S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. మీరే డిటెక్టివ్ 40

గుడికి హరికథ వినడానికి వెళ్లబోయే ముందు ఆశే్లష ఆయన చెప్పబోయే సర్గలని రెంటిని చదువుకుని బయలుదేరాడు.
ఆ రోజు ఆయన కథని ఇలా మొదలెట్టాడు.
‘దశరథుడు అలాంటి దీన స్థితికి తగినవాడు కాదు. పుణ్యమంతా ఖర్చయ్యాక స్వర్గలోకం నించి భూమి మీదకి పడ్డ వాడిలా, సాక్షాత్తు మూర్త్భీవించిన అనర్థానికి రూపంలా ఉన్న ఆయన నేల మీద పడి ఉన్నాడు. తన పనిని సాధించ దలచిన కైకేయి తను భయపడకుండా, భయపెడుతూ మళ్లీ ఆ వరాలనే కోరింది.
‘మహారాజా! నువ్వు సత్యవాదినని, చేసిన ప్రతిజ్ఞ విడువను అని బడాయిలు చెప్పుకుంటావు కదా? ఇప్పుడు నాకు వరాలని ఎందుకు కాదంటున్నావు?’
అది విన్న దశరథుడు కోపించి క్షణకాలం మూర్ఛపడినట్లై, ఇలా చెప్పాడు.
‘దుష్టురాలా! నా శత్రువా! మనుషుల్లో శ్రేష్ఠుడైన రాముడు అడవికి వెళ్లి, నేను మరణించాక నీ కోరిక తీరి సుఖంగా ఉంటావులే. అయ్యో! ఎంత కష్టం వచ్చింది? నేను స్వర్గానికి వెళ్లినప్పుడు ‘రాముడు కులాసాగా ఉన్నాడా?’ అని దేవతలు అడిగితే, అసలు విషయాన్ని కప్పిపుచ్చి క్షేమంగానే ఉన్నాడని వారిని ఎలా నమ్మించగలను? అసలు విషయం దాచకుండా కైకేయి ఇష్టప్రకారం నేను రాముడ్ని అరణ్యానికి పంపాను అని చెప్పినా ఎవరూ నమ్మరు. సంతానం లేని నేను ఎంతో శ్రమపడి, గొప్పవాడు, మహా పరాక్రమశాలి ఐన రాముడ్ని కొడుకుగా పొందాను. అలాంటి రాముడ్ని విడిచి ఎలా ఉండగలను? శూరుడు, అన్ని విద్యలని అభ్యసించినవాడు, కోపాన్ని జయించినవాడు, ఓర్పు గలవాడు, కమల రేకుల వంటి కళ్లు గలవాడు ఐన రాముడ్ని నేను అడవికి ఎలా పంపగలను? నల్ల కలువలా నల్లటివాడు, పొడవైన చేతులు గలవాడు, మహా బలశాలి, మనస్సుని హరించేవాడైన రాముడ్ని నేను దండకారణ్యానికి ఎలా పంపగలను? రాముడు సుఖాలకి అలవాటు పడ్డవాడు, కష్టాలు తెలీనివాడు. అలాంటి రాముడు కష్టపడడాన్ని నేనెలా ఊహించగలను? దుఃఖాలకి తగని రాముడికి దుఃఖం కలిగించకుండానే నేను ఇప్పుడే మరణించినట్లయితే నాకు ఆనందం కలుగుతుంది. పాపాలోచనలు గల క్రూరురాలా! కైకేరుూ! నాకు ఇష్టుడు, సత్య పరాక్రమవంతుడైన రాముడికి ఎందుకు కీడు చేస్తున్నావు? నాకు ఈ లోకంలో అపకీర్తి, పరాభవం తప్పవు’
మనసు చెదిరిపోయిన దశరథుడు ఈ విధంగా విలపిస్తూండగా సూర్యాస్తమయం జరిగి రాత్రైంది. ఆ రాత్రి చంద్రుడు ప్రకాశిస్తున్నా ఆర్తుడై దుఃఖించే దశరథుడికి చీకటిగానే ఉంది. వృద్ధుడైన ఆయన వేడి నిట్టూర్పులు విడుస్తూ, రోగపీడితుడిలా ఆకాశం వైపే చూస్తూ అతి దీనంగా విలపిస్తూ ఇలా చెప్పాడు.
‘నక్షత్రాలని అలంకారాలుగా ధరించిన మంగళకరమైన ఓ రాత్రీ! నువ్వు తెల్లారద్దు. నా మీద దయ ఉంచు. నీకు నమస్కరిస్తున్నాను’
రాజు ఈ విధంగా పలికి కైకేయికి నమస్కరిస్తూ మళ్లీ బతిమాలాడు.
‘మంగళప్రదమైన ఓ రాణీ! నేను మంచి చరిత్ర కలవాడ్ని. దీనుడ్ని. నిన్ను ఆశ్రయించిన వాడిని. ముసలివాడిని. ప్రధానంగా రాజుని. అలాంటి నన్ను అనుగ్రహించు. మంచి మాటలు వినేదానా. నేను చెప్పేదంతా గాల్లో కలిసిపోవడం లేదు కదా? ఓ బాలా! నన్ను అనుగ్రహించు. నువ్వు మంచి మనసు గలదానివి కదా. నల్లని కనుకొసలు గల ఓ దేవీ! నన్ను అనుగ్రహించు. రాజ్యాన్ని నువ్వే రాముడికి ఇచ్చి కీర్తిని సంపాదించుకో. అందమైన ముఖం గలదానా! ఆ పని చేస్తే అది నాకూ, రాముడికీ, లోకానికి, గురువులకి, భరతుడికి కూడా ఇష్టమైనది అవుతుంది’
పరిశుద్ధమైన మనసు గల రాజైన కైకేయి భర్త దీనుడై ఎర్రటి కన్నీటి చుక్కలని కారుస్తూ అనేక విధాలుగా దుఃఖించడం విన్న, దుష్ట స్వభావం గల ఆ క్రూరురాలు అతని మాటలని లెక్క చేయలేదు.
ఎంత చెప్పినా ఒప్పుకోకుండా రాముడ్ని అరణ్యానికి పంపాలని ప్రతికూలంగా మాట్లాడే భార్యని చూసిన రాజు దుఃఖంతో మళ్లీ మూర్ఛపోయి నేల మీద పడిపోయాడు. ఆత్మాభిమానం గల దశరథుడు ఈ విధంగా దుఃఖిస్తూ నిట్టూర్పులు విడుస్తూండగానే తెల్లవారింది.
ప్రాతఃకాలంలో వందిమాగధులు వచ్చి మేలుకొలుపులు ప్రారంభించారు. ఐతే ఆ రాజశ్రేష్ఠుడు వాళ్లని నివారించాడు.
(సర్గ -13 1-26 శ్లోకాలు)
పుత్రశోకంతో బాధపడుతూ స్పృహ లేక నేల మీద పడి దొర్లే దశరథుడితో ఆ పాపాత్మురాలు ఇలా చెప్పింది.
‘ఏమిటిది? నా వరాలని వినగానే పాపం చేసిన వాడిలా దుఃఖిస్తూ నేల మీద పడి ఉన్నావు. నువ్వు మర్యాదని పాటించాలి. సత్యమే ధర్మం అని ధర్మవేత్తలైన వారు అంటారు కదా? నేను కూడా ఆ సత్యానే్న ఆశ్రయించి, నీకు ధర్మం గురించి బోధిస్తున్నాను.
‘రాజా! శైబ్య మహారాజు తన దేహాన్ని డేగకి ఇస్తానని మాట ఇచ్చి, దాన్ని నిలబెట్టుకుని ఉత్తమ లోకాలని పొందాడు. తేజస్సు గల అలర్కుడు వేదపారంగతుడైన బ్రాహ్మణ భిక్షువుకి నిస్సంకోచంగా తన కళ్లని పెకిలించి ఇచ్చాడు. సముద్రుడు కూడా సత్యాన్ని అనుసరిస్తూ ఆటుపోట్ల సమయాల్లో కూడా అతి చిన్న సరిహద్దైన ఒడ్డుని దాటడం లేదు. బ్రహ్మ సత్యం అనే ఒక్క మాట రూపంలో ఉన్నాడు. ధర్మం సత్యం మీదే ఆధారపడి ఉంది. సత్యమే నాశనం లేని వేదాలు. సత్యం ద్వారానే పరమపదాన్ని చేరగలుగుతారు. ఓ పురుష శ్రేష్ఠా! నీ బుద్ధి ధర్మం మీదే స్థిరంగా నిలచి ఉన్నట్లైతే సత్యాన్ని పాటించు. నా వరాలు సఫలం చెయ్యి. వాటిని ఇచ్చిన వాడివి నువ్వే కదా? నువ్వు ధర్మాన్ని నిలుపుకోవాలి. నేను కూడా అదే ప్రేరేపిస్తున్నాను. రాముడ్ని దూరంగా పంపించు. రాజా! నువ్వు మన ఒప్పందం ప్రకారం చెయ్యకపోతే నన్ను వదిలేసినట్లే. నీ ఎదురుగానే ప్రాణాలు విడుస్తాను. (సర్గ-14: 1-10 శ్లోకాలు)
ఆ రెండు సర్గలని బాగా చదువుకుని వచ్చిన ఆశే్లషకి హరిదాసు ఈసారి తక్కువ తప్పులు చెప్పాడని అర్థమైంది. కేవలం మూడు తప్పులే హరిదాసు చెప్పాడు. లేచి ఆ సంగతి ఎవరూ వినకుండా హరిదాసుకి చెప్పాడు.
**
మీకో ప్రశ్న
శ్రీరామ నామం ఎందుకు
తారకమంత్రం అయింది?

**
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

కేకయ సామ్రాజ్యం ఇప్పుడు ఎక్కడ ఉంది?
- పాకిస్తాన్‌లోని తోబా టెక్ సింగ్ సమీపంలో..
**
కిందటి వారం ప్రశ్నలకు జవాబులు
దశరథుడు కైకేయిని నిందించిన ఈ ముఖ్యమైన వాటిని హరిదాసు చెప్పకుండా వదిలేశాడు.
1.ఈ రామ వనవాసం భరతుడికి కూడా ఇష్టమైనట్లైతే నా మరణానంతరం భరతుడు నాకు ప్రేత కార్యాలని చేయకూడదు.
2.ఆడవాళ్లందరూ రహస్యంగా కీడు చేసేవాళ్లే. ఎప్పుడూ స్వలాభమే చూసుకుంటారు అని చెప్పాక దశరథుడు ‘ఐతే నేను అందరు స్ర్తిల గురించి చెప్పడం లేదు. కేవలం భరతుడి తల్లి గురించే చెప్తున్నాను’ అని కూడా చెప్పాడు.
3.నీ కులానికే చిచ్చు పెడుతున్న దానివి.
4.వెనక్కి వెళ్లిన కైకేయి పాదాలని ‘ముట్టుకోకుండానే’ దశరథుడు రోగగ్రస్థుడిలా నేల మీదకి వాలిపోయాడు. కాని హరిదాసు ‘ముట్టుకుని’ అని తప్పుగా చెప్పాడు.
5.ఈ సర్గ ఐపోయింది. కాని హరిదాసు తప్పుగా ‘12వ సర్గలోని మిగిలింది రేపు విందురు గాని’ అనడం తప్పు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి