S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నర్సరీ రూమ్

‘పొరపాటు. అవి బొమ్మలు కావు. నర్సరీలో బొమ్మలే కాక మరి కొన్ని కూడా ఉన్నాయి. ఇదివరకు అద్దెకి ఉన్నవాళ్లు వాటి వల్లే
ఇల్లు ఖాళీ చేసేశారు. అర్ధరాత్రి పిల్లల
బాధాకరమైన ఏడుపులు ఆ గదిలోంచి వాళ్లకి వినిపించేవి’ సాంగ్ చెప్పాడు.
‘అంటే ఆ గదిలో పిల్ల దెయ్యాలు
ఉన్నాయంటావా?’ పాల్ అడిగాడు.

ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా వింత సంఘటన జరిగిందా? తర్వాత దాని గురించి ఎవరికైనా చెప్తే మిమ్మల్ని వాళ్లు మూర్ఖులుగా భావిస్తారని అనిపించిందా? ఐతే మీలాంటి వారు మరొకరు ఉన్నారు.
ఇది జెన్నిఫర్, రోజ్, మేరీ అనే బొమ్మలకి సంబంధించిన సంఘటన. ఇది శాన్‌ఫ్రేన్సిస్కోలో ఇరవయ్యవ శతాబ్దం మొదట్లో జరిగింది. డెన్వర్‌కి చెందిన పాల్ భార్య ఓ ప్రమాదంలో మరణించింది. దాంతో వారి కూతురు ఏన్ డిప్రెషన్‌లోకి వెళ్లింది. పాల్ ఆమెని శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన సోదరి ఎడ్నా ఇంటికి మార్పు కోసం తీసుకువచ్చాడు. ఎడ్నా అద్దెకి ఉండే ఇంటి కేర్ టేకర్ సాంగ్ చైనాలోని పెకింగ్‌లో పుట్టాడు. అమెరికాకి వలస వచ్చినప్పటి నించి ఆ ఇంట్లోనే సేవకుడిగా పని చేస్తున్నాడు.
పాల్ తను రాబోయే ముందే తన భార్య ఫొటోని ఎడ్నాకి పంపి, దాన్ని కనపడేలా ముందు గదిలో ఉంచమని కోరాడు. ఆ ఇంటికి తండ్రితో వచ్చిన ఏన్ హాల్లోని మెట్ల దగ్గరికి వెళ్లి ఆసక్తిగా పైకి చూస్తూ సాంగ్‌ని ‘పైన ఎవరు ఉన్నారు?’ అని అడిగింది.
‘ఎవరూ లేరు. పైన అన్నీ ఖాళీ గదులు’ సాంగ్ జవాబు చెప్పాడు.
‘కాదు. ఓ గది ఖాళీ గది కాదు’ ఏన్ చెప్పింది.
ఏన్ కోసం కొన్న మూడు రబ్బర్ బొమ్మల సెట్టుని ఎడ్నా చూపించింది. తర్వాత ఏన్ మంచినీళ్ల జగ్‌లోంచి నీళ్లని గ్లాస్‌లోకి వంచుకుంటూంటే జగ్ చేయి జారి టీపాయ్ మీద పడటంతో తల్లి ఫొటో కింద పడి పగిలిపోయింది. అది చూసి పాల్ కూతుర్ని అరిచాడు. ఎడ్నా అడ్డుపడితే చెప్పాడు.
‘లేదు. చెయ్యి జారలేదు. ఇదెప్పుడూ ఇంతే’
ఏన్ చిన్నబుచ్చుకుంది. అది గమనించిన ఎడ్నా ఏన్‌తో చెప్పింది.
‘మీ నాన్నకి నువ్వంటే ఇష్టం లేదని అనుకోకు. పిల్లల మీద తండ్రులు అరవడం మామూలే’
‘అది నిజం కాదు. మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు. మా అమ్మంటేనే ఇష్టం. ఆ ప్రమాదంలో మా అమ్మ బదులు నేను పోతే బావుండేదని ఎన్నోసార్లు అన్నాడు’ విచారంగా చెప్పింది.
‘ఇంకెప్పుడూ అలా ఆలోచించకు. మీ నాన్న బాధలో ఉన్నాడు. బాధలో ఉన్నవారు ప్రేమగా మాట్లాడలేరు. కొద్దికాలానికి మామూలు అవుతారు’ సముదాయించింది.
ఏన్ మెట్ల దగ్గర నించుని పైకి చూసి ఎడ్నాని అడిగింది.
‘నేను పైకి వెళ్లచ్చా?’
‘ఒద్దు. అది మనింట్లోని మరణించిన భాగం’ ఆవిడ చెప్పింది.
‘నన్ను ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నారు’
ఏన్ పై మెట్టు ఎదురుగా ఉన్న గదిలోకి తలుపు తెరచుకుని వెళ్లింది. అది పిల్లల నర్సరీ.
‘ఈ గదిలో నేను ఉండచ్చా?’ ఏన్ గట్టిగా అడిగింది.
‘నువ్వు ఒక్కదానివే ఈ గదిలో పడుకోలేవు. నీకు కింది గది సిద్ధం చేసి ఉంచాను’ ఎడ్నా చెప్పింది.
ఏన్ వెంట వచ్చిన సాంగ్‌కి నర్సరీ గదిలోని అటక వైపు చూపించి చెప్పింది.
‘అక్కడున్న మ్యూజిక్ బాక్స్‌ని నాకు ఇవ్వు’
‘అక్కడ అలాంటిదేమీ లేదు’ సాంగ్ చెప్పాడు.
‘ఉంది. అది జెన్నిఫర్, రోజ్, మేరీలది’
అతను ఎక్కి చూస్తే నిజంగా ఓ మ్యూజిక్ బాక్స్ కనిపించింది. దాన్ని దుమ్ము దులుపుతూ సాంగ్ చెప్పాడు.
‘ముప్పై ఏళ్ల నించి దీన్ని నేను చూడనే లేదు’
పైన నర్సరీ గదిని ఏన్‌కి ఇవ్వాలని ఎడ్నా దాన్ని సర్ది, చిన్నపిల్లల బొమ్మలతో గోడలని అలంకరించింది. ఐతే గదిలోని హీటర్ పని చేయకపోవడంతో మరమ్మతు కోసం మనిషిని పిలిస్తే అందులోకి గేస్ ఎందుకు వెళ్లడం లేదో అతను ఎంత ప్రయత్నించినా కనుక్కోలేక పోయాడు. అది తనకి చిత్రంగా ఉందని, ఎలక్ట్రిక్ హీటర్ని ఉపయోగించమని సలహా ఇచ్చి వెళ్లాడు.
‘అందుకోసం ఏభై డాలర్లు వృధా ఖర్చు చేయాలి’ పాల్ నిరసనగా చెప్పాడు.
‘పాల్! నీ కూతురి కోసం నువ్వు ఆ మాత్రం ఖర్చు చేయకపోతే నేను చేస్తాను’ ఎడ్నా నిరసనగా చెప్పింది.
‘ఏన్ నాతో సక్రమంగా ప్రవర్తించకపోతే నా స్పందన ఇలాగే ఉంటుంది’ పాల్ కూతురు వినేలా కోపంగా చెప్పాడు.
‘ఏన్. నీకీ గది ఇవ్వలేను. ఇక్కడ హీటర్ పని చేయడం లేదు’ ఎడ్నా చెప్పింది.
‘నాకు తెలుసది’ ఏన్ చెప్పింది.
‘ఎలా తెలుసు?’
‘వాళ్లు చెప్పారు’
‘ఎవరు వాళ్లు?’
‘జెన్నిఫర్, రోజ్, మేరీలు’
‘వాళ్లెవరు?’ పాల్ అడిగాడు.
ఆ బొమ్మలని చూపించింది.
‘అంటే వీళ్లు నీతో మాట్లాడుతారా?’ ప్రశ్నించాడు.
‘అవును’ చెప్పి తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని బయటకి వెళ్లిపోయింది.
‘ఆశ్చర్యం. నా భార్య పోయాక ఇదే మొదటిసారి’ ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో పాల్ ఎడ్నాతో చెప్పాడు.
సాయంత్రం పాల్ ఇంటికి వచ్చినప్పుడు ఏన్ నర్సరీ గదిలో నృత్యం చేస్తూ కనిపించింది.
‘నీకీ డాన్స్ ఎవరు నేర్పారు?’ అడిగాడు.
‘జెన్నిఫర్, రోజ్, మేరీలు నేర్పారు’
‘ఏన్. నువ్వు అబద్ధాలు చెప్పక్కర్లేదు. నీ అత్త దగ్గర నేర్చుకోవడంలో తప్పులేదు’ పాల్ మందలించాడు.
వారం తర్వాత పాల్ తిరిగి డెన్వర్‌కి బయలుదేరుతూంటే ఏన్ రానని మొండికేసి నర్సరీ గదిలోకి పరిగెత్తింది. ఎడ్నా ఆమె వెనకే వెళ్లింది.
‘ఏన్ ఆ బొమ్మల గురించి ఎన్నో కట్టుకథలు చెప్తోంది. వాటిని చెత్తబుట్టలో పడేసి ఉంటే బావుండేది’ పాల్ కోపంగా చెప్పాడు.
‘పొరపాటు. అవి బొమ్మలు కావు. నర్సరీలో బొమ్మలే కాక మరి కొన్ని కూడా ఉన్నాయి. ఇదివరకు అద్దెకి ఉన్నవాళ్లు వాటి వల్లే ఇల్లు ఖాళీ చేసేశారు. అర్ధరాత్రి పిల్లల బాధాకరమైన ఏడుపులు ఆ గదిలోంచి వాళ్లకి వినిపించేవి’ సాంగ్ చెప్పాడు.
‘అంటే ఆ గదిలో పిల్ల దెయ్యాలు ఉన్నాయంటావా?’ పాల్ అడిగాడు.
‘అవును. కాని అవి ఫ్రెండ్లీ దెయ్యాలు. ఆ పిల్లల తండ్రి ఆ ముగ్గురు కూతుళ్లని నిర్లక్ష్యం చేసేవాడు. ఒకోసారి వాళ్లని ఒంటరిగా ఇంట్లోనే వదిలి వెళ్లేవాడు. ఓ రోజు వాళ్లు ఒంటరిగా నర్సరీలో ఉండగా...’
పై నించి ఎడ్నా అరుపు గట్టిగా వినిపించి పాల్ పైకి పరిగెత్తాడు. ఆ గదిలోంచి ఆందోళనగా బయటకి వచ్చిన ఆమె చెప్పింది.
‘ఆ గదిలో ఎవరో అదృశ్య వ్యక్తి నన్ను వాటేసుకున్నారు. నేను ఈ ఇంట్లో ఇక ఉండలేను. అవి బొమ్మలు కావు’
‘ఏన్‌కి ఈ దెయ్యాల కథ గురించి నువ్వు చెప్పావా?’ వెంటనే పాల్ అడిగాడు.
‘లేదు. ముప్పై ఏళ్ల క్రితం ఆ గదిలోకి గేస్ వెళ్లకపోవడంతో గది వేడెక్కక వాళ్లు చలికి మరణించారు. కట్టుకథైతే ఆ నృత్యాన్ని ఏన్‌కి ఎవరు నేర్పించి ఉంటారు?’ సాంగ్ నెమ్మదిగా చెప్పాడు.
‘ఇది ఇరవయ్యవ శతాబ్దం. ఇలాంటివి మనం నమ్మకూడదని తెలిసినా నేనూ నీతో డెన్వర్ వస్తాను’ ఎడ్నా చెప్పింది.
కిందకి వచ్చిన ఏన్ చెప్పింది.
‘జెన్నిఫర్, రోజ్, మేరీలకి గుడ్‌బై చెప్పి వస్తున్నాను. వాళ్లు చాలా మంచివాళ్లు. వాళ్లే నిన్ను ముద్దుపెట్టుకోమని, నీతో సఖ్యతగా ఉండమని చెప్పారు. నీతో డెన్వర్ వెళ్లడం సబబని కూడా చెప్పారు. నేను రెడీ’
ఏన్‌ని ఎత్తుకుని పాల్ బయటకి నడుస్తూంటే, సాంగ్ అతని సామానుతో అనుసరించాడు.
కారెక్కుతూండగా ఏన్ చెప్పింది.
‘నా మ్యూజిక్ బాక్స్ ఆ గదిలోనే ఉండిపోయింది’
తను తెస్తానని పాల్ పైకి వెళ్లాడు. లోపల ఎవరూ తాకకుండానే మ్యూజిక్ బాక్స్‌లోంచి అకస్మాత్తుగా సంగీతం వినిపిస్తే నివ్వెరపోయాడు. డెన్వర్‌లోని సైకాలజిస్ట్‌లు కూడా సరిదిద్దలేని ఏన్‌ని ఆ గదిలోని ఆ అదృశ్య వ్యక్తులు సరిదిద్దారని, లేకపోతే ఏన్‌లో అంత మార్పు అసాధ్యమని కూడా అతనికి స్ఫురించింది. గదిలోంచి మ్యూజిక్ బాక్స్‌తో బయటకి వస్తూ చెప్పాడు.
‘్థంక్ యు జెన్నిఫర్, రోజ్ అండ్ మేరీ’
మరణించిన ఆ ముగ్గురు పిల్లలూ నిజంగా దెయ్యాలయ్యారా? ఏన్‌ని సరిదిద్దారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సాంగ్‌తో సహా ఎవరూ జవాబు చెప్పలేరు. నిజం దేవుడికే తెలియాలి. ఆ ఇల్లు మాత్రం ఇంకా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంది.

- పద్మజ