S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంకల్ప సిద్ధులు.. సంగీత రసజ్ఞులు (అమృతవర్షణి)

సంకల్పాలు అనేక విధాలు. మన పూర్వీకులంద జేసిన సాంస్కృతిక సంపదను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే తపన ఏ కొద్దిమందికో గాని ఉండదు.
అసలు సమాజ హితం కోరే వారెందరు? తాను మాత్రమే సుఖంగా ఉండాలి, తన కుటుంబం హాయిగా ఉండాలనలుకునేవారే ఎక్కువ. వారి స్వార్థం ముందు అన్నీ దిగదుడుపే.
ప్రతి మనిషీ తన్నుత్తముడనుకుంటాడు. పక్క వాడి సంగతి పట్టించుకునే వాళ్లెందరు? కానీ కొందరి సంకల్పాలు మాత్రం చాలా బలంగా ఉంటాయి. మంచి సంకల్పానికి దైవం సహకరిస్తూనే ఉంటాడు అనేందుకు ఒక చిన్న ఉదాహరణ. వంద సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో చాలామంది సామాన్యులకు సంగీతం నేర్చుకునే అవకాశాల్లేవు. సంగీతం నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉన్న వాళ్లకి సరియైన గురువు దొరికి ఆయన దయ కలిగితే.. గురుసేవ చేసుకుంటూ గురుకుల పద్ధతిలో సంగీత విద్యాభ్యాసం చేసేవారు.
అంతవరకూ ఎందుకు.. 1948లో రేడియో కేంద్రం ఏర్పడేవరకూ, సామాన్య జన బాహుళ్యానికి మహా విద్వాంసుల సంగీతం వినే భాగ్యం కూడా ఉండేది కాదు.
రాజాస్థానాల్లో ఏ మహారాజులో, చక్రవర్తులో లేదా వారి పరివారమో సంగీతం వారొక్కరే వినేవారు. మన తెలుగుదేశంలో అటువంటి కళాపోషణ చేసిన వారిలో అప్పట్లో విజయనగర సంస్థానాధీశులదే ఈ విషయంలో అగ్రస్థానం. అంతే కాదు, మన ప్రాంతంలో సంగీత కళాశాల ముందు ఏర్పడినది విజయనగరంలోనే.
హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకట స్వామి నాయుడు, పప్పు వెంకన్న, కర్రి పద్మనాభస్వామి, కవిగొట్ల కామరాజు, వాసా పెదరామయ్య, కట్టు సూర్యనారాయణ, పేరి రామ్మూర్తి, పట్రాయిని సీతారామశాస్ర్తీ, చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ వంటి సంగీత జ్ఞానం పుష్కలంగా ఉన్నవారూ, బొబ్బిలి మహాలక్ష్మి, సరిదె లక్ష్మ నరసమ్మ (కళావర్ రింగ్) వంటి సంగీత నాట్యాలలో అనుభవం కలిగిన నర్తకీ మణులతో ఆనంద గజపతి పరిపాలనా కాలం ఒక వెలుగు వెలిగింది. సంగీత కళాశాల విద్వాంసులతో నిండిపోయేది. అదొక వైభవం.
అసలు విజయనగరంలో సంగీత కళాశాల ఆవిర్భావమే ఒక మహాసంకల్ప సిద్ధుని వల్ల జరిగింది.
ఆయనే విజయ రామ గజపతి. ఆయన కొలువులో వున్న ఓ ఉద్యోగి పేరు జోగారావు. మహారాజుకు ఈతనంటే చాలా ప్రియం. జోగారావు దంపతులకు ఓ బిడ్డ పుట్టాడు. అతడికి గంగబాబు అని పేరు పెట్టాడు. ఆ పిల్లాడు పుట్టినందుకు సంతోషం ఒకవైపు కానీ ఆ బిడ్డకు భగవంతుడు చూపు ఇవ్వనందుకు బాధ. ఆ బెంగతో ఓ రోజు మహారాజు ఎదురుగా దీన వదనంతో నిలబడ్డ జోగారావును ఒక్కసారి చూశాడు. మహారాజు హృదయం ద్రవించింది. నిశే్చష్టుడై ఒక్క క్షణకాలం ఆలోచించాడు. మెరుపు లాంటి ఆలోచన తళుక్కున మెరిసింది. ఆప్యాయంగా దగ్గరకు పిలిచి ‘చూడు జోగారావ్! ఈ చిరంజీవిని గురించి నువ్వేమీ బెంగపడకు. దిగులు చెందకు. నేనున్నానుగా! మన ఊళ్లోనే ఓ సంగీత పాఠశాల పెడ్దాం. అందులో నీ పిల్లవాడు హాయిగా సంగీతం నేర్చుకుని ప్రయోజకుడౌతాడని ధైర్యం చెప్పి పంపించాడు. మహారాజు అమృతవాక్కు ఫలించింది.
అనతికాలంలో శ్రీ విజయ రామ సంగీత నృత్య కళాశాలగా 1919లో ఆవిర్భవించింది. అక్కడ సంగీతాభ్యాసం చేస్తూ పెరిగి పెద్దవాడైన ‘చాగంటి గంగబాబు’ ద్వారం వెంకటస్వామి నాయుడికి అనుంగు శిష్యుడై పేరు సంపాదించుకున్నాడు. అత్యద్భుతమైన మేధస్సు, శ్రుతిజ్ఞానం, లయ జ్ఞానం కలిగి నాయుడు గారితో సమానమైన విద్వత్తును కైవసం చేసుకున్నాడు ‘చాగంటి గంగబాబు.’
ఒకవైపు మారెళ్ల కేశవరావు, మరోవైపు గంగరాజు, ఒకరా! యిద్దరా! ఇంకా అనేక మంది శిష్యులతో ఆ సంగీత కళాశాల ప్రాంగణం సరస్వతీ నిలయంగా మారిపోయేది. నాయుడు గారితో వున్న రోజుల్లో సంగీత కళానిధి డా.శ్రీపాద పినాకపాణి వంటి అనేక మంది ఈ చాగంటి గంగబాబు శిష్యరికం చేసినవారే.
కేవలం అంధుడైన ఒక వ్యక్తి అభ్యున్నతికి ఏకంగా సంగీత పాఠశాలనే నెలకొల్పడం, ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కాదూ! అదిగో అలా విజయనగర ప్రభువైన పూసపాటి విజయ రామ గజపతిరాజు (4వ) సంకల్పంతో ఏర్పడ్డ సంగీత కళాశాల నుంచి ఎందరో విద్వాంసులు, గాయకులు తయారయ్యారు. ఘంటసాల, పి.సుశీల ఈ కళాశాల నుంచి వచ్చిన వారేనన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందుకే అన్నమయ్య ‘విత్తొకటి పెట్టితేను వేరొకటి మొలుచునా’ అంటాడు.
* * *
విత్తం వుంటే సరిపోదు. వితరణ ఉండాలి. ధనికుడై ఫలమేది? ధర్మము సేయుదాకా! అంటాడు అన్నమయ్య. లోకంలో ఎంతమంది ధనికులు లేరు? కానీ గాయకుల పాలిటి కల్పతరువుగా నాలుగున్నర దశాబ్దాలపాటు ఒక సంగీత సభను విజయవంతంగా నడిపించి గాయక లోకాన్ని ఉద్ధరించిన కళాపోషకుడు కొమ్మిరెడ్డి సూర్యనారాయణ మూర్తి నాయుడు. ఈయన పేరు తెలియని విద్వాంసులు లేరు. సంగీత రసికులుండరు. విద్యాపోషణ, విద్వాంసుల పోషణ కోసమే కంకణం కట్టుకున్న ధీశాలి, వజ్రసంకల్పుడు.
హిమాలయాల్లో వున్నా, కన్యాకుమారిలో వున్నా సరే, విద్వాంసుడున్నాడంటే చాలు, ఎంత ఖర్చైనా వెనకాడకుండా వారిని రప్పించి, ఆంధ్రదేశంలోని సంగీత రసికులకు ఆయన గాత్రం వినిపిస్తే గాని, ఆయన మనసు ఆగేది కాదు, నిద్ర పట్టేది కాదంటే నమ్మండి. అంతేకాదు. యువ గాయకులు పాడుతోంటే ఆయనకెంతో ఆనందం, అలవికానంత సంతోషం. వారి చిరునామాలు తెలుసుకుని కాకినాడ పిలిపించి పాడించుకుని ఆశీర్వదించి మరీ పంపేవాడు, నాయుడుగారు.
