S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అదృశ్యం

బ్రిటన్ ఈజిప్ట్‌ని పాలించేప్పుడు ఓసారి ఈజిప్ట్‌లోని కొన్ని ప్రాంతాల్లో కలరా వ్యాధి సోకింది. ఆ రోజుల్లో ఆ వ్యాధితో ఎలా పోరాడాలో తెలీకపోవడంతో వేల మంది మరణించారు. శుభ్రత పాటించని స్థానికులని ముట్టుకోవడానికే యూరోపియన్స్ భయపడేవారు.
బ్రిటీష్ ఆర్మీ నించి రిటైరైన వింటర్‌టన్ పిన్నుల నించి వజ్రాల దాకా ఏదైనా కొంటూ, అమ్ముతూ మనుగడని సాగించేవాడు. అతను ఓ చవక ఇంట్లో నివసించేవాడు. ఎప్పుడూ తెల్లటి దుస్తుల్నే ధరించి, తను గెలుచుకున్న మెడల్స్‌ని జాకెట్‌కి తగిలించుకునేవాడు.
అతని ఆప్తమిత్రుడు హసన్ కార్పెట్లు, సిల్క్, నగిషీ చెప్పులు, బుట్టలు మొదలైన వస్తువులు అమ్మే దుకాణాన్ని నడిపేవాడు. గోధుమరంగు చర్మం, గీయని గడ్డం, నలిగిన దస్తులు ధరించే హసన్ వింటర్‌టన్‌కి వ్యతిరేకంగా కనిపిస్తాడు. ఇద్దరి మధ్యా స్నేహానికి కారణం ఇద్దరు మేథావులవడం, ఇద్దరికీ అతీంద్రియ విషయాల మీద ఆసక్తి ఉండటం. దాని గురించి వాళ్లు తరచూ చర్చించుకునేవారు.
ఓ రోజు ఇద్దరూ ఓ ఒప్పందానికి వచ్చారు. ఆ ఇద్దరిలో ఎవరు ముందుగా మరణిస్తే వాళ్లు తమకి సాధ్యమైతే రెండో వాళ్లకి కనపడాలి. ఆ విషయం మీద చాలా చర్చించుకున్నారు. అందుకు బతికున్న వారు మరణించిన తన మిత్రుడి మీద సంపూర్ణంగా మనసుని కేంద్రీకరించాలి అని కూడా అనుకున్నారు.
కైరోలో వ్యాపించిన కలరా వ్యాధి వింటర్‌టన్‌కి అంటుకుంది. అది తెలీగానే హసన్ అతన్ని చూడటానికి హాస్పిటల్‌కి వెళ్లాడు. కాని అతన్ని హాస్పిటల్లోకి అనుమతించలేదు.
‘ఇప్పటికే డాక్టర్లకి చేతినిండా పనుంది. నువ్వు లోపలికి వెళ్లి రోగుల సంఖ్యని పెంచకు’ వాచ్‌మేన్ చెప్పాడు.
కొద్ది రోజుల తర్వాత వింటర్‌టన్ మరణించాడన్న సమాచారం అతను మరణించిన గంటకల్లా హసన్‌కి తెలిసింది. వెంటనే హసన్ తమ ఒప్పందం ప్రకారం దుకాణాన్ని మూసేసి, ఓ గదిలో ఏకాంతంగా కూర్చుని వింటర్‌టన్ మీదే తన ఆలోచనలని, మనసుని కేంద్రీకరించాడు. ఆశ్చర్యంగా హసన్‌కి తన మిత్రుడు కనిపించాడు. అతనికి భయం, ఆనందం ఒకేసారి కలిగాయి. ఐతే తను చూసేది వింటర్‌టన్ భౌతిక కాయాన్ని కాక సూక్ష్మ శరీరంగా గుర్తించాడు. అతని శరీరం నించి కాంతి వెలువడటం గమనించాడు. హాస్పిటల్లో వాడే డెటాల్ వాసన ఆ గదిలో వ్యాపించింది.
‘మరణానంతరం ఇప్పుడు ఎలా ఉంది?’ హసన్ ప్రశ్నించాడు.
‘నేనింకా మరణించలేదు. నీ దగ్గరికి రావడానికి గల కారణం అదే. జీవించి ఉన్న నన్ను వాళ్లు పాతిపెట్టబోతున్నారు’
హాస్పిటల్లో ఒక్కో డాక్టర్ వందల కొద్దీ రోగులకి చికిత్స చేయాల్సి రావడంతో రగో మరణించాడా, లేదా అని వాళ్లు చక్కగా పరీక్షించే తీరిక లేదని హసన్ చూశాడు. కొందరు జీవించి ఉండగానే పాతిపెట్టబడుతున్నారనే ఆలోచనకి అతను భయంతో వణికిపోయాడు.
