వెన్నెల

మాస్‌టైటిల్స్‌పై టాలీవుడ్ గురి!

  • 14/06/2013
  • -శ్రీను
ప్రేక్షకులను సినిమాకు రప్పించాలంటే ముందు వారికి సినిమా పేరు నచ్చాలి. అది దృష్టిలో పెట్టుకొని గతంలో కొందరు దర్శకులు, నిర్మాతలు పేరును అందరినీ ఆకట్టుకునేలా నిర్ణయించేవారు. పేరులోనేముంది అని పెదవి విరిచేవారూ అందులో‘నేమ్’ను ప్రత్యేకంగా గౌరవించేవాళ్ళు. గతంలో దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ కూడా తన చిత్రాలకు సరికొత్తపేర్లను నిర్ణయించి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేవారు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడు సినిమాను చూడటం తథ్యం కనుక, అతని వౌత్‌టాక్‌తో మరికొంత ఆదరణ లభిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అప్పట్లో పేర్లను నిర్ణయించేవారు. జంబలకిడి పంబ, ఆయనకిద్దరు, ఆవిడా! మాఆవిడే, ఏవండీ, ఆవిడవచ్చింది, నళినీ ఆంటీ నీకు ఫోనొచ్చింది, మీలోకం ఓ గోలీ- మాలోకం మస్త్ మస్త్, జూ..లకటక తదితర పేర్లతో అప్పట్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేవారు. కానీ ఇప్పటి పరిస్థితి ఇందుకు తారుమారు. కసెక్కిన పేర్లు, కిర్రెక్కించే మాటలతో, వాటికి తోక పేర్లు కూడా పెట్టి ప్రేక్షకులను ఇబ్బందులనుపాలు చేస్తున్నారు ఇప్పటి దర్శక నిర్మాతలు అసలు సినిమాకు పేరును ఎలా పెట్టాలో ఇప్పటివారికి చాలామందికి తెలియడంలేదు. హీరో ఏ పేరు పెట్టమంటే ఆ పేరు పెట్టడానికి సిద్ధవౌతున్నారు. సినిమా నిర్మించేటప్పుడు ఓ పేరు ఉంటే, విడుదలయ్యే సమయానికి ఆ పేరు మారిపోతుంది. కొండొకచో ‘కామా’, ‘్ఫల్‌స్టాప్’, ‘కొశ్చన్‌మార్క్’లాంటి పేర్లు కూడా పెట్టడానికి ముందుకొస్తున్నారు. సినిమాలకు టైటిల్‌ను ఎంపిక చేయడంలో కీలకపాత్ర హీరోనే నిర్వహిస్తున్నారు. కోట్లు గుమ్మరించి చేసేవ్యాపారం లాభసాటిగా ఉండాలంటే మంచి మసాలా టైటిల్ పెట్టాలని దర్శకుల అంచనా. ఎవరేమి చేసినా రిలీజ్‌కి ముందే లాభాలు గడించాలని ఆయన దూరదృష్టి. సినిమాకు మంచి పేర్లు పెడితే బిజినెస్ డల్‌గా ఉంటుందని ప్రస్తుత నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే మాంచి కిక్ ఇచ్చేలా పవర్‌ఫుల్ టైటిల్స్‌కోసం భూతద్దాలు పెట్టి వెతుకుతున్నారు. మాది మాస్ టైటిల్, మాది కసెక్కించే టైటిల్, మేము కుర్రకారుకు క్యాచబుల్‌గా ఉండేలా పేరుపెట్టామని పాత్రికేయుల సమావేశాల్లో చెబుతుంటారు. పేరు నిర్ణయించే విషయంలో అగ్రహీరోలదే ప్రధాన తాంబూలం. సినిమా పేరుతో కథకు సంబంధం ఉన్నా లేకపోయినా పక్కా మాస్ పలికే పదాలను టైటిల్‌గా పెట్టడానికి ఇష్టపడుతున్నారు. హీరోల పుట్టినరోజులకు టీజర్‌లు విడుదల చేసే సంప్రదాయం మొదలుకావడంతో మంచి మాస్ టైటిల్స్‌ను ఎంపిక చేయడానికి ఇష్టపడుతున్నారు. అది అవసరంగా కూడా మారింది. ఆ టైటిల్స్‌తో అభిమానులకు సంతోషం ఇవ్వాలని, తోటి హీరోలకు తన ప్రతిభేంటో చూపాలని, ఓరకంగా హెచ్చరిక చేయాలని సదరు హీరోలు భావిస్తున్నారు. దాంతో మిగతా హీరోలు కూడా అదే తప్పుదారిలో నడవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మహేష్‌బాబు, సుకుమార్‌ల చిత్రం టైటిల్ ప్రజల్లోకి వచ్చింది. ‘1’ (నేనొక్కడినే) అన్న పేరును చూసి అభిమానులు ఇప్పుడు సంతోషపడుతున్నారు. తమకు నచ్చని హీరోల అభిమానుల ముందు కాలర్ ఎగరేసి వారు తమ హీరోనే గొప్ప అని చెప్పుకొనే స్థాయికి చేరారు. అదేవిధంగా మహేష్‌కు మూడక్షరాల టైటిల్స్ బాగా కలిసి వస్తున్న తరుణంలో ఈ టైటిల్‌తో తీస్తే చివరికి సినిమా ఎలా ఉంటుందోనన్న బెంగ కూడా వారిని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే దూకుడు విషయంలో అభిమానుల మధ్య వివాదాలు చెలరేగడం తెలిసిందే. ఆ చిత్రాన్ని టాలీవుడ్ చరిత్రలోనే గొప్ప చిత్రంగా అభివర్ణిస్తున్నందుకు ఇతర కథానాయకుల అభిమానులు ఒప్పుకోవడంలేదు. శ్రీనువైట్ల దూకుడు విజయంతో ఎన్టీఆర్ సినిమా కూడా బాద్‌షా అని పేరు పెట్టినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు మరోసారి మహేష్‌బాబు చిత్రానికి ‘ఆగడు’ అనే పేరు పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. జూ.