పశ్చిమగోదావరి

క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సుజాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 25: కుల, మతాలకు అతీతంగా జరిగే క్రిస్మస్ వేడుకలు ప్రతి కుటుంబానికి వెలుగులు నింపాలని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. భీమవరంలో రూపాంతర దేవాలయం, మున్సిపల్ ఆఫీసు రోడ్డునందు లూథరన్ చర్చిలలో ఆదివారం క్రీస్తు జన్మదిన, నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి పీతల సుజాత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి స్వగృహంలో క్రిస్మస్ వేడుకలను తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జిల్లా నాయకులు మైలాబత్తుల ఐజాక్‌బాబు, పట్టణ అధ్యక్షుడు గనిరెడ్డి త్రినాధ్ పుష్పగుచ్ఛాలు అందచేసి శుభాకాంక్షలు చెప్పారు. కేకు కట్ చేసి వేడుకలు జరిపారు. చెల్లబోయిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుండి ఫుట్‌బాల్ లీగ్ పోటీలు
ఏలూరు, డిసెంబర్ 25 : జిల్లాలో ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ వెస్ట్‌గోదావరి సీజన్-2 ఈ నెల 26 నుంచి 2017 జనవరి 17 వరకు నిర్వహిస్తున్నట్లు ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ వెస్ట్‌గోదావరి ఛైర్మన్ కోటగిరి శ్రీ్ధర్ తెలిపారు. ఆదివారం నగరంలోని ఒక ప్రైవేటు కళ్యాణ మండపం వద్ద ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 16 పట్టణాల్లో మొత్తం 18 మ్యాచ్‌లు సగర్వంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. సీజన్-1లో పట్టణాల వరకే పరిమితమయ్యామని, సీజన్-2లో తాము నిర్వహించబోయే 16 పట్టణాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఫ్లో సీజన్-2 ద్వారా లక్ష మందిని ఫుట్‌బాల్‌కు చేరువ చేసి తద్వారా ప్రపంచానికి గ్రామీణ ఫుట్‌బాల్ లీగ్‌ను మరింత విజయవంతమైన లీగ్‌గా చూపించాలన్నదే ధ్యేయమన్నారు. ఫుట్‌బాల్ క్రీడాకారులకు శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా బలోపేతం చేయాలని, వారిలో నైపుణ్యాలను మెరుగుపర్చి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లుగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. మకర సంక్రాంతికి వినోధాన్ని, అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ మ్యాచ్ అనుభవాలను వినియోగించుకోవాలన్నారు. నర్సాపురంలో లీగ్ మ్యాచ్ ప్రారంభమవుతుందన్నారు. ఫైనల్ మ్యాచ్ ఏలూరు ఎ ఎస్ ఆర్ స్టేడియంలో 2017 జనవరి 12వ తేదీన జరుగుతుందని వివరించారు. క్రీడాభిమానులకు ఆసక్తిగల వారికి అద్బుతమైన ఆఫర్‌ను కూడా ఇచ్చామని, ముందే 17 మ్యాచ్‌ల ఫలితాలను గెస్ చేసి ఫ్లో ఫాంటసీ ఫుట్‌బాల్ లీగ్ సీజన్ -2 ఫారాన్ని నింపి తమకు తెలియజేస్తే విజయాలకు దగ్గరగా వున్న వారికి ఒక అద్భుతమైన కారును కూడా బహుమతిగా అందిస్తామన్నారు. మొత్తం ఆరు టీమ్‌లు 18 మ్యాచ్‌లు 18 రోజులు, 15 వేదికలు టేకింగ్ ఫుట్‌బాల్ టు రూరల్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్నామన్నారు. టోర్నీ ఫ్రైజ్‌మనీ ఆరు లక్షలుగా నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలోని 16 మంది క్రీడాకారులు కూడా పాల్గొంటారని తెలిపారు. ఆయన వెంట ఏలూరు నగరపాలక సంస్థ మాజీ వైస్ ఛైర్మన్ ఎం ఆర్‌డి బలరామ్ తదితరులు పాల్గొన్నారు.
