S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

మంగెన గంగాధరరావు, ఇరగవరం
నేతాజీ అదృశ్యం లేక మరణంపై ఇన్నాళ్లు పళ్లు నూరిన బి.జె.పి. కాంగ్రెస్ వారి తలని తన్నిందేమిటి? నేతాజీ తైపీలో 1945 విమాన ప్రమాదంలో మరణించారని నేటి బిజెపి వారి కేంద్ర ప్రభుత్వం నమ్ముతున్నానన్నది. అమెరికా - రష్యాలతో నూతన బాంధవ్యాలకై నిజాల్ని సమాధి చేశారా?
అంత లేదు. ప్రభుత్వ యంత్రాంగానికి బుర్ర ఉండదనటానికి ఇదో ఉదాహరణ.

శుభ, కాకినాడ
ఏది దేశభక్తి? ఎవరు జాతి వ్యతిరేకులు? నిర్ణయించేది ఎవరు అని అడుగుతున్నాడు నోబెల్ బుర్ర అమర్త్యసేన్. ఏం చెప్తాం?
అతడైతే కాదు.

పుష్యమీ సాగర్, హైదరాబాద్
మనం తినే బియ్యపు గింజల్ని కూడా కల్తీ చేసి మన దేశ మార్కెట్‌లో విచ్చలవిడిగా వదులుతున్నారు చైనా దేశం వాళ్లు.. గుడ్లు, పాలు, ఇప్పుడు తినే బియ్యం గింజలు.. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా మరి ఎందుకు కల్తీ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తుంది.. చైనా వాళ్లు యుద్ధం చెయ్యకుండా అంతర్గతంగా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి లోబర్చుకోవాలన్న దుర్బుద్ధిని మనవాళ్లు ఎందుకు గుర్తించడం లేదు అంటారు.. బయట ఇప్పుడు ఏది తినాలన్నా భయం వేస్తుంది... ఈ కల్తీని అరికట్టడం ఎలా అంటారు? ప్రజల్లో చైతన్యం రావాలా? లేక ప్రభుత్వమే వీటిని నిషేధించాలి అంటారా..?
దేనికైనా ముందు మన నేతాశ్రీలకు చైనా మీద మోజు పోవాలి. అయిన దానికీ కానిదానికీ చైనీయుల వైపు చూడటం మానాలి. డ్రాగన్ నిజస్వరూపాన్ని మన జనం గుర్తించేట్టు చేయాలి. చవకగా వస్తున్నాయి కదా అని చైనా ఉత్పత్తులను ఎగబడి కొనడం మాన్పించాలి. దానికి పెద్ద ఉద్యమమే రావాలి. కీలెరిగి వాత పెడితే అన్ని రోగాలూ కుదురుతాయి.

విరూపాక్ష, వక్కలంక
దర్శకరత్న ఖాళీ అయింది కదా! ఎవరికి యివ్వవచ్చునంటారు?
‘ఆ నలుగురి’ని అడిగితే సరి!

ఎల్.ప్రపుల్లచంద్ర, ధర్మవరం
మన రాష్ట్రంలో రాహుల్ గాంధీగారి ప్రచారం ఇటీవల గుంటూరులో జరిగిన సభ ద్వారా ఆశించిన ఫలితం ఉంటుందంటారా? మీ అభిప్రాయం?
మైనరు బాబు మేజరయ్యాక చూద్దాం.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
పత్రికలు, ఛానల్సూ ఎంతగా ఎమర్జన్సీని విమర్శించినా అన్ని నెలలు ఎ.పి. (అప్పటి ఆంధ్రప్రదేశ్)లో ఇప్పటి ఎ.పి.లో టి.డి.పి. పాలన కంటే (3 సం. పాలన) చాలా చాలా నయం కాదా? ఇందిరాగాంధి వెట్టిచాకిరీ నిర్మూలనకు పాటుపడిందనేది మీకు తెలియనిది కాదు? ఇందిరాగాంధి వలె మోడిగారు ఇటువంటి అభాగ్యులను ఆ కష్టాల నుంచి రక్షించి వెట్టిచాకిరీని తగ్గించడానికి ఏ మాత్రమైనా చర్యలు తీసుకుంటున్నారా? భూకామందుల కబంధ హస్తాల నుండి ఇందిరాగాంధి రక్షించినట్టే, మోడిగారు కార్పొరేట్ యాజమాన్యాలకు ఏమైనా నష్టాలు కష్టాలు కల్పించారా?
ఇందిరమ్మ చేసిన మంచికంటే, తన పవరు కోసం ఎమర్జన్సీని తెచ్చిపెట్టి అడ్డగోలు అత్యాచారాలను, అణచివేతలను పుణ్యం కట్టుకున్నందువల్ల వాటిల్లిన చేటు వంద రెట్లు ఎక్కువ. మోదీగారు ఆమె బాట పట్టకూడదనే మనం కోరుకోవాలి.

శంకర్, వక్కలంక
చంద్రబాబుగారి ఆధ్వర్యంలో ‘సంతోషానికి ఒక శాఖ’ రూపుదిద్దుకుంటున్నదిట..
ఎవరి సంతోషానికి?

మణియం కె.ఎస్., కర్పగం (చెన్నై)
రైల్వే శాఖ, రైళ్లలో లోయర్ బర్త్‌లను అదనంగా వంద రూపాయలు చెల్లించే వారికి కేటాయించే ప్రతిపాదన ఉంది అని వార్తలు విన వస్తున్నాయ్. వయోవృద్ధులకు, మహిళలకు, చిన్నపిల్లలకు, దైహికంగా ఛాలెంజ్డ్ తదితరులకు మాత్రమే లోయర్ బర్త్‌లు కేటాయించాలి. ఏమంటారు?
ఔను. ఎడాపెడా బాదుళ్లతో రైల్వేలు ఇప్పటికి దండుకుంటున్నది చాలు. లోయర్ బెర్తుల మీదా కాసుల కక్కుర్తి పడకుంటే మేలు.

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
ఎక్కడ చూసినా సెల్‌ఫోన్ వత్తుకుంటూ తమలో తాము ఒంటరిగా ఆనందపరవశం పొందుతూ పిలిచినా పలుకని వ్యవధి లేని నేటి ప్రపంచం తీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది?
ఎవరి పిచ్చి వారికి ఆనందం.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్ - 500003.
: email :
sundaymag@andhrabhoomi.net