S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వభావ సంస్కరణతో తొలి అడుగు పడాలి

‘కుతస్త్వా కశ్శల మిదం విషమే సముపస్థితమ్
అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున’
సమయం కాని సమయంలో అంటే అయోగ్య సమయంలో కలవరపాటు, దుఃఖం అనే హృదయ దౌర్బల్యం అర్జునుడ్ని ఆశ్రయించింది అన్నది కృష్ణుడి ఈ పలుకుల సారాంశం. కృష్ణతత్వం ప్రకారం అర్జునుడి ఈ వ్యక్తిత్వం మాలిన్యం సోకినదే. పరలోక ప్రాప్తిని కోరుకునే ఆర్యులకు అసలే తగదు. పైగా క్షాత్ర ధర్మం ప్రకారం ఇటువంటి వ్యక్తిత్వం అపకీర్తికి ఆలవాలం.
‘క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప’
అవును, అర్జునుడు కుంతీపుత్రుడే. కుంతీ మాత అర్జునుడితో పాటు మరో అయిదుగురు యోధుల్ని కన్నతల్లి. ఆరుగురూ క్షాత్ర ధర్మానికి, క్షత్రియ శౌర్యానికి ప్రతీకలే... నాయక లక్షణ భూషితులే. అర్జునుడి తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, వ్యక్తిమత్వాన్ని నఖశిఖ పర్యంతం ఎరిగిన వాడు కృష్ణుడు అంటే, అనుచరుడిని ఆసాంతం చదివిన నాయకుడు కృష్ణుడు. పైగా మొదటి నుండీ తోడూ నీడలా ఉన్నవాడు. శత్రువులకు నిద్రలేమిని కలగజేసే అర్జునుడితడేనా అని అటువంటి కృష్ణుడు సైతం ఒకింత ఆశ్చర్యపోయేలా హృదయ దౌర్బల్యం అర్జునుడ్ని ఆవరించింది. నాయకులకే నాయకుడైన కృష్ణుడికి ఇది అసంబద్ధంగా, అయుక్తంగా, అహేతుకంగా అనిపించింది.
అర్జునుడిలో పొడసూపిన పిరికితనాన్ని, పౌరుషలేమిని నాయక మూర్థన్యుడైన కృష్ణుడు సహించలేక పోయాడు. అందుకే మరో ఆలోచన లేకుండా, మరొక్క అవకాశానికీ తావివ్వకుండా ‘క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని వీడి యుద్ధ సన్నద్ధుడవుకా’ అని ఆదేశించాడు. ఈ ఆదేశం ఒకింత అనునయ పూర్వకం అనిపించినప్పటికీ ఆ వాక్కులలో తిరస్కరించలేని ఆదేశాంశ, శిరసా వహించక తప్పని ఆజ్ఞ మిళితమై ఉంది. కారణం, కృష్ణుడు ‘ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్’ కాబట్టి. సమరానికైనా, సంయమనానికైనా స్వభావ సంస్కరణ తప్పదన్న రహస్యం ఎరిగిన వాడు కాబట్టి.
యుద్ధ్భూమిలో సైతం అర్జునుడ్ని స్వభావరీత్యా అన్ని విధాల సమాయత్తపరచగలవాడు, ప్రభావితం చేయగలవాడు, ఉన్నతంగాను ఆదర్శంగాను నిలబెట్టగల మార్గదర్శి కృష్ణుడు. అంటే, అర్జునుడిలో మానసిక పరివర్తనను తీసుకురాగల నాయక ప్రతిభ ఉన్నవాడు కృష్ణుడు. అర్జునుడిలోని హృదయ దౌర్బల్యాన్ని పోగొట్టి యుద్ధోన్ముఖుడ్ని చేయగల నాయకశోభ సైతం కృష్ణుడి స్వంతం. కాబట్టి అర్జునుడి విషయంలో కృష్ణుడు స్వభావ సంస్కర్త.. ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్. ‘కార్పణ్య దోషోపహత స్వభావః’ అని అర్జునుడు తనకు తానుగా తన వర్తమాన స్వభావాన్ని కృష్ణుడి ముందుంచాడు. కాబట్టి కృష్ణుడి తక్షణ కర్తవ్యం అర్జునుడిలో మానసిక పరివర్తనను తీసుకురావటం. కాబట్టి నాయకుడిగా స్వభావ సంస్కరణకు అనుకున్నాడు. ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్‌గా కృష్ణుడు కర్మక్షేత్రంలో వేసిన తొలి అడుగు ఇది. దీనికి కావలసింది మైండ్ రీడింగ్. మనస్సును చదవగలిగితేనే కదా అర్జునుడి స్వభావంలో పరివర్తనను తీసుకురాగలిగేది.
‘టుక్ కంట్రోల్ ఆఫ్ ది సిట్యుయేషన్ బై కనే్వయింగ్ ఎ క్లియర్ విజన్’ అనేది ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్‌షిప్ లక్షణం. అంటే వర్తమాన పరిస్థితిని, సమకాలీన స్థితిని తన చేతుల్లోకి తీసుకుని సమీప భవిష్యత్తును సత్ఫలితంతో దర్శింపచేయటం అన్నది స్వభావ సంస్కర్త లక్షణం కావాలి. అలాగే అనుచరులలో సమూల మార్పును తీసుకురావటం అన్నది ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్ టార్గెట్ అవుతుంది. అనుచరులలో అనుకూల మార్పులకు అవకాశమివ్వటం అనేది ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్‌కి ఒక ఛాలెంజ్ అవుతుంటుంది.
ఇలా నాయకుడు స్వభావ సంస్కర్తగా త్రిగుణ శోభితుడు కావాలంటే తాను శక్తిమంతుడు అయి ఉండాలి. అంటే ఉల్లాసానికి తన వ్యక్తిత్వమే చిరునామా కావాలి. ఆసక్తిని పెంపొందించటంలో మూర్త్భీవించిన రూపమై ఉండాలి. అనుచరులను ప్రేరేపించటంలో తానే ఒక కాగడా కావాలి. ఒక విధంగా తాను నాయకుడినన్న విషయం మరచి అంతలా కార్యాచరణలో నిమగ్నమై పోవాలి. అనుచరుల విజయమే తన విజయంగా పరిగణించాలి. అవును, అనుచరుడు విజయబాటలో ఒక అడుగు ముందుకు వేశాడంటే నాయకుడూ ముందడుగేసినట్లే! దీనే్న ‘లీడర్స్ అండ్ ఫాలోయర్స్ మేక్ ఈచ్ అదర్ టు అడ్వాన్స్ టు ఎ హయ్యర్ లెవల్ ఆఫ్ మోరల్ అండ్ మోటివేషన్’ అంటుంటాం. కాబట్టే అనుచరులకు స్వభావ సంస్కర్త అయిన నాయకుడి విషయంలో గౌరవమూ ఉంటుంది, విశ్వాసమూ ఉంటుంది, ఆరాధనా ఉంటుంది.
ఒక విధంగా మానసిక సంస్కర్త అయిన ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్ అనుచరుడి దృష్టిలో ధర్మాధికారి. అర్జునుడి దృష్టిలో కృష్ణుడికి మించిన ధర్మాధికారి, వివేక సంపన్నుడు, జ్ఞాన ప్రపూర్ణుడు మరొకడు లేడు. అందుకే అంతటి హృదయ దౌర్బల్యావస్థలోను కృష్ణుడి మాటలను వౌనంగా తలకెక్కించుకున్నాడు.
* ‘మోహ కలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి’
-అవివేక కాలుష్యాన్ని కడిగేసుకోవాలి.
* ‘శ్రుతి విప్రతిపన్నా తే యదాస్థాస్యతి నిశ్చలా’
-సంక్లిష్ట బుద్ధి విక్షేపం, వికల్పం లేకుండా నిశ్చలం కావాలి.
* ‘దుఃఖేష్వనుద్విగ్న మనాస్సుఖేషు విగతస్పృహః వీతరాగ భయ క్రోధః స్థిత ధీర్ముని రుచ్యతే’
- దుఃఖ సమయాలలో సంక్షుభితం కాకూడదు. సుఖాల విషయంలో తృష్ణ పనికిరాదు. ఆసక్తి, భయం, క్రోధం, కోపం, అసూయ, అనుమానం వంటి ఉద్రేక స్వభావం నుండి వైదొలగాలి. ఈ స్థితప్రజ్ఞతే విజయానికి తొలి బాట.
* ‘యస్సర్వత్రా నభి స్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్ నాభి నందతి న ద్వేష్ట తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా’
-శుభ, అశుభ అంశలలో ఆనందం, ద్వేషం పనికిరాదు. సర్వాన్ని సమాశ్వాసించగలగాలి. ఒకేలా ఆదరించగలగాలి. ఈ ప్రజ్ఞా ప్రతిష్టే ధర్మప్రతిష్ఠకు ఆలంబన అవుతుంది.
ఇలా, మానసిక స్థైర్యాన్ని సమకూర్చటాన్ని ‘ఇంటలెక్చుయల్ స్టిములేషన్’ అంటాం. అంటే అనుచరుల్ని బుద్ధికుశలుర్ని చేయటం.. మలచటం. హృదయ దౌర్బల్యంతో ఉన్న అర్జునుడికి తొలుతగా కృష్ణుడు చేసిన బోధలో బౌద్ధిక సంస్కరణ తొలి అంకమైంది.
ఇక, స్వభావ సంస్కరణలో రెండవ అంశం ‘ఇన్‌డివిడ్యుయలైజ్డ్ కన్సిడరేషన్’. అంటే మానసిక సంస్కర్తలైన నాయకులు అనుచరుల విషయంలో వ్యక్తిగతమైన ప్రోద్బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అయితే అనుచరులు తెరచిన పుస్తకం కాగలిగితేనే ఈ బౌద్ధిక సంస్కరణ సాధ్యమయ్యేది. ఈ నేపథ్యంలో నాయకుడు ప్రోత్సహించటాన్ని తన ఊపిరి చేసుకోవాలి.
చూడండి. వైయక్తికంగా కృష్ణుడు అర్జునుడికి ఎంతటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడో-
‘సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజ
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి’
ముందుగ, సుఖదుఃఖే - సుఖాలను, దుఃఖాలను, లాభా లాభౌ - లాభాలను, నష్టాలను, జయాజ - జయాలను, అపజయాలను సమంగా స్వీకరించే మానస సంపన్నుడివి కా.. అంటే రాగద్వేషాలు, భావోద్రేకాలు, భావోద్విగ్నతల ఫలితాల విషయంలో అతీత మానిసివికా.. యుద్ధానికి సమాయత్తం కావటం.. కురుక్షేత్రంలో వెనుతిరగకుండటం తక్షణ కర్తవ్యం.. అలా యుద్ధ క్షేత్రంలో పరాక్రమశీలి వయితే ఏ నిందా నీపై పడదు - అంటాడు. పైగా-
‘యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతమ్’
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీ దృశమ్’
నీ ప్రయత్నంతో, నీ ఇచ్ఛతో రూపుదాల్చింది కాదు ఈ యుద్ధం. నిజానికి ఈ కురుక్షేత్రం తెరచుకున్న ద్వారం వంటిది. సుఖినః క్షత్రియాః - సుఖవంతులైన క్షత్రియులకే అంటే క్షాత్రధర్మాన్ని ఔదలదాల్చే వారికే ఇటువంటి యుద్ధాలు సాధ్యాలు.
‘అథ చేత్త్వ మిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
తతస్స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి’
ఇటువంటి ధర్మయుద్ధంలో కర్తవ్య పరాయణుడివి కాకపోతే స్వధర్మాన్ని, కీర్తిని తుంగలో తొక్కిన వాడవవుతావు.
వ్యక్తిగతంగా జరిగే మంచిని, చెడును చెప్పటం అన్నదే బౌద్ధిక సంస్కరణాభిలాషి అయిన నాయకుడి ప్రతిభ. ఇదెప్పుడు సాధ్యం అంటే ‘ఇన్‌డివిడ్యుయలైజ్డ్ కన్సిడరేషన్’తోనే.
ఇక, ‘ఇన్‌స్పిరేషనల్ మోటివేషన్’ అన్నది మూడవ అంశం. ఈ పద్ధతిని మనం కృష్ణుడు ‘అశోచ్యా నన్వశోచస్త్వం’ - శోకింపదగని వారి గురించి శోకిస్తూన్నావు అనటంలో ప్రస్ఫుటంగా చూడగలం.
‘అపి చేదసి పాపేభ్యస్స ర్వేభ్యః పాప కృత్తమః
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి’
అర్జునా! ఒకవేళ పాపులైన వారి కంటే అధిక పాపాలు చేసిన వాడివి నీవే అయినా కూడా జ్ఞానం వల్ల ఆ పాపాలన్నీ రహితమై పోతాయి. ప్రజ్వరిల్లిన అగ్ని కట్టెల్ని బూడిద చేసినట్లుగా, జ్ఞానం సకల కర్మలను భస్మం చేస్తుంది - ఇలా అర్జునుడి విషయంలో కృష్ణ ప్రేరణ అనేక విధాల సాగుతుంది.
ఇక, నాల్గవ అంశం ‘ఐడియలైజ్డ్ ఇన్‌ఫ్లుయెన్స్’ అంటే, ఆదర్శక ప్రభావం, అనుచరులకు తమ నాయకుడిపై అభిమానం ఉంటుంది, గౌరవరం ఉంటుంది, అటువంటి బౌద్ధిక సంస్కర్తను అనుచరులు మార్గదర్శులుగా చేసుకుంటారు... వారి అడుగులలో అడుగులు వేస్తారు. అర్జునుడు కృష్ణుడిలో ఇన్ని అంశాలు చూడగలిగాడు కాబట్టే కృష్ణుడ్ని తన సర్వస్వ మార్గదర్శిగాను, స్వభావ సంస్కర్తగాను, ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్‌గాను త్రికరణ శుద్ధిగా అంగీకరించి, అనుసరించాడు.
"Transformational Leaders are those who stimulate and inspire followers to both achieve extra ordinary outcomes and, in the process, develop their own Leadership capacity'

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946