S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కలలు కనండి.. కానీ.. (కథ)

‘మీరెప్పుడూ ఇంతే అమ్మా, ఏదడిగినా కాదూ, లేదు అంటారు.. మా ఫ్రెండ్స్‌లో ఎవరికీ ఇంత దరిద్రం లేదు. నాకే ఇదంతా... ఛీఛీ ఏం బ్రతుకిది.. ఇలా బ్రతికేకంటే చావడం మేలు!’ అంటూ చేతిలో కాఫీ గ్లాస్‌ని గోడకేసి కొట్టాడు శరత్‌చంద్ర కోపంగా.
‘ఏమిట్రా ఇదీ.. నువ్వడిగింది ఏది కాదన్నారు నాన్నగారు? మన తాహతుకు మించినవైనా నీవేదడిగినా కాదనకుండా తీరుస్తూనే ఉన్నారు కదరా.. గవర్నమెంటు కాలేజీలో సీటు వచ్చినా అక్కడ ఫెసిలిటీస్ బాగుండవు, కేంపస్ సెలక్షన్స్ సరిగా ఉండవూ అంటే బోలెడు ఫీజులు కట్టి ప్రైవేటు కాలేజీలో జాయిన్ చేశారు. నీకు బైక్ కావాలంటే నానా తిప్పలూ పడి బైక్ కొనిచ్చారు... నువ్వడిగింది ఏది కాదన్నారు చెప్పు?’ అంది శ్యామల నిలదీస్తున్నట్లుగా.
‘్భలే చెప్తున్నావమ్మా, మీరొక్కరే అవన్నీ చేస్తున్నట్లు.. అందరు పేరెంట్స్ చేస్తున్నట్లే మీరూ చేశారు. ఇందులో గొప్పేముంది? ఇవన్నీ కాదమ్మా, నేను యంఎస్ చేయడానికి లండన్ పంపిస్తారా, లేదా చెప్పండి?’ అన్నాడు శరత్ కోపంగా.
‘నీకు చెప్పడం నా వల్ల కాదురా.. ఇప్పటికిప్పుడు పది, పదిహేను లక్షలు ఎక్కడి నుండి తెమ్మంటావూ? అయినా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు వాళ్లు వెళ్తున్నారని, నువ్వు వెళ్లడం ఏమిట్రా, గొంతెమ్మ కోర్కెలు కాకపోతేనూ... హాయిగా కేంపస్ సెలక్షన్‌లో వచ్చిన ఆ జాబ్‌లో చేరక, ఎందుకొచ్చిందిరా ఇదంతా?’ అంది శ్యామల కొడుకు వంక విసుగ్గా చూస్తూ.
‘ఆ వచ్చింది లెద్దూ బోడి ఉద్యోగం, ఆ గొర్రెతోక బెత్తెడు ఉద్యోగం నేను చేయను.. ఫారిన్ వెళ్లి చదివితే ఎన్ని మంచి అవకాశాలు, ఎంత స్టేటస్.. అసలా లైఫే వేరు!’ అన్నాడు శరత్ కలల్లో తేలిపోతూ.
లోపలి గదిలో నుండి అదంతా వింటున్న రఘురామ్ అక్కడికి వచ్చాడు.
కొడుకు మాటలకు జవాబు చెబుతున్న భార్యను వారిస్తూ ‘నువ్వుండు శ్యామలా, నేను మాట్లాడుతాను’ అన్నాడు గంభీరంగా శరత్ వైపు చూస్తూ.
అంతవరకూ తల్లి మీద రంకెలు వేస్తున్న శరత్ తండ్రిని చూడడంతోనే పిల్లిలా మారిపోయి తలవంచుకొని నేలచూపులు చూడసాగాడు.
‘ఏమిట్రా ఇప్పుడు చెప్పు... అమ్మతో గంట నుండీ తెగ వాదిస్తున్నావు’ అన్నాడు రఘురామ్ సూటిగా శరత్ వైపు చూస్తూ.
‘ఏం లేదు నాన్నా, మా ఫ్రెండ్సందరూ యు.ఎస్. గానీ, లండన్ గానీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేను కూడా యంఎస్ చేయడానికి వెళ్తానంటే వద్దంటున్నారు మీరు. దాని గూర్చే అమ్మతో మాట్లాడుతున్నాను’ అన్నాడతడు తడబాటుగా చూస్తూ.
