S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చౌక బేరం

నేను
మేజర్ని మొదటిసారి జైల్లో కలిసాను. శాంతిభద్రతలకి అంతరాయం కలిగించినందుకు నాకు వంద డాలర్ల ఫైన్ విధించారు. దాన్ని చెల్లించలేక పోవడంతో రోజుకి డాలర్ చొప్పున నేను జైలు శిక్షని అనుభవించాల్సి వచ్చింది. ఇంకో డెబ్బై రెండు రోజుల శిక్ష ఉండగా జైలర్ వచ్చి నా సెల్ తలుపు తాళం తీసి చెప్పాడు.
‘నీ పిక్నిక్ పూర్తయింది. ఇక నువ్వు మళ్లీ క్రూరమైన ప్రపంచంలోకి వెళ్లచ్చు’
‘ఇప్పుడా? మీ జైలు వంటవాడు నాకు నచ్చేలా హేష్ బ్రౌన్స్‌ని వండటం ఆరంభించాకా?’ నవ్వుతూ ప్రశ్నించాను.
‘జోక్స్ ఆపు. నీకు బయటికి వెళ్లాలని లేదా?’ ఆయన అడిగాడు.
‘మీరు జోక్ చేయడం లేదా?’ అడిగాను.
ఆయన బదులు చెప్పకుండా తనని అనుసరించమని సౌంజ్ఞ చేసి నడిచాడు.
జైల్ క్లర్క్ నా వ్యక్తిగత వస్తువుల సంచీని ఇచ్చాక అడిగాను.
‘నన్ను ఎందుకు విడుదల చేస్తున్నారు?’
‘నీ మిత్రుడు నీ ఫైన్‌ని చెల్లించాడు’
దూరంగా కూర్చున్న ఓ వ్యక్తి మొహం నన్ను చూడగానే వికసించింది.
‘హలో జేమ్స్! నీ ఫొటో చూడబట్టి నిన్ను గుర్తించాను’
నేను ఆ కొత్త వ్యక్తి వంక ఆసక్తిగా చూశాను.
‘నేను మేజర్ హెన్రీ. యు ఎస్ ఆర్మీలో పని చేశాను. ప్రమోషన్ ఇచ్చే బదులు నన్ను బయటకి పంపించేసారు. అది యు ఎస్ ఆర్మీకి నష్టం. ఇప్పుడు నీకు లాభమైంది. లేదా నేను మిసెస్ పీటర్స్ ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా చేరి ఉండేవాడిని కాను. దాంతో నీ కష్టం గురించి నాకు తెలిసేది కాదు’
అతను నా చేతిని పట్టుకుని బయటకి తీసుకెళ్లాడు.
‘మీరు ఓ అపరిచితుడి ఫైన్‌ని ఎందుకు కట్టారు?’ అతని చేతిని విడిపించుకుని అడిగాను.
‘అది వింతగానే ఉండచ్చు కాని క్రిస్టియన్‌ని ఐన నాలో దాతృత్వ గుణం అధికం’ మళ్లీ నా చేతిని పట్టుకుని చెప్పాడు.
‘ఇతరులు నీకు ఏం చేస్తే అదే జరుగుతుంది అనే నమ్మకం మీలో ఉందా?’
‘కాదు’
‘మీరు నా నించి ఏదైనా ఆశిస్తే మీకు నిరాశే ఎదురవుతుంది. నా దగ్గర డబ్బుంటే ఆ ఫైన్‌ని చెల్లించి ఉండేవాడిని’ నిష్కర్షగా చెప్పాను.
అతను కొద్దిసేపు వౌనంగా ఉండి తర్వాత చెప్పాడు.
‘నువ్వు ఉన్న గదిలోనే నేను అద్దెకి దిగాను. ఇవాళ ఉదయం పోస్ట్‌మేన్ నీ ఉత్తరాన్ని నాకు ఇచ్చాడు’
జేబులోంచి ఓ కవర్‌ని తీసి నాకు ఇచ్చాడు.
‘పొరపాటున దీన్ని తెరిచాను. చదివాకే అది నాది కాదని అర్థమైంది’
కవర్ మీద నా పేరే థామస్ జేమ్స్ అని కనిపించింది. అది మూడు నెలల క్రితం రాసిన ఉత్తరం. రెండు మూడు నా పాత చిరునామాలకి వెళ్లి చివరికి నేను జైలుకి రాక మునుపటి అడ్రస్‌కి చేరింది. దాన్ని చదివాను.
డియర్ మిస్టర్ జేమ్స్,
మీ తాత అర్థర్ వాలెస్ క్రితం నెల పదిహేనో తారీకున మరణించారని తెలియజేయడానికి విచారిస్తున్నాను. ఆయన తన ఆస్తికి నినే్న వారసుడిగా తన విల్లులో పేర్కొన్నాడు. సరైన ఐడి కాగితాలతో మీరు మా ఆఫీస్‌కి వస్తే మిషిగన్ వెకేషన్ లేండ్‌లో గల ఆ ఏడు వందల ఏభై ఎకరాల భూమిని మీ పేర బదిలీ చేస్తాను.
- బైరన్ స్వాబ్
(అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది ఎస్టేట్ ఆఫ్ ఆర్థర్ వాలెస్)
ఏపిల్‌బై, మిషిగన్
నేను తలెత్తి మేజర్ వంక చూస్తే అతను ఆనందంగా నవ్వాడు.
‘మీ తరఫున నేను కొంత రీసెర్చ్ చేసాను. ఆ ప్రదేశం అభివృద్ధి చెందే ప్రాంతం. వేసవి కాటేజెస్‌కి అక్కడ డిమాండ్ ఉంది’
‘సరే మేజర్. మీ డబ్బుతోపాటు కొంత లాభం కూడా కలిపి మీకు ఇస్తాను’ చెప్పి ఆ ఉత్తరాన్ని జేబులో ఉంచుకున్నాను.
‘మంచిది. కొంత అంటే ఎంతో తర్వాత చర్చించుకుందాం. నా సేవ నీకు ఇస్తాను. ముందుగా మనం మిషిగన్‌కి వెళ్లే విషయం ఆలోచించాలి. నీకు అభ్యంతరం లేకపోతే నీ వెంట నేనూ వస్తాను’
నాకు అభ్యంతరం ఉన్నా ప్రయోజనం లేదు. నేను మిషిగన్ వెళ్లాలంటే నాకు ఎవరైనా టిక్కెట్ కొనివ్వాల్సిందే. మేజర్ అందుకు ముందుకు వస్తే ఎలా కాదనగలను?
నేను ఎన్నడూ ఏపిల్‌బై ఊరు చూడలేదు. కాని మా అమ్మ నా చిన్నప్పుడు దాని గురించి చెప్పడంతో నాకు కొంత అవగాహన ఉంది. అది తవాస్-ట్రావెర్స్ ఊళ్ల మధ్య ఎక్కడో ఉంది. మిషిగన్ వెకేషన్ లేండ్ మధ్య అన్నది నేను కొత్తగా వింటున్నాను. అక్కడికి సాజినా నించి బస్‌లో మాత్రమే వెళ్లగలం అని తెలిసాక మేజర్ ఓ కారుని అద్దెకి తీసుకున్నాడు.
‘అది మా అమ్మ స్వగ్రామం. ఐనా నేను అక్కడ ఉండదలచుకోలేదు’ చెప్పాను.
‘నువ్వు అక్కడ ఉండాలని ఎవరూ అడగడం లేదు. భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిపోవచ్చు’
‘అది ఎంత త్వరగా ఐతే అంత మంచిది’
ఏపిల్‌బై పెద్ద బజారులో క్రీడా వస్తువులు అమ్మే షాపులు చాలా కనిపించాయి. దాంతో మేజర్ చెప్పినట్లు అది వేసవిలో చాలా మంది వచ్చి ఆటలాడే ఊరు అనుకున్నాను.
స్వాబ్ ఆఫీస్ ఆ ఊళ్లోని ఏకైక రెస్ట్‌రెంట్ పైన రెండో అంతస్తులో పుస్తకాలు, కాగితాలు అడ్డదిడ్డంగా ఉన్న చిన్న గది. అతను అరవైలలో ఉన్నాడు. మేజర్ స్వాబ్‌కి నన్ను పరిచయం చేశాడు.
‘ఉత్తరం తెచ్చారా?’ స్వాబ్ అడిగాడు.
నేను ఇచ్చిన కవర్లోని ఉత్తరాన్ని చదివి చెప్పాడు.
‘ఇన్ని నెలలుగా రాకపోతే మీకు ఆ వారసత్వపు హక్కు మీద ఆసక్తి లేదని అనుకున్నాను’
‘కారణం లేకుండా ఎవరూ ఆ పని చేయరు. అతను కాదడానికి కారణం లేదు. నేను జేమ్స్‌ని వెదికి పట్టుకోడానికి కొంత టైం పట్టింది’ మేజర్ చెప్పాడు.
‘మీరు మీ బర్త్ సర్ట్ఫికెట్‌ని, ఐడెంటిటీ కార్డ్‌ని తెచ్చారని అనుకుంటాను?’ స్వాబ్ చెప్పాడు.
వాటిని ఆయనకి ఇచ్చాను. వాటిని పరిశీలించి తల ఊపి తిరిగి ఇస్తూ చెప్పాడు.
‘సరిగ్గానే ఉన్నాయి. ఇప్పుడు ఫార్మల్‌గా ఆ భూమిని మీ పేర బదిలీ చేయడమే’
అతను డ్రాయర్ తెరచి, అందులోంచి కొన్ని ఫారాలని తీసి, వాటిని నింపి చెప్పాడు.
‘ముందుగా మీకు చెప్పాలి. మీకు కొంత డబ్బు ఖర్చవుతుంది’
‘నాకు తెలుసది. రండి మేజర్. వెళ్దాం’ నేను కోపంగా మేజర్ చేతిని పట్టుకుని చెప్పాను.
‘అంత త్వరగా కాదు. ఇంత దూరం వచ్చాం కాబట్టి ముందుగా దేనికి, ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం’ మేజర్ నన్ను ఆపాడు.
‘టేక్స్‌లు ఈ సంవత్సరాంతం దాకా చెల్లించబడ్డాయి. అడ్మినిస్ట్రేటర్‌గా నా ఫీజ్ ఆర్డర్ ముందే చెల్లించాడు. కాబట్టి రికార్డర్స్ ఫీజుగా నాకు ఇరవై డాలర్లు చెల్లించాలి’
‘అది అంత పెద్ద మొత్తం కాదు’ చెప్పి మేజర్ జేబులోంచి రెండు పది డాలర్ల నోట్లని తీసి స్వాబ్‌కి ఇచ్చి చెప్పాడు.
‘నేను ఇక్కడ కోర్ట్‌లో డిప్యూటీ క్లర్క్‌ని, రికార్డర్‌ని కూడా’
నింపిన ఫారం మీద నేను సంతకం చేశాక అఫీషియల్ సీల్‌ని వేసి దాన్ని మేజర్‌కి ఇస్తే ఆయన నాకు అందించాడు. నేను దాన్ని పైపైన చదివి మడిచి కోట్ జేబులో పెట్టుకున్నాను.
‘ఈ పని పూరె్తైంది కాబట్టి ఇప్పుడు నేను, నా మిత్రుడు ఆ ఆస్థిని చూడాలని అనుకుంటున్నాం. అక్కడికి ఎలా వెళ్లాలో దయచేసి చెప్తారా?’
‘తప్పకుండా. ఊరికి ఈశాన్యం వైపు రోడ్‌లో ఐదు మైళ్లు వెళ్తే అక్కడ ఉండే ఏకైక చిత్తడి నేలే అది’
‘అంటే నేను ఇంత దూరం వచ్చింది ఓ బురదగుంటకి వారసుడు అవడానికా?’ ప్రశ్నించాను.
‘బురద నేల అన్నది బరువైన పదం. చిత్తడి నేల అనచ్చేమో? చలికాలం అక్కడ అంతా గడ్డ కడుతుంది’
‘అది కొంత విలువైంది కదా?’ మేజర్ అడిగాడు.
‘విలువైందే. కాకపోతే కొనేవాడే దానికి విలువ కట్టాలి. కాని కొనేవాడు దొరకడం కష్టం అనుకుంటా. ఎందుకంటే ముందా నీటిని తోడేసి పొడి నేలగా మార్చాలి. ఏడెనిమిదేళ్ల క్రితం మీ తాత ఆర్థర్ బే సిటీ నించి ఇంజనీర్లని రప్పించాడు. అది లాభం లేని పనని వాళ్లు చెప్పారు. భూమి విలువ కన్నా నీటిని తోడటానికి ఎక్కువ ఖర్చు చేయాలి’
‘ఆ భూమికి విలువ లేకపోతే మీరు ఇంత దూరం నన్ను ఎందుకు రప్పించినట్లు?’ చిరుకోపంగా అడిగాను.
‘ఎస్టేట్ అడ్మినిస్ట్రేటర్‌గా అది నా బాధ్యత. చట్టప్రకారం నేనా సంగతి మీకు తెలియజేయాల్సి ఉంది. ట్రాన్స్‌ఫర్ ఫీజ్ చెల్లించడానికి ముందే చెప్పి ఉండాల్సింది. కాని నాకీ విషయం తోచలేదు’ స్వాబ్ చెప్పాడు.
‘తోచదు. ఎందుకంటే మీరు ఇరవై డాలర్ల కోసమే నన్ను రప్పించారు’ విసురుగా చెప్పాను.
ఇద్దరం బయటకి నడిచాం. నేను మేజర్‌తో చెప్పాను.
‘సారీ! ఈ వ్యవహారంలో బహుశ మీరు నష్టపోయినట్లున్నారు’
‘కావచ్చు. కాని కొంత ప్రయత్నం చేయకుండా నేను ఓటమిని అంగీకరించను. ఈ రాత్రి ఇక్కడే ఉందాం’ మేజర్ చెప్పాడు.
మా హోటల్ గదికన్నా జైలు గదే మాకు సౌకర్యంగా అనిపించింది.
* * *
మర్నాడు ఉదయం మేజర్, నేను ఆయన కారులో వెళ్లి ఆ చిత్తడి నేలని చూశాము. దారిలో ఎక్కడా రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ సూచనలు కనపడలేదు. దాన్ని కొనే ముందు చూడటానికి ఎవరు వచ్చినా దాన్ని కొనడానికి సుముఖంగా ఉండరని ఇద్దరం అనుకున్నాం. మేజర్ తిరుగు దారిలో ఏదో ఆలోచించసాగాడు. నేను మాట్లాడబోతే వౌనంగా ఉండమన్నట్లుగా సైగ చేశాడు. ఆయన కారు రెస్ట్‌రెంట్ బయట ఆగితే అందులోకి వెళ్తామని అనుకున్నాను. కాని మేజర్ రెండో అంతస్థులోని స్వాబ్ ఆఫీస్ గదికి దారి తీశాడు. ఆయన్ని నేను అనుసరించాను.
‘హలో’ స్వాబ్ మమ్మల్ని చూసి ఆదరంగా విష్ చేశాడు.
‘స్వాబ్. మీకు పదిహేను వేల డాలర్లు వచ్చే ఏర్పాటు చేస్తే అందులో మాకు ఎంత ఇస్తారు?’ మేజర్ ఆయన్ని అడిగాడు.
‘ఎలా వస్తాయి?’ అతను వెంటనే అడిగాడు.
‘చట్టబద్ధంగా’
‘పది శాతం?’
‘ముగ్గురికీ సమానం. నా మిత్రుడు కూడా ఈ స్కీమ్‌లో భాగస్వామి’
‘సరే. విషయం ఏమిటి?’
‘డెట్రాయిట్ టెలీఫోన్ డైరెక్టరీ లోని పదిహేను వందల మందికి జేమ్స్ సంతకంతో ఉత్తరాలని పంపాలి. మిషిగన్ వెకేషన్ లేండ్ మధ్యలో వాళ్లు ఓ ఎకరం ఓ దాత నించి ఉచితంగా పొందుతున్నారని, నెలాఖరులోగా వారి పేరు మీద బదిలీ చేయించుకోకపోతే అది జాబితాలోని తర్వాతి పేరు వారికి బదిలీ చేయబడుతుందని మీరు అందులో రాయాలి...’ మేజర్ మొత్తం పథకాన్ని వివరించాడు.
స్వాబ్ కొద్దిసేపు ఆలోచించి అందుకు అంగీకరిస్తూ చెప్పాడు.
‘మీరు చెప్పినట్లు ఇది చట్టబద్ధమైందే’
మేజర్ ఆ మేరకి స్వాబ్‌తో రాతపూర్వకంగా అగ్రిమెంట్ చేశాడు.
పదిహేను వందల మందిలో ఎనిమిది వందల ఏభై మంది ఆసక్తి చూపించారు. ఏడు వందల ఏభై మంది దగ్గర తలకి ఇరవై డాలర్ల చొప్పున ట్రాన్స్‌ఫర్ ఫీజ్‌గా మొత్తం స్వాబ్ పదిహేను వేల డాలర్లని ఆ చిత్తడి నేల మీద సంపాదించాడు. నేను అందరికీ ఒకో ఎకరాన్ని బదిలీ చేశాను. ఇరవై డాలర్లకే ఓ ఎకరం నేల వచ్చినందుకు వారంతా సంతోషించారు. అందులో నా భాగంగా ఐదు వేల డాలర్లు నాకు వచ్చాయి. అమ్ముడు కాని ఆ నేల మీద అంతా బాగుపడే పథకాన్ని వేసి మేజర్ అందరికీ గొప్ప మేలు చేశాడు.
*

రాబర్ట్ ఎడ్వర్డ్ ఎకెల్స్ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి