S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దివ్యదృష్టి

లూకాస్ టేక్సీని ఆపి కిందకి దిగి ఎదురుగా ఉన్న ఇంటి తలుపుని తట్టాడు. గెరాల్డైన్ వీలర్ తలుపు తెరచి చెప్పింది.
‘లోపలికి రా. నా పెట్టెని తీసుకెళ్లు’
లూకాస్ ఆమె వెంట మెట్లెక్కి పైకి వెళ్లాడు. ఆ ట్రంక్ పెట్టె చాలా బరువుగా ఉంది. దాన్ని భుజాన ఎత్తుకుని అడిగాడు.
‘ఇదొకటేనా మిస్ గెరాల్డైన్?’
‘అవును లూకాస్. మిగిలిన పెట్టెలని ఇప్పటికే క్రూజ్‌కి పంపేసాను. ఇంక బయలుదేరుదాం’
మెడ్వేల్‌లో అతను ఒక్కడే టేక్సీ డ్రైవర్.
ఆమె వెనక్కి తిరగ్గానే లూకాస్ ట్రంక్ పెట్టెని నిశ్శబ్దంగా కిందకి దింపి, ఫైర్ ప్లేస్ పక్కనే ఉన్న పోకర్ని అందుకుని వెనక నించి ఆమె తలమీద బలంగా మోదాడు. అది చేసిన శబ్దానికి ఆమె మరణించిందని అనుకున్నాడు. తన వేలిముద్రలు పోవడానికి ఆ పోకర్ని ఫైర్ ప్లేస్‌లోని నిప్పుల్లో ఉంచి, తర్వాత దాన్ని యథాస్థానంలో ఉంచాడు. తర్వాత ఒంగి కింద పడి ఉన్న ఆమెని పరీక్షించాడు.
ఆమె పోయిందని స్పష్టం కాగానే ఆ శవాన్ని అవలీలగా ఎత్తుకుని, కిందకి దిగి వెనక వంట గది తలుపులోంచి ఆమె ఎస్టేట్‌లో, ఇంటికి దూరంగా ఉన్న చెట్ల మధ్యకి నడిచాడు. సరైన ప్రదేశాన్ని ఎన్నుకుని, కిందకి దింపి టూల్ షెడ్లోకి వెళ్లి పార, గునపాలని తీసుకున్నాడు. ఆమెని పాతిపెట్టాక ఆ చలికాలంలో మొదటిసారి అతనికి చెమట పట్టింది.
* * *
ఏప్రిల్ నెల్లో అతని టేక్సీ మరోసారి గెరాల్డైన్ ఇంటి ముందు ఆగింది. అందులోంచి డేవిడ్, అతని భార్య రొవేనా దిగారు. వర్షంలో తడుస్తూ గుమ్మం దగ్గర తమ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డ ఆంట్ ఫెయిత్‌ని చూశారు.
‘ఆవిడే నా అత్త. జిప్సీ అని ముద్దు పేరు. ఆమె సియాన్స్ గురించి, అతీంద్రియ విద్యల గురించి మాట్లాడుతూంటే మొహాన్ని విసుగ్గా పెట్టకు’ డేవిడ్ చెప్పాడు.
‘ప్రయత్నిస్తాను’ రొవేనా పొడిగా చెప్పింది.
డేవిడ్ ఆడవాళ్లు ఇద్దర్నీ ఒకర్ని మరొకరికి పరిచయం చేశాడు. రొవేనాని చూసి ఆవిడ చెప్పింది.
‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’
లోపల ఫైర్ ప్లేస్ ముందు కూర్చుని, సిగరెట్ తాగుతున్న ఓ వ్యక్తిని ఫెయిత్ ఇద్దరికీ పరిచయం చేసింది.
‘లెఫ్టినెంట్ రీస్.. ఇతను నా మేనల్లుడు డేవిడ్. అతని భార్య రొవేనా’
‘ఇలా కలుస్తున్నందుకు సారీ. ఐతే నేను నా వృత్తి రీత్యా ఇలాంటి సందర్భాల్లోనే కలుస్తూంటాను. మీరు మెడ్వేల్ నించి వలస వెళ్లి ఎంతకాలమైంది?’ రీస్ ప్రశ్నించాడు.
‘పదేళ్లు. అప్పుడప్పుడూ వచ్చి వెళ్తూంటాను. దక్షిణ ప్రాంతంలోని మా కుటుంబ వ్యాపారాన్ని చూసుకుంటున్నాను’
‘మీరూ, మీ సోదరి గెరాల్డైన్ ఆ మిల్లుకి యజమానులు కదా?’ రీస్ ప్రశ్నించాడు.
‘అవును. ఆమె నా సవతి సోదరి. గెరాల్డైన్‌కి, నాకు పెద్దగా పడదు. ఇద్దరం ఒకరికొకరం దూరంగా ఉంటూంటాం. ఆమె మాయమయ్యాక నన్ను కాంటాక్ట్ చేయలేదు. ఆఖరిసారి ఆమెని చూసింది నేను మార్చ్‌లో వచ్చినప్పుడు’
‘అవును. మీ అత్త చెప్పింది. మీ రాకకి కారణం?’
‘పూర్తిగా వ్యాపారం. మిల్లుకి కొత్త యంత్రం కొనడానికి బేంక్ లోన్ తీసుకోడానికి గెరాల్డైన్ కూడా సంతకం చేయాలి. ఆమె నిరాకరించడంతో తిరిగి వర్జీనియాకి వెళ్లిపోయాను’
‘ఆ తర్వాత మళ్లీ చూడలేదా?’
‘లేదు. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా నాకు తెలీదు’
రీస్ వెళ్లిపోయాడు.
‘నాకు ఆశ్చర్యంగా ఉంది. కరీబియన్ ట్రిప్‌కి బుక్ చేసుకుంది. టేక్సీ డ్రైవర్ లూకాస్ ఆమెని రైల్వేస్టేషన్‌కి తీసుకెళ్లడానికి వచ్చాడు. కాని ఇంట్లో లేదు. ఎక్కడా లేదు. ఏమైనట్లు? పోలీసులు హాస్పిటల్స్, మార్చురీలు మొదలైన చోట్ల వెదికారు. ఆమెకి ఏమైందో, ఎక్కడికి వెళ్లిందో ఇంతదాకా తెలీదు. ఎవరైనా దొంగలు చంపారా అంటే ఇంట్లోవి ఏవీ మాయం కాలేదు. లెఫ్టినెంట్ రీస్ చెప్పేది నేను నమ్మను. ఎవరో బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లిపోయి ఉంటుందని అతని అభిప్రాయం’ అంట్ ఫెయిత్ చెప్పింది.
‘రీస్ చెప్పింది నిజం అనుకుంటాం. ట్రక్ డ్రైవరో, గనుల్లో పని చేసేవాడో ఎవడో చవకబారు మగాడై ఉండచ్చు’ రొవేనా చెప్పింది.
‘డేవిడ్! గెరాల్డైన్ ఎక్కడుందో తెలుసుకోడానికి నాకో మార్గం తట్టింది. కాని అందుకు నువ్వు ఒప్పుకోవు. సరే. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా గెరాల్డైన్ ఎక్కడుందో ఐరిస్‌ని అడగదలచుకున్నాను.’
‘ఎవర్ని?’
‘ఐరిస్‌ని. రెండు నెలల క్రితం ఆమె గురించి దినపత్రికలో వార్త వచ్చింది. నీకు రాసిన ఉత్తరాల్లో ఆమె గురించి రాసాను కూడా’
‘ఆంట్ ఫెయిత్. నాకు గుర్తుంది. ఆమె సైకిక్. లేదా అలాంటిది. అనాధ కూడా కదా?’ రొవేనా అడిగింది.
‘ఐరిస్ ప్రభుత్వ ఆధీనంలోని మెడ్వేల్ హోం ఫర్ గర్ల్స్‌లో ఉంటోంది. దానికి నేను వైస్ ఛెయిర్‌పర్సన్‌ని. ఆమె నిజమైన క్లెయిర్‌వాయెంట్. వయసు పదహారు’
‘నిజంగా గెరాల్డైన్ ఎక్కడ ఉందో ఆమె ఏ సియాన్స్ ద్వారానో కనుక్కోగలదా?’ డేవిడ్ అడిగాడు.
