S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిక్కుప్రశ్న

బాంబే నించి కలకత్తా వెళ్లే రైల్లోని ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంట్లో అమెరికా నించి వచ్చిన బెడెక్ దంపతులు ప్రయాణిస్తున్నారు. వారు ముందు అనుకున్నట్లుగా పేరిస్‌కి కాని, లండన్‌కి కాని కాక తాజ్‌మహల్‌ని చూడటానికి ఇండియాకి వచ్చారు. ఇండియాలోని వేడిని వాళ్లు తట్టుకోలేక పోతున్నారు. బెడెక్ తాము కట్టుకోబోయే ఇంటి ప్లాన్‌ని పరిశీలిస్తూండగా రైలు ఓ చిన్న స్టేషన్‌లో ఆగింది. ఆ బోగీ తలుపు తెరచుకుని తలపాగాలోని ఓ ముసలాయన, చేతిలో కోడి ఉన్న బుట్టతో అందులోకి ఎక్కాడు. ఆయన్ని చూడగానే బెడెక్‌లో క్రోధం పొంగి పొర్లింది.
‘ఇది నీ కంపార్ట్‌మెంట్ కాదు. వెళ్లు’ కోపంగా అరిచాడు.
‘మాఫ్ కరో సాబ్. మాఫ్ కరో’ ఆ కోపం చూసి ఆయన వణుకుతూ చెప్పాడు.
‘వెళ్లమంటున్నానా?’ అతను గొంతు చించుకుని అరిస్తే బెడెక్ భార్య సారా ఆశ్చర్యపోయింది.
‘మీకు ఎందుకంత కోపం? మీరు చెప్పేది అతనికి అర్థం కాదు. అతను భయపడుతున్నాడు’ చెప్పింది.
వెంటనే బెడెక్ ‘ఇంకా కదలవా?’ అంటూ నీళ్ల సీసాని పగలకొట్టి ఆయన మీదకి వెళ్తూంటే సారా తన భర్తని ఆపింది.
ఆ గొడవకి టిసి వచ్చి ఆ ముసలాయనని రెండు పెట్టెల అవతల ఉన్న బోగీలోకి వెళ్లమని సూచించాడు.
‘కదులు’ అంటూ ఆయన మీద అరిచే బెడెక్‌ని చూసి టిసి చెప్పాడు.
‘మీరు ఎందుకలా అరుస్తారు? అతను చదువుకోలేదు. ఈ పెట్టెలోకి ఎక్కకూడదని తెలీదు. మా దేశంలో చాలామంది ఇప్పటి దాకా రైలు ఎక్కలేదు. మొదటిసారి ఎక్కేవారికి ఏ పెట్టెలో ఎక్కాలో తెలీదు. వారికి క్లాసులు ఉంటాయని కూడా తెలీదు’
ఆయన, టిసి వెళ్లిపోయాక సారా తన భర్తని అడిగింది.
‘మీకు ఎందుకింత కోపం వచ్చింది?’
‘టిసి మూర్ఖుడు. ఆ ముసలాడికి తెలీక కాదు. అతని మొహాన్ని నువ్వు గమనించలేదా? హంతకుడి మొహం, హంతకుడి చూపులు, రాత్రి మన గొంతులు కోసి సామాను ఎత్తుకు పోయేవాడు’
‘మీరు స్లీపింగ్ పిల్ వేసుకుని పడుకుంటే మంచిది’ సారా సూచించింది.
‘నేను పిచ్చివాడ్ని కాను. ఆయన చూపుని గ్రహించాను’ బెడెక్ చెప్పాడు.
‘నేనూ మీ చూపుని గ్రహించాను’ సారా కోపంగా చెప్పింది.
‘సరే. నాకా నిద్ర మాత్ర ఇవ్వు. అలవాటు లేని ఈ ఎండకి అప్‌సెట్ అయినట్లున్నాను’
‘మంచి నీళ్లు లేకుండా మాత్రెలా వేసుకుంటారు?’
బెడెక్ తన చేతిలోని పగిలిన సీసాని చూసి ఆశ్చర్యంగా అడిగాడు.
‘ఏం జరిగింది? దీన్ని నేనే పగలకొట్టానా?’
‘అది మీకు గుర్తులేదా?’ సారా ఆశ్చర్యంగా చూసి అడిగింది.
కొద్దిసేపటికి రైలు నారాయణ్‌పూర్ స్టేషన్‌లో ఆగగానే మంచినీళ్ల కోసం రైలు దిగిన బెడెక్ స్టేషన్లోంచి మయటకి వెళ్లే ఆ ముసలాయన్ని చూసి, ‘వాడ్ని చూడు’ అంటూ కోపంగా ఆయన వెంట పడ్డాడు. అది చూసి ఆయన పారిపోతూంటే సారా భర్తని ఆగమని అరిచింది. బెడెక్ ఆగకుండా స్టేషన్లోంచి బయటకి వెళ్లడంతో తనూ రైలు దిగి ఆయన్ని అనుసరించింది. ఆమె అతని కోసం వెదుకుతూ గుమిగూడిన కొందర్ని చూసి అటెళ్లింది. వారి మధ్య నేల మీద అపస్మారకంగా పడున్న బెడెక్ కనిపించాడు.
‘మీలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? దయచేసి ఇంగ్లీష్ తెలిసిన వాళ్లు డాక్టర్‌కి కబురు చేయండి’ గట్టిగా అర్థించింది.
కొద్దిసేపటికి ఓ డాక్టర్ వచ్చి అతన్ని పరిశీలించి జీప్ కోసం కబురు చేసి, అతన్ని తను పనిచేసే మిషనరీ హాస్పిటల్‌కి తీసుకెళ్లే ఏర్పాటు చేశాడు. అది రాగానే బెడెక్ అందులో ఎక్కించారు. జీప్ బయలుదేరుతూండగా యూనిఫాంలోని పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఆమెతో చెప్పాడు.
‘నా పేరు గోవింద్ సింగ్. మీ భర్త పిచ్చివాడిలా ఇక్కడికి పరిగెత్తుకు వచ్చాడని నాకు ఫిర్యాదు అందింది. ఇక్కడ పర్యాటకులు చూసేవి ఏమీ లేవు. ఈ స్టేషన్లో మీరు ఎందుకు దిగారు? నేను మీకేమైనా సహాయం చేయగలనా?’
‘నా భర్త అనుకోకుండా దిగారు’ ఆమె ఆందోళనగా చూస్తూ జవాబు చెప్పింది.
‘ఎందుకు?’
‘నాకు తెలీదు’
‘కనీసం ఆయన ఎందుకు అలా ప్రవర్తించారో తెలుసా?’
‘ఎండ వేడివల్ల అయి ఉండచ్చు’
‘ఆ ముసలాడ్ని నేను వెతికి పట్టుకుని తీరతాను’ బెడెక్ కోపంగా చెప్పాడు.
రైలు కూత పెట్టి బయలుదేరింది.
‘ఎవర్ని?’ గోవింద్‌సింగ్ అడిగాడు.
ఆమె జరిగింది వివరించింది.
‘ఆ ముసలాయన మీద ఎందుకు మీ వారికి కోపం వచ్చిందో తెలుసా?’
‘తెలీదు’
‘ఆయన చేతిలోని కోడిపెట్ట బుట్ట ఉందన్నారా?’
‘అవును. ఉంది’
‘చేతిలో కోడిపెట్టతో రైలు దిగింది కుమార్ ఒక్కడే. అతను దొంగ కాదు. మీ పాస్‌పోర్ట్‌లని చూపించండి’ కోరాడు.
‘మా సామాను రైల్లోనే ఉంది. నా పాస్‌పోర్ట్ నా హేండ్‌బేగ్‌లో ఉంది. తొందర్లో నేను దాన్ని తీసుకోలేదు’
‘ఇది దేనికి?’ బెడెక్ జేబులోంచి తన పాస్‌పోర్ట్‌ని తీసిస్తూ అడిగాడు.
‘నా రిపోర్ట్‌కి. అది పూర్తి చేసాక దీన్ని తెచ్చి మిషనరీ హాస్పిటల్లో మీకు అందజేస్తాను’ చెప్పి గోవింద్‌సింగ్ వెళ్లిపోయాడు.
‘కుమార్ నన్ను చూసి భయపడి ఉంటాడు. అతన్ని చూసి హిట్లర్ని చూసినట్లుగా ఎందుకో బెదిరాను. అసహ్యం, ద్వేషం కలిగాయి. అతను నన్ను చంపబోతున్నాడనే భయం కూడా నాలో కలిగింది. నాకేమైంది?’ బెడెక్ తనని పరిశీలించిన డాక్టర్ని ఆవేదనగా అడిగాడు.
‘మీరు రిలాక్స్ అవాలి. మీ బిపి ఎంత పెరిగిందో నేను చెప్పను. మీకు ఏం కాదు. ఇండియాలోని ఈ భాగంలో ఈ సమయంలో వేడి ఎక్కువ. అందువల్లయి ఉండచ్చు’
గంట తర్వాత గోవింద్‌సింగ్ పాస్‌పోర్ట్‌తో వచ్చి దాన్ని ఇచ్చి చెప్పాడు.
‘మీ ఆరోగ్యం కుదుటపడితే ఈ రాత్రి రైల్లో మీరు వెళ్లచ్చు’
‘కాని కలకత్తా ఎక్స్‌ప్రెస్ నారాయణపూర్లో ఆగదు. పైగా అతను ఇంకో రోజు విశ్రాంతి తీసుకోవడం మంచిది’ డాక్టర్ చెప్పాడు.
‘కనెక్టికట్ నించి వచ్చిన మిస్టర్ అండ్ మిసెస్ బెడెక్ గౌరవార్థం ఈ రాత్రి ఆగుతుంది. పదీ పనె్నండు నిమిషాలకి మీరు రైల్వేస్టేషన్లో సిద్ధంగా ఉండాలి’ గోవింద్‌సింగ్ చెప్పాడు.
అప్పటిదాకా హాస్పిటల్‌లోని ఓ గదిలో తన అబ్జర్వేషన్‌లో ఉండమని డాక్టర్ చెప్పాడు. కొద్దిసేపటికి భోజనం తెచ్చిన సారాకి గదిలో తన భర్త కనపడలేదు. ఎక్కడికి వెళ్లాడో తెలీలేదు.
* * *
బెడెక్ ఓ ఇంటి బయట ఆగి తలుపు తడుతూ గట్టిగా అరిచాడు.
‘బయటకి రా’
ఆ ఇంట్లోని కుమార్‌కి మెలకువ వచ్చింది. గోడకి వేలాడే తుపాకీని తీసి తలుపు వైపు గురి పెట్టాడు. బెడెక్ కిటికీ అద్దం పగలకొట్టి లోపలకి దూకాడు. అతను ఆ వృద్ధుడి మీదకి కత్తితో దాడి చేస్తే కుమార్ ఆత్మరక్షణకి తుపాకీని పేల్చాడు.
కానిస్టేబుల్ వచ్చేసరికి తను చేసిన పనికి విలపించే కుమార్ కనిపించాడు. బెడెక్‌ని వెంటనే మిషనరీ హాస్పిటల్‌కి తరలించారు. అతన్ని పరీక్షించిన డాక్టర్ చెప్పాడు.
‘నేను చేయగలిగేది చేస్తాను. ఈ చిన్న హాస్పిటల్లో కావాల్సిన సదుపాయాలు లేవు’
పక్క గదిలో సారా గోవింద్ సింగ్‌ని అడిగింది.
‘ఎందుకు? మా వారు ఎందుకిలా చేసారు?’
‘కుమార్‌ది కూడా ఇదే ప్రశ్న. ఆయన జీవితకాలంలో ఇదే సంఘటన ఇది వరకు కూడా జరిగింది. ఒకప్పుడు కుమార్, రంజిత్ ఓ అందమైన అమ్మాయి ప్రేమలో పడ్డాడు. రంజిత్‌కి ఆవేశం ఎక్కువ. ఆమె కుమార్‌ని పెళ్లి చేసుకున్న వారానికి కుమార్ ఇంటికి వెళ్లి ఆమెని చంపి, కుమార్ని కూడా చంపే ప్రయత్నం చేశాడు. కుమార్ ఆత్మరక్షణకి రంజిత్‌ని కాల్చి చంపాడు. అతని మెడ మీద ఓ మచ్చ రంజిత్ గుర్తుగా మిగిలింది.’
‘మాకు, దానికి ఏమిటి సంబంధం?’ సారా బాధగా అడిగింది.
‘ఇవాళ జరిగిన విషాదానికి కొంత నా బాధ్యత కూడా ఉంది’
‘మీ బాధ్యతా?’ సారా నివ్వెరపోయింది.
‘అవును. బెడెక్ పాస్‌పోర్ట్‌ని చూడగానే నేను మీరు రైలు ఎక్కేదాకా బెడెక్ వెంట ఉండాల్సింది. కుమార్ రంజిత్‌ని చంపిన తేదీ నాకు బాగా గుర్తు. ఎందుకంటే అది నేను చూసిన మొదటి హత్య కేసు. 17 జులై 1925. పాస్‌పోర్ట్‌లోని మీ భర్త పుట్టిన తేదీ కూడా అదే’
సారాకి అతను ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. అయాక చెప్పింది.
‘ఇది నాకు చిక్కుప్రశ్నలా అనిపిస్తోంది’
డాక్టర్ చేతులు తుడుచుకుంటూ ఆ గదిలోకి వచ్చాడు.
‘మీరు వెళ్లి అతన్ని చూడచ్చు’ చెప్పాడు.
వెంటనే సారా ఆపరేషన్ గదిలోకి పరిగెత్తింది. కొద్ది క్షణాలకి ఆమె గట్టిగా అరవడం ఇద్దరూ విన్నారు.
‘అయిపోయింది. నా వల్ల కాలేదు’ డాక్టర్ చెప్పాడు.
ఓ మనిషి తుది శ్వాస మరో మనిషి తొలి శ్వాస అవుతుంది. ఇండియాలో, ప్రపంచంలో దీన్ని నమ్మేవారు కోట్లమంది ఉంటారు. పగ, ద్వేషపు బీజాలు శ్వాసతో పాటు వెళ్తాయా? దీన్ని తిరస్కరించే వారికి ఇది విధి, కాకతాళీయం అనిపిస్తుంది. కాని మనకి తెలీని ప్రపంచం చాలా ఉందని ఒప్పుకోవాలి. రంజిత్ బెడెక్‌గా పుట్టాడా? అతను మొదట అనుకున్నట్లుగా పేరిస్‌కో, లండన్‌కో వెళ్లకుండా ఇండియాకే రావడం, రైల్లో కుమార్ తారసపడటం కాకతాళీయమా? హాస్పిటల్లోని అతనికి కుమార్ ఇల్లు ఎక్కడ ఉందో ఎవర్నీ అడక్కుండానే ఎలా తెలిసింది? దేవుడికే తెలియాలి.