Others

జీవన వాహిని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడెప్పుడో-
హెచ్‌ఎం రెడ్డి వేసిన కళాత్మక విత్తనం -ఈనాటి తెలుగు సినిమా వటవృక్షం. మూకీగా మొదలైంది. టాకీని సమకూర్చుకుంది. రంగులల్లుకుంది. కొత్త కథలల్లుకుంది. సరికొత్త కథనానికి పదునెట్టింది. మారుతున్న సాంకేతికతను పొదువుకుంది. దృశ్యంలోనూ, శ్రవణంలోనూ -స్పష్టతకు చేరుకుంది. అయినా ఇంకా ఏదో తపన. ఇంకా బలంగా వేళ్లూనుకోవాలనే ప్రయత్నం. ఎక్కడెక్కడికో ఊడలు విస్తరించే లక్ష్యం. ఒకట్రెండు థియేటర్ల నుంచి మొదలైన ప్రయాణం -వేల థియేటర్లకు విస్తరించింది. ప్రపంచానికి తన సత్తా చాటేస్థాయికి చేరింది. పద్దెనిమిది లక్షల బడ్జెట్‌తో మొదలైన తెలుగు సినిమా -ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది. అంచనాలకు అందని పెట్టుబడితో సినిమా నిర్మాణానికి ఉపక్రమించే సాహసాన్ని ప్రదర్శిస్తోంది. వసూళ్లలోనూ రికార్డులు సృష్టిస్తోంది. 85 మై(ఏ)ళ్ల ప్రయాణంలో -సమస్యలు పరిష్కారాలు, కన్నీళ్లు ఆనందబాష్పాలు, కష్టాలు సుఖాలు, విషాదాలు విజయాలు.. ఇలా ఎన్నో చూసింది. ఇంకెన్నో అనుభవించింది -తెలుగు సినిమా. సుసంపన్నమైన అనుభవాన్ని పోగుచేసుకున్న తెలుగు సినిమా -నిజానికి సినిమా కాదు. చరిత్రను విస్తరించుకుంటూ మున్ముందుకు పరుగులు తీస్తున్న -దృశ్య జీవన వాహిని.
ఫిబ్రవరి 6తో 86వ పడిలోకి అడుగిడిన తెలుగు సినిమా పూర్వాపరాలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే..
**

భక్త ప్రహ్లాదే

85ఏళ్ల క్రితం ఫిబ్రవరి 6న విడుదలైన తొలి తెలుగు టాకీ సినిమా -్భక్తప్రహ్లాద. అప్పటికి సినిమాలు మూకీలు. అంటే శబ్దం లేదు. సినిమా మాట నేర్చిన తరువాత విడుదలైన తొలి చిత్రం -్భక్త ప్రహ్లాదే. భారతదేశపు తొలి టాకీ చిత్రం ‘ఆలంఆరా’ విడుదలైన తర్వాత -1931లో భక్తప్రహ్లాదని హెచ్‌ఎం రెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగు చలన చిత్ర పితామహుడిగా, టాకీ పులిగా ఆయనను కీర్తించేది అందుకే. ‘ఆలంఆరా’ చిత్రాన్ని ఆర్ధేషిర్ ఇరానీ ఇంపీరియల్ ఫిలిం కంపెనీ నిర్మించింది. ఆ కంపెనీలో హెచ్‌ఎం రెడ్డి సహాయకుడిగా పనిచేశారు. ఇంపీరియల్ ఫిలిం కంపెనీ సారథ్యంలో ‘ప్రిన్స్ విజయకుమార్’ (1930), ‘ఎవేజర్ ఇన్‌లవ్’ (1931) అనే రెండు మూకీ చిత్రాలను పృథ్వీరాజ్‌కపూర్ ముఖ్య పాత్రధారిగా నిర్మించారు. ఆ తరువాత హెచ్‌ఎం రెడ్డికి ప్రహ్లాద అప్పజెప్పారు. అంతకుముందు ప్రహ్లాద రంగస్థల నాటకం మాత్రమే. దానే్న యథాతథంగా.. అంటే నాటకానే్న తెరకెక్కించారన్న మాట. దాదాపు నాటకంలాగే తీశారని, తక్కువ క్లోజప్స్ ఉన్నాయని ఆ సినిమా చూసినవారు అప్పట్లో వ్యాఖ్యానించారు. 