‘ఆమె మీడియం కాదు. ఆమెని ఫ్లైండర్ అని పిలవచ్చు. అంటే చూసేది. పోయిన వస్తువులని కాని, మనుషులని కాని కనుక్కునే సమర్థత ఆమెకి ఉంది’
‘ఆమెకి ఆ శక్తి ఎలా వచ్చింది?’ రొవేనా అడిగింది.
‘నాకు తెలీదు. ఐరిస్ కూడా చెప్పలేదు. ఆ హోంలోని సిస్టర్ థెరీసా వస్తువులని ఎక్కడ ఉంచిందో ఎప్పుడూ మర్చిపోతుంటుంది. ఐరిస్ ప్రతీసారి అవి ఎక్కడ ఉన్నాయో సరిగ్గా చెప్తూంటుంది’
‘ఒకోసారి పిల్లల వస్తువులని దాచి తమాషా చేస్తూంటారు’ డేవిడ్ నవ్వి చెప్పాడు.
‘కాని ఇది విను. ఓసారి వాళ్లని క్రాంప్టన్ చెరువుకి పిక్నిక్‌కి తీసుకెళ్లారు. ఎనిమిదేళ్ల డరోథీ మాయమైంది. ఆమె కోసం వెదుకుతూంటే అకస్మాత్తుగా ఐరిస్ పెద్దగా అరవసాగింది. కనుక్కోవడం కొంత బాధాకరంగా ఉంటుందిట. డరోథీ ఉండే ప్రదేశాన్ని వర్ణించింది. అది ఓ చిన్న గుహ. ఆమె చెప్పిన చోట పడి కారుజారి ఉన్న డరోథీని కనుగొన్నారు’
‘దాన్ని పోలీసులకి వదులుదాం. దెయ్యాలతో పెట్టుకోవద్దు’ డేవిడ్ అసంతృప్తిగా చెప్పాడు.
‘నువీ మాట అంటావని నాకు తెలుసు. ఐరిస్ మనింటికి వచ్చి కొన్ని రోజులు ఉండే ఏర్పాటు చేశాను. గెరాల్డైన్ ఆరా ఈ ఇంట్లో ఉంటే ఆమె ఆచూకీ తెలియచ్చని’
‘అంటే ఐరిస్ ఇక్కడికి వస్తుందా?’
‘అవును’
‘నాకు అది ఇష్టం లేదు. ఇది హాస్యాస్పదం’
‘ప్రయత్నించడంలో తప్పు లేదు. ఆ హోం డైరెక్టర్ ఇలాంటివి ప్రోత్సహించకూడదని చెప్పింది. కాని అది భ్రమ కాదు. దేవుడి వరం’ ఫెయిత్ చెప్పింది.
* * *
ఐరిస్‌ది పోనీటైల్. శుభ్రంగా ఉన్న చవక దుస్తుల్ని ధరించింది. డేవిడ్ అయిష్టంగానే ఆ మధ్యాహ్నం ఆ పదహారేళ్ల అమ్మాయిని హోం నించి తీసుకువచ్చాడు. ఐరిస్ వౌనంగా ఇల్లంతా తిరిగి చూసింది. ఫెయిత్ మాయమైన గెరాల్డైన్ ఫొటోని చూపించింది. ఐరిస్ ఎక్కువ కాలం తన గదిలోనే గడుపుతోంది. ఫెయిత్ మూడో రోజు ఐరిస్‌ని అడిగింది.
‘గెరాల్డైన్ ఎక్కడ ఉందో కనుక్కోగలిగావా?’
‘ఈ ఫొటోలోని దుస్తుల్లోనే ఉంది. చాలా దగ్గర్లో ఉన్న భావన కలుగుతోంది. కాని ఇంకా ఆ ప్రదేశం స్పష్టంగా తెలీడంలేదు’
‘ఐరిస్ సాధారణ పిల్లలానే ఉంది. ఇదంతా అబద్ధం’ రొవేనా తన భర్తతో చెప్పింది.
* * *
డేవిడ్ మెడ్వేల్ సూపర్‌బజార్‌కి సరుకులని తీసుకురావడానికి వెళ్తే బయట టేక్సీ డ్రైవర్ లూకాస్ కనిపించాడు.
‘హలో మిస్టర్ డేవిడ్!’ అతను పలకరించాడు.
‘హలో లూకాస్. వ్యాపారం ఎలా ఉంది?’
‘నేను విన్నది నిజమేనా? గెరాల్డైన్‌ని కనుక్కోడానికి ఐరిస్ మీ ఇంటికి వచ్చిందా?’
‘అవును. మా ఆంట్ నేను వద్దంటున్నా రప్పించింది. ఆమెకి ఆ శక్తి లేదని హామీ’
‘కాని ఉందని అంతా అంటున్నారు. డరోథీని సరిగ్గా కనుక్కుందని పేపర్లో రాశారు. గెరాల్డైన్ ఎక్కడ ఉందో ఆమె కనుక్కుంటే మనిద్దరికీ ప్రమాదం. అలా జరక్కుండా చూడండి’ లూకాస్ భయంగా చెప్పాడు.
ఇంటికి వచ్చేసరికి గెరాల్డైన్ దుస్తులు ధరించిన ఐరిస్ కనపడింది.
‘వాటిని ఎందుకు వేసుకున్నావు?’ అతను కోపంగా అడిగాడు.
‘ఆమె ఆరా కోసం. ఇవి సహాయం చేస్తాయని’
‘వెంటనే వాటిని విప్పేయ్. నీకు నా చెల్లెలి దుస్తులు వేసుకునే హక్కు లేదు’ డేవిడ్ కోపంగా అరిచాడు.
‘పాపం. ఈ పిల్ల మనకి సహాయం చేసే ప్రయత్నం చేస్తోంది డేవిడ్. దానికి అడ్డు రాకు. తప్పిపోయిన మూడు పిల్లులని ఐరిస్ కనుక్కుంది. కాబట్టి ఆమె మోసకారి కాదు’ ఆంట్ కోప్పడింది.
‘రెండేళ్ల క్రితం తప్పిపోయిన నా పిల్లి ఈ ఇంట్లో ఎక్కడుందో కనుక్కోగలవా?’ డేవిడ్ అడిగాడు.
వెంటనే ఐరిస్ కళ్లు మూసుకుంది. నడుం నించి అటు, ఇటు కదలసాగింది.
‘వేడిగా ఉంది... చాలా వేడిగా ఉంది.. ఇక్కడ చాలా వేడిగా ఉంది..’ ఐరిస్ గట్టిగా అరిచింది.
‘ఇది నటన’ డేవిడ్ చెప్పాడు.
‘ష్!’ ఆంట్ చెప్పింది.
‘స్టవ్ వెనక పిల్లికి వేడిగా ఉంటుంది’ చెప్పి ఐరిస్ అనేక బాధాకరమైన అరుపులు అరిచింది.
‘ఎలక్ట్రిక్ ఓవెన్ వచ్చాక మనం బేస్‌మెంట్లోని పెద్ద కట్టెల ఇనప కుంపటిని ఉపయోగించడం లేదు. అక్కడ చూద్దాం’ రవీనా వెంటనే వెళ్లి కొద్దిసేపట్లో వచ్చి చెప్పింది.
‘అక్కడ పిల్లి అస్థిపంజరం ఉంది’
డేవిడ్ మొహం వెంటనే పాలిపోయింది.
* * *
ఆ సాయంత్రం ఐరిస్ డేవిడ్‌తో నవ్వుతూ చెప్పింది.
‘నాకు మిసెస్ క్లేటన్ గురించి తెలుసు’
డేవిడ్ ఉలిక్కిపడ్డాడు. అతనికి ఆమెతో కొద్దికాలంగా అక్రమ సంబంధం ఉంది.
‘క్లేటన్? ఎవరు?’ ప్రశ్నించాడు.
‘మీ సెక్రటరీ...’
‘ఇంకాపు’ డేవిడ్ కోపంగా అరిచాడు.
ఐదు రోజుల తర్వాత లూకాస్ మళ్లీ కనిపించినప్పుడు అడిగాడు.
‘ఐరిస్‌ని ఇంకా పంపించలేదే? చచ్చిన నీ పిల్లిని కూడా కనుక్కుందిట కదా?’
‘ఐరిస్ మోసగత్తె లూకాస్. రహస్యంగా అన్నీ వింటూంటుంది’
‘మీరు చెప్పినట్లే గెరాల్డైన్‌ని చంపాను. ఇప్పుడు ఆమె శవం బయటపడితే ఆఖరి సారి ఆమెని చూసానని పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. ఆమె ఇంటికి వెళ్లి చంపానని ఆరోపిస్తారు. పోలీసులు ఆమె ఎక్కడో జీవించి ఉందని భావిస్తున్నంత కాలం నాకు ప్రమాదం ఉండదు. కాబట్టి పంపించేసేయండి’ లూకాస్ అభ్యర్థనగా చెప్పాడు.
‘నా చెల్లెలు మాయమైంది. మళ్లీ తిరిగి రాదు. కాబట్టి భయపడకు’
మరో ఐదు రోజులు డేవిడ్ ఐరిస్ గురించి భయపడ్డాడు. ఆంట్ ఫెయిత్‌కి ఐరిస్ మీద గల నమ్మకం, సహనం అపారం. డేవిడ్ ఆమెని పంపమని కోరినా పంపించలేదు.
‘ఆమె క్లెయిర్‌వాయెంట్ అన్నది నిజం. ఆమె నీ వంక చూసినప్పుడల్లా గమనిస్తున్నాను. నీ మనసులోని ప్రతీ చెడ్డ ఆలోచనా ఐరిస్‌కి తెలిసిపోతున్నట్లుగా నాకు అనిపిస్తోంది’ చెప్పింది.
‘ఆంట్. ఆమె గొప్ప నటి. అంతకు మించి మరేం కాదు. ఇల్లంతా వెతికి ఏది ఎక్కడ ఉందో చూసింది కాబట్టే పిల్లి గురించి చెప్పగలిగింది. లేదా గెరాల్డైన్ ఎక్కడ ఉందో ఈపాటికి చెప్పగలిగేది కదా?’
ఐరిస్ గదిలోంచి బాధాకరమైన అరుపులు వినిపించాయి. వెంటనే ముగ్గురూ ఆమె గదిలోకి వెళ్లారు.
‘ఐరిస్. ఏమైంది? కులాసానా?’ ఫెయిత్ ఆందోళనగా అడిగింది.
ఐరిస్ కళ్లు స్లీప్ వాకర్ కళ్లలా ఎటో చూస్తున్నట్లుగా కనిపించాయి.
‘నేను కులాసానే. నేనింత కాలానికి సిద్ధమయ్యాను. గెరాల్డైన్‌తో కనెక్ట్ అయ్యాను. ఆమె ఎక్కడ ఉందో చెప్పగలను’
వెంటనే ఫెయిత్ లెఫ్టినెంట్ రీస్‌కి ఫోన్ చేసి వెంటనే
రమ్మని కోరింది.
‘ఆంట్! ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఇది అతని డ్యూటీ సమయం కాదు’ డేవిడ్ చెప్పాడు.
‘ఐనా వస్తాడు. చూస్తూండు’
లెఫ్ట్‌నెంట్ రీస్ కొద్దిసేపట్లో వచ్చి ఐరిస్ పక్కన కూర్చున్నాడు.
‘ఆమె ఎప్పుడైనా చెప్పచ్చు రీస్. డేవిడ్. దయచేసి పెద్ద లైట్ ఆర్పేస్తావా?’ ఫెయిత్ అడిగింది.
ఐరిస్ కళ్లు మూసుకుని నడుం పైభాగాన్ని అటు, ఇటు ఊపసాగింది. అంతా నిశ్శబ్దంగా ఆమెనే చూడసాగారు. ఆమె చిన్నగా మూలిగింది.
‘మొదలైంది. చెప్పబోతోంది’ ఫెయిత్ గుసగుసలాడింది.
ఐరిస్ మూలుగు ఎక్కువైంది. బాధాకరమైన అరుపులు అరుస్తూ ఊపిరి గట్టిగా పీల్చుకుని వదలసాగింది. నోటి పక్కనించి నురగ గడ్డం మీదకి కారింది.
