S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సహనం నాయకుడి లక్షణం

విరుద్ధతులు లేని సృష్టి లేదు. విరుద్ధత చోటు చేసుకోని మానవజన్మ లేదు. విరుద్ధతకు అవకాశం ఇవ్వని సంఘటనా లేదు. ఇలా చూసినప్పుడు ఎంతటి మహిమాన్విత నాయకుడికైనా, ఎంతలా ప్రామాణిక నాయకుడనిపించుకున్నా అంతటి ఆదర్శ మార్గదర్శికి సైతం బాహ్యం, అంతరంగం అనేవి ఉండకపోవు. ఈ రెండూ ఒకే నాణేనికున్న బొమ్మాబొరుసుల్లా నాయకతత్వంపై బాహ్యం, ఆంతర్యం ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. సుఖం, దుఃఖం ‘సన్నికర్ష’లయినపుడు బాహ్యం, ఆంతర్యం కూడా సన్నికర్షలే! చీకటి, వెలుతురు వంటివే ఈ బహిరంగం, అంతరంగం.
బాహ్యం వెల్లడవుతున్నపుడు ఆంతర్యం కాపు కాస్తుంటుంది. అంటే ‘ఔట్‌సైడ్’ లోపల ‘వితిన్’ అనేదీ ‘సబ్‌కాన్షియస్’గా ఉంటూనే ఉంటుంది. అయితే చైతన్యంగా కనిపించే దానిలో ఉపచేతనగా ఉన్న అంశను కాదనలేం. అంటే విరుద్ధతలను రెండు ప్రత్యేక అంశలుగా గుర్తించినప్పటికీ రెంటికీ సమ ప్రాధాన్యత ఇవ్వటం, రెంటినీ తులతూచటం చేయగలవాడే సమర్థ నాయకుడు అవుతాడు.
ఆథంటిక్ లీడర్‌కి ఉండవలసింది బాలెన్సింగ్ నేచర్. ఇంకా చెప్పుకోవాలంటే ‘సహనం’ మూర్త్భీవించిన నాయకుడిలోనే నాయక శోభ ఆకట్టుకునేది. దీనే్న ‘ఆగమా పాయినో నిత్యాస్తాం స్తితిక్షస్వ’ అని అంటాడు కృష్ణుడు. అంటే విరుద్ధతలలోని ఒక దానిని మరొకటి స్పృశించటమే సన్నికర్ష కాబట్టి, నిత్యం కానటువంటి ఈ సంయోగాలను దహిస్తుండాలి అన్నది కృష్ణ ఉవాచ.
నాయకుడు చేసిన ప్రతి పనీ సత్ఫలితాన్ని ఇచ్చినపుడు సదరు నాయకుడు అందరికీ మంచివాడే. ఆదర్శప్రాయుడే!! మార్గదర్శే!! కానీ పది పనులలో రెండు పనులు అనుకున్న ఫలితాలను ఇవ్వనపుడు ఆ రెండింటిని ఆశ్రయించుకున్న వారి దృష్టిలో నాయకుడు అప్రయోజకుడే కావచ్చు. అయితే నాయక శోభితుడైన మార్గదర్శి ఎనభై శాతం సత్ఫలితాలకు పొంగి పోకూడదు, ఇరవై శాతం దుష్ఫలితాలకు కృంగిపోకూడదు. అటు సత్ఫలితమైనా, ఇటు దుష్ఫలితమైనా- ఏదీ శాశ్వతం కాదు. అది ఒక సన్నికర్షణే... సంయోగమే.. రెంటినీ సమాదరించటమే నాయకతత్వం అయి ఉండాలి. అంటే, ఆదర్శ నాయకుడికి కావలసింది వివేక ప్రజ్ఞనే తప్ప మోహావేశం కాదు.
‘సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాత కల్పతే’
అవును, ప్రామాణిక నాయకత్వానికి కావలసింది ఆత్మనిష్ఠ, సమస్పర్శ, సమర్థత, యుక్తాయుక్త వివేచన, ధీరత్వం. ఈ అయిదు లక్షణాలు కలిగిన నాయకుడి తత్వం అమృతత్వమై అలరారుతుంది.
‘వశే హి యస్సేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితం’
నాయకుడు స్థితప్రజ్ఞుడు అయి ఉండాలంటే అతడిలో ఇంద్రియాతీత ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉండాలి.
‘ఇంద్రియాణీంద్రియార్ధే భ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా’
ఇంద్రియ విషయాల నుండి ఇంద్రియాలను ఉపసంహరించుకున్న నాయకుడిలో స్థితప్రజ్ఞత కానవస్తుంది.
కాబట్టి, ఇంద్రియాలను అధీనంలో ఉంచుకోవటం నాయక ప్రామాణికత. ఈ ఇంద్రియ నిగ్రహానికి కారణం ఇంద్రియాలే మనస్సును సవ్యమార్గం నుండి అపసవ్య మార్గం వైపు మళ్లిస్తుంటాయి. కాబట్టి అదే భ్రష్ఠత్వానికి మూల కారణం అవుతుంటుంది. రాగద్వేషాలకు అతీతంగా మనసును వశం చేసుకోగలిగితే మనః ప్రసన్నతతో నాయక వర్ఛస్సుతో మార్గదర్శి కావచ్చు.
మొత్తానికి ద్వంద్వాతీతం కాగల తత్వమే ప్రామాణిక నాయకతత్వం. అంటే విరుద్ధతలకు అతీతం కావటం. అసలు జీవితంలో విరుద్ధతలు, సృష్టిలో ద్వంద్వతలు లేవనుకోవటం భ్రమ తప్ప జీవన వాస్తవం కాదు. రెండింటిలో కూరుకుపోవటం సామాన్య మానవ జీవనం అయితే రెండింటి నుండి ఎదుగుతూ ఇంద్రియాతీత వ్యక్తిత్వానికి ఆకరం కావటం అసామాన్య నాయక లక్షణం. చివరికి అనుచరుల సైతం తమ నాయకుడిని సత్ఫలితాలు పుట్టగానే చూడకూడదు. విజయమే తప్ప అపజయం అంటూ లేని నాయకుడు ఉండడన్న స్ఫురణలో ఉండటం ముఖ్యం.
కాబట్టి, సమర్థ నాయకుడికి సమదృష్టి అత్యంత ఆవశ్యకం.Developing a sense of equanimity enables an individual to master the art of handling the World around us by Managing the World within very well.
అవును. అంతరంగాన్ని అంధిపుచ్చుకున్న నాయకుడికి బాహ్య ప్రపంచాన్ని చదవటమూ, అర్థం చేసుకోవటమూ, సమాయత్తం చేయటమూ పెద్ద కష్టమైన విషయం కాదు. ప్రతిభాశీలి అయిన నాయకుడికి అది అలవోక కార్యమే! ఇటువంటి ప్రతిభాశైలికి మూర్తరూపం కృష్ణుడు.
వ్యక్తిని వ్యక్తిగా చూస్తూ వ్యక్తిలోని ఆంతర్యాన్ని, బాహిరాన్ని క్షీర నీర న్యాయంలా వేరుచేసి చూడగలిగే ప్రతిభా సంపన్నత కృష్ణుడిది. కాబట్టే, కురుక్షేత్రంలో కూలబడ్డ అర్జునుడిలో బాహిర ప్రపంచ సంఘర్షణను అంటే సమస్యాత్మకతను చూస్తూనే అర్జునుడి అంతరంగంలో కొలువై ఉన్న సంస్కారయుత సమాధానమూర్తీని చూడగలిగాడు. ధీరోదాత్త నాయకుడిగా కృష్ణుడికి కావలసింది సమస్యను మోసే హృదయ దౌర్బల్య అర్జునుడు కాదు.. సమస్యకు సంస్కారయుత సమాధానాన్ని ప్రపంచానికి ప్రవచించగల విజయుడు. కాబట్టే, తన గీతోపదేశంతో అర్జునుడికి సమృదష్టిని కలుగజేసి, సమరసింహాన్ని చేశాడు.