1931 మార్చి 14న హిందీ ‘ఆలంఆరా’ విడుదలైంది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఇరానీ దృష్టి దక్షిణ భారతీయ భాషా చిత్రాలవైపు మళ్లింది. అప్పటికే రెండు మూకీ సినిమాలకు దర్శకత్వం వహించి ఉన్న హెచ్‌ఎం రెడ్డికి -తొలి తెలుగు, తమిళ టాకీ చిత్రాలు నిర్మించే బాధ్యత అప్పగించారు. అలా దక్షిణ భారత టాకీ పితామహుడిగా చరిత్రలో నిలిచిపోయారు హెచ్‌ఎం రెడ్డి. దాంతో 1931లోనే తొలిసారిగా ‘కాళిదాసు’ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు హెచ్‌ఎం రెడ్డి. అప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన రంగస్థల కళాకారులను పిలిపించి ‘కాళిదాసు’ పూర్తిచేశారు. అందులో కథానాయకుడిగా నటించిన పి శ్రీనివాసరావు తెలుగు భాగవతారు కాగా, కథానాయకి విద్యాధరి పాత్రధారిణిగా తమిళ రంగస్థల నటి టిపి రాజ్యలక్ష్మి నటించారు. శ్రీనివాసరావు తెలుగులో మాట్లాడుతూ తెలుగు పాటలు పాడగా, రాజ్యలక్ష్మి తమిళంలో మాట్లాడటం ఇక్కడ గమనార్హం. అయితే అప్పటి మద్రాసు ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండటంవల్ల మద్రాసువారికి తెలుగు, తమిళ భాషలు వచ్చేవి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలవారికీ కొద్దిగా తమిళం అర్థమయ్యేది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే హెచ్‌ఎం రెడ్డి ‘కాళిదాసు’ను నిర్మించారు. నిజానికి -తెలుగు భాష ఆధిక్యత కొనసాగిన ‘కాళిదాసు’ను తొలి ఆంధ్ర రాష్ట్ర టాకీ సినిమాగా వ్యవహరించొచ్చు. అయితే భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన అనంతరం ఈ చిత్రంలో ‘తమిళం’ ఉండటం వల్ల, ఇది తొలి తమిళ చిత్రంగా పరిశ్రమ గుర్తించింది. అయినా -‘కాళిదాసు’ సంపూర్ణ తొలి తమిళ చిత్రం మాత్రం కాదనడానికి అందులోని తెలుగు మాటలు, పాటలే నిదర్శకాలు. తొలి టాకీ చిత్రం ‘ఆలంఆరా’కు వినియోగించిన సెట్లనే ఈ చిత్రానికీ ఉపయోగించడం గమనార్హం. ఆ తమిళ చిత్రం 1931 అక్టోబర్ 31న విడుదలైంది. కాళిదాసు నిర్మాణం పూర్తయిన వెంటనే తొలి తెలుగు టాకీ చిత్రం ‘్భక్తప్రహ్లాద’ను హెచ్‌ఎం రెడ్డి ప్రారంభించారు.
***
ఆ రోజుల్లో బొంబాయిలోని మెజెస్టిక్ థియేటర్‌లో భారతదేశపు మొట్టమొదటి టాకీ చిత్రం ‘ఆలంఆరా’ విడుదలై ఎనిమిది వారాలపాటు ఏకబిగిన హౌస్‌ఫుల్ ప్రదర్శనగా సాగింది. అంతకుముందే ఒక మూకీ చిత్ర ప్రదర్శనకు ఆ థియేటర్ బుక్‌అయి ఉండటంవల్ల తొమ్మిదోవారంలో టాకీని తీసివేయాల్సి వచ్చింది. హిందీ చిత్రమైన ‘ఆలంఆరా’ బొంబాయిలో విడుదలైన రోజునే విజయవాడ మారుతీ టాకీస్‌లోనూ విడుదలవడం విశేషం. తర్వాత నెల్లూరులోని వినాయక్ థియేటర్‌లోనూ ‘ఆలంఆరా’ విడుదలై రికార్డు సృష్టించింది.
