S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చావని చెడ్డతనం

బ్రిటన్‌లోని హాస్పిటల్స్ వైద్య విద్యార్థులకి పాఠాలు చెప్పడానికి శవాలని కొనేవి. కొందరు దొంగలు సమాధులని తవ్వి వాటిని తెచ్చి అమ్ముతూండేవారు. కొన్ని అస్థిపంజరాలు హాస్పిటల్స్‌కి వచ్చాక రోగులకే కాక సిబ్బందికి కొన్ని కష్టనష్టాలు రావడం పరిపాటిగా ఉండేది.
2 ఆగస్ట్ 1828. ఆ రోజు కార్డర్ని ఉరి తీశారు. 1827లో అతను, తన అన్న థామస్ ద్వారా అక్రమ సంతానాన్ని కన్న ఓ పనిమనిషిని హత్య చేసిన నేరానికి ఉరి తీశారు. తర్వాత అతని శవాన్ని సెయింట్ ఎడ్మండ్స్ స్మశానంలో ఖననం చేశారు. దొంగలు కార్డర్ శవాన్ని కూడా దొంగిలించి వెస్ట్ సఫోల్క్ జనరల్ హాస్పిటల్‌కి అమ్మారు. డాక్టర్ కిల్నర్ యువ విద్యార్థుల ముందు ఆ శవం గొంతు నించి పొట్ట దాకా కోసి చర్మాన్ని పక్కకి మడిచి లోపలి భాగాలని చూపించి వాటి గురించి వివరించాడు.
తర్వాత ప్రొఫెసర్ దాని పుర్రెని అస్థిపంజరం నించి వేరు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ అస్థిపంజరానికి తన దగ్గర ఉన్న మరో పుర్రెని అమర్చాడు. కారణం అతనికి మాత్రమే తెలుసు. కార్డర్ పుర్రెని పాలిష్ చేసి ఓ నల్లటి పెట్టెలో ఉంచాడు. ఆ తర్వాత డాక్టర్ కిల్నర్ ఇంట్లో మనశ్శాంతి కరువైంది. వెలిగే కొవ్వొత్తులు ఆరిపోవడం, తలుపులు చప్పుడు చేస్తూ మూసుకోవడం, ఓ అపరిచిత వ్యక్తి కనిపించి అంతలోనే అంతు తెలీకుండా మాయం అవడం లాంటివి అకస్మాత్తుగా జరగసాగాయి.
డాక్టర్ కిల్నర్‌కి దెయ్యాలంటే నమ్మకం లేకపోవడంతో భయపడలేదు. కాని ఈ చేష్టలని అతను ఎక్కువ కాలం భరించలేక పోయాడు. అతను ఆ ఇంట్లో ఎక్కడికి వెళ్లినా వెనక నించి అడుగుల చప్పుడు వినిపించేది. నడవనప్పుడు వెనక గట్టిగా శ్వాస తీసి వదిలే చప్పుడు వినిపించేది. తలతిప్పి చూస్తే ఎవరూ కనిపించేవారు కారు. ఓ రాత్రి ఆ పుర్రె ఉన్న డ్రాయింగ్ రూం లోంచి ఎవరివో ఏడుపులు, గట్టిగా తలుపు కొడుతున్న చప్పుడు వినిపించడంతో ఇంటిల్లిపాదీ హడలిపోయారు.
వీటన్నింటికీ కారణం కార్డర్ పుర్రె అని దాన్ని దొంగిలించిన డాక్టర్ కిల్నర్‌కి నమ్మకం కలిగింది. దాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో యథాస్థానంలో ఉంచాలి అనుకున్నాడు. కాని దాన్ని పాలిష్ చేయడంతో తేడా తెలుస్తుందని భయపడ్డాడు. ఓ రాత్రి అతనికి కింద గదిలోంచి పెద్ద శబ్దం వినిపించడంతో పరిగెత్తి కెళ్లి చూశాడు. ఆ పుర్రె ఉన్న పెట్టె షెల్ఫ్‌లోంచి కింద పడి ముక్కలై కనిపించింది. పుర్రె మాత్రం భద్రంగా ఉంది. ఇక దాన్ని వదిలించుకోవాలని నిశ్చయించుకున్నాడు.
తన మిత్రుడు ఎఫ్‌సి హాప్కిన్స్‌ని ఓ రాత్రి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించి ఆ పుర్రెని బహుమతిగా ఇచ్చాడు. ఆయన కార్డర్‌ని ఉరి తీసిన జైల్లో కమిషనర్ ఆఫ్ ప్రిజన్స్‌గా పని చేసి రిటైరయ్యాడు. ఆయన కొంత అయిష్టంగానే ఆ బహుమతిని అంగీకరించాడు. వెళ్లేప్పుడు ఆ పుర్రెని సిల్క్ చేతి రుమాల్లో కట్టి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లే దారిలో ఆయన కాలు జారి కింద పడటంతో కాలు బెణికింది. జేబు రుమాల్లోంచి బయటకి వచ్చిన ఆ పుర్రె నవ్వడం చూసిన పక్కనే వెళ్లే ఓ మహిళకి స్పృహ తప్పింది. హాప్కిన్స్‌కి జరిగిన అనర్థాల్లో ఇది మొదటిది. ఆ తర్వాత అనారోగ్యం, కుటుంబ సమస్యలు, అర్థిక నష్టాలు ఒకటి తర్వాత మరొకటి ఆయన్ని చుట్టుముట్టసాగాయి.
ఓ రోజు ఆయన కిల్నర్‌ని తనింటికి భోజనానికి పిలిచి ఆ పుర్రెని వెనక్కి ఇవ్వబోయాడు. కాని అతను దాన్ని తిరిగి తీసుకోడానికి అంగీకరించలేదు. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడంతో ఆ పుర్రెలో ఏదో దుష్టశక్తి ఉందని నిర్ణయించారు. కిల్నర్ ఆ పుర్రెని ఎవరికైనా ఇవ్వమని హాప్కిన్స్‌కి సలహా కూడా ఇచ్చాడు. కాని తనకి కలిగిన కష్టాలు మరెవరికీ కలగకూడదని హాప్కిన్స్ దాన్ని ఎవరికీ ఇవ్వదలచుకోలేదు. అలా అని ఇంట్లోనూ ఉంచుకోదలచుకోలేదు.
ఆయన ఓ తెలివైన పని చేశాడు. స్మశానంలో శవాలకి గోతులు తవ్వే ఒకతనికి లంచం ఇచ్చి తనకి అవసరం లేని ఆ బహుమతిని, క్రిస్టియన్స్‌ని పాతిపెట్టబోయే ముందు జరిపే క్రతువుని జరిపించి పాతిపెట్టమని కోరాడు. అలా కార్డర్ పుర్రెని అతను వదిలించుకున్నాడు. ఆ తర్వాత హాప్కిన్స్ కష్టాలన్నీ తొలగిపోయాయి.
కార్డర్ మరణించాక అతని పుర్రె ఇలా చేయడం విచిత్రమే. అవన్నీ నిజంగా ఆ పుర్రె చేసిందా? నిజంగా దాన్లో దుష్టశక్తి ఉందా? ఇదంతా దాని పనేనా? లేక మిత్రులు ఇద్దరికీ కలిగిన ఆ నష్టాలు, కష్టాలు కేవలం కాకతాళీయమా? దేవుడికే తెలియాలి.
ఇలాగే ఫ్రాన్స్ నించి బ్రిటన్‌కి పారిపోయి వచ్చిన లండ్రూ అనే ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ అస్థిపంజరం వల్ల కూడా కీడు సంభవించింది. అతను విల్లా హెర్మిటేజ్‌లోకి ఆడవాళ్లని మాయమాటలు చెప్పి తీసుకువచ్చి చంపి, వారి దగ్గర ఎంత తక్కువ మొత్తం ఉన్నా దాన్ని దొంగిలించేవాడు. చట్టానికి పట్టుబడి 25 ఫిబ్రవరి 1922న మరణశిక్షని అనుభవించాడు. 11 మందిని చంపాడనే రుజువులు దొరికాయి కాని అతను ఫ్రాన్స్‌లో 300 మందికి పైగా చంపాడని ఫ్రెంచ్ పోలీసుల అభియోగం. వారి నించి తప్పించుకుని ఇంగ్లండ్ వచ్చిన లండ్రూని స్కాట్‌లేండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. తను నిర్దోషినని, తనని దెయ్యాలు స్వాధీనం చేసుకుని ఆ హత్యలు చేయించాయని అతను కోర్టులో వివరించాడు. అతని అస్థిపంజరం ఉన్నంత కాలం హాస్పిటల్‌లో రోగుల మరణాలు అధికమై, దాన్ని హాస్పిటల్ నించి మ్యూజియానికి పంపాక హాస్పిటల్‌లో మరణాలు ఆగిపోయాయి.