‘ఇది మాట్లాడుతున్నట్లుగా లేదురా... పోట్లాడుతున్నట్లుగా ఉంది. నేను రాత్రే చెప్పాను కదరా ఇది మన తాహతుకు మించినది అని. అయినా అదే మంకుపట్టు పడుతున్నావు.
నీకు విదేశాలు వెళ్లాలని ఉంటే ఇప్పుడు వచ్చిన ఉద్యోగంలో చేరి కష్టపడి పని చేయి. ఇలాంటి అవకాశాలన్నీ కోకొల్లలుగా వస్తాయి నిన్ను వెదుక్కుంటూ. మరోమాట, నీవన్నట్లు విదేశాలు వెళ్లినవాళ్లందరూ పౌండ్సూ, డాలర్లూ సంపాదించడం లేదు. చాలామంది అంత ఖర్చు పెట్టుకొని వెళ్లి రిక్తహస్తాలతో వస్తున్నారు. లేదా, అక్కడ పెట్రోలు బంకుల్లోనూ, డిపార్టుమెంటల్ స్టోర్స్‌లోనూ చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తున్న సంగతి నీకు తెలుసా? వచ్చిన ఉద్యోగాన్ని వదులుకొని మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్లుగా ఎందుకురా నీకీ పిచ్చి ఆలోచనలు?
నీ తరువాత మరో బిడ్డ పుడితే నాకు వచ్చే జీతంతో ఇద్దరికీ న్యాయం చేయలేమని నీ ఒక్కడితోనే సరిపెట్టుకున్నాము. నేను చేస్తున్నది ప్రైవేటు కంపెనీలో జాబ్. పాతికేళ్లుగా ఉద్యోగం చేస్తున్నా ఇంతవరకూ స్వంత ఇల్లు అనేది అమర్చుకోలేక పోయాను.
నువ్వడిగింది కాదూ, లేదూ అనకుండా నా శక్తికి మించినవైనా అన్నీ సమకూర్చాను కదరా నీకు.. ఇప్పుడు ఇది చేయలేనంటే అర్థం చేసుకోవెందుకూ?’ అన్నాడు రఘురామ్ అసహాయంగా చూస్తూ.
‘వెనకటికి ఎవడో ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేయడం అన్నాడట.. అలా ఉంది మీ మాట. కన్నందుకు అలా చేయడం మీ బాధ్యత కాదా... అది వదిలేసి ఏదో నేను అడిగిందల్లా ఇచ్చేసినట్లు ఎప్పుడు చూసినా ఈ సోదంతా చెప్తారు’ అన్నాడు శరత్ ఉక్రోషంగా తండ్రి వంక చూస్తూ.
అంత మూర్ఖంగా మాట్లాడుతున్న కొడుక్కి ఎలా నచ్చజెప్పాలో అర్థం కాలేదు రఘురామ్‌కి.
వీడేనా... మిగతా పిల్లలందరూ కూడా వాళ్ల తల్లిదండ్రులతో ఇలాగే ఉన్నారా? అనే ఆలోచనలో పడ్డాడతడు.
తండ్రి వౌనం వహించడం చూసి శరత్ రెచ్చిపోయి తన స్నేహితులు ఎవరెవరు ఏం చేసి ఫారిన్ వెళ్తున్నారో చెప్పసాగాడు. అవన్నీ వింటున్న రఘురామ్‌కి తల తిరిగినంత పనైంది... ఆ పైన అవన్నీ విని భరించడం సాధ్యం కాక.. ‘ఆపరా ఇంక. నేను చేయగలిగింది నేను చేశాను. ఇక నా వల్ల కాదు. జాబ్‌లో చేరి ఇక్కడే ఉంటావో, లేదా విమానాలెక్కి విదేశాలు వెళతావో నీ ఇష్టం... నీకు నచ్చినట్లు చేసుకో... నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు!’ అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు.
తండ్రిని అంత కోపంగా ఎప్పుడూ చూడని శరత్ బిక్క చచ్చిపోయినట్లుగా అలా ఉండిపోయాడు కొంతసేపు.
శ్యామల కూడా తన పనిలో తాను మునిగిపోయింది.
అలాంటి వాతావరణంలో ఉండలేక మెల్లగా కాళ్లీడ్చుకుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు శరత్.