ఒకప్పుడు కాకినాడ సంగీత సరస్వతికి ప్రధాన స్థానం. మహా ప్రసిద్ధులైన విద్వాంసుల గానం వినగలిగే భాగ్యం అక్కడే దొరికేది. ఆయన ఆ కాలంలో బాగా పేరు మోసిన దక్షిణదేశపు ప్రముఖ విద్వాంసుల సంగీతం చెన్నపట్నం వెళ్లి విని వస్తూండేవాడు. అటువంటి ఘనమైన సంగీతం తెలుగు వారిక్కూడా వినిపించాలనే విపరీతమైన అభిలాష - మన వారు కూడా వారి స్థాయిలో బాగా పాడాలనే కోరిక. తనకు పరిచయం వున్న పోలవరం జమీందారు కృష్ణారావు, పిఠాపురం రాజావారు, బొబ్బిలి, విజయనగరం మహారాజా వార్ల సహకారం తీసుకుని 1904లో కాకినాడలో సరస్వతీ గానసభ స్థాపించారు. శతాబ్ద కాలంగా ఈ సభ నడుస్తూనే ఉంది. ప్రతి సంవత్సరమూ అప్పట్లో దసరాల్లో పది రోజులూ సంగీత కచేరీలు జరిగేవి. ఇప్పుడూ జరుగుతున్నాయి. ఇవాళ కాకినాడలోని సూర్యకళా మందిరం ఆవిర్భావానికి ముఖ్య కారకుడు ప్రముఖ సినీ దర్శకుడు కీ.శే.సి.పుల్లయ్య. లక్కరాజు సుబ్బారావు, ఎన్.వి.శాస్ర్తీ, పుల్లయ్య గారి అల్లుడు శ్రీనివాసరావు.
దక్షిణాదిలో పేరున్న కోనేరి రాజపురం వైద్యనాథ భాగవతార్, రామ్నాస్ శ్రీనివాసయ్యంగార్, మధురై పుష్పవనం అయ్యర్ లాంటి వారి కచేరీలతో జనం పరవశించి వినేవారు. మైక్రోఫోన్లు లేవు. కూర్చునేందుకు కుర్చీలు కూడా లేకుండా గంటల తరబడి సాగే కచేరీలు వినేవారంటే నమ్మండి. దసరాల్లో మొదటి ఐదు రోజులూ ఆంధ్ర విద్వాంసుల కచేరీలు, మిగతా రోజుల్లో తమిళ, కర్ణాటక, కేరళ విద్వాంసుల కచేరీలూ వుండేవి.
తుమరాడ సంగమేశ్వర శాస్ర్తీ వీణా కచేరీ, ఆదిభట్ల నారాయణ దాసుగారి హరికథ, ద్వారం నాయుడు గారి వయొలిన్ వాద్యం, ఇంకా అరియక్కుడి రామానుజయ్యంగార్, తిరుచ్చి గోవిందస్వామి పిళ్లె, కాంచీపురం నైనా పిళ్లై, తిరుక్కోడికావల్ కృష్ణయ్యర్ వంటి మేధావుల కచేరీలు జరిగేవి. మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ కంటే ముందే ప్రారంభమై, ఈ రోజుకీ ఈ సభ దిగ్విజయంగా నడుస్తూ సంగీత సేవ చేస్తూండటం గమనార్హం. మొన్న మొన్నటివరకూ మునుగంటి శ్రీరామమూర్తి కార్యదర్శిగా ఈ సభ నిర్వహించబడుతూ కొమ్మిరెడ్డి సూర్యనారాయణ మూర్తి స్ఫూర్తితో ‘గానకళ’ పేరుతో కేవలం సంగీతం కోసం ఆయన సంగీత మాసపత్రికను ప్రారంభించడం విశేషం. గత 52 ఏళ్లుగా నడుస్తున్న పత్రిక ఇది. కాకినాడలోనే మరో సంగీత సభ శ్రీరామ గానసమాజం కూడా ఇదే స్ఫూర్తితో గత శతాబ్దంన్నర నుండి పని చేయడం సంగీత రసికుల అదృష్టం.
‘వక్తా శ్రోతాచ దుర్లభా’ అంటారు. ఎంత ప్రజ్ఞా ప్రాభవాలున్నా, వినేవాడుంటేనే చెప్పేవాడి మాటకు విలువ. అలాగే వినేవాడుంటేనే పాడే గాయకుడి ప్రతిభ.
ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి సభలు నిర్వహిస్తున్నా రసజ్ఞులైన శ్రోతలుండకపోతే నిర్వాహకుల కంత కంటే నిరాశ మరోటి ఉండదు. కూర్చుని వినడానికి పెట్టుబడి కావాలా? నేర్చుకున్న దాని కంటే ఎప్పుడూ వినటం వల్లనే సంగీత జ్ఞానం పెరుగుతుంది. గురువు చెప్పేది తక్కువ. వినవలసినదే ఎక్కువ - అని అందరికీ తెలిసిన విషయమే. వినగా వినగా పాడగలిగేది సినిమా సంగీతం ఒక్కటే. శ్రమపడి సాధన చేస్తే తప్ప లభించనిదీ, సిద్ధించనిదీ సంప్రదాయ సంగీత శాస్త్ర జ్ఞానం. దీనికి ‘దగ్గర దారులు యింతవరకూ కనిపెట్టబడలేదు.
