చిత్తూరు

చిత్తూరు మేయర్ పదవి కోసం పోటా పోటీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 10: చిత్తూరు మేయర్‌గా ప్రస్తుతం బిసి మహిళ కార్పొరేటర్ల నుంచి ఒకరిని ఎన్నుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ పదవికోసం పలువురు కార్పొరేటర్లు తమప్రయత్నం ముమ్మరం చేసారు. దీంతో చిత్తూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చిత్తూరు మున్సిపాల్టీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన తరుణంలో తొలిసారిగా కార్పొరేషన్‌కు 2014లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మేయర్ పదవిని బిసి మహిళకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో ఆ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అత్యధిక కార్పొరేట్ స్థానం కైవసం చేసుకొని 31వడివిజన్ నుంచి ఎన్నికైన కఠారి అనూరాధ తొలి మేయర్‌గా నియమించబడ్డారు. అయితే గత ఏడాది నవంబర్ 17వ తేదిన మేయర్ ఛాంబర్‌లోనే అనురాధతో పాటు ఆమె భర్త కఠారి మోహన్ దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి డిప్యుటీ మేయర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యం ఇన్‌చార్జి మేయర్‌గా కొనసాగుతున్నారు. అయితే చిత్తూరు కార్పొరేషన్‌లోని 50వ డివిజన్‌లలో ఏడుగురు బిసి మహిళలు కార్పొరేటర్లుగా ఎన్నికైన నేపథ్యంలో బిసి మహిళకే మేయర్ పదవిని అప్పగించాలని కొందరు కార్పొరేటర్లు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జి మేయర్ స్థానం నుంచి సుబ్రహ్మణ్యం తప్పించి ఆ స్థానంలో ప్రస్తుతం కార్పొరేటర్లుగా కొనసాగుతున్న బిసిమహిళల్లో ఒకరిని పరోక్ష పద్ధతిలో మేయర్‌గా ఎన్నుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో కోర్టు తీర్పుతో చిత్తూరు నగరంలో ఒక్క సారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత కొంత కాలంగా మేయర్ హత్య అనంతరం పలువురు ఈ పదవి కోసం తీవ్ర స్థాయిలో తమవంతు ప్రయత్నాలు చేస్తూవస్తున్నారు. ప్రస్తుతం కోర్టు స్పష్టమైన ఆదేశాలతో ఈ పదవిని ఆశిస్తున్న బిసి మహిళ కార్పొరేటర్లు చక్రం తిప్పడానికి స్థానిక నేతలను ప్రసన్నం చేసుకొనే పనిలోపడ్డారు. అయితే మేయర్‌గా కొనసాగిన అనురాధ హత్యకు గురై ఏడాది అవుతున్నా ఇంత వరకు ఆ డివిజన్ ఉప ఎన్నిక నిర్వహించక పోవడంతో పాటు ఇన్‌చార్జి మేయర్‌గా కొనసాగుతున్న సుబ్రహ్మణ్యంను పక్కనబెట్టి తాజాగా మేయర్‌ను ఎన్నుకోవడం స్థానిక నేతలను కలవర పెడుతుంది. ఇప్పటికే నగరంలో తెలుగుదేశంపార్టీలో వర్గాలు నెలకొన్న తరుణంలో ఈ మేయర్ వ్యవహారం పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని పార్టీ సీనియర్లు వాపోతున్నారు. మేయర్ అనురాధ మృతితో ఆ స్థానం ఆ కుటుంబానికే ఇస్తామని అప్పట్లో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు లోకేష్ కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ తరుణంలో పార్టీకోసం అంకిత భావంతో పనిచేసి కష్టకాలంలో పార్టీని కాపాడుకోవడంలో కీలకపాత్ర పోషించిన కఠారి మోహన్ కుటుంబానికి ఈ ఎన్నిక కొంత వరకు నష్టాన్ని కలిగించే విధంగా ఉందని ఈ పద్దతి మంచిది కాదని కొందరు పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం చిత్తూరులో 50డివిజన్లు ఉండగా అందులో 32మంది టిడిపి కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. ఇందులో ప్రధానంగా బిసి మహిళ కార్పొరేటర్లుగా ఉన్న ఇందు, నలిని, పద్మావతి, ముత్తమ్మ, ప్రమీళారాణి, రతిదేవి, అల్లిరాణితో