ఉత్తర తెలంగాణ

తెలంగాణ వలసజీవులే ప్రేరణ ( అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన కవిత్వానికి తెలంగాణ వలస జీవులే ప్రేరణ అని సవినయంగా ప్రకటించే ప్రముఖ కవి, రచయిత సంగెవేని రవీంద్ర ఇప్పటి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శకల్ల గ్రామానికి చెందినవారు. వృత్తిపరంగా ముంబాయిలో స్థిరపడ్డ ఆయన తెలంగాణ రచయితల వేదిక అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా, ముంబాయి ఆంధ్ర మహాసభ ఉపాధ్యక్షుడిగానే కాక..పలు సంఘాల్లో క్రియాశీలకంగా ఉంటూ తెలుగు సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్‌ముఖ్ చేతులమీదుగా ‘కవి కాళిదాస్’ అవార్డును అందుకోవడం మరిచిపోలేని అనుభూతి అని చెప్పే ఆయన.. ఐదు కవితా సంపుటాలతో పాటు నానీల సంపుటి, వ్యాససంపుటి, రెండు దీర్ఘ కవితలు, మరో రెండు వైవిధ్య సాహితీ గ్రంథాలను వెలువరించారు. అంతేగాక వివిధ పత్రికలకు కాలమ్స్ రాసే అనుభవముంది. 2004 నుండి నిరంతరం సాహితీ సృజన చేస్తున్న రవీంద్రతో ‘మెరుపు’ జరిపిన ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే...
ఆ మీ రచనా వ్యాసంగం ఎప్పుడు ప్రారంభమైంది ?
రాయాలనే తపన చిన్నప్పట్నుండే ఉండేది. మొదటి ప్రపంచ తెలుగు మాహాసభల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీర్లో కరీంనగర్ జిల్లా స్థాయిలో నాకు ద్వితీయ స్థానం లభించింది. బుగ్గారంలో చదివే నేను పెద్ద కలలే కన్నాను. అమలుకు సాధ్యం కాని అమాయకపు ఆకాంక్షల పేకమేడలెన్నో కట్టుకున్నాను. కానీ, నిత్యం కరువు కాటకాలతో నిప్పుగుండంలా ఉండే తెలంగాణ పల్లెలో కడుపు నిండదనీ మా బాపు నన్ను ముంబై రావాలనీ హుకుం జారీచేశాడు. అలా విద్యార్థి దశనుండే నేను వలస జీవినయ్యాను. ముంబైకి వలస వచ్చిన తెలుగువాళ్ల వెతలు, ఉదయం నుండి రాత్రి వరకు యంత్రాల మధ్య యంత్రాలుగా మారేవైనం, కలవారి ఇండ్లల్లో ఎంగిలి పాత్రల్లో మెతుకులుగా మిగిలే తీరు.. భవన నిర్మాణ రంగంలో కూలీలుగా మారిన రైతులు, నేతన్నల దీనగాథలు నన్ను అనుక్షణం కలిచివేసేవి. ఏదో తీరని అసంతృప్తి నన్ను నిత్యం వెంటాడేది. వలస వేదనలు, వలస జీవుల వెతల కథలు నాలోని కవిని తట్టిలేపేవి. వలస జీవితమే నన్ను కవిగా మార్చింది.
ఆ మీ మొట్టమొదటి రచన..?
నేను నా మొదటి కవిత ఎప్పుడు రాసానో నాకైతే గుర్తులేదు కానీ, అప్పుడప్పుడు రాసిపెట్టుకున్న కవితలన్నింటిని ఒక సంపుటిగా తీసుకురావాలని 2004లో అనుకున్నాను. నాకు నేనే ఆ కవితల్ని రాక్షసంగా ఎడిట్ చేసుకొని ‘అనే్వషణ’ పేరుతో 2005లో వెలువరించాను.
ఆ మీ కవిత్వానికి ప్రేరణ..?
చిన్నప్పట్నుండి కవిత్వాన్ని చదవడం ఒక కారణమైతే, కళ్లముందు కదలాడే ముంబై వలస గాథలు మరో కారణం. జానాబెత్తెడు రేకుల గదుల్లో జీవితాల్ని కాల్చుకునే తెలంగాణ వలసజీవులే నా కవిత్వానికి ప్రేరణ. నా చుట్టూ వ్యథలు, బాధలు, కన్నీళ్లు, కష్టాలే..! నాకు తెలియకుండానే వాటన్నింటికి అక్షర రూపం కల్పించాను. అందుకేనేమో కన్నీళ్లు లేని కవిత్వాన్ని రాయలేకపోతున్నాను.
ఆ కవిత్వమంటే ఏమిటి..?
కవిత్వానికి నిర్వచనం చెప్పడం కుదరదు కానీ, కవిత్వమంటే కళ్లలో కరుణైనా పొంగేలా చేయాలి లేదా గుండెల్లో మంటైనా రగిలించి, ఒక కవిత రాసినా, చదివినా అది మనల్ని క్షణం సేపు ఉలిక్కిపడేలా చేయాలి. ఉద్వేగంతోనో.. ఉత్సాహంగానో, ఉక్రోషంవల్లో..!!
ఆ ప్రస్తుత కవిత్వంపై అభిప్రాయం..?
నేల విడిచి సాము చేసే గాలివాటు కవిత్వం ఇప్పటి పరిస్థితుల్లో అవసరం లేదు. ప్రస్తుతం వస్తున్న కవిత్వం చాలా శక్తిమంతంగా ఉంటోంది. వర్ధమాన కవులు సోషల్ మీడియాను విరివిగా వినియోగించుకోవడం శుభసూచకం. కొందరు రాత్రికి రాత్రే గొప్ప కవులు కావాలనే తపనతో ఎడాపెడా రాస్తూ, పుస్తకాలు అచ్చేసుకుంటున్నారు. ఈ పద్ధతి అభినందనీయం కాదు.
ఆ ప్రస్తుత పత్రికలు సాహిత్యానికి ఇస్తున్న ప్రాధాన్యత..?
పత్రికలు లేకుండా సాహిత్యం విస్తరించదు. తెలుగులో దిన, వార, పక్ష, మాస పత్రికలన్నీ సాహిత్యానికి పెద్దపీటనే వేస్తున్నాయి. వర్ధమాన కవుల నుండి సీనియర్ కవుల వరకు పత్రికలో కవిత అచ్చయితేనే అదో పెద్ద గుర్తింపుగా భావిస్తున్నారు.
ఆ ముంబయి ఆంధ్రమహాసభ వివరాలు తెలుపుతారా?
మహారాష్టల్రోని తెలుగు సంస్థలకు మాతృసంస్థగా పేరుపొందిన ఆంధ్ర మహాసభకు తొమ్మిది దశాబ్దాల చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ రాష్ట్రేతర తెలుగు సంస్థగా పురస్కారాన్ని కూడా అందజేసింది. తెలుగు భాషా, సాహిత్యం, కళలు, సంస్కృతులు పరిరక్షణ కోసం అలుపెరుగని సేవలందిస్తోంది. తెలుగు నేలపై ఉన్న ప్రముఖ సాహితీవేత్తలు, కళాకారులు, రాజకీయ నాయకులెందరో ఆంధ్రమహాసభ ఆహ్వానాన్ని స్వీకరించారు. ఇప్పటికీ ప్రతి నెల విజ్ఞాన, వినోద, సాహితీ, కళలకు చెందిన కార్యక్రమాలెన్నో నిర్వహిస్తున్నారు. పది సంవత్సరాల క్రితం వరకు ఆంధ్ర మహాసభలో తెలంగాణ వారు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది.
ఆ సాహిత్యంలో ఇజాలు, వాదాలు ఉండాలా..?
సమాజానికి ప్రతి రూపమే సాహిత్యం. సమాజమంటే జాతుల, తెగల, కులాల, మతాల సమూహాలే కదా..! నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి జాతి అస్తిత్వపోరాటం చేస్తోంది. ఇందుకు కవిత్వాన్ని ఆయుధంగా వాడుకోవడం జరుగుతోంది. నిజానికి కవిత్వమే ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తోంది. భిన్నాభిప్రాయాల్నే మనం ఇజాలుగా, వాదాలుగా చెప్పుకుంటున్నాం. ఏ ఇజమైనా, వాదమైనా సమాజాన్ని ఏకత్రాటిపై నడిపించే దిశగా కొనసాగాలి కానీ వైషమ్యాలు పెంచేందుకు దోహదపడకూడదు.
ఆ సాహిత్య పురస్కారాలపై అభిప్రాయం..?
పురస్కారాలెప్పుడైనా కొంత ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలిగిస్తాయి. గుర్తింపుకు ప్రతీకగా నిలుస్తాయి.
ఆ ముంబైలో సాహితీ వాతావరణం ఎలా వుంది..?
ముంబైకి ఎందరో ప్రముఖ సాహితీవేత్తలు వస్తుంటారు. అందరూ చెప్పే మాట ఒకటే..స్వరాష్ట్రం కంటే ముంబైలోనే సాహితీ వాతావరణం మెరుగ్గా ఉందనీ..అది నిజం కూడా..! ఒకప్పుడు పొట్ట చేతపట్టుకొని ముంబై చేరుకున్న శ్రామికవర్గం నుండి నేడు అద్భుతమైన సాహిత్యం వెలువడుతోంది. గత నాలుగు సంవత్సరాలలో దాదాపు 25 కవితా సంపుటాలు ముంబై పరిసర ప్రాంతాల నుండి వెలువడ్డాయి. భీవండి నుండి ఎంతో ఉన్నతమైన ఛందోబద్ధ కవిత్వం వస్తోంది.
ఆ అ.్భ.తెరవే ప్రధానకార్యదర్శిగా మీ అనుభవాలు?
అఖిల భారత తెలంగాణ రచయితల వేదికకు కొన్ని పరిధులున్నాయని నాకనిపిస్తోంది. ముఖ్యంగా సరైన ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల అనుకున్న కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నామని నాకనిపిస్తోంది. అంతేగాక, ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహిత్య సంస్థగా ముద్రపడిపోయింది. నిత్యం ప్రశ్నించే కలాలు నేడు వౌనంగా మారిపోయిన నేపథ్యంలో అభాతెరవే మరింత బాధ్యతాయుతంగా ముందుకు పోవాల్సి ఉంది. ముంబయిలో తెలుగుదనం ఉట్టిపడుతున్నప్పటికీ, వ్యక్తిగతంగా తెలుగు కవిత్వం పట్ల ఆదరణ పెరిగినప్పటికీ, ఇంకా సామాన్య ప్రజల్లో కవిత్వం పట్ల ఆసక్తి పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆ జాతీయ స్థాయిలో నేటి సాహిత్య సంస్థల తీరుతెన్నులు?
వాస్తవానికి గతంలో కంటే నేడు దేశవ్యాప్తంగా సాహితీ సంస్థల సంఖ్య పెరిగిపోయిందనే చెప్పాలి. జెండాలు, ఎజెండాలు ఏవైనా, అన్ని సాహితీ సంస్థలు తమవంతుగా అంతో ఇంతో కృషి చేస్తూనే ఉన్నాయి. సాహిత్య సేవలో అన్ని సంస్థలు బాగానే కృషి చేస్తున్నాయనీ చెప్పక తప్పదు. ప్రధానంగా చెప్పుకోవాలంటే కేంద్ర సాహిత్య అకాడెమీకి మన తెలుగు బిడ్డ కె.శ్రీనివాస రావు గారు కార్యదర్శిగా వచ్చినప్పట్నుండి తెలుగు కథకు, కవిత్వానికి పెద్దపీట వేస్తూ వివిధ రాష్ట్రాలకు, ప్రాంతాలకు కవుల్ని, కథకుల్ని ఆహ్వానించి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందిస్తున్నారు.
ఆ నేటి యువతరాన్ని సాహిత్యం వైపు మళ్లించాలంటే..?
ఈ కోణంలో చూస్తే సాహిత్యంపై బెంగ కలుగుతుంది. నేటి యువతరానికి సొంత కెరీర్ తప్ప మిగతా అంశాలపై ఎలాంటి ఆసక్తి ఉన్నట్లు తోచడం లేదు. పిల్లలకు చిన్నప్పట్నుండి పుస్తకాలతో పాటు సమాజాన్ని కూడా చదివే అలవాటు నేర్పాలి. స్పందించే గుణాన్ని అద్దాలి. అప్పుడప్పుడు కన్నీళ్లు పెట్టించాలి. వేదన, ఆవేదనలోని మాధుర్యాన్ని రుచి చూపించాలి. యాంత్రికంగా కాకుండా మానవీయంగా ఎదిగేలా చూడాలి. స్పందించే గుణం ఉంటే సాహిత్యం పట్ల అభిరుచి తప్పకుండా కలుగుతుంది. పుస్తకాల్నే కాదు జీవితాల్ని కూడా చదవాలి.
ఆ కొత్త కవులకు, రచయితలకు మీరిచ్చే సలహాలు,
సూచనలు..?
చదవాలి.. బాగా చదవాలి..! మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని, జీవితాల్ని, సంఘటనల్ని బాగా చదవాలి. కవిగా ఎదగాలనుకుంటే పరిశీలనాసక్తి ఉండాలి. దానివల్ల కలిగిన భావోద్వేగాల్ని అభివ్యక్తీకరించేందుకు భాషాపటిమ పెంచుకోవాలి. భాషా సంపద పెరగాలంటే పఠనాసక్తి ఉండాలి. ఏమీ చదవకుండా ఏదేదో రాసేసి, ఓ ప్రముఖుడి చేతుల మీదుగా ఓ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటే అది అంత ంతమాత్రంగానే మిగిలిపోతుంది. వర్తమానం నుండి కవితా వస్తువుని తీసుకొని భవిష్యత్తు పరిణామాలకు, పరిమాణాలకు అన్వయించుకొని కవిత్వం రాసినప్పుడే కవిగా చిరకాలం నిలిచి ఉంటారు. సమాజానికి, సమకాలీనతకు సంబంధంలేని రాతలు కొట్టుకుపోతాయి.

**
సంగెవేని రవీంద్ర
ముంబయి
సెల్.నం.9987145310
**
ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544
**
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net