సాహితి

జనం కన్నీళ్లకు సిద్ధాంతం ఉంది ( స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనం కన్నీళ్లకు సిద్ధాంతముందా?’ అని 23-1-2017 సోమవారం ఆంధ్రభూమి ‘సాహితి’లో సిహెచ్ మధుగారు ప్రశ్నించారు. ఇంతవరకు ఏ సిద్ధాంతమూ జనం కన్నీళ్లను తుడవడానికి పనికి రాలేదన్నారు. సిద్ధాంతాల వెంట పరుగులు తీసి తీసి అక్షరం అలసిపోయి ఓడిపోయిందన్నారు. ఏ సిద్ధాంతమూ ప్రపంచాన్ని మార్చలేదన్నారు. ప్రజల ఆకల్ని తీర్చలేదన్నారు. మార్క్సిజం వాస్తవిక సిద్దాంతమైనా, ఆచరణాత్మక సిద్ధాంతం కాలేకపోయిందన్నారు.
సిద్ధాంతాల గురించి ఇంత గందరగోళ స్థితిలో మధుగారు వుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మధుగారు ప్రపంచ పరిణామాన్ని పరిశీలించే తీరులో ఏదో తేడా వుంది. ప్రపంచ పరిణామాన్ని పరిశీలించే తీరులో రెండు అంశాల్ని గుర్తుపెట్టుకోవాలి.
పశువులుగా బతికి, పశువునుండి వేరుపడిపోయి, మనిషిగా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకునేంత వరకు మానవుడు ఎదుగుతునే వున్నాడు. తనకు కావలసిన అన్నిరకాల సౌకర్యాలను సమకూర్చుకున్నాడు. ఆహార సేకరణతో తృప్తిపడక తనకు అవసరమైన ఆహార పదార్ధాన్ని తయారుచేసుకున్నాడు. అంతరిక్షంలో దూసుకుపోయి ఇతర గ్రహాలను సైతం అందుకున్నాడు. ఇది ఒక అంశం. ఇంతవరకు సామాజిక సిద్ధాంతంతో సంబంధం లేకుండా ఈ అభివృద్ధి జరిగింది.
ఇక రెండో అంశం. మానవుడిలో రోజురోజుకు స్వార్ధం పెరిగిపోతోంది. ఒకడు మరొకడ్ని దోచుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాడు. అధికార దాహంతో, స్వలాభాపేక్షతో, ఆధిపత్య స్వభావంతో ప్రపంచాన్ని సర్వనాశనం చేసే అణుబాంబుల్ని సైతం సిద్ధం చేసుకోగలిగాడు. పర్యావరణాన్ని దెబ్బతీసి మానవ జాతి మనుగడకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే విధంగా కూడా మానవుడు తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
మానవుడి తెలివితేటలలోని అభివృద్ధి దీనిక్కూడా దారితీస్తోంది. ఇది రెండో కోణం. ఈ రెండో కోణంలోని లోపాల్ని సవరించడానికి వచ్చినవే అనేక రకాల సామాజిక సిద్ధాంతాలు. అయితే ఇంతవరకు ఈ సిద్ధాంతాలేవీ జనం కన్నీళ్లను తుడవలేపోయాయనీ, జనం ఆకల్ని తీర్చలేకపోయాయనీ మధు అంటున్నారు. ఇది పాక్షిక సత్యం మాత్రమే.
