S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జానే కహాఁ గయే?

అయిదు వారాలు, అనవరతంగ, నా ఆలోచనలతో ఊదరగొట్టేసరికి అందరూ కాలం మారింది, లోకాభిరామం అనే కాలమ్ మారింది అనుకున్నరు. ఏమీ మారలేదు. అందుకే మరోసారి నడుస్తున్న మన ‘అతని’ గురించి, కొరకు వెదుకుతూ వెళదాం పదండి!
పట్టించుకునే వారున్నారు. నా గురించి రాసుకుని, చదువుతున్నారు అన్న సంగతి అతను పట్టించుకున్నట్లు లేదు. కనుక తన దారిన నడుస్తూ, ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఎక్కడున్నాడు? బొగ్గులకుంటా? లోతుకుంటా? నాగమయ్యకుంటా? నల్లకుంటా? బతుకమ్మకుంటా? అతని ఆలోచన కుంటలున్నాయి. కుంట అంటే ఏంటి? గుంట అంటే కొంతమందికి అమ్మాయి. చాలామందికి నేలలో ఉండే గొయ్యి. ఎకరంలో కొన్ని గుంటలుంటాయి. అంటే అది పొలం కొలతలో ఒక విస్తీర్ణం. కానీ కుంట అంటే గుంటకన్నా పెద్దది, చెరువుకన్నా చిన్నది అయిన జలాశయం. ఇందాక అనుకున్న కుంటలన్నీ మన భాగ్యనగరం అనే హైదరాబాద్‌లో ఉన్నాయి. ఆ బాదీ అంటే జనాశ్రయం. హైదర్‌గారి ఆబాదీ ఇది. ఖులీ ఖుతుబ్ షా ఈ నగరాన్ని కడుపుతున్నప్పుడు, చెరువుల్లో చేపలలాగ నా ఊరిని మనుషులతో నింపు అంటూ కవిత రాసుకున్నాడు. ఈ ఊళ్లో వందల కుంటలు, చెరువులు, తోటలు ఉండేవి. వాడల పేర్లన్నీ సేకరించి చూస్తే అందులో భవనాలకన్నా బాగ్‌లు అనే తోటలు ఎక్కువ కనిపిస్తాయి. బషీర్‌బాగ్, కుందన్‌బాగ్, మరెన్నో తోటలు. కుంటలు! కుంటల్లో చేపల సంగతి ఏమయిందో గానీ, నగరంలో మనుషులు ఎక్కువయినరు. ఎక్కడెక్కడి వారు ఇక్కడికి వచ్చి ఇండ్లు కట్టుకుంటున్నరు. అందుకే ఫూల్‌బాగ్‌లో పూలు కాదుగదా, మొక్కలు కూడా లేవు. నాగమయ్య కుంటలో, నల్లకుంటలో అసలు కుంట, గుంట, అందులో నీళ్లు ఆచూకీ కూడా లేదు.
కొన్ని కుంటల్లో నీళ్లు ఉండడం అతను ఎరుగును. కానీ, వాటన్నిటినీ పూడ్చి ఇళ్లు కట్టుకున్నరు. వాన కురుస్తుంటే, అతను ఒకసారి ఆనందంగా చూస్తూ ఉన్నాడు. అప్పట్లో కుంటలు, చెరువులు నిండడం గురించి ఆలోచిస్తున్నాడు. నగరంలో పడిన చినుకు పడినట్టు, ఎక్కడికో కొట్టుకుపోవడం గురించి ఆలోచిస్తున్నాడు. చెరువులు, కుంటల గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. నడుస్తున్న అతని కాలు, నీళ్లలో పడినట్టుంది. అప్పుడు అతనికి ఆనాటి మాటలు గుర్తుకు వచ్చాయి. ‘ఇంత వాన ఎందుకు లోతట్టు ప్రాంతాలు జలమవుతయి గదా?’ అని అడిగాడు ఒక అబ్బాయి. అవును మరి. ఇక జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, అధికార యంత్రాంగం, హుటాహుటిన సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టవలసి ఉందని, వాపోతారు. అతను ఆలోచనలో పడ్డాడు. నీళ్లలో పడ్డందుకు తాను ఆలోచనలో పడ్డాడు. టీవీ కారణంగా అబ్బాయి తప్పుడు ఆలోచనలో పడ్డాడు. లోతట్టు ప్రాంతం అంటే ఒకప్పటి చెరువు లేదా కుంట. ఆ సంగతి తెలిసి కూడా అక్కడ ఎందుకు ఇల్లు కట్టుకున్నరు? వర్షాలు రాకుండా ఉంటే, ఈ జనం ఏం తింటారు. జలమయం ఒకటే తెలుసు. జనమయం సంగతి తెలియదు. చవకగా దొరికింది గదా అని చెరువులో ఇల్లు కట్టుకున్న వారు వాన రాకుంటే బాగుంటుంది, అనుకుంటారు. వాన రాకుంటే, తాగడానికి నీరుండదు. తినడానికి తిండి ఉండదు. అయినా పట్నం వారు గదా, మినరల్ వాటర్ తాగుతారు, పీజ్ తింటారు. గుంటలో బతుకుతుంటారు. చటుక్కున అతనికి మాసాబ్ ట్యాంక్ అనే ప్రాంతం గుర్తుకు వచ్చింది. అంతలోనే ఆలోచన తెగింది. సీన్ మారింది.