**
‘్భక్తప్రహ్లాద’ నాటకాన్ని ధర్మవరం రామకృష్ణమాచార్య రాశారు. ఆ నాటకాన్ని సురభి నాట్యమండలి ప్రదర్శించేది. నాటకంలో 40 పాటలు, పోతన భాగవతం పద్యాలూ ఉండేవి. సినిమా రూపంలోకి వచ్చాక అవే పద్యాలూ.. కొన్ని పాటలూ సంభాషణలయ్యాయ. రామకృష్ణమాచార్యులు రాసిన పాటలేకాకుండా సినిమాకి ప్రత్యేకంగా చందాల కేశవదాసు చేత కూడా కొన్ని పాటలు రాయించారు. నాటకంలోని పాత్రధారులే -సినిమాలోనూ నటించారు. సురభి కమలాబాయి లీలావతిగా, మునిపల్లె వెంకట సుబ్బయ్య హిరణ్యకశిపుడుగా, సింధూరి కృష్ణారావు ప్రహ్లాదుడిగా, బిఏ సుబ్బారావు ఇంద్రుడిగా, దొరస్వామినాయుడు, చిత్రపు నరసింహారావులు బ్రహ్మ, చండామార్కులుగా నటించారు. హెచ్‌ఎం రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎల్‌వి ప్రసాద్ చండామార్కుల శిష్యుడిగా నటించటం గమనార్హం.
‘్భక్తప్రహ్లాద’ సినిమాకు పాటల పుస్తకం వెయ్యలేదు. అలాగే గ్రామఫోను రికార్డులు కూడా తర్వాతి సినిమాలకు వచ్చినట్టు అన్నీ రాలేదు. అందుచేత పూర్తి వివరాలు లభ్యంకాలేదు. మొత్తం నలభై పాటలు, పాతిక వరకూ పద్యాలున్నాయని అంటుండేవారు. చందాల కేశవదాసు (1876-1956) రచించిన పద్యాలు కనీసం మూడు ఉన్నట్టు రూఢిగా తెలుస్తోంది.
* ప్రహ్లాదునికి లీలావతి విషాహారమిచ్చే సన్నివేశం నాటకంలో లేదు. సినిమాకు ఆ సన్నివేశంలో పాట పెట్టాలనే కొత్త ఆలోచన రాగానే హెచ్‌ఎం రెడ్డి దృష్టిలో కేశవదాసు పడ్డారు. -‘పరితాప భారంబు భరియింపతరమా/ కటకటనేనిధి గడువంగ జాలదు’ అంటూ సాగే (నాటకం కోసం కేశవదాసు రచించిన పద్యం) పాటనే యథాతథంగా సినిమాలో వినియోగించుకున్నారు. లీలావతి పాత్రధారిణి కమలాబాయి పాడిన ఈ పాటతోనే తెలుగు సినిమా పాట మొదలైందని కచ్చితంగా చెప్పవచ్చు.
* లీలావతి తన కుమారునికి తండ్రి మాట మీరవద్దని నచ్చచెప్పేందుకు కేశవదాసు రచించిన పద్యానే్న సన్నివేశం చేస్తూ -తనయా ఇటులనే తగదుర బలుకా తండ్రి మాట వినకా’ అన్నదాన్నీ వాడుకున్నారు.
* తన భార్య అయిన లీలావతిని అపహరించుకు పోయినందుకు హిరణ్యకశిపుడు ఇంద్రుని మందలించే తీరు వర్ణించబడింది. -్భకరమగు నా ప్రతాపంబునకు/ భీతిలేక ఇటు చేసెదవా/ భీరుడవై క్రూరుడువై చోరుడవై పారుడవై.. అన్నట్టుగా సాగుతుంది.
**
ఆంధ్రప్రదేశ్, మద్రాసు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలోని ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లో భక్తప్రహ్లాద ప్రదర్శించబడి తెలుగువారి ఆదరాభిమానాలు చూరగొంది. చాలామంది మెప్పుతోపాటు, అప్పట్లోనే కొన్ని పత్రికల నుంచి మొట్టికాయల్నీ అందుకోవాల్సి వచ్చింది.
కొంతమంది తొలి తెలుగు టాకీ ప్రేక్షకుల అభిప్రాయాలు..
-‘్భక్తప్రహ్లాద నాటకం అందరికీ సుపరిచితం. అందుకే తెరమీద నాటకం చూసిన అనుభవమే తప్ప బొమ్మలు మాట్లాడుతున్న థ్రిల్ కలగలేదు. అలాగే సంభాషణలు పద్యాలు వచ్చినప్పుడు శబ్దాల్లో హెచ్చుతగ్గులు, బొమ్మ స్పష్టంగా లేకపోవడంవల్ల కూడా సినిమా చూస్తున్నామన్న ఫీల్ కలగలేదు’.