దోపిడీ దారులపై పీడిత ప్రజల ఎర్రజెండాని పారిస్ కమ్యూన్‌లో ఎగరేసింది. 1917లో సోవియట్ యూనియన్‌లో విప్లవం వచ్చి సోషలిస్టు వ్యవస్థకు పునాది వేసింది. అలాగే 1948లో చైనాలో ప్రజారిపబ్లిక్ అవతరించింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో మార్క్సిజం ప్రభావం చూపింది. మార్క్స్ ఊహించినట్టు బానిస, భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థల తర్వాత సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యవస్థలు ఏర్పడడానికి ఒక మార్గం దొరికింది. రష్యా, చైనాలలోని ప్రజలు కొన్ని దశాబ్దాల పాటైనా సోషలిస్టు వ్యవస్థ రుచిని చూసారు. సోషలిస్టు వ్యవస్థ తాత్కాలిక వైఫల్యం ముందు ముందు రాబోయే కమ్యూనిస్టు వ్యవస్థ విజయానికి తొలిమెట్టుమాత్రమే. ప్రతి ఒక్కరికి పని కల్పించడం, పనికి తగ్గ ఫలితాన్ని అందించడం సోషలిస్టు వ్యవస్థ లక్ష్యం. దీన్ని రష్యా, చైనాలు కొంతకాలమైనా సాధించాయి. ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పని చేయడం, తనకు అవసరమైన మేరకు అనుభవించడం అనే మహోన్నత లక్ష్యం కమ్యూనిస్టు వ్యవస్థది. సుదీర్ఘమైన మానవ జాతి చరిత్రలో సోషలిస్టు వ్యవస్థ ఒక మైలురాయి. ప్రపంచంలో వ్యక్తిగత ఆస్తి వున్నంతవరకు మధుగారు చెప్పిన జనం కన్నీళ్లు ఎవ్వరూ తుడవలేరు. ఏ సిద్ధాంతమూ ఆకలిని తీర్చలేదు. ఈ అవగాహన వున్న సిద్ధాంతం ఇంతవరకు మార్క్సిజం ఒక్కటే. కొన్ని దేశాల్లో అయినా కొంత కాలమే అయినా జనం కన్నీళ్లు తుడిచి, వారి ఆకలిని తీర్చగలిగింది మార్క్సిజం మాత్రమే. ఇది ఆచరణలో రుజువైన సత్యం. ఇంతవరకు ఏ ఇతర సిద్ధాంతమూ ఆచరణలో ఇలా రుజువు చేసుకోలేకపోయింది. కారణం వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలన్న దృష్టి ఆ సిద్ధాంతాలకు లేకపోవడమే.
వ్యక్తిగత ఆస్తిని ఏ మేరకు అదుపు చేయగలిగితే ఆ మేరకు శ్రమదోపిడీని అరికట్టగలం. వర్గపోరాటం ద్వారా, శ్రామిక వర్గ నియంతృత్వం ద్వారా సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యవస్థల్ని సాధించుకోగలమని మార్క్స్ చెప్పాడు. ఇదొక పెద్ద ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఒడిదుడుకులుంటాయి. గెలుపోటములుంటాయి. అంతిమ విజయం పీడిత ప్రజలదే. సిద్ధాంతాలపట్ల అలసిపోయేట్టు పరుగులు తియ్యక్కరలేదు. సక్రమంగా ప్రపంచ చరిత్రను చదువుకున్నా ఈ విషయం అర్దం అవుతుంది.
అన్ని సిద్ధాంతాలు విఫలమైనాయని చెప్పి, మధుగారు చెప్పిందేమిటి? ‘ప్రపంచంలోని వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా అందితే దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, అంతా శాంతియే’ అని. వనరులన్నీ ప్రజలకు సమంగా ఎలా అందుతాయో మధుగారు చెప్పలేదు. ఈ విషయం చెప్పింది మార్క్సిజం మాత్రమే. తత్వవేత్తలందరు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు కానీ, అసలు విషయం దాన్ని మార్చడం ఎలా అన్నదే అని ప్రశ్నించుకున్నాడు మార్క్స్. ఈ ప్రశ్న వేసుకున్నాడు కాబట్టే ప్రపంచాన్ని మార్చగలిగిన సిద్ధాంతాన్ని చెప్పగలిగాడు మార్క్స్.

- వి. చెంచయ్య, 9440638035