S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అసాధ్య చింతనకు సుసాధ్య నాయకత్వ ప్రతిభ

భగవద్గీతను మతగ్రంథంగా కాక విశ్వరచనగా చూస్తే అందులో మానవాళి వర్థిల్లటానికి వలసిన అనేకానేక విశ్వ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికీ ఉపకరిస్తాయి. అలాగే కాలానికి అతీతంగా నాయకులకు ఉండవలసిన వ్యక్తిత్వ, వ్యక్తిమత్వాల చిత్రణ అడుగడుగునా కనిపిస్తుంది. గీతలో ఉన్నవి ఏడు వందల శ్లోకాలే అయినా ఏడు ఆవరణలలో రాణించటానికి కావలసిన ఏడు వందల మార్గాల పొత్తం అది. మానవ జీవన సంఘర్షణలకు ప్రతిరూపం అది.
మనం పైకి ఎంతలా గంభీరంగా ఉన్నా అంతర్లీనంగా గూడుకట్టుకుని ఉన్న భావోద్వేగాలు ఒక్కసారిగా పెల్లుబికి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయనటానికి ఎంతో సంయమనంతో ఉండే అర్జునుడు సైతం తల్లడిల్లటమే ఒక మంచి దృష్టాంతం. ఏది ఏమైనా అటు మహాభారతంలోనైనా ఇటు మన సమాజంలోనైనా ప్రతి ఒక్కరిదీ అస్తిత్వ సంఘర్షణే. ప్రతి ఒక్కరం పడిలేచే కెరటాలమే. అయితే మంచి చెడుల మధ్యన, ధర్మం అధర్మం మధ్యన ఈ జీవన ఘర్షణ ఎలా ఉందనటానికి కౌరవులు, పాండవులు మంచి ఉదాహరణలు.
మనకు తెలిసిన గీతోపదేశం జరిగింది కురుక్షేత్రంలోనే అయినప్పటికీ ఈ రోజు ప్రాపంచికంగా మనలోని ప్రతి ఒక్కరికి ఆ గీతోపదేశ సారాంశం అవసరమవుతోంది. పసిపిల్లల నుండి పండు ముదుసలుల దాకా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపేణా గీతాంశాలు అనుసరణీయాలే. అయితే యథాతథంగా కాక సమకాలీనానికి అన్వయించుకుని చూస్తే గీతాసారాంశాన్ని ఒక అను సృజనగా మనం అందుకోవాలి. ఎందుకంటే గీత మనకు ఈనాడు అక్షర రూపంలో కనిపిస్తున్నప్పటికీ మూల రూపం మాత్రం వాగ్రూపమే.
కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించింది మాటల రూపంలోనే. అయితే ఆ ఉపదేశ తరంగిణి కొన్నివేల ఏళ్లు వాగ్రూపంలోనే ప్రచారంలో ఉంటూ క్రమేపీ అక్షరబద్ధమైంది. కాబట్టి అది శబ్ద రూపంలో ప్రాచుర్యంలో ఉన్నంత కాలం ఒకరి నుండి మరొకరిని చేరుకుంటూ రావటం వల్ల అందులో మార్పులు చేర్పులు ఇబ్బడి ముబ్బడిగానే జరిగాయి. అలా కృష్ణుడి నుండి వెలువడ్డ గీత కాలం సాగుతున్న కొద్దీ పరిపుష్టమవుతూ వచ్చింది. అందుకే అన్ని కాలాలకు అందరికీ అనుసరణీయం అవుతూ వస్తోంది.
కారణం ప్రతి ఒక్కరం అర్జునుడిలో మనల్ని చూసుకోవటం, కృష్ణుడిలో ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని చూడగలగటం. అంటే మనకు దైనందిన జీవితంలో అసాధ్యమవుతున్నది కృష్ణ రూపంలో సాధ్యంగా ప్రత్యక్షమవుతోంది.. ఆదరణీయం, ఆచరణీయం అవుతోంది.
అలనాడు గీత వెలికివచ్చింది దాయాదుల పోరు నేపథ్యంతోనే. ఈనాడు ఈ పోరు ప్రతి వ్యక్తికీ వర్తిస్తోంది.. అది వ్యక్తిగతంగా కావచ్చు, కౌటుంబికంగా కావచ్చు. సామాజికంగా కావచ్చు, ప్రవృత్తిపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు. అందుకే నేడు మానసిక క్షేత్రానికైనా, వ్యాపార క్షేత్రానికైనా గీతా సిద్ధాంతాలు సహజ వనరులు అవుతున్నాయి. ఏ రంగం అన్న ప్రశ్నను అటుంచితే మనలోని ప్రతి ఒక్కరం నాయకులం కావాలనుకుంటున్న వారమే. అంటే లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని పెంచుకోవటం కోసం పరితపిస్తున్న వారమే.
పరితపిస్తున్నామంటే మనలో నాయకత్వ లక్షణాలు కొన్ని లేనట్లే. అసలు గీతలో మనకు కనిపించే నాయకత్వ లక్షణాలు మన మానవ సంస్కృతి నుండి, మన మానవ చరిత్ర నుండి ఆవిష్కృతమైనవే. అందుకే గీతలోని అంశాలు కొత్తగా అనిపించవు కానీ కొత్తకోణంలో అనువదించుకోవలసినవే.
నిజానికి మనమే సంస్కృతి.. సంస్కృతే మనం.. రెండూ కలిసిందే మన చరిత్ర. ఈ చరిత్ర నుండి పుట్టుకొచ్చే ఏ సిద్ధాంతాలైనా. తమాషా ఏమిటంటే ఆ సిద్ధాంతాలే భవిష్యతరాలకు పాఠాలవుతుంటాయి. అయితే చరిత్ర చేసే పని ఆ సిద్ధాంతాలను సంఘటనల రూపంలో కాలబద్ధంగా పోగేయటమే. అందులో నుండి మనకు కావలసిన వాటిని మనం గుదిగుచ్చుకోవలసిందే. ఆ సంపదతో మనం జీవితాన్ని పండించుకుంటూ, అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ, మనమే నాయకులం కావాలి.
ఇక మహాసంగ్రామంలో దుర్యోధనుడూ నాయకుడే.. అర్జునుడూ నాయకుడే.. కాని మనం దుర్యోధనులం కావాలనుకోవటం లేదు. మన జీవితం, వ్యక్తిత్వం అర్జునుడి వ్యక్తిమత్వంలా ప్రకాశించాలనుకుంటున్నాం. కారణం అర్జునుడు విలువలకు ప్రతీకగా నిలిచాడు కాబట్టి.. మనమూ అటువంటి విలువలతో రాణించాలనుకుంటున్నాం కాబట్టి.
ఏ కాలంలోనైనా మంచీ చెడులు ప్రతి ఒక్కరిలోను ఉంటాయి. అయితే మంచిపాలు ఎక్కువైన వ్యక్తి ఆదర్శప్రాయుడవుతాడు. మంచితనానికి పడే మార్కుల్నిబట్టి పది మందికీ అనుసరణీయుడవుతాడు.. నాయకుడవుతాడు. ఇదీ తరతరాల మానవ చరిత్ర. మంచి ఒక్కటే కాక తానే న్యాయానికి ప్రతి రూపమూ కాగలిగితే చరిత్రలో నిజమైన నాయకుడిగా నిలిచిపోతాడు. ఈ వాస్తవాలకు ప్రతిరూపం అయ్యింది కాబట్టే భగవద్గీత విశ్వకళ్యాణకారి అయ్యింది.. దానిలోని మానవ వికసన సిద్ధాంతాలు ఏ సరిహద్దు రేఖ మధ్యనో ఇరుక్కుపోయినవి కావు కాబట్టి మన ఆలోచనాసరళిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంటాయి.
అన్నట్టు భగవద్గీతపై ప్రమాణం చేసి న్యాయస్థానంలో నిలబడి నోరు విప్పటం మనం చేస్తున్నాం.. అంటే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మనల్ని మనం ఆవిష్కరించుకోవాలనేగా, అదీ గీతకున్న పవిత్రత, పారదర్శకత. అంతెందుకు గీతా ప్రభావానికి లోనుకాని ఏ వ్యాపార దిగ్గజమూ ఉండదు. ఏ నాయక శిఖామణీ ఉండడు. డబ్బుని కాక పనినే పెట్టుబడిగా పరిగణించే వారికి అన్ని విధాల గీతనే మార్గదర్శనం. ‘కమిట్‌మెంట్’ అన్నది హృదయస్పందన అయిన ప్రతి ఒక్కరికీ గీతనే శిరోధార్యం.
కాంపిటీషన్‌తో మనం ఎప్పటికప్పుడు ‘అప్-టు-డేట్’ అవుతుండవలసిందే. అంటే లభించే ప్రతి సమాచారమూ మన ఎదుగుదలకు అవసరమైనదే. అయితే ఈ సమాచారాన్ని శిరోభారంగా భావిస్తే మనం అపజయం వొళ్లో పడతాం. సమాచారం మనలో తిష్ట వేసుకుని కూర్చుంటే మన ఆలోచనలు మిన్నకుండవు. అవి ఉద్రేకానికి లోనవుతాయి. అంటే మనలో ఎల్లప్పుడూ ఒక భావోద్విగ్న స్థితి నెలకొని ఉంటుంది. ఫలితంగా ‘అబ్జర్వేషన్’ వైపు మన చూపు ప్రసరించే ఉంటుంది.
