S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బుర్ర చించుకుని

గడచిన వారం లోకాభిరామం చదివినా చదవకున్నా ఈ సంగతులు మీకు అర్థమవుతాయి. మన గురించి మనం ఆలోచించ వలసిన అవసరం ఉంది అనుకునే వారంతా ఈ మాటలను గురించి ఆలోచించాలి కూడా.
జీవికి మొదటి నుంచి వచ్చిన పద్ధతుల్లో జాతిని కొనసాగించడం అన్నిటికన్నా మొదటిది. అన్ని జీవులు ఒకేసారి పుట్టాయంటే, అది నమ్మవలసిన సంగతి కాదు. ఇన్ని రకాల జీవులు ఉండడం అవసరమా అని ప్రశ్నిస్తే, జవాబు సులభంగానే దొరుకుతుంది. పూలు పూసినా, తల్లి జంతువు పిల్లకు పాలిచ్చినా, మనుషులు వ్యవసాయం చేసినా, అన్నింటిలోనూ ఒకే ఉద్దేశం. అదే మనుగడ, జాతి కొనసాగింపు! అన్ని జాతులలోనూ ఎక్కడికక్కడ ప్రత్యేకమయిన పద్ధతులు ఉంటాయి. కానీ, జాతులన్నింటినీ కలిపి చూడగలిగితే, ఒక సామాన్య లక్షణం కూడా కనిపిస్తుంది. ఎంత వైవిధ్యం ఉందో, అంతగాను పోలికలూ ఉన్నాయి. మీలాంటి వారు మరొకరు లేరు. ఇవాళ పూచిన ఒక గులాబి ఇంతకు ముందు పూయలేదు, ఇక మీద పూయదు. మీలోను, నాలోనూ, ఆ గులాబీలోనూ ఉండేవి కణాలే, రసాయనాలే! సంవత్సరాల తరబడి జరిగిన పరిణామ క్రమంలో ఈ తీరు ఏర్పడింది. ఇక ముందు కూడా సాగుతుంది. ఇక్కడ సంవత్సరాలు అంటే, మనం ఊహించగలిగినవి కావు.
కోతులు మన తాతలు అని చెపుతుంటారు. అంటే, మనకు రెండు మూడు తరాల పైవి అయినా సరే, అవి తాతలే కావాలి! ఒకరోజు ఒక తాతగారికి మరో కోతి పుట్టింది. ఆ కోతికి సగం మనిషి లక్షణాలు వచ్చాయి. ఆ తరువాతి తరంలో లేదా ఆ తరువాతి తరంలో మనిషి వచ్చాడని చెప్పలేము కదా! చెప్పినా, పిల్లలు కూడా నవ్వుతారు, కాదు పొమ్మంటారు. ఎన్ని తరాలు దాటితే, కోతిలో నుంచి ఇక కోతి కాని మనిషి జాతి వచ్చింది? ఆలోచించగలగాలి. మనకు పరిణామం గురించి చదివినా, చరిత్ర చదివినా, చివరకు కథలు చదివినా, కాలం గురించిన ఈ ధ్యాస ఉండదు. నేను అనే రసాయనాల కుప్ప, ఇంత మాట అనేసిందంటే, ఈ కుప్పలో గొప్పతనం ఇవాళటిది కాదు. ఈ మాట నేను మొదటిసారి అనడం లేదు. ఎన్నాళ్ల నుంచో ఈ ఆలోచన ఉండి ఉంటుంది. ఎంతో మంది ఈ ప్రశ్న అడిగేశారు. జవాబు చెప్పుకున్నారు. నేను కూడా ఆలోచించినందుకు మరోసారి అదే ప్రశ్న అడుగుతున్నాను. మీకు కూడా ఈ విషయం ఇంతకు ముందే తోచి ఉండే అవకాశం ఉంది.
