S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గాన గంధర్వ స్వరఝరి.. కుంతీకుమారి (అమృతవర్షణి)

‘ముఖే ముఖే సరస్వతి’ అంటారు. సంగీతం విషయంలో ఇది చాలా యధార్థం. భగవద్దత్తంగా కొందరికి శృతిజ్ఞానం అలవడుతుంది. మరి కొందరికి లయ జ్ఞానం అద్భుతంగా ఉంటుంది. ఈ రెంటితోబాటు అప్రతిహతమైన మనోధర్మం మరి కొందరికి అలవోకగా సిద్ధిస్తుంది.
ఎటువంటి సాధనా లేకపోయినా రాణించిన అటువంటి మహానుభావులున్నారు. వారే కారణజన్ములైన నాదోపాసకులు... చాలా అరుదుగా జన్మిస్తారు. ‘నాదతనుమనిశం’ అంటారు త్యాగయ్య.
ఆకాశమే శరీరంగా కలిగిన ఆ పరమాత్ముడు నాదశరీరుడు. ఆకాశ తత్త్వం నాదమే గదా!
నాదమయుణ్ణి నాదం ద్వారానే పూజించాలి. స్వర లయాది రాగ జ్ఞానంతో హరిభజన చేసే భాగ్యం కలిగిన వారందర్నీ త్యాగయ్య ‘ఎందరో మహానుభావులని’ కీర్తించాడు. ‘మనో వాక్కాయ శుద్ధితో’ నాదసిద్ధి పొందిన మహా విద్వాంసులు కొందరు అదృష్టం కొద్దీ మనతెలుగు నేలపై జన్మించారు. పాడవలసినదంతా పాడేసి వెళ్లిపోయారు.
శాశ్వత కీర్తిని సొంతం చేసుకున్నారు. సంగీతం కోసమే సంగీతం పాడిన మహావాది వెంకటప్పయ్య శాస్ర్తీ దీనికి ఉదాహరణ. సంగీత లోకంలో ఈయన పేరు ప్రసిద్ధం. దేవుడు ప్రసాదించిన గాంధర్వ గానమే ఈయన ఆస్తి. చూపరులను ఆకర్షించే రూపం... సంభ్రమాన్ని కలిగించే పాటతో.. పండిత పామరులెందరినో పరవశింపజేసిన మధుర గాయకుడు మహావాది - సమ్మోహనకరమై శాస్తబ్రద్ధమై సకల జనరంజకమైన ఆయన పాట దక్షిణాది విద్వాంసులను ఆకర్షించింది. సుమధురంగా ఆయన వినిపించే పద్య గానానికి సంగీత రసికులు నీరాజనాలెత్తేవారు.
మన తెలుగు సాహిత్య పిపాసకులకు పద్యం ఒక తరగని ఆస్తి. ‘కుంతీకుమారి’ని తలుచుకుంటే గుర్తుకొచ్చే పేరు కరుణశ్రీ. ఆస్తికులైన భక్తులు చదువుకుని ఆనందించే పద్యం, పాడితే యింకా మధుర మనోజ్ఞంగా ఉంటుంది. సూటిగా మనస్సుకు చేరుతుంది.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్ర్తీ ‘కరుణ రసాత్మ’క ఖండ కావ్యంలోని ‘కుంతీకుమారి’ని లోకానికి మొదటిసారి పరిచయం చేసిన విద్వాంసుడు మహావాది వెంకటప్పయ్య శాస్ర్తీ. ఈ విషయం కొద్దిమందికే తెలుసు. పుష్పవిలాపం, ‘కుంతీకుమారి’ పద్యాలు తెలుగు నాట ఎంత ప్రాచుర్యాన్ని పొందాయో వేరే చెప్పనవసరం లేదు. కీర్తన పాడినంత సులభంగా పద్యం పాడటం కుదరదు. అందరివల్లా కాదు. పాటకు నిర్దిష్టమైన లయ ఉంటుంది. రాగం ఉంటుంది. ప్రతి మాటా లేదా పదం కొన్ని స్వరాల అమరికతో ముందుగానే (నొటేషన్) స్వరపరచబడి ఉంటుంది. కాస్త మనోధర్మం కూడా కలిసి, తాళంలో పాడితే అది కీర్తనవుతుంది. కీర్తన నుండియే రాగం పుడ్తుంది. తాళం లేకుండా పాడితే రాగమవుతుంది.
రాగానికీ, పాటకూ వున్న తేడా యిదే. పాటకూ, పద్యానికీ రాగం ఆధారమే అయినా పద్యంలో అంతర్లీనంగానే ఒక లయ ఉంటుంది. పద్యానికున్న ఛందస్సే ఆ పద్యానికో నడకను చూపిస్తుంది. ప్రేమ, విరహం, ప్రణయం, ఎడబాటు, వైరాగ్యం మొదలైన అనుభూతులకు తగిన రాగాలు ఉన్నాయి.
మనసులో చెలరేగే భావాలకు, రాగాలతో రూపాన్ని సృష్టించగలిగే శక్తి సంగీతం తెలిసిన విద్వాంసులందరికీ వుండదు - అదో ప్రజ్ఞ. అందులో మహావాది సిద్ధహస్తుడైతే ఆ గానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘కుంతీకుమారి’ని మన కళ్ల ముందు నిలిపిన గాన గంధర్వుడు ఘంటసాల.
వీరిద్దరి గాన ఫణితినీ ఒక్క మాటలో చెప్పలేము. శ్రావ్యమైన కంఠస్వరం, వివిధ గమకములు పలికించగలిగిన నేర్పు, శ్రుతిశుద్ధత, చక్కని ఉచ్చారణతో, శ్రోతలను ఆనంద సాగరంలో ఓలలాడేలా చేసిన మన ‘ఆంధ్ర గాయక శిఖామణి’ మహావాది. ‘కుంతీకుమారి’లో పరకాయ ప్రవేశం చేసి, తానే ‘కుంతీకుమారియై ఆత్మానుభవంతో రసరమ్య రాగమాలికలను పొదిగి, వింటున్న శ్రోతలను ఆనందపారవశ్యులను చేస్తూ - కంట తడిపెట్టించిన.. మహావాది, కరుణశ్రీ ‘కుంతీకుమారి’ పద్యాల గానంతో ఒక వెలుగు వెలిగిన విద్వాంసుడు. ‘కుంతీకుమారి’ పద్యాలతో గుర్తింపు లభించినా, కీర్తిప్రతిష్ఠలు మాత్రం ఘంటసాల వేంకటేశ్వర్రావుకు దక్కాయి. మహావాది పద్యాలను హెచ్‌ఎంవి కంపెనీ రికార్డు చేయడానికి సంకల్పించారు. కానీ అనివార్య కారణాలు అడ్డుపడటం వల్ల ఆ మహా గాయకుడి కంఠం వినే అదృష్టం ఆంధ్రులు నోచుకోలేదు. శుద్ధమైన సుస్వరం వున్న గాయకులకు శుద్ధమైన మనస్సు అరుదు. కానీ ఆయనకు ఈర్ష్య అసూయలు, భేషజం, ప్రచార ఆర్భాటాలు ఏమీ వుండేవి కావు. యిటువంటి మనస్తత్వం కల్గిన వారి జీవితాలు వడ్డించిన విస్తరిలా వుండవు. శాస్ర్తీ దీనికి అతీతుడు కాదు. విశృంఖలత్వం నుండి గొప్ప కళాకారుడు పుడ్తాడని విఖ్యాత తాత్త్వికుడు బెట్రాండ్ రస్సెల్ అన్నట్లుగా -ఇది శాస్ర్తీగారి తాత్త్విక చింతనకు, సరైన ఉదాహరణ.
ఆయన సంగీతానికే వర్తిస్తుందీ మాట. సంప్రదాయాన్ని పక్కన పెట్టకుండా, దాని పరిధులను ఒక్కోసారి అధిగమిస్తూ పాడే సాహసి. దక్షిణాది విద్వాంసులు సైతం ఆశ్చర్యపోయేవారు వారి గానానికి. కర్ణాటక సంగీతానికి జీవం రాగం గదా? తనకు ప్రాణప్రదమైన రాగాలాపనలో శాస్ర్తీ అడుగడుగునా ఏదో కొత్తదనాన్ని తనదైన శైలిలో పాడుతూ పక్కవాద్యాలను ఆశ్చర్యచకితులను చేసేవారు. పద్యగానం సరేసరి. ఎదురుగా కూర్చున్న శ్రోతలు ‘కుంతీకుమారి’ని దర్శించిన అనుభూతి పొందుతూ అశ్రుపూరిత నయనాలతో ఇళ్లకు వెళ్లేవారుట. ఆ స్ఫూర్తితోనే ఘంటసాల ఆ పద్యాలు పాడి ‘కుంతీకుమారి’ని శాశ్వతంగా తెలుగు హృదయాలలో ప్రతిష్ఠించాడు.
బలిజేపల్లి సీతారామయ్య, చదలవాడ కుమారస్వామి శిష్యుడై సంగీత మర్మాలు బాగా తెలుసుకుని తనదైన ఓ ప్రత్యేకమైన శైలిని సుస్థిరం చేసుకున్న విద్వాంసుడు మహావాది. ఆయన పాడిన కరుణశ్రీ పద్యాల ఒరవడిని గమనించిన ఘంటసాల ఆ పద్యాలకు ప్రాణ ప్రతిష్ట చేసి పాడి, మెప్పించటంలో ఆశ్చర్యం లేదు. అందులో ఘంటసాల ప్రత్యేకత వేరు. తాను పాడే లలిత సంగీతానికి శాస్ర్తియ సంగీత గౌరవాన్ని కల్పించి, సంగీత విద్వాంసుల చేత కూడా శహభాష్ అనిపించుకున్న గాయకుడు ఒక్క ఘంటసాలే. మరే నేపథ్య గాయకునికీ యింతవరకూ ఈ గౌరవం దక్కలేదు. 1950-60 ప్రాంతాల్లో ఘంటసాల పాడిన కుంతీకుమారి పద్యాలు గ్రామఫోన్ రికార్డులుగా విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసినదే. అయితే ‘శాస్ర్తీ’ మాత్రం దీనికి చింతపడలేదు. అసూయ పడలేదు.
తనకంటే చిన్నవారైనా, పెద్దవారైనా పాడితే మెచ్చుకునే మనస్తత్వం ఆయనది.
పంతాలకు పోని పట్టుదల, కార్యదీక్ష ఆయన్ని తిరుగులేని విద్వాంసుణ్ణి చేశాయి.
1970లో కాకినాడలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర, సంగీత నాటక అకాడెమీ వార్షిక మహాసభలో ‘వీరికి’ సంగీత కళాప్రపూర్ణ బిరుదునిచ్చి గౌరవించారు. ఎన్నో సన్మానాలు సత్కారాలు పొందారు. అనారోగ్యం వల్ల ఒంగోలులో త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ఓసారి శాస్ర్తీగారు పాడలేని స్థితిలో వుండగా, వారి పాట కోసం మద్రాసులో వున్న గాన సరస్వతి శ్రీమతి డి.కె.పట్టమ్మాళ్ సోదరుడు డి.కె.జయరామన్ శాస్ర్తీకి కబురు చేసి ‘వంతగా’ తాను పాడగలనని నచ్చచెప్పి, కచేరీ పాడించారు. పక్కవాద్యాలు వయొలిన్‌పై ఎం.ఎస్.గోపాలకృష్ణన్, మృదంగంపై టి.కె.మూర్తి. అనారోగ్యంతో లేవలేని స్థితిలో వున్నా కచేరీకి సిద్ధపడి వేదికనెక్కి శ్రుతి సరిచేసుకుంటూ ఒక్కసారి తన అమృతమయమైన కంఠంలో బేగడ రాగంలో నాలుగు సంగతులు వరుసగా తారాజువ్వల్లా వదిలేసరికి గోపాలకృష్ణన్ సైతం విస్తుపోయి, నిశే్చష్టుడై వయొలిన్ కింద పెట్టేశాడని అన్నవరపు రామస్వామి చెప్పగా విన్నాను.
అంతటి ప్రతిభామూర్తి మహావాది వెంకటప్పయ్య శాస్ర్తీ. మరొకరి గుణాన్ని ఎంచి, ప్రేమించి ఆదరించడం ఒక వ్యక్తి ప్రత్యేక వ్యక్తిత్వంగా భాసిస్తుంది. గొప్పవారనిపించుకున్న చాలామంది సంగీత విద్వాంసులకు ఈ గుణం ‘సున్న’. మనస్ఫూర్తిగా మరొకరి సంగీతాన్ని మెచ్చుకునే సంస్కారం చాలా మందిలో వుండదు. మహావాది గానానికి వంత పాడేందుకు సిద్ధమైన డి.కె.జయరామన్ అభినందనీయుడు. కాదా మరి?
నిరంకుశాః కవీశ్వరాః - అన్నట్లుగా కవులొక్కరేనా? గాయకుల్లో కూడా నిరంకుశులై, తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే వారుంటారు. వారిలో మహావాది ఒకరు. వారి వ్యక్తిత్వానికి భంగం వాటిల్లితే సహించలేరు. చాలా స్వతంత్ర భావాలతోనే జీవించారు. ఆ రోజుల్లో రికార్డింగ్ సౌకర్యాలున్నా, కొందరు వాటికి చాలా దూరంగానే ఉండేవారు. దీనికి ప్రధాన కారణం, సంప్రదాయ సంగీతం పట్ల వారికున్న గౌరవం. శుద్ధమైన సంగీతానికి కొన్ని నియమాలు, కట్టుబాట్లూ వుండాలని గాఢంగా నమ్మిన కారణంగా వారి గానం ఎక్కడా ధ్వనిముద్రితం కాలేదు.
నర్సరావుపేట తాలూకా సంతగుడిపాడు ఈయన స్వగ్రామం. తండ్రి దగ్గర ప్రారంభించిన సంగీతానికి దోహదం చేసిన సద్గురువుల బాటలో అపారమైన మనోధర్మాన్ని సంపాదించారు మహావాది. ఆ రోజుల్లో గుంటూరులో పేరెన్నికగన్న విద్వాంసులలో మృదంగంలోనూ, వయొలిన్‌లోనూ సవ్యసాచియైన చదలవాడ కుమారస్వామి వద్ద ముందు వయొలిన్ నేర్చుకున్నారు మహావాది. క్రమంగా ఆ అభిరుచి గాత్రం వైపు మళ్లింది. కేవలం స్వయంకృషితో తనదైన బాణీని ఏర్పరచుకున్నాడాయన.
ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, బాలమురళీ వంటి మేధావుల ప్రశంసలందుకున్నాడు.
తెలుగునాట మాత్రం ఆయనకు తగ్గ గౌరవం లభించలేదనే చెప్తారు - మన తెలుగువారికున్న ప్రత్యేకత ఇదే.
మహావాదికున్న చెప్పుకోదగ్గ శిష్యులలో
త్రిపురారిభట్ల శ్రీరామమూర్తి, నేలభొట్ల ఆంజనేయశర్మ, జనాబ్ షేక్ కబీర్ సాహెబ్, చదలవాడ ప్రేమావతి మొదలైనవారు ముఖ్యులు.
కర్ణాటక సంగీతమొక్కటే కాదు.
