేదు. యాడ్ ఏజెన్సీల్లో పనిచేయటం అస్సలు ఇష్టం లేదు’ కరాఖండిగా చెప్పాడు.
వాడికి చాలా రకాలుగా నచ్చచెప్పాను. చివరికి - నీ సహాయం లేకపోతే ఉద్యోగం పోతుందనీ, ఇక ఆత్మహత్యే శరణ్యమని కూడా హెచ్చరించాను.
వాడు చిరాగ్గా చూసి ‘ఏవిఁటీ? బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా?’ అన్నాడు.
నేను నిర్లక్ష్యంగా నవ్వి ‘అంతేలే! నువ్వు అడిగితే ఎదుటి వాళ్లకు ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాలి. మేమడిగితే మాత్రం బ్లాక్‌మెయిలా?’ అన్నాను నిష్టూరంగా.
అమర్ దెబ్బతిన్నట్టు చూశాడు. ఏమనుకున్నాడో ఏమోకానీ, కొద్దిసేపు ఆలోచించి ‘సరే! నీ కోసం వస్తాను మావయ్యా’ అన్నాడు.
ఫరవాలేదు! మెల్లిగా దారిలోకొస్తున్నాడు అనుకున్నాను.
హైదరాబాదు వెళ్లినప్పటి నుంచి అమర్‌ని పూర్తిగా ఆఫీస్‌కే అంకితమయేలా చేశాను. యానిమేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న హారికకు వీడిని అప్పచెప్పాను. ఎందుకైనా మంచిదని హారికకు వీడి ప్రవర్తన గురించి ముందుగానే హెచ్చరించాను. ఆమె అమర్‌ని తమ్ముడూ అంటూ ఆప్యాయంగా మాట్లాడుతూనే వాడిని జాగ్రత్తగా పరిశీలించసాగింది. తెలిసీ తెలియని వయసులో కలిగే ఆకర్షణ మూలంగా దిక్కుతోచని స్థితిలో వున్న అమర్ అప్రయత్నంగానే హారిక మాటలతో సాంత్వన పొందసాగాడు.
కొద్దికాలంలోనే అమర్‌లో అనూహ్యమైన మార్పు వచ్చింది. హారిక అతనికి అవసరమైన సలహాలు ఇస్తూ, చక్కని తర్ఫీదునిచ్చింది. దాంతో చిన్న చిన్న యాడ్స్ తనే సొంతంగా తయారు చేయసాగాడు. మొదట్లో అప్రెంటిస్‌గా కూడా పనికిరాడన్న యాజమాన్యం క్రమేణా పారితోషికం కూడా ఇవ్వసాగింది.
అమర్‌లోని ఈ మార్పుకి కారణమైన హారికను మనసారా అభినందించాను. ఆమె చిన్నగా నవ్వి ‘ఇందులో నా గొప్పేమీ లేదు సార్! ప్రేమకీ, ఆకర్షణకీ మధ్య తేడా అతనికి తెలియదు. సున్నితమైన ఈ విషయం అర్థమయ్యేలా చూశాను. అంతే!’ అని చెప్పి ‘కాకపోతే అతని ప్రేమోన్మాదాన్ని వదలించటానికి చిన్న నాటకం ఆడవలసి వచ్చింది’ అంటూ వివరించింది.
అర్థంకానట్లు చూశాను. అప్పుడు చెప్పింది ‘అతను చూస్తుండగా ఓరోజు మా బావ వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. నేను ఒప్పుకోలేదని నా మీద యాసిడ్ పోస్తానని బెదిరించాడు. నన్ను సొంత అక్కలా భావిస్తున్న అమర్ మా బావతో గొడవపడ్డాడు. అప్పుడే అతనిలో మార్పుకి బీజం పడింది’ అని నవ్వేసింది హారిక.
తను చేసిన ఈ మహోపకారానికి మనసారా కృతజ్ఞతలు చెప్పాను.
అమర్ మాత్రం పిచ్చి ఆలోచనలు వదిలేసి, ఇప్పుడు జీవితాన్ని ప్రేమించటం మొదలుపెట్టాడు.

- బలభద్రపాత్రుని ఉదయశంకర్,
నందిగామ, కృష్ణా జిల్లా.
చరవాణి: 94945 36524

- బలభద్రపాత్రుని ఉదయశంకర్, నందిగామ, కృష్ణా జిల్లా. చరవాణి: 94945 36524