నిజానికి, నాయకుడి ప్రథమ కర్తవ్యం కర్తవ్య కర్మను ఎరుకపరచటం. అందుకే కృష్ణుడు అంటాడు ‘కర్మణైవ హి సంసిద్ధి’ అని. అంటే కర్మాచరణ వల్లనే సంసిద్ధి సాధ్యం అని అర్థం. పైగా ‘లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తు మర్హసి’ అపమార్గం నుండి సవ్య మార్గం వైపు మరలించటం అన్నదీ కర్తవ్య కర్మణే - అని.
‘యది స్యహం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః
మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః’
అప్రమత్తతే నాయక లక్షణం.. సోమరితనం, సహచర్యం చేయకూడదు. అప్పుడే సహవాసుల ముందు ‘ఆదర్శం’గా నిలబడగలగటం జరుగుతుంది.. నాయకుడి మార్గం అనుసరణీయ మార్గం అవుతుంది. కాబట్టి, నాయక వర్తనం తలఎత్తుకునేలా ఉండాలే తప్ప తలదించుకునేలా ఉండకూడదు. అంటే, నాయకత్వంలో మార్గదర్శకత్వం, ఆదర్శవంతం, ఆమోదయోగ్యం అనే లక్షణాలు కలసిమెలసి ఉండాలి. అందుకే నా ఉద్దేశంలో ప్రామాణిక నాయకత్వంలో మనస్కృత అంగీకృత నాయకత్వం, మార్గదర్శకత్వ ప్రతిభలతో పాటు కర్తృత్వ బాధ్యత, స్వేచ్ఛ అన్నవీ పెనవేసుకుపోయి ఉంటాయి.
కృష్ణుడి నాయకత్వంలో మార్గదర్శనం, ఆదర్శనీయం అనే సుగుణాలను స్పష్టంగా చూడగలం. కృష్ణుడే అర్జునుడితో అన్న ఈ వాక్యాలను చూడండి.
కృష్ణ నాయకత్వం స్పష్టంగా అర్థమవుతుంది.
‘యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే’
శ్రేష్ఠ పురుషులు, పురుషోత్తములు, ప్రతిభా సంపన్న నాయకులు దేనిని అనుసరిస్తారో అనుచరులు సైతం దానినే అనుసరిస్తారు.. అంటే మార్గదర్శులు, ఆదర్శమూర్తుల అడుగులలో అడుగులు వేస్తారు.
అంతేకాక, పురుషోత్తములు ప్రామాణికంగా పరిగణించిన వాటినే అనుచర వర్గమూ సప్రామాణికంగా తలకెత్తుకుంటుంది. దీనే్న ‘మనం’ అన్‌వేవరింగ్ కమిట్‌మెంట్ టు వాకింగ్ ది టాక్ అంటూంటాం.
అంటే, మాటను చేతను జత కలపటంలో వెనకడుగు పడని ధీరోదాత్తత, అకుంఠిత దీక్ష, అచంచల అంకితత్వం, మూర్త్భీవించిన వాడే ప్రామాణిక ప్రతిభాసంపన్న నాయకుడు. పైగా ప్రామాణికతకు, మార్గదర్శకత్వానికి, ఆదర్శనీయతకు తానే నిలువెత్తు మూర్తరూపం కావలసిన వాడు.. అనుచరవర్గం ఒకే బాటన నడవగలగటమే తన నాయకత్వానికి సాక్ష్యంగా భాసించేవాడు.
ఒక్క మాటలో చెప్పుకోవాలంటే-
తన మాటనే ‘విలువైనది’గా ‘అద్వితీయం’గా పరిగణించే అనుచర వర్గం ఉండటమే ప్రామాణిక నాయకునికి శోభ.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946