పాటు టిడిపి మద్దతుతో విజయం సాధించిన సిఎం విజయ మేయర్ పదవి కోసం తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసారు. అయితే పార్టీ కష్టకాలం నుంచి అండగా ఉన్న వర్గానికే ఈ మేయర్ పదవిని అప్పగించాలని పార్టీ నేతలు భావిస్తున్నా కొందరు మాత్రం ఏ విధంగానైనా ఈ పదవిని దక్కించుకోవాలనే తలంపుతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో చిత్తూరు నగరంలో మేయర్ వ్యవహారం రాజకీయ వర్గంలో కలకలం సృష్టించింది. మరో పక్క పార్టీకోసం కుటుంబాన్ని పోగొట్టుకొని కష్టకాలంలో చిత్తూరు నగరంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడంలో విశేషకృషి చేసిన కఠారి మోహన్ వర్గాన్ని అణగదొక్కాలని ఓ వర్గం కుట్ర పన్నుతున్నారని కఠారి మోహన్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. కఠారి వర్గానికేగాక ఇతరులకు ఈ పదవి దక్కడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో నగరంలో ఈ మేయర్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి
తిరుపతి, డిసెంబర్ 10: ఆర్యవైశ్యుల్లోని పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుని ఒప్పించి కార్పొరేషన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి శిద్దా ద్ధరాఘవరావు చెప్పారు. స్థానిక మిట్టవీధిలో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న ఏడంతస్థుల వాసవీనిలయానికి ఎంపి టి.జి.వెంకటేష్‌తో కలసి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు విభేదాలను పక్కనపెట్టి కలసిమెలసి పనిచేయాలని కోరారు. సంపాదనపైనే దృష్టి పెట్టకుండా నిరుపేదలకు, ప్రజలకు సేవ చేయాలన్నారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో, అధ్యాత్మిక కేంద్రాల్లో వాసవీ నిలయాలున్నాయని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్యవైశ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని వసతులు కల్పించడం అభినందనీయమని చెప్పారు. భవిష్యత్తులో నూతనంగా నిర్మిస్తున్న వాసవీ నిలయం సైతం అందరికి ఉపయోగపడాలన్నారు.
ఎంపి టి.జి.వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల్లో నిరుపేదలు ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఆర్యవైశ్యుల్లో వివాహాలు నిర్వహించుకోవడానికి ఇలాంటి భవనాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. అయితే భవన నిర్మాణ సమయంలో అండర్ గ్రౌండ్ పార్కింగ్‌కు చర్యలు తీసుకోవాలని ఎంపి వారికి సూచించారు. ఈకార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఆర్యవైశ్య సంఘ నాయకులు వెంకటేశ్వర్లు, పసుపర్తి గోపి పాల్గొన్నారు.
ప్రభుత్వభూమిలో బడుగులకు శ్మశానవాటిక కేటాయించాలి
మదనపల్లె, డిసెంబర్ 10: సోమల మండలం 81 ఉప్పరపల్లె రెవెన్యూ సర్వెనెంబర్ 434/3 ప్రభుత్వభూమిని ఎస్సీఎస్టీబిసిల స్మశానవాటికకు కేటాయించాలని డిమాండ్ చేస్తుఎపి వ్యవసాయం కార్మిక సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఎస్ సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలేదీక్షలు చేపట్టారు. శనివారం ఈ రిలేదీక్షలు మూడరోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాకార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ సోమల మండలం 81 ఉప్పరపల్లె పంచాయతీ వినాయకపురంలో నివశిస్తున్న ఎస్సీఎస్టీబిసిల కుటుంబాలకు స్మశానవాటిక కేటాయించాలని అధికారులకు విన్నవిస్తున్న పట్టించుకోవడం లేదన, బడుగులపై అదికారులకు చిన్నచూపుతగదన్నారు. గత 15ఏళ్లుగా 81 ఉప్పరపల్లె పంచాయతీ పరిధిలోని గ్రామాల బడుగులకు స్మశానవాటిక లేకపోవడంతో ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందన్నారు. ఎస్సీఎస్టీబిసిల నివశించే గ్రామాలలో స్వంతిళ్ళు, స్మశానవాటిక, కాలనీరోడ్లు, మురికికాల్వల ఏర్పటుచేసిన దాఖలాలు లేవన్నారు. బడుగులు జీవించేందుకు ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్, బిసి నిధులు కేటాయిస్తున్నప్పటికీ అధికారులు విస్మరించడం సరికాదన్నారు. ఎస్సీఎస్టీ లకు ప్రత్యేక చట్టాలు అమలులో ఉన్నప్పటికీ అధికారులు వాటిని దుర్విని యోగం చేస్తున్నారని, బడుగుల కాలనీలలో వౌలిక సదుపాయాలు కల్పించడంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే సబ్‌ప్లాని నిధులు అమల్లోకి తీసుకువచ్చి నిధులు దుర్వినియోగం కాకుండా బడుగుల గ్రామాలలో తాగునీటి ట్యాంకులు, స్మశానవాటిక స్థలం కేటాయింపు, రోడ్లు, విద్యుత్‌సౌకర్యాలు, కాల్వల అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం వహిస్తున్న సోమల మండల ఎంపిడిఓ, తహశీల్దారు, ఇతర మండలం పరిధిలోని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ నాయకులు సాంబశివ, కృష్ణప్ప, ఉప్పరపల్లె గ్రామస్థులు సునీల్‌క్రిష్ణ, బాబు, ఆదిలక్ష్మీ, చంద్రకళ, సురేష్, ఎన్ బాబు, నాగరాజు, అమర్‌నాధ్, నవీన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారిణికి సన్మానం
రేణిగుంట, డిసెంబర్ 10: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ద్వితీయ స్థానం పొందిన డాక్టర్ హసీనా బేగం బిడిఎస్ క్రీడాకారిణికి రైల్వే ఇన్‌స్టిట్యూట్ సభ్యులు ఘనంగా సన్మానించారు. శనివారం ఉదయం స్థానిక రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో జాతీయ స్థాయిలో రాంచీ పట్టణంలోజరిగిన కరాటే చాంఫియన్ షిప్‌లో రేణిగుంటకు చెందిన డాక్టర్ హసీనాబేగం ద్వితీయ స్థానం పొందడంతో రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లోని సభ్యులు ఘనంగా సన్మానించారు. వచ్చే యేడు జరుగు ఒలంపిక్స్‌కు కరాటే క్రీడల్లో మన దేశం తరపున పాల్గొని విజయం సాధించి భారత్‌కు, రాష్ట్రానికి, ఊరికి మంచి పేరు తేవాలని అన్నారు. ఈకార్యక్రమంలో డాక్టర్ సురేంద్ర నాయక్, ఎడిఎస్ జయంత్‌కుమార్, సెక్రటరీ బాకర్, యూనియన్ సభ్యులు అబ్దుల్, సుధాకర్, ప్రసాద్, విజయభాస్కర్ పాల్గొన్నారు.
భగవద్గీత సృష్టికి మూలం
చంద్రగిరి, డిసెంబర్ 10: భగవద్గీత సృష్టికి మూలమని, దీనిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని పాటించాలని ఆధ్యాత్మిక వేత్త సి.రాజేంద్రబాబు శనివారం అన్నారు. శ్రీ మళయాల స్వామి గీతా సమాజం దేవాలయంలో గీతాజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రబాబు మాట్లాడుతూ భగవద్గీత సనాతన ధర్మప్రతీక అని, హిందువుల పవిత్ర గ్రంథమని అన్నారు. కర్మజ్ఞాన, భక్తియోగాల గురించి శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన గీతాసారమే ఈ భగవద్గీత అన్నారు. ఈ గీతాసారం అందరికీ చేరాలన్న సంకల్పాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యత మేధావులపై ఉందని అన్నారు. భగవద్గీత సర్వజనులకు సన్మార్గ దీపిక అన్నారు. ఈ సృష్టిలో నాది, నీది అన్నది విడనాడాలన్నారు. అపుడే జీవుడి లక్ష్యం ఏమన్నది తెలుస్తుందన్నారు. గీత చెప్పేది కూడా అదేనని అన్నారు. ప్రపంచ దేశాలకు భారతీయ సంస్కృతిని తెలియజేసిన గొప్పగ్రంధం భగవద్గీత అన్నారు. నెల్సన్‌మండేలా జైల్లో ఉన్నపుడు కూడా తనకు భగవద్గీతను, అందులోని శ్లోకాలను, వాటి సారంశాలను చదివి తెలుసుకున్నానని ప్రకటించడం కూడా జరిగింది. భగవంతుడి ప్రాప్తి పొందడానికి శరణాగతి ఒక్కటే మార్గం అని అన్నారు. భగవద్గీత ఒక మతానికి సంబంధించింది కాదని, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సమాజంలో ఆధ్యాత్మిక కోణంలో ఎలా జీవించాలో తెలియజేస్తుందని అన్నారు. భారతదేశంలో ఉద్భవించిన ఈగ్రంథాన్ని విదేశీయులు సైతం తమ భాషలోకి అనువదించుకొని ఫలితాన్ని అనుభవిస్తున్నారని వివరించారు. అన్ని ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత అని, చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరు గీతాపారాయణాన్ని అలవరచుకోవాలని అన్నారు. భగవద్గీత పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి, నరసింహారెడ్డి, నారాయణ రెడ్డి, నాగరాజుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఖేల్‌ఇండియా తైక్వాండో జిల్లాచాంఫియన్ మదనపల్లె
మదనపల్లె, డిసెంబర్ 10: ఖేల్‌ఇండియా జిల్లాపోటీలలో భాగంగా జిల్లా కేంద్రం చిత్తూరు మోసానికల్ ఇండోర్‌స్టేడియంలో శుక్రవారం జరిగిన తైక్వాండో జిల్లా చాంఫియన్‌షిప్ పోటీలలో మదనపల్లె రాఘవేంద్ర తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు 11మంది బంగారు పతకాలు సాధించినట్లు తైక్వాండో అధ్యక్షులు ఎం చంద్రశేఖర్, కార్యదర్శి పివిజయకుమార్‌లు వెల్లడించారు. మదనపల్లె తైక్వాండో మార్షల్‌ఆర్ట్స్ మాస్టర్ జయప్రకాష్‌వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారని వారు అభినందించారు. ఖేల్‌ఇండియా తైక్వాండో జిల్లాకరాటే పోటీలలో బి తేజస్విణి, పి కీర్తిశ్రీ, ఎం జాహ్నవిలు వరుసగా అండర్-14, అండర్-16 విభాగాలలో బంగారు పతకాలు సాధించారన్నారు. బాలుర విభాగంలో అండర్-18విభాగంలో 23-25, 25-27కేజిలలో వి లిఖిత్, వై సంజీవ, ఎస్ కిషోర్‌లు బంగారు పతకాలు సాధించారని, అలాగే బాలిక విభాగం అండర్-17విభాగంలో 32,35,38, 41, 44లో ఐదు స్థానాలలో స్వాతి, రేణుక, నాగముణి, వై గౌతమి, రజితలు బంగారు పతకాలు సాధించడంతో జిల్లాతైక్వాండో ఓరాల్ చాంఫియన్‌షిప్‌ను మదనపల్లె కైవసం చేసుకుందన్నారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులందరు ఈనెల 27నుంచి 30వతేది వరకు కడప జిల్లాలో జరిగే రాష్టస్థ్రాయి ఖేల్ ఇండయా తైక్వాండో పోటీలలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.
సమావేశాలకు రాని అధికారులకు నోటీసులు
* ఎంపిపి మునికృష్ణ స్పష్టం
తిరుపతి, డిసెంబర్ 10: తిరుపతి రూరల్ మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులకు నోటీసులు జారీచేయనున్నట్లు ఎంపిపి మునికృష్ణ చెప్పారు. శనివారం ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఉన్న సర్వసభ్య సమావేశంలో ఎంపిడిఓ రవికుమార్, జడ్పీటిసి సుభాషిణి, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, అలాగే తాగునీరు, గృహనిర్మాణాలతోపాటు వివిధ అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈసందర్భంగా మునికృష్ణ మాట్లాడుతూ సమావేశంలో అర్థవంతమైన చర్చ జరిగిందని అన్నారు. అయితే కొందరు అధికారులు సమావేశానికి హాజరుకావడంలేదని దీంతో జరుగుతున్న పనులకు సంబంధించి సమాచారం అందడంలేదన్నారు. రానున్న సమావేశానికి తమ పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి సమాచారంతో అధికారులు రావాలని నోటీసులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.