S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొదమసింహం

మన దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం రాజుకోక ముందే బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసిన ఆంధ్రుడెవరు అని అడిగితే మొదట జ్ఞాపకం వచ్చే పేరు అల్లూరి సీతారామరాజు. అయితే సినిమా తీయనుండటంతో తెలిసిన రెండో పేరు కొదమసింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ‘కవర్‌స్టోరీ’ ద్వారా ఆయన కథ తెలుసుకొని ఆనందించాం. మొదటి బహుమతి కథ విలువ ఉన్నదే. నేటి పరిస్థితులకు దర్పణం పట్టింది. అవినీతి పరులే లోకంలో నీతికి నిజాయితీకి చోటెక్కడ అని అంగలార్చడం తమాషాగా ఉంది. ఇలాంటి జలగల వల్లనే ఆర్‌బిఐ దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నోట్లు తెలుగు రాష్ట్రాలకిచ్చినా వాటిని బీదలకు అందకుండా చేసి ఇంకా ఇంకా కావాలని ప్రభుత్వం కూడా ఆర్‌బిఐని వత్తిడి చేయడం గమనార్హం.
-బి.ప్రభాస్ (గాంధీనగర్)
తెలుస్తుందా?
జరగబోయేది కలల్లో తెలుస్తుందా? ఒక్కోసారి తెలుస్తుంది అని నమ్మకం కలిగే లాగ చెప్పిన ‘పీడ కల’ కథ ఉత్కంఠభరితంగా సాగింది. నిజంగా అందరికీ అలా తెలిస్తే నేరస్తుల్ని పట్టుకోవడం సులభం అవుతుంది. నేరాలు తగ్గుతాయి. జరగబోయేది కలల్లో కనిపిస్తాయన్నది చాలామంది నమ్మలేనట్టే క్లెయిర్ వాయన్స్‌నీ నమ్మలేరు. కాని క్రైం కథ ‘దివ్యదృష్టి’ లో క్లెయిర్ వాయన్స్ ద్వారా చనిపోయిన గెరాల్డైన్ ఎక్కడ ఉందో ఐరిస్ చెప్పగలగడం, కథ చివర్లోని ట్విస్ట్ చాలా బాగా కుదిరాయి. సూర్యుడు ఆరోగ్యకారకుడు. జీవన వైవిధ్యాన్ని సంరక్షించే ప్రకృతి శక్తుల్లో సూర్య భగవానుడు ముఖ్యుడు. ఎండలోనే ఎముకల నిండుదనం అని వివరించిన ‘మీకు మీరే డాక్టర్’ ఉపయుక్తంగా ఉంది.
-జె.జ్ఞానబుద్ధ (సిద్దార్థనగర్)
‘మీరెవరు?’
ఆశ్చర్యపడడానికి ఈ ప్రపంచంలో చాలా సంగతులున్నాయి. ఆశ్చర్యం మనకు చేతగావాలి అన్న గోపాలం గారి సిద్ధాంతం చాలా బాగుంది. ‘మీరెవరు?’ అని ఆయన అడిగిన ప్రశ్న. దాని వివరణ చదువుతుంటే ఒక సినిమాలో ఒక హాస్యనటుడు మరో హాస్యనటుని ‘నువ్వెవరు?’ అంటూ వేధించడం జ్ఞాపకం వచ్చింది. చివరకు మనం రసాయనాల కుప్పలం అని గోపాలంగారు తేల్చేశారు. లేకుంటే మనం ఇంకా ఇంకా ఆలోచిస్తూనే ఉండేవాళ్లం. వ్యర్థుడు, తాగుబోతు అయినా సరే అతడు నిర్మల మనస్కుడు అయితే అతనికి స్వర్గప్రాప్తి కలుగుతుందని కథాసాగరంలో చెప్పిన కథ చాలా నీతిని బోధించింది.
-ఆర్.శాంతిచంద్రిక (సామర్లకోట)
గొప్ప ప్రేమ
ఎంత గొప్ప ప్రేమ అయినా దాన్ని వ్యక్తీకరించకపోతే ఫలితం ఉండదు. అలాగే గొప్ప ఆలోచనలు పంచుకోకపోతే వృథా అంటూ అడవిలో చెట్టు కూలిపోవడం దృష్టాంతంగా చెప్పిన ‘ఓ చిన్న మాట’ బహుదా ప్రశంసనీయం. శృంగారంలా కనిపించే భక్తి సాంద్రమైన ఆధ్యాత్మిక సంకీర్తనలు అన్నమాచార్యుల ప్రతిభ అయితే శృంగారాన్ని ప్రధానంగా చేసుకొన్న తరంగాలలో ఆధ్యాత్మికత నారాయణ తీర్థుల మార్గం అంటున్నా ఇద్దరి మధ్య పోలిక అమృతవర్షమే.
-పి.శాండిల్య (కాకినాడ)
సహనం-సంగీతం
కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడి ధాటికి తట్టుకోలేక కృష్ణ పరమాత్ముడే సహనం కోల్పోయి చక్రం చేబూనాడు. నాయకుడి సహనానికి కూడా ఓ హద్దుంది. అది దాటిన వారికి శస్తచ్రికిత్స తప్పదు. ఇది నాయకుడి కుండవలసిన మరో ముఖ్య లక్షణం. వాసిలి వారి నాయకత్వ వివరణ బాగుంది. ఇక మల్లాది వారి అమృతవర్షిణిలో ‘గాంధర్వ గానం చేయగల వారందరూ గంధర్వులేనన్న’ నిర్వచనం అద్భుతం. వారు ఉదహరించిన ఆంగ్ల కవిత్వపు బంగారు కణిక ప్రయోగించింది జాన్ కీట్స్ అనే రొమాంటిక్ పొయెట్. ఎందరో మధుర గాయకులు సరైన గుర్తింపు లేకుండా కనుమరుగవడం సంగీతాభిరుచిగల అభిమానుల దురదృష్టం. ఆ రోజుల్లో మీడియా ఇప్పుడున్నంతలో అణుమాత్రం కూడా లేదు. కనీసం వాటిని గ్రామ్‌ఫోన్ రికార్డులకయినా ఎక్కించారా లేక అవి దొరకడం లేదా? పేరుకు తగ్గట్టు వసంత కోకిలమ్, పుష్పవన మయ్యర్‌లు పిన్నవయసులో పరమపదించినా వారి గాన మాధుర్యం శాశ్వత కీర్తినార్జించిందని మల్లాది వారు చెబితేనే అందరికీ తెలిసింది.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
ఆదరణ
దైవదత్తంగా లభించే శాస్ర్తియ సంగీతం మహత్తరమైనది. అత్యుత్తమ కర్ణాటక సంగీతం అలవడటం అంత సులభం కాదు. కఠోర దీక్ష, సాధన, మంచి గురువులు ఉంటేనే ఆ విద్య కొంతవరకూ సాధ్యం. ఆకాశవాణి, దూరదర్శన్, టిటిడి ప్రసార మాధ్యమాలు కర్ణాటక సంగీతానికి ప్రాముఖ్యత నిస్తూ, దాదాపు ప్రతీరోజూ ఏదో ఒక వేళలో, ఎక్కువ సమయం కర్ణాటక సంగీత కచేరీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కేవలం గాత్ర సంగీతమే కాక, వీణ, వయొలిన్, నాదస్వరం వాయిద్యాలు వాయించే నిపుణులకు అవకాశాలు, తగిన పారితోషికాలను ఇస్తూ వారి విద్యకు సార్థకత కల్పిస్తూ ఉంటారు. ఇక భద్రాచల రామదాసు కీర్తనలు, అన్నమయ్య సంకీర్తనలు, మంచి ప్రాచుర్యంలో ఉన్నాయి.
-ఆర్.కె. (హైదరాబాద్)
‘చిన్న’ గీత
ఈ శీర్షికలు చదవకుండా ఆదివారం అనుబంధంలో ముందుకు వెళ్లలేం. తెలిసిన విషయాలే అయినా బాగా అర్థమయ్యేట్టుగా ఉంటాయి. ‘లోకాభిరామమ్’లో ‘బుర్ర చించుకొని’ వ్యాసం బాగుంది. అలాగే ప్రతి వారం గాన గంధర్వుల గురించిన పరిచయాలు సంతోషదాయకం. ‘అదృశ్య కథ’ నిజంగానే ఆశ్చర్యం గొలిపేదిగా ఉంది. మనకు తెలీని ఎన్నో శక్తులు ఉన్నాయనిపిస్తుంది. ‘వినదగు’ సహనం నాయకుడి లక్షణం అని చక్కగా వివరించారు. పూర్ణచంద్‌గారి ‘మీకు మీరే డాక్టర్’ శీర్షిక ఉపయుక్తంగా ఉంటోంది.
-డి.వి.తులసి (విజయవాడ)