తన ఫ్రెండ్స్‌ని ఎవర్ని కదిపినా ఫారిన్ వెళ్లేందుకు చేసుకుంటున్న ఏర్పాట్లను గురించి ఎంతో ఉత్సాహంగా చెప్పే కబుర్లు వింటున్న కొద్దీ అతని బుర్ర గిర్రున తిరిగిపోతోంది. అందరూ బాగున్నారు. నాకే ఎందుకిలా అవుతోంది. అనుకున్నాడు ఆక్రోశంగా.
అంతే తప్ప ఆ పిల్లల్ని అలా విదేశాలు పంపేందుకు ఆ తల్లిదండ్రులు పడ్తున్న కష్టాల గూర్చి గానీ, సాధక బాధకాల గూర్చి కానీ అతడికి ఏ మాత్రం గమనంలో లేదు.
శరత్ ప్రమేయం లేకుండానే.. అతడి క్లాస్‌మేట్, ప్రాణ స్నేహితుడు అయిన కరుణాకరం ఇంటికి చేరుకున్నాడు.
కరుణాకరానిది కూడా శరత్ పరిస్థితి లాంటిదే. కాకపోతే వాళ్లకు ఉండడానికో స్వంత ఇల్లుంది.
శరత్ వెళ్లేసరికి వాళ్లింట్లో కూడా ఇదే చర్చ వాడిగా వేడిగా సాగుతోంది.
వాళ్లింట్లో జరుగుతున్న వాగ్యుద్ధం చూసి.. అదేదో సినిమాలో హీరో అన్నట్లు ఈ పెద్దోళ్లంతా ఇంతే.. చిన్నోళ్ల మనసులను అసలు అర్థం చేసుకోరు అనుకున్నాడు విసుగ్గా.
కరుణాకరం తండ్రి మధుసూదన్ శరత్‌ని చూసి ‘రారా శరత్, సమయానికి వచ్చావు. వచ్చిన బంగారం లాంటి ఉద్యోగాన్ని వదులుకొని వీడు యంయస్ చేయడానికి విదేశాలు పోతానంటున్నాడు.. ఈ పిచ్చి వీడికేనా, నీక్కూడా పట్టిందా?’ అన్నాడతడు కోపంగా కొడుకు వంక చూస్తూ.
అతడి ప్రశ్నకు నిరుత్తరుడైనట్లుగా తలవంచుకున్నాడు శరత్.
‘వాడి సంగతి ఎందుకు మీకు... నా సంగతి తేల్చండి ముందు!’ అన్నాడు రోషంగా కరుణాకరం స్నేహితుడి ముందు తండ్రి తన పరువు తీసేసినట్లుగా భావిస్తూ.
‘రోషానికేం తక్కువ లేదు... అరే శరత్, ఇలా వచ్చి కూర్చో.. ఏంట్రా సంగతి, నువ్వు కూడా వెళ్దామనుకుంటున్నావా ఫారిన్?’ అనడిగాడు సూటిగా చూస్తూ.
‘అవునండీ.. కానీ ఇంట్లో...’ అంటూ ఆగిపోయాడు శరత్.
‘అయిందా.. నేను చెప్తే వీడసలు వినిపించుకోవడం లేదు. అసలేంట్రా మీ ప్రాబ్లమ్.. పిలిచి ఉద్యోగాలిస్తూ ఉంటే కాలదన్నుకుని ఎక్కడికో పోతామనుకుంటున్నారు. ఏముందిరా అక్కడ? ఎంత సంపాదించినా తినేది అన్నమే కానీ, పౌండ్సూ, డాలర్సూ కాదు కదా... అసలు మీలాంటి విద్యావంతులంతా విదేశాలకు పరుగులు పెడుతూ వెళ్లడం వలనే మన దేశం ఇలా వెనుకబడిపోయింది...’
అంటున్న తండ్రి మాటలను పూర్తి చేయనివ్వకుండా అందుకున్నాడు కరుణాకరం. ‘ఆపండి మీ తొక్కలో ఆదర్శాలు... మీలాంటి వారందరూ ఇలా వెనక్కి లాగబట్టే మాలాంటి వాళ్లకు ఎంత టాలెంట్ ఉన్నా ఇలా వెనకబడిపోతున్నాము’ అన్నాడు దూకుడుగా.
అతడా మాటలు అన్న వెంటనే వడివడిగా అక్కడికి వచ్చిన వసుంధర కొడుకు చెంప మీద బలంగా కొట్టి ‘దరిద్రుడా, తండ్రితో మాట్లాడే విధానం ఇదేనా? నీ చదువు నీకు నేర్పిన సంస్కారం ఇంతేనా? విదేశాలకు వెళితేనేనా ముందుకు వెళ్లినట్లు... లేకపోతే ఇంకేమీ లేదా?’ అంది ఆగ్రహంగా చూస్తూ.
స్నేహితుడి ముందు తల్లి అలా కొడుతుందని ఏ మాత్రం ఊహించని కరుణాకరం ఆశ్చర్యంగా తల్లి వంక చూస్తూ దెబ్బ పడిన చెంపను చేత్తో పట్టుకున్నాడు.
ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే వసుంధర ఆంటీ ఈ రోజు ఇలా తన స్నేహితుడ్ని కొట్టడంతో మొదటిసారిగా శరత్ ఆలోచనలో పడ్డాడు. తాము చేస్తున్నది తప్పేమో అన్న భావన కలిగింది.
భార్య ఎదిగిన కొడుకును అలా కొట్టడం మధుసూదన్‌కి ఎంత మాత్రం నచ్చలేదు.
‘ఏమిటి వసూ నువ్వు చేసిన పని.. కోపమూ, ఆవేశమూ మనిషిలోని ఆలోచనను పూర్తిగా నశింపజేస్తుంది. ప్రతి పది నిమిషాల కోపం వలనా ఆరు వందల సెకండ్ల ఆనందాన్ని మనం నష్టపోతూ ఉంటామట. వాడు తెలియక ఏదో అన్నాడని నువ్వూ తొందరపడితే ఎలా... దానివలన సమస్య పరిష్కారం అవుతుందా? అసమర్థుల ఆఖరి అస్త్రం హింసా, పరుష వాక్యాలే అంటారు పెద్దలు. నేను మాట్లాడుతాను గానీ నువ్వెళ్లు’ అన్నాడతడు అనునయంగా.
ఒళ్లు తెలియని కోపంతో కొడుకుని కొట్టినందుకు బాధపడుతూ తప్పు చేసినట్లుగా తలవంచుకొని వెళ్లిపోయింది వసుంధర అక్కడి నుండి.
భార్య వెళ్లాక కొడుకు వంక తిరిగి ‘కరుణా, నువ్వు అడిగింది అమ్మగానీ, నేను గానీ ఎప్పుడైనా కాదన్నామా చెప్పు... ఇది మనకు సాధ్యం కాదు గనుక వద్దని ఇంత గట్టిగా చెప్తున్నాము. అదీగాక నీ వెనుక చెల్లి ఉంది. అది కూడా బి.టెక్ ఫస్టియర్ చదువుతోంది. దాన్ని కూడా చదివించాలి గదా మేము. ఏదో ఈ చిన్న ఇల్లు ఉంది గనుక అద్దె బాధ లేదు మనకి. నాకు వచ్చే కొద్దిపాటి జీతంతో ఇలా నెట్టుకొస్తున్నాము. ఆ సంగతి నీకు తెలియంది కాదు.
ఉన్న ఇల్లు అమ్మేసి నిన్ను ఫారిన్ పంపేస్తామనుకో... ఈ మహాపట్నంలో నాకు వచ్చే జీతంతో చెల్లి చదువూ, ఇల్లు గడపడం సాధ్యమే నంటావా? నాకు తెలివితేటలు ఎన్ని ఉన్నా మా నాన్నకు నన్ను కనీసం డిగ్రీ అయినా చదివించే స్తోమత లేకపోయింది ఆ రోజుల్లో... ఏదో టైపూ, షార్ట్‌సేండ్ నేర్చుకొని ఈ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను.
నాలాంటి బ్రతుకులు మీవి కాకూడదని కష్టపడి నిన్నూ చెల్లెల్నీ చదివిస్తున్నాను. నీకు ఉద్యోగం వచ్చింది. మా కష్టాలు గట్టెక్కాయని నేనూ, మీ అమ్మా సంతోషపడుతూంటే.. కాదని ఎక్కడికో వెళ్తానంటున్నావు. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు నాన్నా!
అరే పిల్లలూ! మీరిద్దరూ ఇంకా జీవితం ప్రారంభ దశలోనే ఉన్నారు. ఈ వయసులో రంగురంగుల కలలు కనడం అతి సహజం. కాదనను. ఎందుకంటే కలలు కనడంలో ఎంత మాత్రం తప్పు లేదు.. అతి సహజం కూడా ఇది. కానీ ఆ కలలను సాకారం చేసుకునేందుకు మీరు ఎంచుకున్న విధానమే సరైంది కాదు అంటున్నాను.
ఇదేదో నేను అందని ద్రాక్ష పుల్లన అనే చందాన వద్దంటున్నానని అనుకోవద్దు. మన మధ్యతరగతి జీవితాలు పిండి కొద్దీ రొట్టెలా మనుగడ సాగించకపోతే బ్రతకడం చాలా కష్టం. దుప్పటి పొడవును బట్టే కాళ్లు చాచుకోవాలిరా... అలాగే మన ఆలోచనలను కూడా మలచుకోవాలి.
కానీ ఒక్కమాట మాత్రం మీరు జీవితాంతం గుర్తు పెట్టుకోవాలిరా పిల్లలూ... ఎవరైనా విజయం సాధించాలంటే ఎప్పుడూ జీవితంలో రెండు విషయాలను గమనంలో ఉంచుకోవాలి.. యూ కెన్ విన్ ఇన్ లైఫ్ బై ఎవాయిడింగ్ టూ థింగ్స్ ఇన్ లైఫ్.. వన్ ఈజ్ కంపేరింగ్ విత్ అదర్స్ అండ్ టూ ఈజ్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రం అదర్స్.
అంతే కాదర్రా, మన ఆలోచనలు మనల్ని బంధించినట్లుగా మన శత్రువు కూడా మనల్ని బంధించలేడు. అందరూ వెళ్తున్నారు కనుక మేమూ ఫారిన్ వెళ్లాలి అని ఒక వ్యామోహంతో ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నట్లుగా వెళ్దామనుకుంటున్నారు. అలా వెళ్లడం తప్ప మరో మార్గం లేదు మా అభివృద్ధికి అనుకుంటున్నారు. కానీ అలా వెళ్తున్న వాళ్లలో వెళ్లాలీ అనుకుంటున్న వాళ్లలో మీ ఇద్దరిలాగా కేంపస్ సెలక్షన్స్‌లో జాబ్ వచ్చిన వాళ్లు ఎందరున్నారో ఒకసారి లెక్క చూసుకోండి. కానీ మీరా విషయాన్ని అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు.
అందరాని దాని కోసం అర్రులు చాస్తూ చేతికి అందిన దాన్ని జారవిడుచుకోవడం చాలా అవివేకం. ఏ పనినీ కష్టమని కాకుండా ఇష్టంగా చేయడం ప్రారంభిస్తే.. అందులో కూడా అద్భుతాలు సాధించవచ్చు! ఈ రోజు కష్టానికి యజమానులై ముందుకు నడిస్తే.. రేపు విజయం మీకు కరతలామలకం అవుతుంది’ అన్నాడు మధుసూదన్ నచ్చజెప్తున్నట్లుగా.
అతడి మాటలు విన్న మిత్రులిద్దరిలోనూ అంతర్మథనం ప్రారంభమైంది. ఇద్దరూ ఒకరి వంక ఒకరు సాభిప్రాయంగా చూసుకున్నారు.
ముందుగా శరత్ ‘సారీ అంకుల్! ఇంతవరకూ నాకెంతో చేసిన అమ్మానాన్నలను నా మూర్ఖత్వంతో చాలా బాధపెట్టానని మీ మాటలు వినేవరకూ నాకు అర్థం కాలేదు. వెంటనే ఇంటికి వెళ్లి అమ్మానాన్నలకు సారీ చెప్పడమే కాదు, నేను ఫారిన్ వెళ్లననీ, జాబ్‌లో జాయిన్ అయిపోతానని చెప్పేస్తాను’ అంటూ ఉద్వేగంగా లేచాడు అతడు అక్కడి నుండి.
‘నేను కూడా వెళ్లను నాన్నా.. నన్ను క్షమించండి, అనరాని మాటలని మిమ్మల్ని చాలా బాధపెట్టాను. ఏనాడూ లేనిది అమ్మ కోపంతో నాపై చేయి చేసుకునేలా ప్రవర్తించాను’ అంటూ చప్పున వంగి కరుణాకరం మధుసూదన్ పాదాలను కళ్లకు అద్దుకున్నాడు.
‘చాలా సంతోషం నాన్నా.. మంచేదో చెడేదో నువ్వూ నీ ఫ్రెండూ తెలుసుకున్నారు. అయాం వెరీ హ్యాపీ!’ అంటూ కొడుకుని హృదయానికి హత్తుకున్నాడు మధుసూదన్.

-పెబ్బిలి హైమావతి