S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాగుంది

‘సామాన్యుని సవారి’ కథనం ఎంతో బాగుంది. సైకిల్ తొక్కడం వ్యాయామం మాత్రమే కాదు సైకిల్ సామాన్యుని జీవితకాల సహచరి. కోనసీమలో సైకిల్‌కి ఐదారు అరటి గెలలు కట్టి సైకిల్ తొక్కడం చూసి తీరాల్సిందే. పల్లెటూరి సంతల్లో సైకిల్ ఒక మొబైల్ షాప్! సైకిల్‌కి నాలుగైదు ట్రేలు కట్టి వాటిలో అద్దాలు, దువ్వెనలు, నెయిల్ పాలిష్, రిబ్బన్లు, ప్లాస్టిక్ బొమ్మలు లాంటివి పెట్టి అమ్మేవాళ్లు కనిపిస్తారు. చిన్‌బిల్లా అని పిలువబడే ఎలుక జాతి పెంపుడు బొచ్చు జీవులు, కుందేళ్లను వేటాడే ఫెర్రెట్‌ల విషయాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. సహనం నాయకత్వ లక్షణం అంటూ డా.వాసిలి చెప్పిన విషయాలు బాగున్నాయి. నాయకులు సహనం కోల్పోవడం ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో మనం చూస్తూనే ఉన్నాం.
-పి.చంద్ర (కాకినాడ)
లక్ష్యం
పెద్ద లక్ష్యాలను పెట్టుకోండి. ఎయిమ్ హై అని చెప్తూ ఉంటారు. కాని వాటిని అందుకోవడం అందరికీ సాధ్యం కాదు. చిన్నచిన్న లక్ష్యాలు పెట్టుకొని సాధిస్తూ పెద్ద లక్ష్యాల దిశగా పయనించాలి అని చెప్పిన ‘ఓ చిన్న మాట’ మహా దొడ్డమాట. కొన్ని వందల బుల్లి ఫ్లెమింగోలకు మార్గదర్శనం చేస్తూ ఒక పెద్ద ఫ్లెమింగో ఎగురుతున్న ఫొటో అద్భుతంగా ఉంది. నేతాజీ గురించి తెలిసింది చాలు. ఇంకా ఏదో ఉందని బుర్రలు బద్దలు కొట్టుకోవడం అనవసరమేమో. గతం తవ్వుకుంటూ ఉండిపోతే భవిష్యత్తు చెదిరిపోతుంది కదా. ‘దిక్కు’ కవితలో ‘విశ్వాసమే నా చెలికాడు. నేనే కదా నాకు కడదాకా తోడు’ అన్న భావన బాగుంది.
-ఎ.చైతన్య (వాకలపూడి)
మనస్ఫూర్తిగా అనుకోవాలి
ఏదైనా చేద్దామని మనస్ఫూర్తిగా అనుకుంటే మనసు ఆ దిశగా పని చేస్తుంది. కచ్చితంగా ఆ పని మనం చేసేస్తాం అని చెప్పిన ‘సండే గీత’ చక్కగా ఉంది. అందుకే మనసుంటే మార్గం ఉంటుంది అన్నారు. బీటిల్ తలలో చిన్న భాగాన్ని అతి పెద్దదిగా ఫొటో తీస్తే మల్లయుద్ధానికి సిద్ధపడ్డ గన్‌లాగ కనిపించడం భలేగా ఉంది. ‘తెల్ల కాగితం’ మనసు చూసే అద్దం. రేపటి కావ్యం/ కొంగల గుంపు దివిలో నడుస్తున్న ముత్యాల ముగ్గు’ అన్న హైకూలు హాయిగా ఉన్నాయి. సంప్రదాయ సంగీత వారధులైన గాన గంధర్వుల గురించి చెప్పిన అంశాలు ఆకట్టుకొన్నాయి.
-పి.శుభ (తూ.గో.జిల్లా)
చాలా బాగుంది
రెండో బహుమతి కథ ‘సాలభంజికలు’ చాలా బాగుంది. డబ్బున్న వాడి వద్దకే అక్రమంగానో సక్రమంగానో మరింత డబ్బు వచ్చి చేరుతుంది. పెళ్లికి ఇంత ఆర్భాటం అవసరమా అంటే అది ‘నల్ల హోదా’ చిహ్నం అయింది. ఇంత ఆర్భాటంలో ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో పెళ్లి పెద్దలకు తెలియదు. వచ్చామా, తిన్నామా, అక్షింతలు వేశామా అన్నట్లు సాగిపోతుంది. గీత, ఆమె భర్త ఏమీ ‘చదివించకుండానే’ వెనుదిరిగి వెళ్లిపోవడం వారి సామాజిక స్పృహకు దర్పణం. మాంఛి సస్పెన్స్‌తో క్లుప్తంగా చక్కగా ఉంది క్రైం కథ. ఆ బీదవాడు నాథన్ దొంగిలించిన బూట్లు వేసుకోవడంతో కథ పునరావృతం అవుతుందా అన్న సందేహం. శాకాహారమే శరణ్యం అంటూ డాక్టర్‌గారు చెప్పిన విషయాలు అనుసరణీయం.
-సి.మైథిలి (సర్పవరం)
సఫలం
బుర్రలు చించుకున్నా మాబోంట్లకు అర్థంకాని జీవజాలం పరిణామ క్రమాన్ని తన బుర్ర చించుకొని ఆలోచించి గోపాలంగారు మా బుర్రల్లో ప్రవేశపెట్టడానికి చేసిన ప్రయత్నం సఫలం అయిందనే చెప్పాలి! చనిపోయిన మిత్రుని గురించి గదిలో ఏకాంతంగా కూచుని ఏకాగ్రంగా ఆలోచిస్తుంటే ఆ మిత్రుడు సూక్ష్మరూపంలో కనిపించి తను పూర్తిగా చావలేదని తన శరీరాన్ని ఖననం చేయకుండా ఆపమని అతనిని కోరడం, అతడు ఆస్పత్రి శవాల గదికి వెళ్లగా అటెండెంట్ ఆ శవం మాయమైందని చెప్పడం దిగ్భ్రాంతి కలిగించే నమ్మలేని నిజమే. కుక్కల్ని సాకడం కష్టం కాబట్టి ఒక శాస్తజ్ఞ్రుడు రోబో డాగ్ తయారుచేయడం, అది అచ్చం కుక్కలాగే ప్రవర్తించడం శాస్త్ర విజయం అనే చెప్పాలి.
-ఆర్.సత్య (కరప)
విజయం
లేని అవకాశాలను సృష్టించుకోవడంలో, వున్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలోనే విజయం దాగి వుందన్న ‘సండే గీత’ కథనం స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎన్నో విలువైన జీవిత సత్యాలపై వ్యాఖ్యానం సూటిగా, సరళంగా, అర్థవంతంగా అందించే సండే గీతను భద్రంగా ఫైల్ చేసుకుంటున్నాం. తనకు వచ్చిన సీరియల్ కలల ద్వారా ఒక హత్య మిస్టరీని ఒక మహిళ ఛేదించిన వైనం నమ్మండి ఇది నిజంలో చదివి ముక్కున వేలేసుకున్నాం. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే తెలుగువారి స్వాతంత్య్ర కాంక్షను బ్రిటీష్ దొరలకు తెలిసి వచ్చేలా తిరుగుబాటు చేసి, వారికి ముచ్చెమటలు పట్టించి, చివరి వరకు మడమ తిప్పని వీరునిలా అలుపెరుగని పోరాటం సాగించి జనం కోసమే ప్రాణాలు విడిచిన రాయలసీమ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై ప్రత్యేక కథనం స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆయన చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినా, ఆయన పోరాటానికి సాక్షీభూతంగా నిలిచిన కట్టడాలు, వస్తువులను భద్రపరచి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే!
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
ఉత్తేజం
అవకాశం వచ్చినప్పుడు గ్రహించాలి లేదా అవకాశాన్ని సృష్టించుకోవాలి. తర్వాత ఉపయోగించుకోవాలని చెప్పిన ‘సండే గీత’ ఉత్తేజం కలిగించేదిగా ఉంది. కందిరీగ తన గూడును నిర్మించుకోవడమే కాక గూడుపై నిలిచిన నీటిని పీల్చి బుడగలుగా చేసి వదిలేయడం ఆశ్చర్యమే. భావాన్ని కళ్లలో పలికించగలిగి ఫలింప చేయగల చైతన్యమే ప్రేమ - అంటూ సాగిన ‘ప్రకంపనలు’ కవిత మాకు నచ్చింది.
-సదాప్రసాద్ (గొడారిగుంట)