S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాలజ్ఞానం

ఆ రాత్రి మేరీ తన భర్తకి పుట్టినరోజు బహుమతిగా ఓ వాచీని ఇచ్చింది. దాన్ని చూసి విలియమ్స్ ముచ్చటపడ్డాడు.
‘చాలా బావుంది. ఎక్కడ కొన్నావు? ఇలాంటివి ఇప్పుడు తయారుచేయడం లేదు. నా ఇనీషియల్స్‌లో దొరకడం అద్భుతం’ విలియమ్స్ అడిగాడు.
‘సెకండ్ హేండ్ షాప్‌లో. మీ చేతికి బావుంటుందని కొన్నాను. అదృష్టవశాత్తు దీని వెనుక మీ ఇనీషియల్సే ఉన్నాయి’ ఆమె చెప్పింది.
వాచీని చేతికి పెట్టుకుని పడుకున్న విలియమ్స్ అర్ధరాత్రి గట్టిగా అరుస్తూ లేచాడు.
‘ఏమిటి?’ మేరీ కూడా లేచి అడిగింది.
‘ఓ భర్త తన భార్యని హత్య చేయాలనుకుంటున్నాడు. అతని కంఠం నాకు వినబడింది’
‘పీడ కల. పడుకోండి’ మేరీ చెప్పింది.
మర్నాడు రాత్రి కూడా అతనికి మళ్లీ ఆ కంఠం వినపడింది. తన భార్యని బ్రిడ్జ్ మీంచి నీళ్లల్లోకి తోసి చంపాలని ఉందని, కాని ఎదురుగా చిన్న ద్వీపంలోని జైలుని చూశాక తను అక్కడికి వెళ్లచ్చనే భయంతో ఆ పనిని విరమించుకుని భార్యని ఇంటికి తీసుకెళ్లాడని చెప్పే ఓ భర్త ఆలోచనలు వినిపించాయి. అతనికి భయంతో మెలకువ వచ్చేసింది. మూడో రాత్రి అతనికి హాయిగా నిద్ర పట్టింది. ఉదయం నిద్ర లేచాక టైం చూసుకుందామని అనుకుంటే, చేతికి వాచీ లేదు. అతను మేరీని అడిగాడు.
‘నువ్వు ఆనందంగా ఉన్నావా?’
‘అదేం ప్రశ్న?’ ఆమె ఆశ్చర్యంగా అడిగింది.
‘మనకి పిల్లలు లేరని, నేను సంపాదించేది తక్కువని, ఇలాంటివి నీ ఆనందానికి అడ్డు పడుతున్నాయా? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?’
‘ఇవాళ మీరు ఎందుకింత పిచ్చిగా మాట్లాడుతున్నారు?’ మేరీ ప్రశ్నించింది.
అతను ఆఫీస్‌కి సబ్‌వేలో వెళ్తూ కునుకు తీస్తే మళ్లీ ఆ కంఠం వినిపించింది.
‘పెళ్లైనా ఇన్ని సంవత్సరాలుగా సుఖం లేదు. నా భార్యంటే ద్వేషం తప్ప ప్రేమ లేదు. కాబట్టి ఆమెని చంపి తీరాలి..’
‘ఆపు ఆపు’ విలియమ్స్ గట్టిగా అరిచాడు.
అంతా తన వంక చూస్తూండటంతో సిగ్గుపడుతూ లేచి ఇంకో కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాడు.
ఆఫీస్ నించి ఇంటికి తిరిగి వచ్చాక మేరీతో చెప్పాడు.
‘నా మెదడులో ఎవరో ఉండి నేను నిద్రపోతున్నప్పుడు మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది. నాకు పిచ్చెక్కుతోందా?’
‘లేదు. మీలో ఆ లక్షణాలు లేవు’
‘ఒకోసారి ఇంకో వ్యక్తి మాట్లాడినట్లుగా వినిపించినా నా మనసులోని భావాలే అలా బయటకి వస్తున్నాయేమో? నువ్వంటే నాకు ప్రేమ తప్ప ద్వేషం లేనప్పుడు అలాంటి పిచ్చివి నేను ఎందుకు ఆలోచిస్తున్నాను?’
ఆమె అతని వంక ఆందోళనగా చూసింది.
‘అన్నట్లు నువ్విచ్చిన వాచీ పని చేయడం లేదు’
‘మీరు రెండు రోజులు ఇంట్లో ఉంటే మంచిది. మీ ఆఫీస్‌కి ఫోన్ చేసి మీకు ఒంట్లో బాలేదని చెప్పనా?’ మేరీ అడిగింది.
‘సరే. నిన్న రాత్రి సరిగ్గా నిద్ర లేదు. నిద్ర పోవడానికి భయంగా ఉన్నప్పుడు ఇదే మంచి పని’ అతను ఒప్పుకుని పడక గదిలోకి వెళ్లి పడుకున్నాడు.
* * *
రెండు రోజులు ఏ కలా రాకపోవడంతో మూడో రోజు ఆఫీస్‌కి వెళ్తూ దారిలో రిపేర్ అయిన వాచ్‌ని తీసుకున్నాడు విలియమ్స్.
ఆ రాత్రి పడుకున్న కొద్దిసేపటికి ‘మేరీ’ అని అరుస్తూ లేచాడు.
‘నాకు మళ్లీ ఆ కంఠం వినిపించింది. అతని పేరు వాల్టర్. ఇన్సూరెన్స్ సొమ్ము కోసం తన భార్యని చంపబోతున్నాడు. రెండు రోజులు నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. మళ్లీ మొదలైంది.. నాకు ఎందుకు ఇలా జరుగుతోందో అర్థమైంది. నా చేతికి ఈ వాచీ వచ్చిన రోజే ఇది మొదలైంది. రెండు రోజులు వాచీ పాడై పెట్టుకోకపోతే ఏం కాలేదు. మళ్లీ అది పెట్టుకున్నాక నిద్రలో ఆ మాటలు వినిపించాయి’
నిద్రలోంచి లేచి భార్యతో చెప్పాడు.
‘రేపు ఆమెని చంపబోతున్నాడని అతని ఆలోచన. మెట్ల మీంచి తోసి అది ప్రమాదవశాత్తుగా జరిగినట్లుగా పథకం వేశాడు. ఇది టెలీపతిగా సంబంధించింది అనుకుంటా. లేకపోతే ఎందుకిలా జరుగుతుంది? నేను నిజంగా దాన్ని విన్నానా లేక నా మెదడులో ఏదైనా లోపం ఏర్పడిందా అన్నది తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలోని కోటానుకోట్ల మందిలో ఎక్కడో వాల్టర్ అనే పేరుగలవాడు ఉన్నాడు. అతని భార్య పేరు బెత్. ఈడెన్ అనే ఇంకో ఆమె కూడా ఉంది. ఆమెని పెళ్లి చేసుకోవాలని అతని ఆలోచన. నేను సబ్‌వేలో ఇంటికి వస్తూ కునుకు తీసినప్పుడు అతను భోజనం చేస్తున్నాడు. అంటే న్యూయార్క్‌కి, అక్కడికి మూడు గంటల సమయం తేడా ఉంది. మరోసారి నేను నిద్రపోతున్నప్పుడు అతను సముద్రపు ఒడ్డున సూర్యాస్తమయం చూస్తున్నాడు. అది పసిఫిక్ టైమై ఉంటుంది. అప్పుడు సూర్యాస్తమయం జరిగేది అక్కడే. అతను బ్రిడ్జ్ మీంచి ఓ ద్వీపాన్ని చూశాడు. జైల్‌ని చూస్తున్నానని అన్నాడు’
‘అల్‌కట్రాజ్ జైలై ఉంటుంది’ మేరీ సూచించింది.