‘ఐరిస్‌కి ఫిట్ వచ్చినట్లుంది. చికిత్స చేయాలి’ డేవిడ్ వణికే కంఠంతో చెప్పాడు.
‘కాదు. ఇది ట్రాన్స్ మాత్రమే...’
ఐరిస్ పెద్దగా అరిచింది. ఎంత పెద్దగా అంటే రొవేనా తన చెవులని చేతులతో మూసుకుంది.
‘ఆంట్ ఫెయిత్. ఆంట్ ఫెయిత్. నేను ఇక్కడ ఉన్నాను. వచ్చి సహాయం చేయి. ఇక్కడంతా చీకటి. ఎవరూ సహాయం చేయలేరా?’
ఆ గొంతు ఐరిస్‌ది కాదు.
‘ఎక్కడున్నావు గెరాల్డైన్. ఎక్కడ?’ ఫెయిత్ కళ్లమ్మట నీళ్లు కారుతూంటే అడిగింది.
‘ఆంట్ ఫెయిత్. సహాయం చేయి. ఇక్కడంతా చీకటి. వినపడుతోందా?’
‘వినపడుతోంది. ఎక్కడున్నావో ముందు చెప్పు’
రీస్ లేచి వెళ్లి ఆమె పల్స్‌ని, కుడి కంటి రెప్పని ఎత్తి కనుపాపని చూశాడు.
‘ఐరిస్. నా మాట వినిపిస్తోందా? నువ్వు కులాసానా?’ అడిగాడు.
‘ఎస్ సర్. వినిపిస్తోంది’
‘గెరాల్డైన్ ఎక్కడ ఉందో తెలుసా?’
ఐరిస్ నెమ్మదిగా కళ్లు విప్పి చుట్టూ ఉన్న ముఖాల వంక చూసింది.
‘గెరాల్డైన్ ఎక్కడుంది?’ మళ్లీ ప్రశ్నించాడు.
ఆమె కళ్లు ఎక్కడో దూరంగా చూసినట్లుగా చూసాయి.
‘చాలా దూరంలో ఎక్కడో. ఓడలున్న ప్రదేశం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. కొండలు, ఆకుపచ్చ చెట్లు, వీధుల్లో గంటలు మోగడం విన్నాను’
‘ఓడలున్న చోటా? అలాంటి ప్రదేశాన్ని మీరు గుర్తు పట్టగలిగారా?’ రీస్ ఆంట్, డేవిడ్ల వంక చూస్తూ అడిగాడు.
ఎవరూ జవాబు చెప్పలేదు.
‘అది ఊరు. చాలా దూరంలోని ఊరు’
‘సముద్రం అవతలా?’
‘కాదు. ఇక్కడే. అమెరికాలో ఎక్కడో. ఓడలు, బే, ఆరెంజ్ రంగు బ్రిడ్జ్. నీలం రంగు నీళ్లు...’
‘శాన్‌ఫ్రాన్సిస్కో. అది తప్పకుండా శాన్‌ఫ్రాన్సిస్కోనే’ రొవేనా చెప్పింది.
‘ఐరిస్. అది ఎక్కడో చెప్పాలి. ఈ పెద్ద దేశంలో ఎక్కడని వెతకను. గెరాల్డైన్ నువ్వు చూసింది శాన్‌ఫ్రాన్సిస్కోలోనేనా?’ రీస్ అడిగాడు.
‘ఏమో? వీధుల్లో ట్రాలీలని చూశాను. ఎతె్తైన వీధుల్లో వింతగా ఉన్న ట్రాలీలు పైకి ఎక్కుతున్నాయి’
‘ట్రాలీ కాదు. ట్రామ్. వీధుల్లో గంటలు కొడుతూ ట్రాములు ప్రయాణించేది అక్కడే. గెరాల్డైన్ ఎప్పుడైనా అక్కడికి వెళ్లిందా? తెలిసిన వాళ్లున్నారా?’ రీస్ అడిగాడు.
‘ఎప్పుడూ వెళ్లలేదు, డేవిడ్. గెరాల్డైన్ అక్కడికి ఎందుకు వెళ్లిందో నీకు తెలుసా?’ ఆంట్ అడిగింది.
‘తెలీదు’ డేవిడ్ రిలీఫ్‌గా నవ్వి చెప్పాడు.
