S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గెలుపు

ప్రత్యేక బహుమతి
రు.2,500 పొందిన కథ
**
‘అసలు తను అలా చేసి ఉండాల్సింది కాదు!’ సునంద తనను తాను తిట్టుకోవడం వందసార్లకు పైనే!
నీరిడిన కళ్లతో నందూ తనను నిలదీయడం ఆమె మనసును అరగంట నించీ కుదిపేస్తోంది.
ఆగిన ఆటోలోంచి దిగి డబ్బులిచ్చి గబగబా ఇంట్లోకి వచ్చి నిస్త్రాణగా మంచం మీద వాలిపోయింది సునంద.

పక్కనే పడేసిన హేండ్‌బ్యాగ్‌లోంచి ఫోన్ మోగింది. చాలాసేపటి నుండి అది మోగుతూనే ఉంది. ఆ ఫోన్ భర్త సుదీప్ నుండే అని తనకు తెలుసు. ఫోన్ ఎత్తకపోతే అతను బాధపడతాడనీ తెలుసు! కానీ ఎత్తి ఏం చెప్పాలి? జరిగిన నిర్వాకమంతా తనవల్లే అని చెప్పాలంటే ఎంత కష్టంగా ఉంటుంది? ఆలోచిస్తుంటేనే ఎంత భయంగా ఉంది? తన పాపిష్టి చేతులతో కొడుకు భవిష్యత్‌ను నాశనం చేసిన తనసలు తల్లేనా? ఆమె మనసంతా బాధతో దహించుకుపోతోంది. కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
నిజంగా నందూ అన్నట్టుగా ఎప్పుడూ లేటుగా వెళ్లే తను ఈ రోజు మాత్రం ఎందుకని టైముకే వెళ్లాలి? వెళితే వెళ్లింది... ఏ వెనుకో గప్‌చుప్‌గా కూర్చోకుండా తగుదునమ్మా అని ముందు వరుసలోకి ఎందుకు వెళ్లాలి? అలా వెళ్లడమే తన కొంప ముంచింది. నందూను దగ్గర నుంచి చూడొచ్చు అనుకున్న తన అత్యాశే అశనిపాతమయింది. తను ముందు వరుసలో కూర్చోవడం, ప్రిన్సిపాల్ గమనించడం ఒకేసారి జరిగిపోయాయి. ‘సునందా మేడమ్ రండి. సమయానికి వచ్చారు’ అని మైక్‌లో అనౌన్స్ చేసేసిందామె.
దాంతో తను స్టేజ్ మీదకు వెళ్లక తప్పలేదు. అప్పుడే రాసి మడత పెట్టిన రెండు చీటీలను తన ముందుకు తోసి ఒకదాన్ని తియ్యమంది. జరుగబోయే విపత్తును తనెలా ఊహించగలదు! ఏదో పేరెంట్స్‌కి లక్కీ డిప్ లాంటిదేమో అనుకుంటూ ఆనందంగా తీయడం, దాన్ని చదివి ప్రిన్సిపాల్ ‘ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ ఫర్ ద ఫైనల్స్ ఎట్ హైదరాబాద్ ఈజ్ అమల్!’
ఆ మాట వింటూనే నివ్వెరపోయి చూసింది తను. ప్రిన్సిపాల్ మాత్రం చిరునవ్వుతో స్టేజీ దిగిపోవచ్చన్నట్లుగా థాంక్స్ చెప్పింది. ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మిన తను ఎలా కిందకు దిగి కుర్చీలో కూర్చోగలిగిందో తనకే తెలీదు. ప్రపంచమంతా తలక్రిందులై పోయినట్టు, బంగారం లాంటి నందూ భవిష్యత్తంతా చీకటై పోయినట్టుగా అనిపించింది.