‘అవును. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మీంచి దూరంగా ఓ ద్వీపంలో కనపడే జైల్ అదే. శాన్‌ఫ్రేన్సిస్కో! ఆమెని చంపనివ్వను. అతన్ని కనుక్కుని ఆపాలి’
* * *
న్యూయార్క్ నించి విలియమ్స్ విమానంలో శాన్‌ఫ్రాన్సిస్కోకి చేరుకున్నాడు. విమానాశ్రయంలో అతను ఆ నగర టెలిఫోన్ డైరెక్టరీని తిరగేసి వాల్టర్ పేరుతో గల నంబర్లకి ఫోన్ చేసి వాల్టర్ భార్య బెత్‌తో మాట్లాడాలని చెప్పసాగాడు.
‘వాల్టర్ భార్య బెత్? ఆమెతో మీరేం మాట్లాడాలి?’ చివరకి ఒకరు అవతల నించి అడిగారు.
‘ఆమె క్షేమంగా ఉందా?’ విలియమ్స్ ఆతృతగా అడిగాడు.
‘క్షేమమే. మీరు ఎవరు?’ ఆ కంఠం ప్రశ్నించింది.
‘నేను వెంటనే వస్తున్నాను. ఇది వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన విషయం’
అరగంట తర్వాత విలియమ్స్ వాల్టర్ ఇంటి డోర్ బెల్‌ని నొక్కాడు. తలుపు తెరిచిన వ్యక్తిని అడిగాడు.
‘మీరు వాల్టరా?’
‘కాదు. ఆయన మా బావ. మీరేనా ఫోన్ చేసింది?’
‘అవును. ఆయనతో మాట్లాడాలని వచ్చాను.’
‘ఐయాం సారీ. పెద్ద ప్రమాదం జరిగింది’
‘ఏం జరిగింది?’
‘నా చెల్లెలు అవిటిది. వీల్ ఛైర్లోని ఆమెని మెట్ల మీంచి కిందకి తీసుకువస్తూంటే వీల్ ఛెయిర్ జారి నా చెల్లెలు కింద పడిపోయింది. కాని ఆమెకి ఏం కాలేదు. అదే సమయంలో కాలుజారి వాల్టర్ కూడా కిందపడ్డాడు. అతను మరణించాడు.’
విలియమ్స్ నివ్వెరపోయి చెప్పాడు.
‘అది ప్రమాదం కాదు.’
‘మీరు ఎవరు? మీకు ఎలా తెలుసు?’
‘ఈ వాచ్ మీ బావదా?’ దాన్ని చూపించి అడిగాడు.
‘అవును. ఇటీవల ఆయన న్యూయార్క్‌కి వెళ్లినప్పుడు ఎవరో మగ్ చేసి దాన్ని కొట్టేశారు. ఇది మీకెలా దొరికింది?’
‘సెకండ్ హేండ్ షాప్‌లో నా భార్య కొని నాకు ప్రెజెంట్ చేసింది. ఈ వాచ్ మీ చెల్లెలికి ఇవ్వండి’
‘మీరు న్యూయార్క్ నించి ఎందుకు వచ్చారు?’ అతను తెల్లబోతూ అడిగాడు.
‘అది ఇప్పుడు మీకు చెప్పి ప్రయోజనం లేదు. చెప్పినా నమ్మరు కూడా’ విలియమ్స్ వెనుదిరిగాడు.
కొన్ని వస్తువులని స్పర్శిస్తే అరుదుగా అవి వాటి యజమాని మనసులోని ఆలోచనలని టెలీపతిక్ కాంటాక్ట్ ద్వారా ప్రసారం చేయగలుగుతాయి. దీన్ని సైకామెట్రీ అంటారు. సైకామెట్రీ జరిగిన కేసులు అనేకం ప్రపంచంలో నమోదయ్యాయి. వాటిలో విలియమ్స్, వాల్టర్ల ఉదంతం ఒకటి. ఐతే ఆ ఆలోచనలు ఎలా, ఎందుకు ప్రసారం అవుతాయో ఇంత దాకా ఎవరూ కనిపెట్టలేక పోయారు. దీనికి సమాధానం ఆ దేవుడికే తెలియాలి.

- పద్మజ