ఆలోచనలలో నుంచి అసలు ప్రపంచంలోకి వచ్చి చూస్తే, తాను ఇంటి దారి పట్టినట్టు అతనికి అర్థమయింది. బయలుదేరింది వాకింగ్ అనే వ్యాయామం కోసమా? కాదేమో? కాలక్షేపం కోసమా? అందుకు మరెన్నో మార్గాలున్నాయి. ఈ రద్దీ, కాలుష్యం, గోలలో పడి నడిస్తేనే కాలం గడుస్తుందా? తాను మళ్లవలసిన మూల వచ్చిందని అర్థమయింది? ఎట్లా? అక్కడ మెట్ల మీద స్టీలు గొట్టాలతో కట్టిన రెయిలింగ్ ఉంటుంది. ఆలోచిస్తూ నడుస్తుండగా, పక్కన స్టీలుగొట్టాల రెయిలింగ్ కనిపిస్తే మళ్లడమేనా? వల్లకాట్లో రామనాథం, వాకిట్లో వేపచెట్టు అంటే ఇదే గాబోలు?! ఏ అంగడికి వెళ్లావు? అని అడిగితే, అక్కడ ముందర గేదె పడుకుని ఉందే, అక్కడ! అన్నాడట ఒక తెలివిగల మనిషి. అయినా అతనికి అది ఆలవాటయిన దారి.
పల్లెలో పశువులు, బండికి కట్టిన ఎద్దులు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు, ఆనాడు ఎక్కడికి పోవలసిందీ తెలియక మార్గదర్శనం కోరుకుంటాయి. తిరుగు దారిలో మాత్రం ఎవరూ చెప్పనవసరం లేకుండానే, తమ ఇంటికి నేరుగా వచ్చి చేరుకుంటాయి. అతను బండెద్దులాగ తాను కూడా నడుస్తున్నాను అనుకున్నాడు. తలెత్తి చూస్తే మగ్గం వర్క్స్ అని బోర్డ్ కనిపించింది. అక్కడ అంగడిలో మగ్గం మాత్రం లేదు. ఒక మంచం లాంటి ఏర్పాటు ఉంది. దాని మీద చీరె లేదా, మరొక వస్త్రం ఒకటి బిగుతుగా అమర్చి, పక్కన కూచుని ఒకతను చకీలు కుడుతున్నాడు. అతనికి అనుమానం వచ్చింది. తాను మామూలు నూలు అంగీ తొడుక్కుంటేనే అప్పుడప్పుడు చీదరగా ఉంటుంది. ఈ చకీల డ్రస్‌లు, చీరెలు ఎలా కట్టుకుంటారు? అని. ఈ మధ్యన పెళ్లిళ్లు పార్టీలకు వెళితే అక్కడ కొంతమంది పాతకాలం సినిమాల్లో వంటి దుస్తులు వేసుకుని కనబడుతున్నారు. అయిదు నక్షత్రాల హోటేళ్లలో ద్వారం దగ్గర ఉండే దర్వాన్‌లు అటువంటి డ్రస్ వేసుకునేవారు. కిరీటం లాంటి తలపాగా పెట్టుకునేవారు. ఈ మధ్యన పెళ్లికొడుకులకు ఆ రకం పోషాకు అంటే డ్రెస్ వేస్తున్నారు. అన్ని రంగులుండే ఆ బట్టలు వేసుకుని మామూలు పద్ధతిలో బజారులోకి వెళితే ఏమవుతుంది? పగటి వేషం అనుకుంటారేమో? కుక్కలు మొరుగుతయేమో?