ఎన్టీఆర్ దమ్ము టైటిల్ అభిమానులకు ఆనందాన్నిచ్చినా రిలీజయ్యాక డీలాపడేలా చేసింది. సాఫ్ట్‌టైటిల్స్‌తో హిట్లు అందుకునే వెంకటేష్ కూడా ‘షాడో’ అన్న టైటిల్‌తో ఏమీ సాధించలేకపోయాడు. ‘సీతమ్మ వాకిట్లో...’ టైటిల్ వెంకటేష్‌కి లాభం చేకూరినా మహేష్‌బాబుకు మైనస్‌గానే మిగిలింది. ఏ సినిమా అయినా బాగుంటేనే టైటిల్‌ను సాఫ్ట్‌గా నిర్ణయించాలనే హీరోలు కూడా ఉన్నారు. ఓపెనింగ్ కలెక్షన్లు టైటిల్‌మీదకంటే, హీరో హీరోయిజం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అలా భావించే నిర్మాతలు కొద్దిమంది సాఫ్ట్ టైటిల్‌ను ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ పద్ధతిలో అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో అని వచ్చారు. పవన్ కల్యాణ్ తాజా చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ‘అత్తారింటికి దారేది?’ అని నిర్ణయించారు. ఇదే చివరికి ఖాయం కావచ్చు కూడా. సాఫ్ట్ టైటిల్స్‌తో హిట్ కొట్టే దర్శకులు గతంలో మహేష్‌బాబుతో ‘అతడు’ అనే పేరుతో వచ్చాడు. ఆ సినిమా థియేటర్లలో కంటే టీవీలలోనే ఎక్కువ హిట్ అన్న మాటను స్వంతం చేసుకుంది. త్వరలో రాబోయే రామ్‌చరణ్ సినిమాలు ‘ఎవడు’, ‘తుఫాన్’ లాంటివి పక్కా మాస్ టైటిల్సే. నూతన తారలతో నిర్మిస్తున్న చిత్రాలకు ఎక్కువగా కళాత్మక పేర్లను నిర్ణయిస్తున్నారు. విభిన్న తరహాగా ‘3జిలవ్’ అని పేరు కూడా వచ్చింది. మరికొందరు గతంలో వచ్చిన పాత హిట్‌చిత్రాల పేర్లను ఎన్నుకుంటున్నారు. ఓ చిత్రం హిట్ అయిందీ అంటే ఆ చిత్రంలోని పాటల పల్లవులు సినిమా పేర్లుగా మారుతున్నాయి. అలా ఇటీవల వచ్చిన ‘గుండెజారి గల్లత్తయ్యిందే’ సినిమా పేరు, గబ్బర్‌సింగ్ చిత్రంలోని పాటఅని మనకు తెలిసిందే. మాయాబజార్ చిత్రంలోని అన్ని పాటలతో సినిమా పేర్లు వచ్చేశాయి. టెలివిజన్ చానల్స్ పైరసీల దెబ్బకు వెండితెర రాను రాను బోసిపోతున్న ఈ తరుణంలో మాస్ టైటిల్స్ పెట్టడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. అవి ప్రేక్షకులను ఆకర్షించి కోట్లను కుమ్మరిస్తాయని నమ్ముతున్నారు. ఇటీవల సింగిల్ సింబల్ (ఓం)తో కళ్యాణ్‌రామ్ నిర్మించిన చిత్రం ఆడియో జరుపుకుంది. వెనువెంటనే ప్రిన్స్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘1’ (నేనొక్కడినే) అనే పేరు నిర్ణయించారు. ఈ టైటిల్‌పై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అన్ని ప్రాంతాలనుండి ఈ చిత్రం కోసం ఇప్పటినుంచే బిజినెస్ ప్రారంభమైందట. ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించడానికి క్లాస్ టైటిల్స్ కంటే మాస్ టైటిల్సే బాగుంటున్నాయని ఓ మాట షికారు చేస్తోంది. పేరేదైనప్పటికీ కథకు న్యాయం చేసినప్పుడే ఆ పేరుకి సార్థకత. అగ్రహీరోలుగా సినిమాలు నిర్మిస్తున్నవారు మంచి పేర్లతోకంటే, మాస్ టైటిల్స్‌తోనే మంచి రేంజ్‌కు గతంలో ఎదిగారన్న నిజాన్ని గమనించిన యువ హీరోలు, నిర్మాతలు కూడా అదే పద్ధతిలో పేర్లను నిర్ణయిస్తున్నారు. ఇప్పుడే ఈ పేర్ల గోల ఇలా వుంటే భవిష్యత్తులో ఎలా వుండబోతోందో? చూడాల్సిందే!! పేర్లతో అభిమానుల మధ్య గొడవలు సృష్టిస్తున్న అగ్రహీరోలు కూడా ఈ విషయంపై ఆలోచించి మాస్ టైటిల్స్ పెట్టినా, అభిమానులమధ్య ఎటువంటి ఆగ్రహాలు, గొడవలు లేకుండా చూడాలి. అభిమాన సంఘాలమధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పి సినిమా పరిశ్రమను నాలుగు కాలాలపాటు పచ్చగా ఉండేలా హీరోలు, నిర్మాతలు, దర్శకులు పాటుపడాలి.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading