S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిలుకల నేస్తం

కొన్ని సంఘటనలు ఎంతో మార్పు తీసుకువస్తాయి. కొందరిలో ఉన్న భిన్నతత్వాలను వెలికి తీస్తాయి. చెన్నైకి చెందిన శేఖర్ జోసెఫ్ విషయంలో అదే జరిగింది. ఎలాగంటే 2004లో వచ్చిన సునామీ సమయంలో చెన్నైలోని ఒక భాగం బాగా దెబ్బతింది. ఆ సమయంలో అనేక చెట్లు కూలిపోయాయి. దాంతో అనేక పక్షులు గూడు లేక అల్లల్లాడాయి. అలాంటి పక్షుల్లో రెండు రామచిలుకలు కెమెరాలు రిపేర్ చేసే శేఖర్ జోసెఫ్ ఇంటి ముంగిట వాలి వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ కనిపించాయి.
అప్పటి వరకు పెంపుడు జంతువులు, పక్షులను పెంచే అలవాటు లేని జోసెఫ్ శేఖర్ వాటి దీనావస్థ చూసి చలించిపోయాడు. వాటిని ఆదరించి, రక్షణ కల్పించాలని అప్పుడే ఆయన నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా వాటిని సున్నితంగా పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ వేళకి ఇంట్లో ఉన్న పళ్లు, గింజలు వేసి వాటి ఆకలి తీర్చి ఆశ్రయం కల్పించాడు.
తుపాను పరిస్థితి సద్దుమణిగిన తర్వాత అతను మార్కెట్‌కి వెళ్లి ఒక పక్షి గూడు, పక్షుల ఆహారం కొనుక్కుని వచ్చాడు.
ఇంట్లో వాళ్ల సాయంతో వాటిని చక్కగా పోషించడం ప్రారంభించాడు. ఖాళీ సమయంలో వాటితో గడపడం అలవాటయింది. పనిలోని ఒత్తిడి, దైనందిన జీవితంలో గందరగోళ పరిస్థితుల వల్ల ఉత్పన్నమయ్యే అలసట వంటివి ఆయనకి ఆ పక్షుల సాంగత్యం వల్ల ఇట్టే తొలగిపోతుండేవి. దాంతో అతను ఆ పక్షుల సంరక్షణలో సేదదీరడం అలవాటు చేసుకున్నాడు. అంతే కాకుండా తొలుత రెండు పక్షులతో ప్రారంభమైన అతని అభిరుచి మెల్లగా విస్తరించింది. ఇప్పుడు ఎక్కడ పక్షులు కనిపించినా వాటిని తీసుకురావడం మొదలుపెట్టాడు.
ఏదైనా ప్రమాదంలో దెబ్బతిన్నవి, తెలిసిన వాళ్లు వద్దనుకుని ఇచ్చేసేవి ఇలా అతని వద్ద ఇప్పుడు నాలుగు వేల వరకు పక్షులు వచ్చి చేరాయి. అతను తాను సంపాదించే దాంట్లో దాదాపు నలభై శాతం వరకు ఆ పక్షుల సంరక్షణకే ఖర్చు చేస్తున్నాడు. దీనికి అతని కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంది. అతను పక్షుల సంరక్షణ పనివల్లే ప్రతిరోజు ఉదయం నాలుగున్నరకి నిద్ర లేస్తుంటాడు. అరవై కిలోల బియ్యం, గింజలను ఉడకేసి ఉదయం పక్షులకు మేత వేస్తాడు. ఆ పని పూర్తయ్యాకే తన పనుల్లో పడతాడు. అలాగే సాయంత్రం కూడా వాటికి మేత వేసి తాను తింటాడు.
అతను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఉడికించిన ఆహారాన్ని పక్షులకు తినిపించడానికి పధ్నాలుగు అట్ట తొట్టెల వంటివి ఏర్పాటు చేశాడు. ఆ తొట్టెలను ఇంటి వద్ద వరుసగా అమర్చి అందులో ఉడికించిన గింజలను వేస్తాడు. వాటిని పక్షులు క్రమ పద్ధతిలో చేరి తింటాయి. అతను స్వయంగా పెంచుతున్న పక్షులతో పాటు బయటి పక్షులు కూడా అలవాటు పడ్డాయ. ఈ గింజలను తినడానికి ప్రతిరోజు క్రమం తప్ప కుండా ఉదయం ఆరు గంటలకి, తిరిగి సాయం త్రం నాలుగు గంటలకి వస్తాయి. ఇందుకోసం అతనికి రోజుకి అయిదు వందల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఎక్కడైనా గాయపడి పడిపోయిన పక్షులను కూడా అతను చేరదీసి వాటిని జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుంటాడు. అవి పూర్తి స్వస్థత పొందాక వదిలేస్తాడు. అందుకే అతన్ని ‘బర్డ్‌మేన్ ఆఫ్ చెన్నైయ్’ అని పిలుస్తుంటారు. అరవై నాలుగేళ్ల వయసులో కూడా తాను ఇంకా చురుగ్గా పని చేయగలుగుతున్నానంటే పక్షులను నేస్తాలుగా మలచుకుని, వాటి సంరక్షణలో ఎక్కువ కాలం గడపడమే కారణమని అతనంటుంటాడు. తన అభిరుచి తనకి మానసిక సంతృప్తిని ఇస్తుందని, తాను ఈ విధంగా పక్షులను పెంపకానికి తనకు తన కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరిస్తుంటారని అతను చెబుతున్నాడు.

- దుర్గాప్రసాద్ సర్కార్