S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సైకిల్

నాకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఓ మూడు చక్రాల సైకిల్ ఉండేది. అది నడపడం చాలా సులువుగా వుండేది. ఎలాంటి భయం ఉండకపోయేది. మూడు చక్రాలు ఉండడం వల్ల చాలా రక్షణగా ఉండేది. సురక్షితంగా అన్పించేది.
కాస్త పెద్దగా అయిన తరువాత మూడు చక్రాల సైకిల్ మూలకి పడిపోయింది. రెండు చక్రాల సైకిల్ నడపాలన్న కోరిక బాగా ఉండేది. ఇంట్లో ఒకే సైకిల్ ఉండేది. దాన్ని మా బాపు తీసుకొని వెళ్లేవాడు. సైకిల్ నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. పిప్పరమెంట్లు కొనుక్కోవాలని చిల్లర డబ్బుల కోసం మా అమ్మను వేధించి కిరాయకు సైకిల్ తీసుకునేవాన్ని. అప్పుడు గంటకి ఐదు పైసలు కిరాయి.
సైకిల్ ఎత్తుగా ఉండడం వల్ల సీటు మీద కూర్చుంటే కాళ్లు అందక పోయేవి. అందుకని సైకిల్ మధ్యలో కాలు పెట్టి తొక్కేవాళ్లం. దాన్ని ‘కాంచీ’ అనేవాళ్లం. స్నేహితుడొకడు కొంచెంసేపు పట్టుకునేవాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వదిలేసేవాడు. ఆ నేర్చుకునే క్రమంలో మోకాళ్లకు దెబ్బలు తగిలేవి. చేతులకు తగిలేవి. అట్లా సైకిల్ నేర్చుకున్నాను. నేనే కాదు. మా స్నేహితులందరూ అలాగే నేర్చుకున్నారు. కాళ్లకు చేతులకు ఎన్నో దెబ్బలు. చివరికి ఎలాంటి భయం లేకుండా సైకిల్ తొక్కడం వచ్చేసింది.
మా పిల్లలకి అంత స్వేచ్ఛ లేదు. వాళ్ల కోసం కొంచెం ఎత్తు తక్కువగా వుండే సైకిళ్లు వచ్చేశాయి. వాళ్లు సులువుగా నేర్చుకోవడానికి వెనుక చక్రం దగ్గర అటూ ఇటూ రెండు చక్రాలు ఉండేవి. వాటిని ట్రైనింగ్ వీల్స్ అంటారు. ఇవి వుండటం వల్ల మా పిల్లలు సురక్షితంగా ఉన్నారన్న భావన వాళ్లకి వుండేది. మాకు అంతకన్నా ఎక్కువ ఉండేది. వాటివల్ల మా పిల్లలకి ధైర్యంగా ఉండేది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఏర్పడేది.
ట్రైనింగ్ వీల్స్ సహాయంతో ఎక్కువ కాలం నడపడం బాగుండదు. స్కూల్‌కి అలా వెళ్లలేరు. అందుకని ట్రైనింగ్ వీల్స్ తీసేశాం. కొంతకాలం తరువాత అవి లేకుండా సైకిల్ నడపడం నేర్చుకున్నారు.
జీవితంలో కూడా కొంతకాలమే ట్రైనింగ్ వీల్స్ ఉండాలి. పెద్దవాళ్ల రక్షణ ఉండాలి. ఆ తరువాత వాళ్ల అవసరం లేకుండా జీవితాన్ని ఎదుర్కొనే శక్తి రావాలి.
తల్లిదండ్రులు కూడా ఈ ట్రైనింగ్ వీల్స్‌ని పిల్లల నుంచి దూరం చేయాలి. అప్పుడే జీవితమనే సైకిల్ ధైర్యంగా గాలికి ఎదురుగా నడపగలరు.

- జింబో 94404 83001