తర్వాత లేచి వెళ్లి ఐరిస్ భుజం మీద తట్టి చెప్పాడు.
‘ఐరిస్. నువ్వు నిజమే చెప్పి ఉంటావు. గెరాల్డైన్ దయ్యం నీకు నిజమే చెప్పింది. అవునా?’
‘నేను హోంకి వెళ్తాను. మదర్ రోజ్ కావాలి’ ఐరిస్ చిన్న పిల్లలా ఏడవసాగింది.
* * *
మెడ్వేల్ హోం ఫర్ గర్ల్స్‌లో ఐరిస్‌ని దింపి ఇంటికి వచ్చాక డేవిడ్ నవ్వి చెప్పాడు.
‘గెరాల్డైన్ ఈపాటికి శాన్‌ఫ్రాన్సిస్కో నించి సౌత్ ఈస్ట్‌కి బయలుదేరి ఉండచ్చు’
‘ఐరిస్ ఇంతదాకా ఎన్నడూ అబద్ధం చెప్పలేదు. కాబట్టి పోలీసులు తప్పక గెరాల్డైన్‌ని కనిపెడతారు. అప్పుడు కాని నువ్వు నమ్మవు’ ఖిన్నురాలైన ఫెయిత్ చెప్పింది.
మర్నాడు డేవిడ్ దంపతులు టేక్సీలో రైల్వేస్టేషన్‌కి చేరుకున్నారు. లూకాస్‌కి డబ్బిచ్చాక డేవిడ్ అతన్ని పక్కకి తీసుకెళ్లి రహస్యంగా చెప్పాడు.
‘ఐరిస్‌ని హోంలో దింపేశాం’
‘అంటే గెరాల్డైన్ ఎక్కడ ఉందో చెప్పలేదా?’ లూకాస్ ప్రశ్నించాడు.
‘తెలిస్తేగా?’
‘ఐతే నేను అనవసరంగా భయపడ్డాను. ఆ పని చేయకుండా ఉండాల్సింది’ లూకాస్ చెప్పాడు.
‘ఏమిటి నువ్వనేది?’
‘గెరాల్డైన్‌ని నేను ఎక్కడ పాతానో ఐరిస్ కనుక్కుంటుంది అనుకుని ఆమె కనుక్కోలేని దూర ప్రదేశానికి పంపాను’
‘ఏ దూర ప్రదేశం?’ డేవిడ్ అడిగాడు.
‘నిజానికి నేనిది మీకు చెప్పదలచుకోలేదు. క్రితం వారం ఓ రాత్రి నేను మళ్లీ తవ్వి గెరాల్డైన్ శవాన్ని తీసి, ఆమె ట్రంక్‌పెట్టెలో ఉంచి, దూర ప్రదేశానికి దాన్ని రైల్లో బుక్ చేశాను. చాలా దూర ప్రదేశానికి ఐరిస్ కనుక్కోలేనంత దూరం అది’
‘ఎక్కడికిరా వెధవా? శాన్‌ఫ్రాన్సిస్కోకా?’ డేవిడ్ భయంగా అడిగాడు.
అవునన్నట్లుగా లూకాస్ తల ఊపాడు.
* * *
శాన్‌ఫ్రాన్సిస్కో రైల్వే టెర్మినల్ అన్‌క్లెయిమ్డ్ బేగేజ్ గదిలోని వాసన వేసే ట్రంక్ పెట్టె వంక మఫ్టీలోని ఇద్దరు పోలీసులు చూశారు. ఇద్దరిలోని ఒకరు దాని తాళాన్ని పగులగొట్టి మూతని తెరిచారు. ట్రంక్ పెట్టె మీద జి డబ్ల్యు అనే పొడి అక్షరాలు ఉన్నాయి. గెరాల్డైన్ వీలర్ పొడి అక్షరాలవి.
‘దీన్ని ఎక్కడ బుక్ చేసారు?’
‘మెడ్వేల్ అనే చిన్న గ్రామంలో జార్జ్ లూకాస్ అనే అతను దీన్ని బుక్ చేశాడు’ క్లర్క్ చెప్పాడు.

(హెన్రీ స్లీసర్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి