S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ ఆదాయానికి బ్యాంకుల గండి!

విశాఖపట్నం, నవంబర్ 22: పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కల్పించిన కొన్ని వెసులుబాట్లు అమలుకు నోచుకోవట్లేదు. ఎంత మొత్తాన్నైనా వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసుకోవడంతో పాటు, అవసరమైన డిడి, చలానాలు ఇవ్వాల్సిన బ్యాంకులు ససేమిరా అనడంతో కొన్ని ప్రభుత్వ శాఖల ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌పై ఒత్తిడి పెంచుతోంది. నోట్ల రద్దుతో 40 శాతం రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా, మరికొన్ని రిజిస్ట్రేషన్లు బ్యాంకర్ల నిబంధనలతో ఆగిపోతున్నాయి.

బోర్డులు, శిలాఫలకాలు తెలుగులోనే ఉండాలి

విజయవాడ, నవంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, అన్ని రకాల వ్యాపార సంస్థల సంస్థల బోర్డులతోపాటు శంకుస్థాపన ప్రారంభోత్సవ శిలాఫలకాలన్నీ తెలుగులో ఉండేలా చట్టాన్ని తీసుకురావాలంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడిక్కడ మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంతంలో నేటికీ శిలాఫలకాలు ఆంగ్ల భాషలోనే సాక్షాత్కరించడం ఎంతో బాధాకరమన్నారు. ప్రధాన మంత్రి మోదీ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ఆంగ్లంలో ఏర్పాటు చేయడాన్ని తామంతా నిరసించడమే కాకుండా తాము తెలుగు భాషలో రూపొందించిన శిలాఫలకాన్ని అందించినా నేటికీ ఆవిష్కరించలేదన్నారు.

అభిృవద్ధిలో దూసుకుపోతున్న భారత్

పుట్టపర్తి,నవంబర్ 22: అభివృద్ది చెందిన దేశాల జాబితాలో భారత్ చేరబోతోందని కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు ఆర్.చిదంబరం పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 35వ స్నాతకోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భారతదేశం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. క్లిష్టపరిస్థితుల్లో సుహృద్భావ వాతావరణం అవసరమన్నారు. సాఫ్ట్‌వేర్, సాంకేతిక రంగాల్లో వేగంగా వృద్థి సాధిస్తున్నామన్నారు. భారతదేశం ఆర్థికంగా విజ్ఞానభాండాగారంగా మార్పుచెందాలన్నారు.

పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని ఏ చట్టంలో ఉంది?

ప్రత్తిపాడు, నవంబర్ 22: గాంధీ మార్గంలో చేసే సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని ఏ చట్టంలో ఉందో తెలియచేయాలని ఆంధ్రప్రదేశ్ డిజిపి సాంబశివరావును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈమేరకు డిజిపికి మంగళవారం ఆయన ఒక లేఖ రాశారు. మంగళవారం కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో లేఖకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నవంబర్ 12న పాదయాత్రకు అనుమతి లేదని, గొడవలు జరగవని హామీ ఇస్తే పరిశీలిస్తామని, రాష్ట్రంలో సెక్షన్ 30 అమలులో ఉందని డిజిపి పేర్కొన్నారన్నారు. గతంలో చంద్రబాబునాయుడు, రాజశేఖరరెడ్డి, జగన్మోహనరెడ్డి, కమ్యూనిస్టు నాయకులు చేసిన యాత్రలకు, ర్యాలీలకు అనుమతి ఉందా అని ఆయన ప్రశ్నించారు.

ప్రాజెక్టులకు 7900 కోట్లు కావాలి

హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 7900 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, నిధులు మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ కేంద్రాన్ని కోరనుంది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పిఎంకెఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 99 ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమస్య తదితర అంశాలపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది.

వర్గీకరణకు కేంద్రంలో అడ్డుపడుతున్నారు

హైదరాబాద్/చార్మినార్, నవంబర్ 22: కేంద్ర మంత్రి రాందాస్ అత్వాలే, విపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గేలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అడ్డుపడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో డప్పోల్ల రమేష్ రచించిన ‘చిటిక కోలా దండోర’ వర్గీకరణ ఉద్యమ దీర్ఘ కవిత అనే పుస్తకావిష్కరణ సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మందకృష్ణ పుస్తకావిష్కరణ గావించినానంతరం మాట్లాడుతూ వర్గీకరణ బిల్లును పార్లమెంటు అడ్డుకోవాలని మాలలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

జిఎస్‌టి బిల్లుకు ఆమోదం తర్వాతే అసెంబ్లీ

హైదరాబాద్, నవంబర్ 22: జిఎస్‌టి బిల్లుకు పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం లభిస్తేనే, అసెంబ్లీని సమావేశపరిచి ఆమోదం తెలపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. పార్లమెంటులో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందకపోతే, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించకుండా నేరుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం మంచిదన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏకీకృత పన్ను విధానానికి సంబంధించి రాజ్యాంగ సవరణ కోసం రెండు నెలల క్రితం పార్లమెంటు ఉభయ సభలూ ఆమోద ముద్ర వేసి అన్ని రాష్ట్రాల ఆమోదం కోసం పంపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కరోజు అసెంబ్లీని సమావేశపరిచి దానికి ఆమోదం తెలిపింది.

రంగంలోకి సైబర్ వారియర్స్

హైదరాబాద్, నవంబర్ 22: సైబర్ దాడులను అడ్డుకోవడానికి సైబర్ వారియర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. నగరంలోని హెచ్‌ఐసిసిలో సైబర్ సెక్యూరిటీపై మంగళవారం జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీపై నూతన పాలసీని రూపొందించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

అత్యవసర క్లాజ్‌తో భూసేకరణ తగదు

హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 2013 భూసేకరణ చట్టంలోని అత్యవసర క్లాజును ఉపయోగించి ఇప్పటికిప్పుడు భూమిని సేకరించే పరిస్థితి లేదని, నాలుగు వారాలపాటు ఈ క్లాజును ఉపయోగించి భూములను అధీనంలోకి తీసుకోరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణ్‌తో కూడిన ధర్మాసనం జారీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బి పవన్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

ఆదివాసీ మృతులకు పరిహారంపై విచారణ

హైదరాబాద్, నవంబర్ 22: మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల్లో తొమ్మిదిమంది ఆదివాసీలు ఉన్నారని, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో ఏపి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిల్‌ను ట్రేడ్ కో ఆర్డినేషన్ సెంటర్ ప్రతినిధి నారాయణస్వామి దాఖలు చేశారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 9 మంది ఆదివాసీ కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని పిల్‌లో కోరారు. అమాయకులైన గిరిజనులు ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారన్నారు.

Pages