S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనుకూల పరిష్కారం

ఇలాంటి వైవాహిక సమస్య చాలామందికి వచ్చినా మూడు పార్టీలకి అనుగుణంగా పరిష్కరించే విధానం మాత్రం అందరికీ తెలీదు. నా వైవాహిక జీవితంలో వచ్చిన ఆ సమస్యకి నేను కనిపెట్టిన పరిష్కారం ఇది.
విషం.
ఆగండాగండి. నేను నా భార్యని చంపదలచుకోలేదు. నా భార్య కూడా నన్ను చంపదలచుకోలేదు. లేదా నేను నా భార్య ప్రియుడ్ని కాని, అతను నన్ను కాని, నా భార్యని కాని, నా భార్య తన ప్రియుడ్ని కాని చంపదలచుకోలేదు. మరి విషం ఎలా పరిష్కారం అవుతుంది? ఎవరు విషాన్ని తీసుకుంటారు? నేను చెప్పింది విన్నాక నా భార్య నాతో చెప్పింది.
‘డార్లింగ్! నువ్వు చెప్పిన పరిష్కారం నాగరికతతో కూడింది’
‘అవును. నేను నాగరికతని నమ్ముతాను. మనం నాగరికులం. కాని ఈ ఏర్పాటుకి నీ ప్రియుడు అంగీకరిస్తాడా అన్నది నాకు అనుమానం’ చెప్పాను.
‘నీ సూచన ప్రకారమే మనం ముగ్గురం కలిసి నాగరికుల్లా ఈ సమస్య గురించి చర్చించుకుందాం. చర్చకి అతను నిరాకరించడు. నువ్వు సూచించే పరిష్కారాన్ని అతను అంగీకరిస్తాడనే నా నమ్మకం’
‘నీ కోసం అతను తన ప్రాణాలని కూడా అర్పిస్తానని అనేకసార్లు చెప్పాడని నువ్వు నాతో అన్నది నిజమో, అబద్ధమో తెలుసుకునే అవకాశం కూడా నీకు వస్తుంది’
‘అతను ఎన్నటికీ అందుకు వెనుకాడడు’ నా భార్య రోషంగా చెప్పింది.
‘ఐతే నువ్వు అదృష్టవంతురాలివే’
‘నిజమే. ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండే ఓ భర్త, అదే సమయంలో ఓ ప్రియుడు ఉండే భార్యలు ఈ లోకంలో ఎంతమంది ఉంటారు?’ ఆ మాటలు చెప్తూంటే నా భార్య మొహంలో గర్వం తొంగిచూసింది.
‘ఈ రాత్రికి మన మీటింగ్‌ని ఏర్పాటు చేయగలవా?’ అడిగాను.
‘అలాగే. ఇది త్వరగా తేల్చాల్సిన సమస్య. ఈ రాత్రికే’ చెప్పి ఆమె రిసీవర్ అందుకుని అతని నంబర్ని డయల్ చేసింది.
వారు ఇద్దరూ ఒంటరిగా మాట్లాడుకునే అవకాశాన్ని ఇస్తూ, నాగరికుడినైన నేను ఆ గదిలోంచి బయటికి నడిచాను.
* * *
కొద్ది రోజుల క్రితం బయట నించి వచ్చిన నా భార్య ఒంటి మీంచి మగవాళ్లు వాడే సెంట్ వాసన వేసింది.
‘నీకు ఇంకో మగాడితో శారీరక సంబంధం ఉంది కదా?’ నేను మామూలుగా అడిగాను.
ఆ ప్రశ్నకి జవాబు చెప్పే ముందు ఆమె కొద్ది క్షణాలు వౌనంగా ఉండి తర్వాత చెప్పింది.
‘అవును. ఆ రహస్య పనికి వాసన రాదు కానీ డెన్నిస్ వాడే సెంట్ వాసనని నువ్వు పట్టేసావు కదా?’ అడిగింది.
‘అతని పేరు డెన్నిస్సా?’
‘అవును. లంచ్‌కి నేను వెళ్లే రెస్ట్‌రెంట్‌లో పరిచయం. విడాకులు తీసుకున్నాడు. పిల్లలు లేరు. నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని, నీకు విడాకులు ఇవ్వమని కోరుతున్నాడు.’
‘మీకు పరిచయమై ఎంత కాలమైంది?’ నేను ఎలాంటి భావనలని ప్రదర్శించకుండా అడిగాను.
‘ఆరు వారాలు’
‘ఆరు వారాల్లోనే అతను అలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే నిజంగా నీతో గాఢంగా ప్రేమలో పడ్డట్లు ఉన్నాడు.’
‘అవును. నా గర్వాన్ని మన్నించండి’
‘అంటే నువ్వు నన్ను ఇప్పుడు ప్రేమించడం లేదనేగా చెప్పేది?’
‘అదేం లేదు. మన పెళ్లి రోజున మీ మీద నాకు ఎంత ప్రేమ ఉండి చేసుకున్నానో ఆ ప్రేమ ఎంత మాత్రం తగ్గలేదు. కాని నేను అతనితో లోతుగా ప్రేమలో పడ్డాను’ నా భార్య చెప్పింది.
‘నువ్వు ఒకప్పుడు నాతో లోతుగా ప్రేమలో పడ్డావు’
‘మీరా మాట అన్నందుకు మిమ్మల్ని తప్పు పట్టను. ఎందుకంటే నా మనసు మీకు అర్థంకాదు. ఇప్పుడు నేను మీ ఇద్దర్నీ సమానంగా ప్రేమిస్తున్నాను.’
* * *
ఆ రాత్రి డోర్ బెల్ వినపడగానే నా భార్య ఉత్సాహంగా చెప్పింది.
‘డెన్నిస్ వచ్చాడు. తలుపు తీయండి’
‘నువ్వు తియ్యి. అతను నన్ను చూడటానికి సిగ్గు పడచ్చు’
కాని ఆమె తలుపు తెరచి అతని మెడ చుట్టూ చేతులువేసి అతన్ని చుంబించినా డెన్నిస్‌లో అలాంటి అపరాధ భావం నాకు కనపడలేదు. అతని వయసు ముప్పై పైనే ఉంటుంది. నాకన్నా నాలుగైదు ఏళ్లు చిన్నవాడు.’
‘షెర్మ్. ఇతను డెన్నిస్. డెన్నిస్! ఇతను నా భర్త షెర్మ్’ చెప్పింది.
ఇద్దరం కరచాలనం చేసుకున్నాం.
‘మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది’ డెన్నిస్ చెప్పాడు.
నేనూ మర్యాదకి అదే మాట చెప్పాను.
‘మన వ్యవహారంలో మీరు చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు.’
‘మర్యాదగా కాదు. నాగరికంగా’ నేను సరిదిద్దాను.
‘మీ ఇద్దరూ విడాకులు తీసుకుని నా పెళ్లికి మీరు సహకరించచ్చుగా? అది ఇంకా నాగరికంగా ఉంటుందిగా?’ డెన్నిస్ అడిగాడు.
‘నాగరికతలోని ఆ మొదటి పద్ధతి నచ్చేంత నాగరికుడ్ని కాదు. అందుకనే రెండో నాగరిక పద్ధతిని సూచించాను. నువ్వు నీ ప్రియుడికి మొత్తం వివరించావా?’ నా భార్యని అడిగాను.
‘వివరించింది’
‘నాకోసారి అది చెప్పండి’ కోరాను.
అతను చెప్పాక నేను మూడు షెర్రీ సీసాలని తెచ్చి చూపిస్తూ చెప్పాను.
‘నా పథకం ఇది. మనం ముగ్గురం తలో సీసాని తీసుకుని తాగుతాం. ఈ మూడు సీసాల్లోది షెర్రీనే. ఒక దానికి, ఇంకో దానికి ఒక్క విషయంలో తప్ప ఎలాంటి తేడా లేదు. మూడు సీసాల్లోని ఓ దాంట్లో విషం కలిపాను. అది తాగిన నిమిషంలో ఊపిరి ఆగిపోతుంది. ముగ్గురం వీటిని తాగుదాం. నువ్వు విషం కలిసింది తాగితే నాకు నా భార్య దక్కుతుంది. నేను విషం కలిసింది తాగితే నీకు నా భార్య దక్కుతుంది. ఒకవేళ నా భార్య అది తాగితే మనిద్దరికీ ఆమె దక్కదు. సమస్య నా భార్య నించి ఉద్భవించింది కాబట్టి ఈ ఆటలో ఆమె కూడా పాల్గొనడం సబబు. అందుకు నా భార్య ఇప్పటికే ఒప్పుకుంది కూడా. ఇందులో బలవంతం ఏమీ లేదు. నువ్వూ ఒప్పుకున్నావనే చెప్పింది. నేను చెప్పింది అర్థమైందా? నీకు అంగీకారమేనా?’
అతను దీర్ఘంగా నిట్టూర్చి నా భార్య చేతిని ప్రేమగా తట్టి చెప్పాడు.
‘అంగీకారమే. మీ భార్య నాతో లేకుండా నేను ఎటూ బతకలేను’
‘నువ్వు?’ నా భార్యని అడిగాను.
‘అంగీకారమే’ ఆమెలో ఉత్సాహం తప్ప ఎలాంటి అధైర్యం లేదు.
‘ఇందులో విషం కలిపిన సీసా ఏది?’ డెన్నిస్ నవ్వుతూ అడిగాడు.
‘నాకు తెలీదు. మీ ఇద్దరూ చెరోటి తీసుకున్నాక నేను మూడోది తీసుకుంటాను కాబట్టి ఒకవేళ నాకు తెలిసినా ఉపయోగం ఉండదు’
‘ఇప్పుడే తాగాలా?’ డెన్నిస్ అడిగాడు.