మనం ఉంటున్న రంగంలో మనం ‘లీడర్’లం కావాలంటే మనకు ‘గ్లోబల్ స్కిల్’ అవసరమవుతోంది. ఎప్పటికప్పుడు ‘అప్- డేట్’ కావటం అవసరమవుతోంది. ‘అడాప్టబిలిటీ’ ‘్ఛంజ్’ అవసరమవుతున్నాయి. ఇవి సాధ్యం కానపుడు మనం ఒత్తిడికి గురి అవుతుంటాం. ఒత్తిడితో వెనకబడుతుంటాం.. లేదా అనర్థాలకు ఆలవాలమవుతుంటాం.
కురుక్షేత్ర ప్రారంభంలో అర్జునుడు గురైంది ఇటువంటి ఒత్తిడికే. మనలోనూ అర్జునాంశ బాగానే ఉంది కాబట్టి మనమూ మన నిత్యజీవన సంగ్రామంలో ఈ ఒత్తిడికి అతీతులం కాలేకపోతున్నాం. అందుకే గీతోపదేశ రూపంలో కృష్ణ చైతన్యం మనకు అవసరమవుతోంది. కృష్ణుడే మనకు ఆదర్శనాయకుడవుతున్నాడు. అంటే కృష్ణుడు చెప్పిన అంశాలు మనలోని నాయకుడు వర్థిల్లటానికి ఉపయుక్తాలవుతున్నాయి.
నాయకులు ఎప్పుడూ ‘రిసీవ్’ చేసుకోవటానికి సిద్ధమై ఉంటారు. మనమూ అలా సిద్ధమైతే గీతోపదేశం బోధపడుతుంది.. మనం మారటానికి మార్గం చూపుతుంది. ఈ మార్పుతో మనం నాయక ప్రతిభతో పునర్జీవితులమైనట్లే. పునర్జీవితం అంటే పరిణామంలో మరొక ముందడుగు అని. కాబట్టి గీతను మనం పరిణామ సిద్ధాంత గ్రంథంగా చెప్పుకోవచ్చు.
అన్నట్టు పరిణామం అనేది పరిపూర్ణం కావటానికే. నిజానికి మన మనుగడ అసంపూర్ణంగా సాగుతోంది. ఇలా మనం అసంపూర్ణ జీవులం, అసంపూర్ణ నాయకులం. మనలో నాయక ప్రజ్ఞ నెలకొనాలంటే ముందస్థుగా మనం ‘వర్క్-లైఫ్’తో కర్మిష్ఠులం కావాలి. వేడిమిని, చల్లదనాన్ని ప్రతిరోజు అనుభవిస్తున్నట్లే వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవనాన్ని సమంగా అనుభవించాలి. మనలోని నాయకుడికి ఈ సమవిద్య, సమన్యాయం తెలిసి ఉండాలి.
జీవితంలో వృత్తిని, ప్రవృత్తిని వాటి కోసం ఏర్పరచిన గుమ్మాల నుండే ప్రవేశింపజేయాలి. అంతేకానీ ఒక గుమ్మం నుండి ప్రవేశించి మరో గుమ్మం నుండి నిష్క్రమించటానికి అనుమతించకూడదు. ఈ చిన్నపాటి సూత్రం తెలిసి ఉంటే చాలు నాయక విజయ రహస్యం తెలుసుకున్నట్లే.
వృత్తి ప్రవృత్తులు కలిస్తేనే సంపూర్ణ జీవనం.. ఆ సంపూర్ణ జీవితాన్ని సాధ్యం చేసుకోగలిగితే మనం నాయకులమే. అయినా జీవితం అనేది ఏ ఒక్క గదికో పరిమితం కాదు. అన్ని గదులలోను శ్వాసించగలగటమే జీవితం. ఆ శ్వాసను సమశ్వాసగా మలచుకోవటమే నాయక విజ్ఞత, నాయకత్వ ప్రతిభ.
‘శ్రోత్రం చక్ష్స్పుర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే’ -అంటుంది గీత. ఈ శ్లోకంలో చెప్పినట్లుగా ఇంద్రియాలను అధిష్ఠించి శబ్దాది విషయాలలో భోగించటం అంటే మానవ జీవనంలో రాణించటమనే అర్థం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, త్రిగుణాలు - అవన్నీ మనం వసించదగ్గ గదులే. అయితే వాటిని మానసిక సంయమనంతో వాసనాయోగ్యాలుగా మలచుకోవటంలోనే నాయకత్వ ప్రతిభ దాగుంది.
*

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946