మీరు, నేను అనే ఈ రసాయనం కుప్పలు, ఈ కణాల సమాహారం మరో కొంతకాలంపాటు మన్ని ఉంటుంది అనే అనుకుందాము. జీవం బాధ అంతా మనుగడ గురించే కదా! ఈ కణాలన్నీ కలిసి లక్షలు, కోట్ల రకాలుగా పనులు చేస్తూనే ఉంటాయి. ఆ పనిలో ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఇవాళ వచ్చింది కాదు. ఆ సహకార వ్యవస్థ చరిత్ర వెతికితే బుర్ర చించుకున్నంత పని అవుతుంది. ఆ విషయాలను గురించి ఆలోచించకుండా బతుకుతున్నాము కనుకనే మీరు, నేను, మనమూ మనగలుగుతున్నాము, తెలివిగా కొనసాగుతున్నాము. కొన్ని విషయాలను పట్టించుకోకుంటేనే బాగుంటుంది.
నాలాంటి వాళ్లు మాత్రం బుర్ర చించుకుని, జుట్టు పీక్కుని ఆలోచించడానికి అవకాశం ఉందని అటుగా సాగుతున్నాము. మమ్మల్ని పిచ్చివాళ్లు అన్నా, ఆనందం కిందనే భావిస్తున్నాము. అది వేరే సంగతి గాని, మీరు అనే ఈ అణువుల కుప్ప ఎందుకు అంత కష్టపడి, మీకు ఒక గుర్తింపును ఇస్తున్నది? ఆ పని చేసినందుకు ఆ రసాయనాలకు మెచ్చి మేకతోలు కప్పే వీలు ఏమన్నా ఉందా? అసలు ఆ అణువులకు మీరు ఉన్నారని తెలుసా? పిచ్చి ప్రశ్నలు అనుకోవద్దు. ఈ ప్రశ్నలకు జవాబులు కూడా ఉన్నాయి. రసాయనాలకు వాటి గురించి తెలియదు. అవి ఒకచోట చేరి తయారయిన కణాలకు మాత్రం ఒక పద్ధతి ఉంది. కణాలు ఒకటిగా చేరి తయారయిన మామూలు జీవులకు కూడా పద్ధతి ఉంది. పరిణామం జరిగిన కొద్దీ, జంతువుల తీరు గజిబిజిగా మారినకొద్దీ, వాటిలో కణ సముదాయాలు మొదలయ్యాయి. అంటే, శరీరంలోని అన్ని కణాలు ఒకేలాగ ఉండవని అర్థం. ఒక పనికి ఒక రకంగా రకరకాల కణ సముదాయాలు పుట్టాయి. వాటికి వాటి పనితీరు తెలుసు. పద్ధతి తెలుసు. కణాలు, కణజాలాలు, రకరకాలుగా ఉండాలన్న సమాచారాన్ని కణాలలోనే రసాయనాల ఆధారంగా రాసిపెట్టుకునే పద్ధతి ఏనాడో మొదలయింది. కనుకనే, కణాలు కొనసాగుతున్నాయి. జీవం కొనసాగుతున్నది. జాతులు కొనసాగుతున్నాయి. పరిణామ క్రమంలో చాలా పై స్థాయి అంటున్న మనమూ కొనసాగుతున్నాము. ఇక్కడ ఒక కొత్త ప్రశ్న పుడుతుంది. పరిణామం అంతా మనం అనే మానవ జాతి పుట్టాలని జరిగిందా? ఒకవేళ జరిగితే మధ్యలో మనకు సంబంధం లేని జాతులన్నీ ఎందుకు పుట్టాయి? మనకు, అంటే మనుషులకు తెలివి అన్న ఒక లక్షణం కలుగుతుందని, ఆ లక్షణానికి పని పెట్టాలని పరిణామ క్రమంలో ఎక్కడ నిర్ణయం జరిగింది? ప్రస్తుతానికి సంగతిని పక్కన పెడదాము. ఒక్కటి మాత్రం గుర్తుంచుకుని ముందుకు సాగవచ్చు. జీవం పుట్టిన నాటి నుంచి తీరు నిర్ణయించే పద్ధతి మాత్రం ఆ నిర్మాణంలోనే భాగంగా నడుస్తున్నది! దీన్ని స్వయం పరిపాలన అని అనవచ్చు. జీవి ఎలా ఉండాలన్న నిర్ణయం జీవులే చేసుకున్నాయి!
రసాయనాలకు వాటి ఉనికి తెలియదు. కణాలకు కొంత తెలుసు. శరీరంలో నుంచి రసాయనాలు ఏదో ఒక రకంగా విడిపోగలిగితే, మన శరీరంలోని రసాయనాలకు కూడా మన గురించి తెలియదు! అవి మనలో ఉన్నప్పుడు మాత్రం మన భాగంగానే ఉంటాయి. అంటే, రసాయనాలు జీవిగా మారడంలో, జీవిలో భాగంగా ఉండడంలో విచిత్రమయిన పరిపాలన పద్ధతి ఉందని సులభంగానే అర్థమవుతుంది. మనిషి జీవితానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతికి ఒక హద్దు ఉంది. ఈ మధ్యన మనుషులు ఎక్కువ కాలం బతుకుతున్నారు. అయినా, ఆరు లేదా ఏడు లక్షల గంటలకన్నా, ఎవరూ ఎక్కువగా బతకరు. ఆ గడువేదో పూర్తయితే, అప్పటివరకూ పరిపాలన పద్ధతి ప్రకారం పని చేస్తున్న కణాలు, వాటిలోని రసాయనాలు ఎవరో చెప్పినట్టే చటుక్కున పని మానేస్తాయి. అప్పుడిక ఏదో పద్ధతిలో అవి మళ్లీ మట్టిలో కలుస్తాయి. రసాయనాలు కుప్పగా ఎందుకు, ఎట్లా చేరింది తెలియదు. అవి పని ఎందుకు మానిందీ తెలియదు! మొత్తానికి బతుకంటే ఏమిటి? అన్న ప్రశ్నకు కొత్త జవాబులు కనపడుతున్నట్టు ఉన్నాయి. ఇదీ ఒక రకంగా సంతోషమే!
జీవం, జీవి, చివరకు మనమూ ఏర్పడుతున్న ఈ రసాయనాలు నిజంగా అరుదయినవి మాత్రం కావు. ఇలాంటి రసాయనాలు విశ్వమంతటా పెద్ద ఎత్తున తిరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూచినా, కార్బన్, హైడ్రోజెన్, ఆక్సిజెన్, నైట్రోజెన్ లాంటివి ఉన్నాయి. కొంచెం కాల్షియం, మరింత గంధకం ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. చిత్రంగా, ఈ మామూలు రసాయనాలతోనే మన శరీరం కూడా తయారయింది. అందులో కొన్ని రసాయనాలు చాలా కొంచెంగా ఉంటాయి. అవి కూడా బయట ప్రపంచంలో మామూలుగా దొరికేవే! ప్రపంచంలో ఉన్న రసాయనాలు జీవులు కావు. జీవుల్లో మాత్రం మామూలు రసాయనాలే ఉన్నాయి! మీలో, నాలో ఉన్న రసాయనాలకు ఒకే ఒక ప్రత్యేకత! ఏమిటది చెప్పగలరా? అవి మీకు, నాకు ఉనికిని ఇచ్చాయి! రేపు ఎప్పుడో అవి మట్టిలో కలిస్తే, మళ్లీ మామూలు రసాయనాలు అవుతాయి. శరీరంలోని రసాయనాలు మట్టిలో కలవడానికి మనం చావవలసిన అవసరం లేదు. కనుక భయం లేదు. శరీరంలో ఉన్న రసాయనాలు కొన్ని పోతుంటాయి. కొత్తవి వచ్చి చేరుతుంటాయి. జీవం కొనసాగుతుంది. జీవంలో ఉన్న చిత్రమంటే, అదే!
ఆశ్చర్యపడడానికి మీరు కూడా సిద్ధమయి ఉంటారని అనుకుంటే, కథ మరింత ముందుకు సాగుతుంది.

కె. బి. గోపాలం