S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పీడకల

1886.
లివర్‌పూల్.
జనరల్ స్టోర్ని నడిపే ఓ వ్యక్తి మరణించడంతో అతని పిల్లలు స్టీవెన్స్, అతని తమ్ముడు మార్క్స్ తండ్రి ఆస్తికి వారసులు అయ్యారు.
ఓ రోజు మార్క్ తన బాల్య స్నేహితురాలిని ఇంటికి ఆహ్వానించి భోజనం దగ్గర స్టీవెన్స్‌తో చెప్పాడు.
‘స్టీవీ! నేను రోజ్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం’
‘కంగ్రాచ్యులేషన్స్’ స్టీవెన్స్ చెప్పాడు.
‘నేను, రోజ్ ఈ ఇంట్లో కొనసాగాలని అనుకుంటున్నాం. నాన్న విల్లు ప్రకారం ఇల్లు ఇద్దరిదీ...’
‘నా భాగం కూడా నువ్వే తీసుకో. నేను ఎటూ చచ్చిపోతాను. మీకు తెలుసుగా. ప్రతీ రాత్రి కల్లో ఓ మనిషి నన్ను కత్తితో చంపడానికి వస్తున్నాడు. అతని మొహం నాకు నా మొహంలా బాగా పరిచయం. అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. విధిని ఎవరూ తప్పించుకోలేరు. అందుకు అన్నీ సమకూరుతాయని నా నమ్మకం’ స్టీవెన్స్ చెప్పాడు.
‘ఎందుకలా మాట్లాడతావు? నువ్వెవరి సహాయమైనా కోరచ్చుగా?’ అతని కలల గురించి తెలిసిన రోజ్ సూచించింది.
ఎప్పటిలానే ఆ రాత్రి కూడా స్టీవెన్స్ నిద్ర పోబోయే ముందు జీసెస్‌ని ప్రార్థించి పడుకున్నాడు. కాని ఆ మొహం మనిషి కత్తితో తన వైపు వస్తూ కల్లో కనిపించడంతో భయంతో లేచాడు.
* * *
స్టీవెన్స్ ఆ ఊళ్లోని ఓ ప్రఖ్యాత వృద్ధ చిత్రకారుడి దగ్గరికి వెళ్లి అడిగాడు.
‘ఇక్కడికి రాని ఓ మనిషి మొహం మీరు గీయగలరా?’
‘ప్రయత్నిస్తాను. అందమైన యువతా?’ ఆయన అడిగాడు.
‘కాదు. ఓ మగవాడిది’
‘అతన్ని తెస్తే పావుగంటలో. ఫొటో ఇస్తే గంటలో గీసేస్తాను’
‘కాని అతను ఇక్కడికి రాడు. నా కల్లో వచ్చే మొహం అది. వర్ణిస్తే గీస్తారా?’
ఆయన టేబిల్ ముందు నిలబడి పెన్సిల్, కాగితం అందుకుని స్టీవెన్స్ చెప్పినట్లుగా గీయసాగాడు.
‘వెడల్పైన మొహం.. నల్లటి క్రూరమైన కళ్లు... పొడుగాటి ముక్కు, చిన్న నోరు స్వార్థపూరితంగా కనిపిస్తుంది. సగం బట్టతల...’
గడ్డం కూడా ఎలా ఉంటుందో స్టీవెన్స్ వర్ణిస్తూంటే దాన్ని చిత్రకారుడు గీశాడు. పూర్తయ్యాక స్టీవెన్స్ చిన్నచిన్న మార్పులని చేయించి తృప్తిగా చెప్పాడు.
‘నేను చెప్పినట్లు చక్కగా గీశారు. కల్లో నన్ను బాధపెట్టే మొహం ఇదే.’
* * *
‘నేను ఇన్‌స్పెక్టర్‌కి దీన్ని చూపించాను. ఇతను పాత నేరస్థుడు కాదు’ ఆ చిత్రాన్ని తిరిగి ఇస్తూ పోలీసు కానిస్టేబుల్ చెప్పాడు.
‘కాని ఇతను నన్ను చంపబోతున్నాడు అని చెప్పాగా?’ స్టీవెన్స్ ఆందోళనగా చెప్పాడు.
‘పోలీసులు ఏ ఫిర్యాదునీ సాక్ష్యం లేకుండా తీసుకోరు. అందుకు సాక్షుల్ని తీసుకువస్తే కేస్‌ని పరిశీలిస్తాం. ఒట్టి మాటలతో మా సమయాన్ని వృధా చేయకండి’ అతను విసుగ్గా చెప్పాడు.
అప్పటి నించి స్టీవెన్స్ ప్రతీ రాత్రి లివర్‌పూల్ లోని బార్లకి వెళ్లి అక్కడికి కస్టమర్స్‌కి ఆ చిత్రాన్ని చూపించి ‘ఆ వ్యక్తిని వాళ్లు ఎక్కడైనా చూశారా?’ అని అడగసాగాడు. అంతా చూడలేదనే చెప్పారు.
ఓ రోజు ఆ బార్లోకి వచ్చిన నలుగురు నావికులకి ఆ చిత్రాన్ని చూపించాడు.
‘ఇది ఎక్కడిది?’ ఒకరు అడిగారు.
‘ఇతన్ని మీరు చూశారా?’ స్టీవెన్స్ అడిగాడు.
‘ఇతనితో నీకేం పని?’ అతను మళ్లీ అడిగాడు.
‘ఇతను నన్ను చంపబోతున్నాడు’
‘నిజంగా? దేనికి? నేను ఇతన్ని ఎక్కడో చూసిన గుర్తుంది. ఎక్కడ...’