పౌరాణిక నాటకరంగ ప్రవేశం కూడా చేసి, ‘పాండవోద్యోగ విజయాల’లో ధర్మరాజు పాత్రలో నటించడం, అద్దంకి శ్రీరామమూర్తి కోరిక మేర నాటకాల నుంచి విరమించి అమృతోపమానమైన గానంతో, ‘తన మానసిక పుత్రిక ‘కుంతీకుమారి’ని సాక్షాత్కరింపజేసిన మహావాదిని,
‘మోదముతోడ నీదు నగుమోము గనన్ మది పల్లవించు ఆ
మోదముతోడ నీదు నగుమోము వినన్ హృది పొంగులెత్తు, సా
హ్లాదములౌ కృతుల్ నవరసాకృతులై విలసిల్లు మా ‘మహా
వాదివి’ నీవు; నీకు ప్రతివాది యటంచును లేడు ధాత్రిపై’
అని ప్రశంసించారు కరుణశ్రీ.
యావదాంధ్ర దేశంలో శాస్ర్తీగారు తనదైన శైలితో నాలుగు దశాబ్దాలపాటు పండిత పామర జనకంగా సంగీత కచేరీలు చేశారు. రాజమండ్రిలో తన 29వ ఏట 1940లో గండపెండేరంతో సత్కారం పొందిన గొప్ప సంగీత విద్వాంసుడు.
స్వయంగా ఆలిండియా రేడియో వారే రికార్డు చేస్తామన్నా, శాస్ర్తీ సమ్మతించలేదు.
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వరదలు, బురదల వల్ల నిలకడ కరువైంది. అయినా వేటినీ ఖాతరు చేయలేదు. కళాప్రపంచంలోనే విహరించారు. ఎవ్వరినీ ‘దేహి’యని ఆశ్రయించలేదు. వారనుకున్న బాటలో ఒంటరిగానే పయనించారు. వారికి శాంతినీ, విశ్రాంతినీ కలిగించినది, వారి మిత్రులే. చిలకలూరిపేటలోవున్న ‘నాదస్వర బ్రహ్మ’ షేక్ చినపీరు సాహెబ్‌తో ఈయన చాలా సన్నిహితంగా ఉండేవారు అని చెప్తారు.
సాధారణంగా మన తెలుగు వారిలో ఎవరైనా విద్వాంసుడో, కవియో, మహాజ్ఞానియో బయలుదేరితే, అతను బ్రతికున్నన్నాళ్లూ పట్టించుకునే వాళ్లెవరూ ఉండరు. ఏమీ తెలియనట్టే ‘నిద్రబోయి, తీరా సదరు మహావ్యక్తి హరీ’మన్న తర్వాత, సభలు సమావేశాలు చేసి, కాంస్య విగ్రహాలో, తైలవర్ణ చిత్రాలో ఆవిష్కరించడానికి ఎగబడ్డం మామూలే. స్థితప్రజ్ఞులు కొందరుంటారు. అవకాశాల కోసం అర్రులు చాస్తూ, కనిపించిన ప్రతి అథముణ్ణీ అనవసరంగా ముఖస్తుతి చేస్తూ పబ్బం గడుపుకునే చౌకబారు ఆలోచనలేమీ లేని విద్వాంసుడు మహావాది వెంకటప్పయ్య శాస్ర్తీ. తన 63వ ఏట (27.2.74) కనుమరుగైయ్యారు. కాని ఆయన జ్ఞాపకాలు కొందరి విద్వాంసుల హృదయాలలో ప్రక్షిప్తంగా ఉన్నాయి. ఆయన గానాన్ని విన్న అనుభూతులింకా, ఆ తరం వ్యక్తుల్లో పదిలంగానే ఉన్నాయి.
స్వేచ్ఛా జీవనానికీ, ప్రాపంచిక పరిధిలో జీవితానికీ కావలసిన కట్టుబాట్లకూ ఎంతటి సమన్వయం ఉండాలో శాస్ర్తీగారికి తెలిసినా, వారి అంతః ప్రేరణ ప్రకారమే నడుచుకున్న తలవంచని వ్యక్తి మహావాది వెంకటప్పయ్య శాస్ర్తీ.
*

చిత్రాలు.. కరుణశ్రీ *మహావాది వెంకటప్పయ్య శాస్ర్తీ *ఘంటసాల

- మల్లాది సూరిబాబు 9052765490