‘నన్ను హాస్పిటల్లో ఎడ్మిట్ చేసాక నిన్న కళ్లు తెరిచి రెప్పవాల్చకుండా చూస్తూండిపోయాను. బహుశ నా శరీరం కూడా చల్లబడి ఉండచ్చు. ఐనా నేను చావలేదని నాకు తెలుసు. నా చుట్టూ ఏం జరుగుతోందో నాకు తెలిసినా మాట్లాడలేకపోయాను. డాక్టర్ నా శవాన్ని తొలగించమని అటెండెంట్‌కి చెప్పాడు. అప్పుడు మన ఒప్పందం గుర్తొచ్చి మనసుని నీ మీదే కేంద్రీకరించాను. నా దేహాన్ని వదిలి ఏదో అయస్కాంత శక్తి లాగినట్లుగా ఇక్కడికి వచ్చాను. కాబట్టి నువ్వు నన్ను పూడ్చడాన్ని ఆపాలి’
వింటర్‌టన్ క్రమంగా మాయం అయ్యాడు.
అది తన ఊహ లేక నిజంగా జరిగిందా అని హసన్ ఆలోచించాడు. అతను మళ్లీ వస్తాడా? ఒకవేళ నిజంగా మరణించి జీవించే ఉన్నానని అనుకుంటున్నాడా? వెంటనే హసన్ ఆ రాత్రే హాస్పిటల్‌కి చేరుకున్నాడు. వింటర్‌టన్‌ని అప్పటికే మార్చురీకి తరలించారని తెలిసింది. మర్నాడు ఉదయం కాని మార్చురీ అటెండెంట్ రాడని తెలిసి ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు.
వింటర్‌టన్ తన ముందు ప్రత్యక్షమైనప్పుడు వచ్చిన డెట్టాల్ వాసనే హసన్‌కి మార్చురీలో వేసింది. దాంతో వింటర్‌టన్ దేహం అక్కడే ఉందని హసన్ నమ్మాడు. మార్చురీ అటెండెంట్ వృద్ధుడు. తెల్లవాడైన వింటర్‌టన్ శవం అతనికి గుర్తుంది.
తన మిత్రుడు బతికే ఉన్నాడని, అతన్ని చూడాలని హసన్ చెప్తే ఆ వృద్ధుడు పిచ్చివాడిని చూసినట్లుగా చూశాడు.
‘అందుకు ఏదైనా కారణం ఉందా? అతని వంటి మీద విలువైన వస్తువులు ఏమీ లేవు’ చెప్పాడు.
‘వస్తువుల కోసం కాదు. అతని శవాన్ని చూడాలి. అదింకా ఉందా?’ హసన్ అడిగాడు.
‘నాకు తెలీదు’ అటెండెంట్ చెప్పాడు.
‘ఎందుకు తెలీదు? అతని శవం ఎక్కడ ఉంచావో అక్కడికి వెళ్దాం పద’ హసన్ గద్దించాడు.
‘అది మాయమైంది’ ఆ వృద్ధుడు నెమ్మదిగా చెప్పాడు.
హసన్ నమ్మలేనట్లుగా చూస్తే ఆ వృద్ధుడు వివరించాడు.
‘డెట్టాల్ వాసన పడక నేను తరచూ మార్చురీ తలుపు తాళం వేసి బయట కూర్చుంటాను. నిన్న రాత్రి ఏడు గంటలకి అలా కాసేపు బయట కూర్చున్నాక లోపలకి వెళ్లి చూస్తే అతని శవం లేదు’
‘అంటే అతను చావలేదా?’ హసన్ ప్రశ్నించాడు.
‘పోయాడు. నాకు శవాలతో చాలా అనుభవం కాబట్టి అది గట్టిగా చెప్పగలను’
‘కలరాతో మరణించిన వాడి శవాన్ని పిచ్చివాడు కూడా దొంగిలించడు. మరి ఎలా మాయమైంది?’
‘తలుపు మూసానని చెప్పాగా. నేను తిరిగి వచ్చాక లోపల నించి బోల్ట్ పెట్టిన వెంటిలేటర్ తలుపు తెరచి ఉండటం చూశాను. శవాలని లెక్కపెడితే వింటర్‌టన్ శవం మాయమైంది’
‘అందులో అతను పడతాడా?’
‘రోగంతో చిక్కిపోయాడు కాబట్టి పడతాడు. అలా తప్ప ఇంకో విధంగా మాయం అవలేడు. కాని నేను లేనప్పుడు ఏం జరిగిందో మాత్రం నాకు తెలీదు. ఇది బయటపడితే నా ఉద్యోగం పోతుంది. దయచేసి ఎవరికీ చెప్పకండి’
‘అలాగే. ఏదైనా పొరపాటు జరిగితే అది నువ్వు కావాలని చేసింది కాదు’ హామీ ఇచ్చి హసన్ తన దుకాణానికి తిరిగి వచ్చాడు.
వింటర్‌టన్ ఎవరికీ మళ్లీ ఎన్నడూ కనపడలేదు. హాస్పిటల్ నించి పారిపోయాక వీధుల్లో ఎక్కడైనా మరణించాడా? లేదా జీవించి ఇంకెక్కడికైనా వెళ్లాడా? హసన్ తన ఆలోచనలని అతని మీద కేంద్రీకరించినా అతని సూక్ష్మ శరీరం మళ్లీ కనపడలేదు. వింటర్‌టన్ ఏమయ్యాడో దేవుడికే తెలియాలి.