-‘ఏదేమైనాగానీ ఏమాత్రం సాంకేతిక సౌకర్యాలూ లేకుండానే తెలుగు సినిమా విత్తువేసి ఇంతలా సమున్నత స్థాయికి ఎదిగేలా చేసిన హెచ్‌ఎం రెడ్డికి ప్రతి ప్రేక్షకుడూ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే’.
**
1957 జనవరి 12నుంచి 20వరకూ మద్రాసులో శబ్ద చిత్ర రజితోత్సవం (టాకీ జూబ్లీ) ఘనంగా జరిగింది. పాతికేళ్ల సినిమా పండుగ సందర్భంలో తొలి తెలుగు టాకీ మూలపురుషుడు హెచ్‌ఎం రెడ్డిని, ‘్భక్తప్రహ్లాద’లో నాయికగా నటించిన సురభి కమలాబాయిని సన్మానించారు. నిజమే.. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ప్రింట్ కూడా లభ్యం కావటంలేదు. పూణె ఫిల్మ్ ఆర్ట్స్‌లో కూడా సినిమా నెగిటివ్‌ను భద్రపర్చకపోవడం దురదృష్టం. చరిత్రను భద్రపర్చుకోవడంలోనూ, స్మరించుకోవడంలోనూ మనకున్న (ఆ)శ్రద్ధ అలాంటిది మరి. తొలి తెలుగు చిత్రం పెద్ద బాక్సాఫీసు హిట్టయ్యింది.
***
అయితే తెలుగులో సినిమా వచ్చిందని ఎవరూ మురిసిపోనక్కర్లేదని, ఈ మీడియా ప్రజలకి ఎలాంటి మేలు చేస్తుందో తెలీదుగాని, పోనుపోను దాని ప్రభావం వల్ల ప్రజలు తప్పుదారిపట్టే ప్రమాదం ఉందని ఒక ప్రముఖ సాహితీ మాస పత్రిక అప్పట్లోనే హెచ్చరించింది.
18 వేల రూపాయల పెట్టుబడితో 18 రోజుల్లో సినిమా నిర్మాణం పూర్తి చేశారు. 9762 అడుగుల నిడివిగల ఈ చిత్రం 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకుంది. ఈ సినిమాను మొదట బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్‌లో ఫిబ్రవరి 6న విడుదల చేశారు. బొంబాయిలో రెండువారాలు ఆడిన తర్వాత విజయవాడ (శ్రీ మారుతి సినిమా హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా సినిమా హాలు)లో విడుదలైంది. అటుపై 1932 ఏప్రిల్ 2న మద్రాసు నేషనల్ పిక్చర్స్ ప్యాలెస్‌లో ప్రహ్లాద విడుదలైంది. అప్పుట్లో రోజుకి రెండు ఆటలు (సాయంత్రం ఫస్ట్‌షో, రాత్రివేళ సెకండ్ షో) ప్రదర్శించేవారు. తమిళ ‘కాళిదాసు’ 1931 అక్టోబర్ 31న మద్రాసులోని కినిమా సెంట్రల్ (ఇప్పడు ఈ హాలు పేరు మురుగన్ టాకీస్) విడుదలైంది. భారతీయ సినిమా చరిత్రలో హెచ్‌ఎం రెడ్డి ఒకే ఒక్కడన్న నిజం స్ఫురిస్తుంది.
**
ఇక్కడ గర్వించాల్సిన విశేషం మరొకటి ఉంది. మన దేశంలో తయారైన తొలి టాకీలైన ఆలంఆరా (హిందీ), కాళిదాసు (తమిళం), భక్తప్రహ్లాద (తెలుగు)... మూడు చిత్రాల్లో నటించిన ఏకైక రికార్డు మరో తెలుగు వ్యక్తికి దక్కింది. ఆయనే -ఎల్వీ ప్రసాద్. ఇద్దరు తెలుగు వాళ్లు సుసంపన్నం చేసిన ప్రస్తుత సినిమా వటవృక్షాన్ని చూస్తుంటే గర్వంతోకూడిన ఆనందం కలుగుతుంది.

చిత్రాలు..హెచ్‌ఎం రెడ్డి, ఎల్‌వి ప్రసాద్

కె శ్రీనివాస రావు