‘దయచేసి గుర్తు తెచ్చుకోండి’ స్టీవెన్స్ అభ్యర్థించాడు.
అతను నవ్వుతూ ఆ చిత్రం మీద విస్కీ పోశాడు. మిగతా ముగ్గురూ అతని చేత బలవంతంగా తాగించారు.
* * *
మెలకువ వచ్చేసరికి తను లివర్‌పూల్ నించి న్యూయార్క్‌కి వెళ్లే ఓడలో ఉన్నాడని గ్రహించాడు. బార్లో తారసపడ్డ నావికులు తనని అందులోకి చేర్చారని అర్థమైంది.
‘మీరు స్పెయిన్ ఓడలో ఉన్నారు. చాలా నెలలు మనం ప్రయాణం చేస్తాం. కెప్టెన్ పగారో ఇక్కడ అధికారి. ఈ ఓడ స్పెయిన్ దేశంతో సమానం. ఆ దేశ చట్టాలన్నీ ఈ దేశానికి వర్తిస్తాయి. మీ అధికారులు చెప్పింది విని మీ పనులని చేస్తూంటే మీరు భయపడాల్సిన పని లేదు’ బలవంతంగా తీసుకురాబడ్డ నలుగురితో ఓ అధికారి చెప్పాడు.
‘గత రాత్రి నలుగురు నన్ను బార్లో బాగా తాగించి మోసం చేసి ఇందులోకి తీసుకువచ్చారు’ ఒకరు చెప్పారు.
అక్కడికి వచ్చిన ఆ వ్యక్తిని చూసి స్టీవెన్స్ వణికిపోయాడు.
తనకి కల్లో కనిపించిన వ్యక్తి మొహం అదే!
ఇందాకటి అధికారి అందరి వృత్తులని అడిగి ఆయనకి స్పేనిష్ భాషలో చెప్పసాగాడు. షాక్‌లో ఉన్న స్టీవెన్స్ ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. కెప్టెన్ అతన్ని దీర్ఘంగా చూసి వెళ్లిపోయాడు.
స్టీవెన్స్ కెప్టెన్‌ని చూసినప్పుడల్లా భయంతో వణికిపోతూనే ఉన్నాడు. ఓ రాత్రి స్టీవెన్స్ ఒక్కడే డెక్ మీద డ్యూటీలో ఉండగా కెప్టెన్ పగారో అక్కడికి ఇన్‌స్పెక్షన్‌కి వచ్చాడు. స్టీవెన్స్ వెంటనే లైఫ్ బోట్ తెడ్డుని అందుకుని వెనక నించి అతని తల మీద బలంగా మోదాడు. అతని శవాన్ని సముద్రంలోకి నెట్టబోతూ మొహాన్ని చూస్తే అతను కెప్టెన్ కాదు! అలాంటి గడ్డం గల మరో నావికుడు.
ఆ నావికుడు మాయం అవడం, స్టీవెన్స్ రాత్రి డ్యూటీలో ఉన్నచోట రక్తపు మరకలు చూసి మర్నాడు ఉదయం అతనే హంతకుడిగా నిర్ణయించిన కెప్టెన్ పగారో అతనికి ఉరిశిక్షని విధించాడు. స్టీవెన్స్‌ని ఉరికంబానికి ఎక్కించబోయే ముందు లివర్‌పూర్ నించి తీసుకురాబడ్డ వారిలోని ఒకతనికి ఓ ఉత్తరాన్ని ఇచ్చి చెప్పాడు.
‘నువ్వు లివర్‌పూల్ వెళ్లినప్పుడు దీన్ని నా తమ్ముడు మార్క్‌కి ఇచ్చి నా కల అబద్ధం కాదని, అది నిజమైందని చెప్పు’
స్టీవెన్స్ మెడ చుట్టూ ఉరి తాడు కట్టినా కలలో కలిగిన లాంటి మృత్యుభయం కలగలేదు. కలలో లాగా కెప్టెన్ కత్తిని పట్టుకుని స్టీవెన్స్ వంక చూస్తూ, అతని వైపు నడిచాడు. తలారికి సైగ చేయగానే అతని కాళ్ల కింద ఆధారాన్ని తీసేసారు. కెప్టెన్ పగారో కొద్దిసేపట్లో ఆ ఉరి తాడుని చేతిలోని కత్తితో కోయగానే స్టీవెన్స్ శవం సముద్రంలో పడిపోయింది.
స్టీవెన్స్ ఉరి తీయబడ్డ సంవత్సరం తర్వాత మార్క్‌కి ఆ ఉత్తరం అందింది. ఆ ఓడ కెప్టెన్ వివరాలు తెలుసుకుని మార్క్ అతన్ని ముఖాముఖీ కలిశాడు. ఆయనది అచ్చం స్టీవెన్స్ వర్ణించిన మొహమే. స్టీవెన్స్ కల గురించి తనకేం సంబంధం లేదని, తన కలలోకి ఎన్నడూ స్టీవెన్స్ రాలేదని ఆయన చెప్పాడు.
ఓ మనిషి కల ద్వారా తనకి జరగబోయేది ముందుగా తెలుసుకోగలడా? స్టీవెన్స్ కలలోని మొహం గురించి అనే్వషించి ఉండకపోతే అతనా ఓడలోకి చేరి మరణించి ఉండేవాడు కాదు. లేదా విధే ఈ ఏర్పాటు చేసిందా? ఈ ప్రశ్నలకి జవాబు దేవుడికే తెలియాలి.

- పద్మజ