S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

డి. శంకర్, పెదపూడి
బాహుబలి-2 చిత్రాన్ని నిశితంగా విమర్శిస్తూ వ్యాసం ప్రచురించారు. వ్రాసినతని సంగతి ఎలావున్నా, ప్రచురించదలచుకున్నప్పుడు మీకు భయం కలగలేదా? ఇలాంటి విమర్శను ‘వారు’ సహృదయంతో స్వీకరిస్తారనే నమ్మకంతోనా?
విమర్శ చేసేది పాఠకుల కోసం...
ఒకరి మెప్పు కోసం కాదు.

ప్రొ. కె.ఎన్.రావు, కావలి
ప్రపంచ న్యాయస్థానంలో మన భారతదేశం తరపున సమర్థవంతంగా వాదించిన ప్రముఖ న్యాయవాది కేవలం ఒక్క రూపాయ మాత్రమే ఫీజు తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ కూడా వేతనంగా నెలకు ఒక్క రూపాయ మాత్రమే తీసుకునేవారట. తెలంగాణ, నవ్యాంధ్ర ముఖ్యమంత్రులు, ఇతర కేబినెట్ అమాత్యులు కూడా కేవలం ఒక్క రూపాయ వేతనంగా తీసుకొనిన బాగుండును కదా?
ఆ మంచి బుద్ధి వారికి కలిగితే మంచిదే.

సి. మనస్విని, విజయవాడ
నలభై ఏళ్ల పాటు తమిళుల అభిమానానికి పాత్రుడై, వారితో మమేకమైన రజనీకాంత్‌ను తమిళేతరుడనే కారణం చూపి వ్యతిరేకించడం న్యాయమేనా?
రాజకీయాల్లో తలదూర్చదలిచాక ఇలాంటివి తప్పవు.

పి. ప్రతాప్, శ్రీకాకుళం
సోషల్ మీడియా అనేది ప్రపంచం కళ్లు తెరిపించి, విస్తృత ప్రజానీకానికి గొంతునివ్వడం, మార్పు తేవడంలో సమాజానికి లభించిన అత్యాధునిక ఆయుధంగా అభివర్ణింపబడ్తోంది. అటువంటి సోషల్ మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేసి అక్రమ నిర్బంధనలు, అన్యాయపు కేసుల ద్వారా నోరు మూయంచే విధానాలను కొన్ని ప్రభుత్వాలు ఇటీవల అనుసరించడం సమర్థనీయమా?
ఆ మీడియాలో విచ్చలవిడితనమూ బాగానే ఉంది.
దేవుళ్లపై చిత్ర విచిత్రమైన కార్టూన్లు, వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేసి హిందూ సమాజంపై చులకన భావం పెంచడంలో మీడియా పనిచేసినప్పుడు స్పందించని ప్రభుత్వాలు, తమ పనితీరుపై కొందరు అదే వైఖరి అవలంబించినప్పుడు తీవ్రంగా స్పందించడం కరెక్ట్ కాదు కదా!
ఇవి హిందూ ప్రభుత్వాలన్న అనుమానం ఎందుకొచ్చింది?

ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
వెనె్నలలో నేను రాసేవి కొన్ని ఇతరుల పేర్లతో ప్రచురిస్తున్నారు. నా భావాలు ఇతరులకొచ్చినా అక్షరం అక్షరం సమంగా ఉండవు కదా. ఇలా ఎందుకు జరుగుతున్నది?
అలా జరగదు. అలా చేయడం వల్ల ఎవరికీ ఏమీ ఒరగదు.

అమిత్ షా తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేసి ఆంధ్ర ప్రభువు ఇంట్లో విస్తరి వేయడం బాగుందంటారా?
కంచం పొత్తు ముందునుంచీ ఉన్నవాళ్లే కదా! షరా మామూలే.

పి. రామకృష్ణ, రాజమండ్రి
నాకు ఒక్కరోజు గవర్నరు కావాలని ఉంది. ఆ ఒక్కరోజు అధికార దుర్వినియోగం చెయ్యకుండా తిరుమల స్వామివారి సన్నిధిలో రోజంతా గడపాలని కోరిక. ఎన్నిసార్లు వెళ్లినా జబ్బపట్టి తోసివేయబడుతున్నాను. స్వామివారిని కనులారా చూసే భాగ్యం లేదు. నా కల నెరవేరేనా?
టి.టి.డిలో ఇలాంటి స్కీము ఉన్నట్టు లేదు.
దర్శకరత్న దాసరి నారాయణరావుగారు మరణిస్తే నివాళి అర్పించటానికి ‘ఆ నలుగురు’ రాలేదేం? తీరిక లేదా?
వారి కబంధ హస్తాలనుంచి థియేటర్లను విడిపించి, చిన్న నిర్మాతలను ఆదుకోవడానికి బతికినంతకాలం ఆయన పోరాడాడు కదా? మరి వారెందుకు వస్తారు?

పి.వి. శివప్రసాదరావు, అద్దంకి
అంతర్గత కుమ్ములాటలు వున్న నియోజకవర్గాలలోని నేతలను సంప్రదించి ఒప్పించకుండా ఆ ప్రాంత ప్రతిపక్ష నేతల్ని పార్టీలో చేర్చుకుంటే వారిమధ్య తలెత్తే వర్గపోరు, సమన్వయం కుదరని కార్యకర్తల ఘర్షణ వల్ల పార్టీ అగ్ర నేతకు ఇలాంటి తలవంపులు, తలనొప్పులు కట్టడి చేసుకోకపోతే పార్టీ ఉనికికి, లక్ష్యానికి దెబ్బ కాదంటారా?
అనుభవం అయతేగాని ఫిరాయంపుల తత్వం బోధపడదు... కానీండి.

ఎం. కనకదుర్గ, తెనాలి
రెండు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న త్రాగునీరు, నిరుద్యోగం, అధిక ధరలు, దిగజారిన వైద్య ప్రమాణాలు ఇత్యాది సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేయడం మాని సభలు, ప్లీనరీలు, విదేశీ యాత్రలతో సమయం, ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం? ఇటీవల టమాటా, మిర్చి, నిమ్మ రైతులు గిట్టుబాటు ధరలు లేనందున ఉత్పత్తులను పారేసుకుని ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలు ప్రభుత్వాలకు, ప్రజా ప్రతినిధులకు పట్టవా?
సమస్యలు ఎప్పుడూ ఉండేవే. దేనిదారి దానిదే.

*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్ - 500003.

: email :
sundaymag@andhrabhoomi.net