అలా పది నిమిషాలు గడిచాక స్టేజ్ పై ఉన్న పిల్లల్ని కిందకు పంపారు. ఏడుపు ముఖం పెట్టుకుని వచ్చిన నందూ ఉక్రోషంగా తన వైపు చూశాడు. ఒకటే ప్రశ్న సూటిగా సంధించాడు. తన గొంతులో విచ్చుకత్తి దిగినట్టుగా.. ‘నన్ను ఓడించడానికేనా అమ్మా వచ్చావు? ఎప్పుడూ లేటుగానే వస్తారుగా...’
వాడి మాటలు వింటూనే అప్పటివరకూ పడిన బాధ పదింతలై పోయింది. ఏమని జవాబు చెప్పగలదు తను? రెండు నెలల క్రితం స్కూల్లో క్విజ్ పోటీలు జరుగుతున్నాయని, ఫైనల్స్‌కి సెలెక్టయితే హైదరాబాద్ వెళ్లాలని, అక్కడ సిద్దార్థ బసు వచ్చి క్విజ్ నిర్వహిస్తాడని చెప్పగానే తనే స్వయంగా క్విజ్‌లో పాల్గొంటున్నంతగా గాలిలో తేలిపోయింది తను! ఎందుకంటే తన చిన్నప్పటి నుండి టీవీ క్విజ్ కార్యక్రమాల్లో చూస్తున్న సిద్దార్థ బసు అంటే అంత ఇష్టం తనకు! అసలు జనరల్ నాలెడ్జి మీద ఆసక్తి పెరిగింది కూడా సిద్దార్థ బసు వల్లనే! టీవీలో చూపిస్తున్న పిల్లల్లా తను కూడ పాల్గొనాలని, సిద్దార్థ బసుతో భేష్ అనిపించుకోవాలని తనూ ఎన్నో కలలు కనేది! కానీ తను చదివింది ఓ మామూలు స్కూల్లో. అక్కడ క్విజ్‌లకు పంపేటంత సీన్ లేదు. దాంతో టీవీలో సిద్దార్థ బసు చేసే ఆ క్విజ్‌లో తనను తానే విజేతగా ఊహించుకుని సంతృప్తి పడిపోయేది. అలాంటి సిద్దార్థ బసు నిర్వహిస్తున్న ఫైనల్స్‌కి తన కొడుకు వెళ్లబోతుంటే తనేం చేసింది! తన కలలు కొడుకు ద్వారా తీరబోతున్నాయన్న ఆశలపై తనే నీళ్లు చల్లేసుకుంది. వాడి ఏడేళ్ల పసి మనసుకు కూడా ఆనందాన్ని లేకుండా చేసేసింది!
ఆలోచనలు ఆమె మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి. మళ్లీ ఫోన్ మోగింది. ఏమయిందో తెలీక సతమతమై పోతున్నట్టున్నాడు సుదీప్! ఎలాగో చెప్పెయ్యాలి అనుకుంటూ ఫోన్ ఎత్తి, ‘హలో!’ అంది సునంద.
‘వాట్ సునందా.. ఫోన్ తియ్యకపోతే ఎలా? అంత నానె్సన్స్ చేశారేంటి స్కూల్ వాళ్లు? ఇప్పుడే వాళ్లకు పోన్ చేస్తే విషయం తెలిసింది. రియల్లీ రిడిక్యులస్! ఫోన్లోనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాను. లంచ్‌కి ఇంటికొస్తున్నాను. అక్కడ నుండి మళ్లీ స్కూల్‌కి వెళదాం’ ఆవేశంగా చెప్పి ఫోన్ పెట్టేసాడు సుదీప్.
మంచంపైన వాలిపోయి కాసేపు అలానే పడుకుంది సునంద. టైం చూసింది. ఒంటిగంట కావస్తోంది. సుదీప్ భోజనానికి వస్తాడన్న విషయం గుర్తుకు వచ్చి డైనింగ్ టేబుల్ సర్దింది. ఆ పని అయ్యాక కాసేపు వంటింట్లోకీ హాల్లోకీ పచార్లు చేసింది. అయినా సునంద మనసు మాత్రం అల్లకల్లోలంగానే ఉంది.
అంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తీయగానే కనిపించిన సుదీప్‌ను గట్టిగా హత్తుకుని వెక్కివెక్కి ఏడవసాగింది సునంద. ‘ఊరుకోరా సునందా.. మనం స్కూల్ వాళ్లను నిలదీద్దాం. అసలు క్విజ్‌కి లాటరీ ఏంటి? నందూకి అన్యాయం జరిగిపోయింది. న్యాయం జరిగేవరకూ వాళ్లతో మనం పోట్లాడాల్సిందే!’ ఆవేశంగా అంటూనే సునంద వీపును అనునయంగా తట్టాడు సుదీప్.
‘ఏమో సుదీప్ నాకైతే జీవితంలో అన్నీ పోగొట్టుకున్నంత విచారంగా ఉంది. స్కూల్ వాళ్లను ఏమడుగుతావో, ఎలా అడుగుతావో నాకు తెలీదు. మన నందూ మాత్రం ఎలాగైనా ఫైనల్స్‌కి హైదరాబాద్ వెళ్లాల్సిందే!’ కన్నీళ్లు తుడుచుకుంటూ పట్టుదలగా చెప్పింది సునంద.
‘అలాగే. పద భోంచేద్దువు గాని. ఉదయం నువ్వు టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు’ అంటూ వాష్‌రూం వైపు నడిచాడు సుదీప్.
పెద్దగా ఏమీ మాట్లాడుకోకుండానే వాళ్ల భోజనం ముగిసింది. ఆ వెంటనే బయలుదేరి స్కూల్‌కి చేరుకున్నారు.
రిసెప్షన్ దగ్గరకు వెళ్లి ప్రిన్సిపాల్‌ని కలవాలని చెప్పాడు సుదీప్. ఆమె ఆ హాల్లో వేచి ఉండమని చెప్పడంతో అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నారు సుదీప్, సునంద. ఆ హాల్లో అప్పటికే కొందరు పేరెంట్స్ కూర్చుని వేచి ఉండటం గమనించారు వాళ్లిద్దరూ.
‘లోపల ప్రిన్సిపాల్ ఉన్నట్టుగా లేదు. లంచ్‌కి వెళ్లిందో ఏమో!’ సునంద చెప్పింది.
‘అవును. అందుకే అందర్నీ వెయిటింగ్‌లో పెట్టింది’ రిసెప్షనిస్ట్ వైపు విసుగ్గా చూస్తూ చెప్పాడు సుదీప్.
వీళ్ల సంభాషణ అవుతుండగానే రిసెప్షనిస్ట్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడింది.
మరో ఐదు నిమిషాల్లో ‘హాయ్ మమీ.. హాయ్ డాడీ!’ అన్న నందూ మాటలు విని సంభ్రమంగా అటువైపు చూశారు సుదీప్, సునంద.
‘అరె నందూ, ఇలా వచ్చావేంటి? మీకు క్లాస్ జరగడం లేదా?’ ఒకింత ఆశ్చర్యంతో అడిగింది సునంద. ఉదయం ఉన్నప్పటి బాధ నందూ ముఖంలో లేకపోవడం గమనించిందామె. దాంతో ఆమె మనసులో దిగులు కొంత మాయమైనట్టనిపించింది.
‘లేదు మమీ.. ఇవాళ క్లాసులు లేవు. ఇప్పటివరకూ సీనియర్స్‌కి క్విజ్ ఫైనల్స్ అయ్యాయి. అవి చూస్తున్నాం’ చెప్పాడు నందూ.
‘నందూ నువ్వేమీ బాధపడకు. డాడీ నీ గురించి ప్రిన్సిపాల్‌ని అడగడానికే ఇప్పుడొచ్చారు. తప్పకుండా నువ్వు హైదరాబాద్ వెళతావు’ కొడుకుని సంతోషపెట్టే ప్రయత్నం చేసింది సునంద.
‘ఎందుకు మమీ.. అమల్ వెళతాడని పొద్దుట డిసైడ్ చేసేసారుగా?’ అడిగాడు నందూ.
‘అది ఆన్యాయంగా చీటీలు తీసి చేసిన సెలక్షన్ కదా! క్విజ్ టైబ్రేకర్ అంటే క్వొశ్చన్స్ వేసే చెయ్యాలి’ సుదీప్ చెప్పాడు.
‘అలా కూడా త్రీ టైమ్స్ అయింది డాడీ. అందుకే చిట్స్ పెట్టారు. ఇట్స్ ఓకే’ అంటూ భుజాలెగరేసాడు నందూ.
‘మరి ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి అడగొద్దా?’ సునంద అడిగింది.
‘ఎందుకు మమీ? మార్నింగ్ నేను వెళ్లలేక పోయానని ఏడుపొచ్చిందంతే. ఇట్స్ ఓకే! అమల్ కూడా చాలా బాగా ఆన్సర్ చేశాడు. తనతోపాటు వెళుతున్న అఖిల్ కూడా వెరీ బ్రిలియంట్! ఈసారి ఫైనల్స్‌లో ట్రోఫీ మాదే!’ ఉత్సాహంగా చెప్పాడు నందూ. వాడి ముఖంలో బాధ ఏ కోశానా లేకపోవడం గమనించారు సునంద, సుదీప్.
‘నువ్వు వెళ్లలేదని బాధగా లేదా నందూ?’ సునంద అడిగింది.
‘లేదు మమీ. ఇట్స్ ఫైన్’ చాలా తేలికగా చెప్పాడు నందూ.
సిద్దార్థ బసు నిర్వహించే క్విజ్ ఫైనల్స్‌లో తన కొడుకు ఉండడనే బాధ సునందలో ఇంకా పోలేదు. ఆ బాధనే కొడుకుతో వెళ్లగక్కింది.. ‘నువ్వు వెళ్లలేకపోవడమంతా ఆ అమల్‌గాడి వల్లనే కదా?’
‘అయ్యో మమీ... అమల్ ఏం చేశాడు? వాడినేం అనకు. మార్నింగ్ నేను కూడా అలానే బాధపడ్డాను. ఆ తరవాత టీచర్స్, ప్రిన్సిపాల్ మేడం అంతా చెప్పారు. అమల్ ఈజ్ ఏ హాస్టలర్!’ చెప్పాడు నందూ.
‘అయితే? ఏ ఊరు వాళ్లది?’ సునంద అడిగింది.
‘ఏ ఊరూ లేదమ్మా వాడికి. హీ ఈజ్ ఏన్ ఆర్ఫన్.. వాడికి మమీ డాడీ ఎవరూ లేరంట’ బాధగా చెబుతున్న నందూ కళ్లల్లో నీళ్లు కనిపించాయి సునంద, సుదీప్‌లకు.
‘అలా అయి ఉండి కూడా వాడంత బాగా పెర్ఫార్మ్ చేసాడంటే చాలా గ్రేట్ కదా మమీ! నేను నెక్స్ట్ ఇయర్ ఫైనల్స్‌కి కష్టపడతాను’ చెప్పాడు నందూ నవ్వుతూ.
కొడుకుకున్నంత విశాల హృదయం తమకు లేకపోయిందే అన్న బాధతో సునంద, సుదీప్ ముఖాలు ఒక్క క్షణం చిన్నబోయాయి. అయినా మరుక్షణంలోనే సంతోషంగా కొడుకు వైపు చూశారు.
సునందకైతే కొడుకు ముఖంలో ‘గెలుపు’ స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె మనసు మరింత తేలికయింది!

రాజేష్ యాళ్ల.. 9700467675