నిజంగానే కుక్క మొరిగింది. కుక్కలకు తమది అంటూ కొంత రాజ్యం ఉంటుంది. అతని చిన్నప్పటి అనుభవం గుర్తు చేసుకున్నాడు. అదిలిస్తే కుక్క భయపడి పరిగెత్తింది. ఆహా అనుకుని అతను కుక్క వెంట పరుగెత్తాడు. ఒకచోటికి చేరిన తరువాత కుక్క వెనుకకు తిరిగి వీలయినంత గట్టిగా మొరిగి భయపెట్టింది. అంటే దాని రాజ్యం వచ్చిందన్నమాట! ఈసారి వెనుదిరిగి చూడకుండా పరుగెత్తడం అతని వంతయింది. ఈ టెరిటరీ (రాజ్యం) గురించి చదువులో, ఇతరత్రా తెలిసిన తర్వాత అతను హాయిగా నవ్వుకున్నాడు. అది గుర్తుకు వచ్చి అతను ఇప్పుడు కూడా నవ్వుతున్నాడు. ఆలోచిస్తూ నడుస్తున్న మనిషి ఒక్కసారిగా నవ్వడం మొదలుపెడితే, అందరూ ఏమనుకుంటారు? కుక్క మాత్రం ఏమనుకుంటుంది? దానికి సంగతి అర్థమవుతుందా? అసలు అది ఎందుకు మొరిగింది. అలవాటుగా మొరిగి ఉంటుంది. అతను నవ్వు ఆపుకుంటూ నడుస్తున్నాడు. వెనక్కు తిరిగి చూచాడు. కుక్క కనిపించలేదు. అతనికి మళ్లీ నవ్వు వచ్చింది. కుక్క మొరిగింది, అనే రేడియో పాట మనసులో మెదిలింది. మరింత నవ్వు వచ్చింది. అతను ఆగిపోయాడు. సీరియస్‌గా కనిపించాలని ప్రయత్నిస్తున్నాడు.
ఇంత దూరం నడిచాడు, నడుస్తున్నాడు. ఒక్క పరిచయంగల మనిషి కనిపించలేదు. పలకరించలేదు. అతను కూడా ఎవరినీ పలకరించలేదు. అతను అంత జనసమూహంలోనూ ఒంటరిగా ఉంటాడని అర్థమా? అంతగా ఆలోచించే మనిషి, అందరినీ పరిశీలనగా చూస్తాడా? ఎవరినీ పట్టించుకోడు. అతను అందరినీ చూచే తీరు చూస్తే మాత్రం, అందరి మధ్యన ఉండాలన్న భావం కనబడుతుంది. అయినా ఒంటరిగా ఉండాలి, అనుకుంటాడేమో! అందరూ ఉండాలి. అయినా ఎవరి దారిన వాళ్లు ఉండాలి. తన గురించి పట్టించుకోకూడదు. తాను మాత్రం అందరినీ పట్టించుకుంటాడు. ఉదాహరణకు పాన్‌షాప్‌లో తెల్లజుట్టు మనిషి. చాలాకాలం తరువాత కనిపించాడు. అలాగని ఇద్దరికీ పరిచయం ఉందా? పలకరించుకుంటారా? అదేమీ లేదు! అతను ముందుకు వెళ్లిపోతున్నాడు. అతను అంగడి వేపు చూచే తీరు చిత్రంగా ఉంటుంది. ఆ అంగడి కొరకే వెతుకుతున్నాడు, అనిపిస్తుంది. కానీ ముందుకు కదిలిపోతాడు. మరో అంగడినీ అట్లాగే చూస్తాడు. ఛట్! ఏదో గుర్తొచ్చింది! కట్!

కె. బి. గోపాలం