మన ఆంధ్రదేశంలో 70, 80 ఏళ్ల క్రితం ఏలూరు అటు కాకినాడ, భీమవరం, తెనాలి ప్రాంతాల్లో ఏవో 5,6 చోట్ల మాత్రమే త్యాగరాజు పేరుతో ఉత్సవాలు జరిగేవి. నిలకడైన సభలు చాలా తక్కువే.
సంప్రదాయ సంగీతం మీద అనురక్తి శ్రోతలకుండాలి.
ఏ ఒకరిద్దరికో ఉంటే సరిపోదు - రసికులకూ ఉండాలి. నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులనేకం. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడీ నిలబడీ వేంకటేశ్వర స్వామిని నాలుగు క్షణాలు దర్శించగానే ఒక్కసారిగా శ్రమ ఎలా మరిచిపోతారో, మంచి సంగీతం విన్నప్పుడు కలిగే ఆ అనుభూతుల కోసం చాతక పక్షుల్లా కూర్చుని, ఇబ్బందుల్ని పట్టించుకోని సభా నిర్వాహకులూ ఉన్నారు. నిజానికి వెనుకటి తరంలో సంగీత సభలు అలాగే నిర్వహించేవారు. వారి చిత్తశుద్ధే ప్రధాన ఆకర్షణ. విద్వాంసులు కూడా అలాగే పాడేవారు. రసజ్ఞులు మెచ్చిన సంగీతం వాళ్లది. అటువంటి సభల్లో పాడటమే గౌరవంగా భావించేవారు. కాకినాడ సరస్వతీ గాన సభ ఆ నవరాత్రి ఉత్సవాల వైభోగమే వేరు. సంగీత విద్యార్థులు అలంకారాలు నేర్చే దశలో వున్నా, గీతాలు పాడినా, వారికి కాంప్లిమెంటరీ టిక్కెట్లు ఇచ్చి శ్రద్ధగా కచేరీలు వినమనేవారు నాయుడు.
వారింటి ఆవరణలోని నేలమాళిగలోని ఒక చిన్న గదిలో కోనేరి రాజపురం వైద్యనాథయ్యర్ సాధకం చేస్తూండటం చూశానన్నారు డాక్టర్ పినాకపాణి. అంతేకాదు - వీణ ధనమ్మాళ్ కాకినాడలో కొన్నాళ్లున్నారు. నాయుడు గారు వీణ ధనమ్మాళ్ వీణ వాయిస్తూ పాడే క్షేత్రయ్య పదాలు తన్మయత్వంతో వినడం నేనెరుగుదునన్నారు. అటువంటి సంగీత రసజ్ఞుడు, కళా పోషకులు చాలా అరుదుగా ఉంటారు.
* * *
కేవలం స్వయంకృషితో మృదంగ విద్య సాధించి, పళని సుబ్రహ్మణ్య పిళ్లై, మన తెలుగువాడైన వారణాసి ఘంటయ్య శాస్ర్తీ వల్ల ప్రభావితుడై శాస్ర్తియ సంగీతాన్ని ప్రజల్లో బహుళ వ్యాప్తంగా ప్రచారం చేయ సంకల్పించిన మరో వజ్ర సంకల్పుడు. సిద్ధ సంకల్పుడు, ఏలూరులోని కంభమెట్టు వెంకట సుబ్బారావు (1910-1995). వృత్తి రీత్యా చార్టెర్డ్ అకౌంటెంట్ అయినా ఆయన ప్రవృత్తి సంగీతం. ఒక దానికి మరో దానికీ సంబంధం లేదు. ఆయనకు మృదంగ వాద్యమంటే మక్కువ. కృషి వుంటే మనుషులు మహా పురుషులౌతారనేది ఇటువంటి వారి పట్ల ఎంతో నిజమనిపిస్తుంది. మృదంగ వాద్యంలో నిష్ణాతుడై, కేవలం సంగీతం పట్ల అనురక్తితో 1947 సం.లో ఏలూరులో ఆయన స్థాపించిన త్యాగరాజ గానసభ దీనికి సాక్ష్యం. లాభాపేక్ష లేకుండా పది మందికీ సంగీత మాధుర్యం వినిపింపచేయాలనేదే ఆయన సంకల్పం. వీరిని స్ఫూర్తిగా తీసుకుని అప్పట్లో మన రాష్ట్రంలో చాలా సంగీత సభలు వెలిశాయి. అర్ధశతాబ్దానికి పైగా ఈ సభ దిగ్విజయంగా నడిచింది.

చిత్రాలు.. కె.వి.సుబ్బారావు *కొమ్మిరెడ్డి సూర్యనారాయణ *విజయరామ గజపతి- 4

- మల్లాది సూరిబాబు 9052765490