‘కాదు. ఇక్కడ తాగితే ఒకవేళ మీరు మరణిస్తే మీ శవం కొత్త చిక్కులని తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం ముగ్గురం మన సీసాలతో వేరే ఎక్కడైనా తాగాలి. విషం కలవని సీసాలోది తాగిన ఇద్దరు అదృష్టవంతులు రేపు మధ్యాహ్నం ఒంటిగంటకి కేఫ్ షికార్డోలోని కాక్‌టైల్ లాంజ్‌లో కలుసుకోవాలి. ఇందువల్ల దాన్ని తాగాలా, వద్దా అని మరి కాస్త ఆలోచించుకునే వ్యవధి దొరుకుతుంది’
‘సరే’ డెన్నిస్ కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు.
తన బాటిల్‌తో వెళ్తూ గుమ్మం దగ్గర ఆగి నా వైపు తిరిగి డెన్నిస్ చెప్పాడు.
‘మీరు ఓ పొరపాటు చేశారు’
‘ఏమిటది?’
‘షెర్రీ బదులు పోర్ట్‌వైన్ వాడాల్సింది. నాకు అది ఇష్టం’
* * *
మర్నాడు మధ్యాహ్నం కేఫ్ షికార్డోకి మధ్యాహ్నం ఒంటి గంటకి వచ్చిన నా భార్య ఆసక్తిగా అటూ ఇటూ చూస్తూ కళ్లతో వెదకడం నాకు కనిపించింది. చివరకి ఆమె దృష్టి నా మీద పడింది. వచ్చి నా ముందు కూర్చుని, కొద్దిసేపు నా కళ్లల్లోకి నిరసనగా చూసి అడిగింది.
‘డెన్నిస్ విషం సీసా తీసుకునేలా ఏం ఉపాయం చేసారు?’
నేను సన్నగా నవ్వి తల అడ్డంగా ఊపి చెప్పాను.
‘అలాంటిదేం లేదు’
‘మరి?’
‘అసలీ పరిష్కారం ఉద్దేశం నీకు గుర్తుందా?’
‘మీ ఇద్దరిలో ఎవరు నన్ను గాఢంగా ప్రేమిస్తున్నారో నేను తెలుసుకోవాలి అన్నది’ ఆమె చెప్పింది.
నేను నా చేతిలో గ్లాస్‌లోంచి కొద్దిగా మార్టినీని తాగి, గ్లాస్‌ని కింద ఉంచి నవ్వుతూ చెప్పాను.
‘నేను చిన్న తేడాని చేసింది నిజం’
‘ఏమిటది?’
‘మూడు సీసాల్లో విషం కలిపాను’
‘ఏమిటీ?’ అదిరిపడింది.
‘అవును’
‘ఎందుకని?’
‘ప్రాణాలకన్నా ఈ ప్రపంచంలో - లేదా మన ముగ్గురిలో ఎవరికీ ప్రేమ ముఖ్యం కాదని రుజువు చేయడానికి. చూశావా? నువ్వూ తాగలేదు. నేనూ తాగలేదు’
‘డెన్నిస్ ఇంకా రాలేదు. అంటే అతను నా కోసం మరణించడానికి సిద్ధం కాబట్టి విషం అని తెలిసీ దాన్ని తాగాడన్నమాట’ ఆదుర్దాగా అడిగింది.
‘లేదు. నాలా, నీలా దాన్ని అతనూ తాగలేదు’
‘ఎలా తెలుసు?’
‘అతని మరణవార్త దినపత్రికలో రాలేదు. బహుశ అతను కొద్దికాలం నీకు కనపడడు. అంతే’
‘ఇది ఎలా చెప్పగలరు? ఇంకా అతని శవం బయటపడి ఉండకపోవచ్చు.’
నేను చిన్నగా నవ్వి తల అడ్డంగా ఊపి చెప్పాను.
‘కిటికీలోంచి చూడు. అతని కారు బయట పార్క్‌చేసి ఉంది. అందులోంచి అతను మనిద్దరిలో ఎవరు వస్తారా అని తెలుసుకోవాలనే ఆసక్తితో కూర్చుని చూస్తున్నాడు. నువ్వు వెళ్లి అతన్ని పలకరిస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’
ఆమె చేతి వేలు బల్ల మీద కొద్దిసేపు తట్టి క్రమంగా ఆగిపోయింది. ఆమె మొహంలో చిన్న చిరునవ్వు మొలిచింది.
‘అంటే నేను అబద్ధాలకోరుని ప్రేమించానన్న మాట. అంతేగా?’
నేనా ప్రశ్నకి జవాబు చెప్పకుండా అడిగాను.
‘షెర్రీ బాటిల్‌ని ఆర్డర్ చేస్తాను. గుర్తుందా? మన హనీమూన్‌లో మనం తాగింది షెర్రీనే.’
‘గుర్తుంది’ చెప్పి ఆమె వెయిటర్ని చూసి చిటికె వేసింది.
*

ఫ్లెచర్ ఫ్లోరా కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి