S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అలా జరిగింది!

‘హుమ్...’ ఇరవై ఒకటవసారి నిట్టూర్చింది రాజేశ్వరి. ప్రస్తుతం ఆమెను ‘అభిమాన వైరాగ్యం’ పట్టి బాధిస్తోంది. అభిమాన వైరాగ్యమనేది ప్రేమాభిమానాల మీద వైరాగ్యమో లేక తన అభిమానం దెబ్బ తినడం వల్ల వచ్చిన వైరాగ్యమో కావచ్చు.
‘ఇంటి నుండి బయల్దేరేప్పుడే అపశకునాలు ఎదురయ్యాయి. ఈ ట్రైనొకటి.. రాహుకాలంలో బయల్దేరింది. నేనె్చప్తూనే ఉన్నా.. ఈ ప్రయాణం వద్దని. అందులోనూ పిల్లనేస్కొని నేనొక్కదాన్నీ..’ భర్త మీద గొంతు దాకా కోపం వచ్చేసిందామెకు. ఒళ్లో పడుకోనున్న పాప కదలడంతో, ఆ అమ్మాయిని కొంచెం సర్ది, సరిగా పడుకోబెట్టుకుని జుట్టుని సవరించింది.
‘పాపం.. నా గొడవలో నేనుండిపోయి అమ్ములుని పట్టించుకోనే లేదు. నాలుగు ముక్కలు గొణికి, నేను వినకపోయేసరికి గమ్ముగ నిద్రపోయింది’ నీరసపడి పోయింది రాజేశ్వరి.
తమ వెనకాల సీటులో కూర్చొని వున్న నలుగురు కుర్రాళ్లు కారణం లేకపోయినా విరగబడి నవ్వుతున్నారు.
‘హయ్యో.. నవ్వండి నాయన్లారా.. నవ్వండి. తెలీనితనం.. ఏం ఎగిరెగిరి పడుతున్నారు! మీకు ఇప్పుడు అర్థం కాదు. ఓ ఆరేడు సంవత్సరాల తర్వాత ఈ గుంపులో ఒకడు ఎదురయ్యి ‘ఎవరండీ మీరు.. గుర్తుకు రావడం లేదే’ అన్నప్పుడు ఏమవుతాయి. ఈ ఇకయికలూ పకపకలూ.. వెర్రి స్నేహాలు ... ‘హు..’ వాస్తవాల్ని, నిత్యసత్యాల్ని వాళ్లకు బోధించాలన్నంత కసి ఏర్పడ్డా ‘వాళ్లు వినే రకం కాదు. ఎవడికి వాడి అనుభవంలోకి రావాల్సిందే’ అని సరిపుచ్చుకుంది రాజేశ్వరి.
‘అయినా నన్నింత బాధపెట్టి ఆ నందిని ఏం బావుకుంటుంది. అనుభవిస్తుంది’ అని మనసులో అనుకుంది.
ఇంతలో ఒంగోలు స్టేషనొచ్చింది. యధాలాపంగా దూరంగా కూర్చొని వున్న నందిని వైపు చూసింది, రాజేశ్వరి. కూల్‌డ్రింక్ టిన్ కొంటుందామె.
‘అబ్బో... బాగా సంపాదిస్తున్నదల్లే ఉంది. అయినా తను సంపాదిస్తూందో.. మొగుడు సంపాదనో.. ఆ పక్కన కూర్చున్నతను మొగడయ్యుంటాడా? ఏమో అన్పిచ్చట్లా... ఏం ఫ్యాషనబుల్‌గా ఉన్నారో! జీన్సూ.. టీ షర్టూ ఆపైన జుట్టు కత్తిరింపొకటి. మొత్తం మీద అందంగా ఉంది. హు.. ఎంతందంగా ఉంటేయేం? సంస్కారం ఉండక్కర్లేదూ? ట్రైన్ ఎక్కి బ్యాగులు సర్దుతున్నానో లేదో ఈవిడ కనిపించింది. ఎంత అభిమానంగా పలకరించానూ.. ‘నందినీ.. బావున్నావా?’ అని గట్టిగా అరిచి మరీ. దానికేమంది! మొహమాటపు నవ్వొకటి పడేసి ముఖం తిప్పుకుంది.
‘రాజీ.. నువ్వా.. ఎలా ఉన్నావే?..’ అని పరిగెత్తుకు రాపనే్లదూ? అంతేలే.. ఈ కలికాలంలో ఎవరికెవరో!
ఓ మహానుభావుడు చెప్పకనే చెప్పాడు ‘ఆత్మీయత.. అనుబంధం అంతా ఒక నాటకం’ అని.. నేనే పిచ్చిమొద్దుని.. ఎవరెలాంటి వాళ్లో తెలుసుకో పనే్లదూ!
అయినా... ఈ నందినీ నా క్లాస్‌మేటే గాని ఎక్కడ కూర్చునేది? నా బెంచీ కాదే! దూరపు బెంచీలో కూర్చునేదా?.. అందుకే కాబోలు నన్ను గుర్తు పట్టలేదు. ఒకే బెంచీ కాకపోతే ఏం? చోద్యం.. గుర్తు పట్టలేరా యేం? నేను తనని గుర్తుపట్లా.. అయినా నాలాగా అందరూ ఉండొద్దూ.. నేనంటే అందరిపట్లా అభిమానం, ఆప్యాయతా ఉన్నదాన్ని.. నాలా అందరూ ఉండొద్దూ!’