నిస్వార్థ నివేదికలవల్లే ప్రథమస్థానం
-గోపాలపురం నియోజకవర్గ అభివృద్ధిపై జడ్పీ ఛైర్మన్ బాపిరాజు
-వైసిపి నేతలకు పెద్దపీట వేస్తున్న మంత్రి మాణిక్యాలరావు
దేవరపల్లి, డిసెంబర్ 25: ప్రభుత్వ అధికారులు నిస్వార్ధంగా ఇచ్చిన నివేదికల వల్లే గోపాలపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉందని, ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై విచారణకు సిద్ధమని జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సవాల్ విసిరారు. దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. 14 అంశాలతో ప్రభుత్వం సర్వే చేయగా పది అంశాల్లో గోపాలపురం ముందంజలో ఉందన్నారు. రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఉపాధి హామీ నిధులు అనుసంధానం చేసి రోడ్లు, డ్రెయిన్లు నిర్మించామన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, అధికారుల కృషి వల్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని ముళ్లపూడి వివరించారు. గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, మంత్రి రావెల కిశోర్‌బాబుకు మధ్య ఉన్న విభేదాలే జిల్లాలో తనకు, మంత్రి మాణిక్యాలరావు మధ్య ఉన్నాయన్నారు. మంత్రి మాణిక్యాలరావు మిత్రధర్మం పాటించకుండా టిడిపి నాయకులు, కార్యకర్తలను విస్మరించి వైసిపి నేతలకు పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. అధిష్ఠానవర్గానికి, కార్యకర్తలకు మధ్య తాను నలిగిపోతున్నానని జడ్పీ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కాపులకు పెద్ద పీట వేసిందని, అయితే కాపునేత ముద్రగడ చేస్తున్న విమర్శలు సరికావని ఆయన వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే ముప్పిడి, ఎఎంసి చైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు, ఎంపిపి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
పదిలమైన ప్రణాళిక

భీమవరం, డిసెంబర్ 25: సమగ్ర నిరంతర మూల్యాంకనం విధానం (సీసీఈ) అమలులోకి వచ్చిన తర్వాత పదోతరగతి పరీక్ష ఫలితాల శాతంలో తగ్గకుండా మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాచరణను సిద్ధంచేసింది. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే ఫలితాలపై దృష్టిసారించి ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేసిన అధికారులు సరికొత్త ఆలోచనల్లో ముందుకు సాగుతున్నారు. ఇటీవలే నియోజక వర్గాలకు ప్రత్యేకాధికారులను నియమించి ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంలో పూర్తిస్థాయిలో విద్యార్థులను సిద్ధం చేసే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. డిసెంబర్ నాటికి పాఠ్యాంశాలు పూర్తి కసరత్తు ప్రారంభించింది. సిలబస్‌ను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో పూర్తికాగా, మరికొన్ని చోట్ల చివరి దశలో ఉన్నాయి.
ప్రత్యేక తరగతులు
పదోతరగతి విద్యార్థులకు ఇప్పటికే ఉదయం, సాయంత్రం రెండూ పూటలు ప్రత్యేకంగా స్టడీ అవర్స్‌ను అన్ని పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకుని చదివించడం, చూడకుండా రాయించటం వంటివి ప్రస్తుతం సాగిస్తున్నారు. విద్యార్థుల సందేహాలు సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. ఉదయం ప్రార్థన సమయానికి గంట ముందు, మధ్యాహ్నం పాఠశాల విడిచిపెట్టిన తర్వాత మరో గంట సమయం కేటాయిస్తున్నారు. అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తిచేసిన అనంతరం జనవరి నుంచి విద్యార్థులపై మరింత శ్రద్ధ తీసుకోనున్నారు. ఉదయం, సాయంత్రం రెండుపూటలా పరీక్షలు నిర్వహించనున్నారు. పాఠశాల ముగిసిన అనంతరం ఇంటి వద్దకూడా సమయం వృథా చేయకుండా మరుసటి రోజు స్టడీ అవర్‌లో పరీక్ష నిర్వహిస్తారు. అదే విధంగా పాఠశాలలో ఉదయం 5 సబ్జెక్టులు, మధ్యాహ్నం ఒక సబ్జెక్టుకు సంబంధించి పునఃశ్చరణ చేస్తారు. ఫార్మేటిన్, సమ్మెటివ్ పరీక్షల ఆధారంగా చూస్తే విద్యార్థులు మూడు సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నట్టు గుర్తించారు. గణితం, సైన్స్, తెలుగు పాఠ్యాంశాల్లో కొంత మంది విద్యార్థులు వెనుకబడ్టారు. వీరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. స్టడీ అవర్స్‌లో ఎక్కువ సమయం వీరితో ఆయా సబ్జెక్టుల్లో సాధన చేయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆదివారం కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించి ఎక్కువ సమయం సాధన చేయిస్తారు.
ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్న హిందూ సంస్కృతి

భీమవరం, డిసెంబర్ 25: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పంచ మహానదుల వరకు విస్తరించిందని ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర బౌద్ధిక్ ప్రముఖ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక) కాచం రమేష్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్ వంటి దేశాల్లో సంఘ్ పరివార్ శాఖలను నిర్వర్తిస్తుందన్నారు. అర్‌ఎస్‌ఎస్ స్థాపించిన 91 ఏళ్లలో ఇటువంటి అద్భుతాలు ఎన్నో జరిగాయన్నారు. నేడు హిందూ సంస్కృతి ప్రపంచానికి మార్గమయ్యిందన్నారు. గత రెండు రోజులుగా భీమవరంలో జరుగుతున్న విభాగ్ హేమంత శిబిరం సమారోహ్ ఆదివారం జరిగింది. ముందుగా భారతమాత చిత్రపటానికి మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పూలమాల వేశారు. సమారోప్‌కు ముఖ్య వక్తగా విచ్చేసిన కాచం రమేష్ మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ అంటే మతం కాదని, జీవన విధానమని దేశం సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. 1925లో పరమపూజ్య డాక్టర్ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్‌జీ ఆర్‌ఎస్‌ఎస్‌ని స్థాపించినపుడు దేశం బ్రిటీషు బానిసత్వంలో ఉందన్నారు. కేరళలో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా స్వామి శ్రద్ధానంద 50 వేలమంది ముస్లింలను హిందూ సమాజంలోకి పునరాగమనం చేశారని రమేష్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ప్రతీ హిందువు తాను హిందువునని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు. ధైర్యంగా బొట్టు పెట్టుకుంటున్నారని, ఆరోజు ఇటువంటి సందర్భాలు లేవన్నారు. హిందూ సమాజానికి అన్యాయం జరిగితే చేతులు కట్టుకుని ఊరుకోబోమన్నారు. 1992 అయోధ్య సంఘటన తర్వాత హిందూ పునరుత్థానం జరుగుతోందన్నారు. గ్రామ గ్రామాన సంఘం శాఖలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని క్షేత్రచేద్దిక్ ప్రముఖో పిలుపునిచ్చారు. సూర్య నమస్కారాన్ని హాస్యం చేశారని, ఇపుడు ప్రపంచమంతా చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రపంచంలోని 220 విశ్వవిద్యాలయాల్లో భగవద్గీతను పాఠ్యాంశంగా చెబుతున్నారన్నారు. భారతదేశం సంస్కృతి ప్రపంచం అంతా అనుసరిస్తుందని పేర్కొన్నారు. ఓంకారంపై ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. పోప్ జాన్‌పాల్ సైతం హిందూ కుటుంబ వ్యవస్థను నేర్చుకోవాలని చెప్పారన్నారు. అప్పుడే విలువలు పెరుగుతాయని, యుఎన్‌ఒ యోగా దినోత్సవాన్ని ప్రకటించిన తర్వాత కమ్యూనిస్టు దేశంగా ఉన్న చైనాలోని బీజింగ్‌లో వెయ్యి యోగా సెంటర్లు నడుస్తున్నాయన్నారు. ప్రపంచం అంతా హిందూ సమాజం చాలా గొప్పదని చెబుతోందని, ఒక బిలియన్ జనాభా ఉన్న హిందువులు 4 బిలియన్ల జనాభాకు శిక్షణ ఇస్తే వారికి మంచి జీవన విధానం అలవడుతుందని కాచం రమేష్ అన్నారు. హిందూ సమాజంపై ముప్పేట దాడులు జరుగుతున్నాయని, మత మార్పిడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు హిందూ సమాజంలో భాగమన్నారు. ఒక సినీ హీరో తన కుమార్తె పేరు తైమూరు అని పెట్టుకున్నాడని, మరొకరు టిప్పు సుల్తాన్‌కు వేడుకలు చేస్తున్నారని, దళిత క్రైస్తవులకు హోదా ఇస్తానంటున్నారని దుయ్యబట్టారు. వీరందరూ దేశానికి ద్రోహం చేస్తున్నారన్నారు. వృద్ధాశ్రమాలను సంఘం వ్యతిరేకిస్తుందని, తల్లిదండ్రులను గౌరవించాలని, స్వయం సేవకులు శాఖలకు పరిమితం కాకుండా సంస్కృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 జరుపుకోవడం హిందూ సంస్కృతికి విరుద్ధమన్నారు. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ అత్యంత ధనికులు, పేదలు లేని సమాజం కావాలన్నారు. ప్రాంత సహసంఘచాలక్ బి.శ్రీనివాసంరాజు, విభాగ్ సంఘచాలక్ సుంకవల్లి రామకృష్ణ, విభాగ్ సహసంఘచాలక్ మంతెన రాంమచంద్రరాజు, గెడ్డమంచిలి సత్యనారాయణ, వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, పిఆర్‌కె వర్మ, దార్జాల ప్రభాకరశర్మ, బిజెపి వర్మ, తుమ్మలపల్లి శివ, నగర సంఘచాలక్ బ్రహ్మరాజు, ప్రిన్సిపాల్ దొర తదితరులు పాల్గొన్నారు.
రమణీయంగా శ్రీవారి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల, డిసెంబర్ 25: శ్రీవారి దివ్యక్షేత్రంలో చిన వెంకన్న తిరువీధి సేవ ఆదివారం కడు రమణీయంగా జరిగింది. పద్మావతీ, ఆండాళ్ అమ్మవార్లతో పాటు గోదాదేవితో కలిసి శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో విహరించారు. ధనుర్మాస వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన తొళక్కం వాహనంపై స్వామి, అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ గజసేవతో శ్రీవారి వాహనం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది.

తిరుపతి డబుల్‌డెక్కర్ రైలుకు
తాడేపల్లిగూడెంలో హాల్టు

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 25: రైల్వే శాఖ నూతనంగా ప్రవేశపెడుతున్న విశాఖపట్నం - తిరుపతి డబుల్ డెక్కర్ సూపర్‌ఫాస్ట్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఏర్పాటు చేసినట్లు బిజెపి పక్ష నేత యెగ్గిన నాగబాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కృషితో సూపర్‌ఫాస్ట్ రైలుకు హాల్టు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ నెల 30న కేంద్రమంత్రి సురేశ్ ప్రభు తిరుపతిలో ఉదయం 10 గంటలకు రైలును ప్రారంభిస్తారన్నారు. సాయంత్రం 7.15 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటుందన్నారు. జవనరి 1 నుంచి ప్రతీ ఆది, బుధ, శుక్రవారాల్లో ఈ రైలు నడుస్తుందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు జిల్లా ప్రజలకు ఈ రైలుతో మరింత సౌకర్యం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో గమిని సుబ్బారావు, వబిలిశెట్టి నటరాజు, చలంచర్ల మురళి పాల్గొన్నారు.
చింతమనేనిపై జనసేన ఆగ్రహం

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 25: జనసేన నేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసిన దెందులూరు ఎమ్మెల్యే, టిడిపి విప్ చింతమనేని ప్రభాకర్ దిష్టిబొమ్మను ఆదివారం జనసేన కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్త మారిశెట్టి పవన్ బాలాజీ మాట్లాడుతూ శుక్రవారం ఐడ్రీమ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చింతమనేని ప్రభాకర్ జనసేన నేత పవన్ కళ్యాణ్‌పై దారుణమైన విమర్శలు చేశారన్నారు. దీన్ని ఖండిస్తున్నామన్నారు. 2014 ఎన్నికల్లో జిల్లాలో 15 సీట్లు గెలుపులో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు మద్దాల మణికంఠకుమార్, కెవి రత్నాజీ, నాని తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో...
జంగారెడ్డిగూడెం: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పవన్ కల్యాణ్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని చిరంజీవి యువత గౌరవాధ్యక్షుడు మద్దాల ప్రసాద్ డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ పట్ల చింతమనేని ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆదివారం జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు స్థానిక బోసుబొమ్మ సెంటర్‌లో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. చింతమనేని దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నిస్తుండగా కార్యకర్తలను ఎస్సై ఎం.కేశవరావు వారించి, దిష్టిబొమ్మ స్వాధీనంచేసుకున్నారు. ఈ సందర్భంగా మద్దాల ప్రసాద్ మాట్లాడుతూ మీడియా ముఖంగా చింతమనేని బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. చింతమనేని నోరు అదుపులో పెట్టుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని, పవన్ కల్యాణ్ జోలికి వస్తే సహించేది లేదని అన్నారు. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి చేసిన సహాయాన్ని మరచి చింతమనేని నోటికి వచ్చినట్టు మాట్లాడటం జనసేన కార్యకర్తలను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు. పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేసేముందు ఆయన తెలుగుదేశం, బిజెపీలకు చేసిన సహాయాన్ని మరువరాదన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండు పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమేరకు అమలు చేస్తున్నాయో, ప్రజలను ఏ విధంగా అయోమయానికి గురిచేశాయో అందరికీ తెలిసిందేనన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రభాకర్ వంటివారి నోళ్ళు అదుపులో పెట్టకపోతే మెగా ఫ్యామిలీ అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు చింతల నాని, మెగా ఫ్యామిలీ, పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన నేతలు వలవల తాతాజీ, మైరెడ్డి పవన్, జనసేన నాని, వసంతాటి మంగరాజు, రుద్రబోయిన చైతన్య, బోగాదుల సురేష్, కఠారి వాసు, బైగాని తేజ, నాగూరి శ్రీను, బద్ది నాని, పద్మాకర్, నాగేంద్ర, చనమాల గణేష్, హరి, రాజు తదితరులు పాల్గొన్నారు.
బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్న చంద్రబాబు
దేవరపల్లి, డిసెంబర్ 25: బడుగు బలహీన వర్గాల ఆభ్యున్నతికి నిస్వార్ధంగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో శ్రీ రఘునాయక కోపరేటివ్ సొసైటీలో ఆదివారం సర్పంచ్ టేకుమూడి చక్రయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు నిరంతరం పాటుపడుతున్నారన్నారు. ఆనంతరం ఆయన చంద్రన్న క్రిస్మస్ కానుకలను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల హామీని నూరుశాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పొగాకు రైతులకు ఏడు నుండి తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని రైతులు కోరగా ఈ విషయాన్ని ట్రాన్స్‌కో సిఎండి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. చిన్నాయగూడెం గ్రామానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. మాజీ ఎంపిపి గెడా మురళీ అజిత్‌కుమార్ మాట్లాడుతూ చిన్నాయగూడెం గ్రామానికి పశువైద్యాధికారిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు, ఎంపిపి శ్రీకాకొళపు వెంకట నరసింహారావు, టిడిపి నాయకులు కాట్రగడ్డ శ్రీనివాసచౌదరి, మండల టిడిపి అధ్యక్షుడు సుంకర దుర్గారావు, సొసైటీ అధ్యక్షుడు మార్ని సూర్యచంద్రం మాట్లాడారు. అనంతరం ముఖ్య అతిథులను సూర్యచంద్రం సన్మానించారు. గెడా దాశరధి, గెడా రామనరసింహారావు, ముమ్మిడి సత్యనారాయణ, గెడా రాజేష్, పిలకా రాజేష్, పరిమి దొర వరప్రసాద్, తాతిన శ్రీనివాస్, పసుపులేటి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో క్షీణించిన పారిశుద్ధ్యం
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 25: పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించింది. పందుల బెడదతో పారిశుద్ధ్యం దెబ్బతింటోంది. 2వ వార్డు ఊదరవారి వీధిలో కచ్చా డ్రెయిన్ సైతం లేకపోవడంతో పందులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఈ వీధిలో పారిశుద్ధ్యం లోపించిందని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త వీరవల్లి సోమేశ్వరరావు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలోకి అడుగుపెట్టాలంటే భయం వేస్తోందని, ఒక పక్క మురుగునీరు, పందులు కనిపిస్తుంటే మరోపక్క చెత్తాచెదారం దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోవడం లేదని, ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కోరారు.
ఆన్‌లైన్‌లో ఫార్మసీ రిజిస్ట్రేషన్లు నవీకరణ

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 25: ఫార్మసిస్ట్‌ల నమోదు, నవీకరణల ధృవీకరణ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎపి ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ నాగరాజు పేర్కొన్నారు. స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్ ద్వారా సర్ట్ఫికెట్లు, డాక్యుమెంట్లు పంపిస్తే పరిశీలించి ధృవీకరణ పత్రాలు అభ్యర్థులకు పంపిస్తామన్నారు. ఫార్మసీ కౌన్సిల్ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించిందన్నారు. ఫార్మసిస్టల వృత్తికి సంబంధించి సమాచారం, సలహా, సూచనలు, ప్రభుత్వ నిబంధనలు తదితర అంశాలను దీనిలో పొందు పరిచినట్టు చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కృషి మేరకు నూతన రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్, మానేపల్లి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.