మళ్లీ ఓసారి నందిని వైపు చూసింది రాజేశ్వరి ‘ఏ మాటకామాట చెప్పుకోవాలి. ఈ నందిని నాకంటే ఐదేళ్లు చిన్నదిగా కనిపిస్తోంది. పెళ్లయిందో లేదో! పిల్లలున్నారో లేదో? అయినా ఏం స్మార్ట్‌లే.. ఆ జీన్సూ, బూటూ నాకూ తగిలిస్తే నేనూ ఓ మోస్తరు ఉండబోనూ?’
‘్ఛఛీ... ఎంతసేపూ ఆవిడ గురించేనా? ఇంక ఆ వైపు చూడకూడదు. ఒట్టు..’ అనుకుంది రాజేశ్వరి.
కిటికీలోంచి మొహం దూర్చినట్టు పెట్టేసి బైటకు చూడ్డం మొదలుపెట్టింది.
‘నేనంటే లెఖ్ఖ లేనప్పుడు నేనెందుకు ఆలోచించాలి’ అనుకుంటూ.
బైట రాజేశ్వరికి పచ్చటి పొలాలు కనిపించాయి. వరి, అరటి, పసుపు ఎకరాలకు ఎకరాలు.. రకరకాలు రంగుల్తో నేలపై కాలపురుషుడు ఓపిగ్గా చిత్తరువేదో గీసినట్టుంది. ఆ చిత్రాన్ని చిత్రంగా అనిపించి అలానే చూస్తూండి పోయింది రాజేశ్వరి.
ఆమెకు నెల క్రితం చూసిన రాయలసీమ గుర్తొచ్చింది. ముళ్లకంపలూ, నల్లబండలూ.. ఎండిన కొట్టాలు.. ఎవరో ప్రయత్నించి మంచి బొమ్మ మీద దుమ్ము పోసినట్లు... ‘కష్టాలలో నుంచే కొట్లాడే మనస్తత్వం పుట్టుకొస్తుంది.. పప్పూ బువ్వా చేతిలో పడితే అందరూ బుద్ధిమంతులే..’ అనుకుంది రాజేశ్వరి.
ఇంతలో రైలు చీరాలలో ఆగింది. స్టేషనులోని శబ్దాలకు పాపలేచి కూర్చుంది. పాపను ఇంతసేపూ పట్టించుకోనందుకు రాజేశ్వరి బాధపడింది. బండి మీద తినుబండారాలు అమ్ముకుంటున్న అతన్ని కేకేసి చాక్లెట్టు కొనిపెట్టింది - కిటికీలోంచి కనపడే దృశ్యాల్ని పాపకు చూపిస్తూ. పాప అడిగే వాటికి సమాధానాలివ్వసాగింది.
చీరాలలో ఎక్కిన ఒక నవ దంపతులు రాజేశ్వరి ఎదురు సీట్లో కుదురుకున్నారు.
నిమిషం వృధా కాకూడదన్నట్లు ఒకరి మీద ఒకరు ప్రేమ ఒలకబోసుకుంటున్నారు. ఇదే సినిమా అయ్యుంటే...
‘క్షణం క్షణం.. అనుక్షణం
నాతో నువ్వు..
కన్నుల ముందర ప్రత్యక్షంగానో...
మనస్సు కిటికీలోంచి పరోక్షంగానో..’ అన్న పాట పాడేసి, డ్యూయెట్టాడేసుకుంటారు వీళ్లు.
వాళ్లను చూసే కొద్దీ రాజేశ్వరిలోని అభిమాన వైరాగ్యం ఉవ్వెత్తున ఎగసిపడసాగింది. ఇలాంటి వాళ్ల మీద ఓ జోక్ ఉండనే ఉంది. ‘మొదటి సంవత్సరం అమ్మాయి అబ్బాయి మాట వింటుందట. రెండవ సంవత్సరం అబ్బాయి అమ్మాయి మాట వింటాట్ట ఆ తర్వాత.. వీరి ఇద్దరి మాటలు ఊరంతా వింటార్ట..’ విపరీతం కాకపోతే ప్రపంచంలో వీళ్లొక్కళ్లకే పెళ్లయినట్లు.. హు..’ అనుకుంది రాజేశ్వరి. పచ్చకామెర్ల సామెతలా, బుర్రనిండా వైరాగ్యం నిండి వున్న రాజేశ్వరి విపరీత ధోరణిలో పడింది.
విజయవాడ స్టేషన్ దగ్గర పడటంతో బ్యాగు కిందికి దించింది రాజేశ్వరి. పాప కాళ్లకు చెప్పులు తగిలించి, బెల్టు సరిచేసింది. నందిని వైపు ఇక ఆమె చూడదలచుకోలేదు. ప్లాట్‌ఫామ్ రావడంతో రాజేశ్వరి, పాప ఇద్దరూ కిటికీ నుంచి బైటకి చూడసాగారు.
‘నాన్నా...’ అంటూ కిటికీ నుండి చెయ్యూపింది పాప. రైలు నుండి పాపను దింపుకుని ఎత్తుకున్నాడతను. నాన్నను చూడంగానే ముచ్చట్లు మొదలుపెట్టేసింది పాప. చేతులూపుతూ, కళ్లు తిప్పుతూ మాటలు చెప్తోంది. వాళ్లిద్దరి వెనకాల బ్యాగు పట్టుకుని నడవసాగింది రాజేశ్వరి. ఎప్పుడూ గలగల మాట్లాడే రాజేశ్వరి పరధ్యానంగా ఉండటాన్ని గమనించాడు ఆమె భర్త.
‘ఏం రాజీ అలా ఉన్నావ్? ప్రయాణం బానే జరిగింది కదా!’ ఆటో ఎక్కాక నెమ్మదిగా అడిగాడతను.
‘ఊ బానే జరిగింది’ ముక్తసరిగా అంది రాజేశ్వరి.
‘మరింకేంటి?’ అడిగాడతను.
‘ఏం లేదు. రైల్లో నా క్లాస్‌మేట్ ఒకమ్మాయి కనిపించింది. ఆప్యాయంగా పలకరిస్తే.. గుర్తు పట్టనట్లుగా ఉండిపోయింది. బాగా డిస్ట్రబ్ అయ్యాను. మనుషులంతా అంతే. అవసరం మేరకే స్నేహాలూ నవ్వులూనూ. అంతటా స్వార్థం పెరిగిపోయింది. ప్రేమలూ, అభిమానాలూ కరువయ్యాయి..’ రాజేశ్వరి వాక్ప్రవాహానికి అడ్డుపోతే ఏం జరుగుతుందో తెలుసున్నవాడు కాబట్టి రాజేశ్వరి వాళ్లాయన మిన్నకుండిపోయాడు. అది కూడా బాధే ఆమెకు. ‘ఎంత పని జరిగింది!.. ఇంతగా అవమానించిందా?.. పురుగులు పడిపోదూ’ అని అతడు అనుంటే ఆమెకు సపోర్టింగ్‌గా ఉండేది.
ఇల్లు రావడంతో మాటలకు బ్రేకు వేసి, బ్యాగు తీసుకుని లోపలికి నడిచింది రాజేశ్వరి. కాళ్లు చేతులు కడుక్కుని పాలు స్టవ్ మీద ఉంచింది. ఈ లోపు టీవీ పెట్టి ఛానెల్స్ మారుస్తూ ఉన్నాడు రాజేశ్వరి వాళ్లాయన. హాల్లోకి వచ్చిన రాజేశ్వరి యధాలాపంగా టీవీ వైపు చూసింది. అది తాను క్రమం తప్పకుండా చూసే సీరియల్. చూడ్డమే కాకుండా పక్కింటి వాళ్లతో, స్నేహితులతో ఈ సీరియల్ గురించిన ముచ్చట్లు జరుగుతూనే ఉంటాయి. విశే్లషణలూ, విమర్శలూ, సుదీర్ఘ చర్చలూ ఈ సీరియల్ పైనే. అందులో హీరోయిన్ ముఖం స్క్రీన్ అంతా కనిపిస్తోంది. కడివెడు కన్నీళ్లతో, భారీ డైలాగులు చెప్తూంది. ఆమెను చూడగానే రాజేశ్వరి తెరలు తెరలుగా నవ్వడం మొదలు పెట్టింది. సెంటిమెంటు సీనుకి కామెడీగా కనెక్ట్ అవడం చూసి కన్ఫ్యూజ్ అయ్యాడు రాజేశ్వరి వాళ్లాయన.
‘ఏమయ్యింది రాజీ...’ అని అయోమయంగా చూస్తున్న భర్తను చూసి ఆమెకు నవ్వు ఇంకా ఎక్కువైంది. ఇక నవ్వలేక పొట్ట పట్టుకొని సోఫాలో కూలబడింది.
‘ఆమె.. ఆ హీరోయిన్.. నందిని’ అంది.
‘అయితే’ అన్నాడతను.
‘నేను రైలులో కనిపించిందని చెప్పిన క్లాస్‌మేట్ ఈవిడే.. రోజూ ఈ నందినిని చూసీ చూసీ.. ఆలోచించి, ఇవ్వాళ రైల్లో కనపడంగానే ‘నాకు బాగా తెలిసిన అమ్మాయి’ ‘నా క్లాస్‌మేట్’ అని ఫిక్స్ అయిపోయాను.’ అక్కడక్కడా నవ్వు ఆపుకుంటూ చెప్పింది రాజేశ్వరి.
‘సీరియల్స్ మన జీవితంలో భాగాలయ్యాయి’ నవ్వుతూ అన్నాడు రాజేశ్వరి భర్త.
*

-యస్.వి.యమ్.నాగ గాయత్రి
9440465797
ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా, సిఎబి
నెల్లూరు.

-యస్.వి.యమ్.నాగ గాయత్రి