S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 48 మీరే డిటెక్టివ్

ఆశే్లష ఆ రోజు హరికథని జాగ్రత్తగా వినసాగాడు. హరిదాసు క్రితం రోజు మధ్యలో వదిలిన 23వ సర్గని తిరిగి ఆరంభించాడు. ఆయన ఇలా చెప్పసాగాడు.
‘లక్ష్మణుడు తను చెప్పేది ఇలా కొనసాగించాడు.
‘వారు మోసంతో, పాపబుద్ధితో ఈ పని చేస్తున్నారని నువ్వు గ్రహించనందుకు నాకు దుఃఖం కలుగుతోంది. ఇలాంటి ధర్మాచరణ నిందింపతగింది. వాళ్లు ఇద్దరూ స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ ఎన్నడూ నీ మంచిని కోరలేదు. వాళ్లు తల్లిదండ్రులనే పేరుగల శత్రువులు. అలాంటి వారి కోరికని తీర్చాలి అని మనసులో కూడా అనుకోకూడదు. వాళ్లకి కలిగిన ఈ ఆలోచన కేవలం దైవం చేసిందిగా నువ్వు అనుకుని, రాజ్యం పోవడాన్ని నువ్వు పట్టించుకోకపోవడం నాకు ఇష్టం లేదు.
‘గట్టి మనసు లేనివాడు, వీరత్వం లేనివాడు మాత్రమే దైవం మీద ఆధారపడతాడు. ఆత్మాభిమానం గల వీరులు దైవాన్ని లెక్కచేయరు. స్వంత ప్రయత్నంతో దైవాన్ని బాధించే సమర్థుడి ప్రయోజనాన్ని దైవం పాడుచేసి దుఃఖం కలిగించలేదు. దైవానికి ఎంత శక్తి ఉందో, పురుషుడికి ఎంత శక్తి ఉందో ఈ రోజు అంతా చూస్తారు. దైవానికి, మనిషికి ఉన్న భేదం స్పష్టమవుతుంది. నీ రాజ్యాభిషేకాన్ని ఏ దైవం అడ్డుకుంటుందో ఆ దైవాన్ని నేను నా పౌరుషంతో ఎదిరించడాన్ని ప్రజలంతా చూస్తారు. బంధనాలని తెంచుకుని, అంకుశాన్ని లెక్క చేయకుండా మదబలంతో గర్వించి పరిగెత్తే ఏనుగులా నేను పురుషాకారంతో దైవాన్ని వెళ్లగొడతాను. ఈ రోజు సమస్తమైన లోకపాలకులు, మూడు లోకాలు ఏకమైనా కాని రాముడికి జరగబోయే అభిషేకాన్ని అడ్డుకోలేవు. ఇక మన తండ్రి గురించి చెప్పనే అక్కర్లేదు.
‘రాజా! నువ్వు అడవిలో నివసించాలని రహస్యంగా నిర్ణయించిన వారే పధ్నాలుగేళ్లు అడవిలో నివసిస్తారు. తండ్రి ఆశని, నీ అభిషేకానికి విఘ్నం కలిగిస్తూ తన కొడుక్కి రాజ్యాన్ని కట్టబెట్టే కైకేయి ఆశనీ నేను తుంచేస్తాను. నా బలాన్ని ఎదిరించిన వారికి భయంకరమైన నా పౌరుషం ఎంతటి దుఃఖాన్ని కలిగిస్తుందో అంత దుఃఖాన్ని దైవం కూడా కలిగించలేదు.
‘నువ్వు వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేసి తపస్సు చేసి అడవికి వెళ్లాక నీ కొడుకులే రాజ్యపాలన చేస్తారు. ప్రజలని స్వంత కొడుకుల్లా పాలించడం కోసం రాజ్యాన్ని తమ కొడుకులకి అప్పజెప్పి అడవుల్లో నివసించడం మన ధర్మంగా నిర్ణయించబడింది కదా. రాజైన దశరథుడు చపలచిత్తుడై ఉన్నప్పుడు రాజ్యం ముక్కలవుతుందనే కారణంతో నువ్వు ఈ రాజ్యం వద్దని అనుకుంటున్నావు. కాని ఆ భయం అక్కరలేదు. నేను నీకు మాట ఇస్తున్నాను. సముద్ర తీరం సముద్రాన్ని రక్షించినట్లుగా నేను నీ రాజ్యాన్ని రక్షిస్తాను. అలా కాకపోతే నాకు వీరలోకం లభించకుండు గాక! మంగళ ద్రవ్యాలతో నీ రాజ్యాభిషేక ప్రయత్నాలు చెయ్యి. నేను ఒక్కడినే నా బలంతో రాజులు అందర్నీ నివారిస్తాను.
‘నా ధనస్సు అలంకారం కోసం, చేతులు కేవలం అందం కోసం మాత్రమే కావు. ఖడ్గం నడుముకి కట్టుకోడానికే కాదు. బాణాలు కదలకుండా పడి ఉండటానికి కాదు. ఈ నాలుగూ శత్రువుని బాధ పెట్టడానికే ఉన్నాయి. నాకు శత్రువు అని నిర్ణయించబడే వాడిని ఏ విధంగాను జీవించనివ్వను. బాగా పదునైన, మెరుపులా మెరిసే నా కత్తిని చేత్తో పట్టుకుని నేను నా ఎదుట ఉన్న శత్రువు దేవేంద్రుడైనా లెక్కచేయను. ఈ భూమంతా కత్తితో నరకబడ్డ ఏనుగులు, గుర్రాలు, మానవుల చేతులతో, తొడలతో, తలలతో నిండి, నడవడానికి వీలు కాకుండా ఉంటుంది. ఏనుగులు నా కత్తివేటుకి మండే పర్వతాల్లా, మెరుపుతో కూడిన మేఘాల్లా తెగి భూమి మీద పడతాయి. వేళ్ల రక్షణ కోసం ఉడుము తోలుతో చేసిన కవచాలు ధరించి, చేత్తో ధనస్సుతో నేను నిలబడితే ‘నేను పురుషుడ్ని’ అని చెప్పుకునే ఎవరూ నా ముందు నిలవలేరు. నేను ఒక్క బలవంతుడ్ని అనేక బాణాలతో, ఒక్క బాణంతో అనేక మందిని చంపుతాను. నా బాణాల్ని మనుషులు, గుర్రాలు, ఏనుగుల మర్మస్థానాల్లో కొడతాను. ఓ రాజా! ఈ రోజు నా అస్త్ర శక్తి రాజైన దశరథుడ్ని రాజ్యాధికారం నించి తొలగించి నీకు ఆ అధికారాన్ని ఇవ్వగలదు. మంచి గంధం, పూలు ధరించడానికి, దానం చేయడానికి, మిత్రులని రక్షించడానికి తగిన ఈ చేతులు ఈ రోజు నీకు రాజ్యాభిషేకం చేయడాన్ని అడ్డుకునే వారిని తొలగించడానికి పని చేస్తాయి. నీ ఏ శత్రువుని వారి ప్రాణం, కీర్తి, మిత్రుల నించి దూరం చేయాలో చెప్పు. నేను ఇప్పుడే ఆ పని చేస్తాను. ఈ భూమి నీకు వశం అవడానికి నేనేం చేయాలో ఆజ్ఞాపించు. నేను నీ సేవకుడ్ని.’
అప్పుడు రాముడు లక్ష్మణుడి కన్నీటిని తుడిచి మాటిమాటికీ ఓదారుస్తూ ఇలా చెప్పాడు.
‘ఓ లక్ష్మణా! నేను తండ్రి మాటనే పాటించదలచుకున్నాను. ఇదే మంచి మార్గం.’ (సర్గ 23 -13వ శ్లోకం నించి చివరి శ్లోకం దాకా (41)
హరిదాసు కథ ముగించి స్టేజి దిగాక ఓ వృద్ధ శ్రోత చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
‘ఈ హరిదాసు తప్పులు చెప్పకుండా హరికథని చెప్పడు కదా? ఈ రోజూ తప్పులు చెప్పాడు’
మీరు ఆ తప్పులని కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
శ్రీ తులసీదాస్ రాముడి మీద
రాసిన పుస్తకం పేరేమిటి?
*
గత వారం
‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
ఈ సర్గలోని దైవం అనే పదం దేనికి ప్రత్యామ్నాయ పదం అని భాష్యకారులు చెప్పారు?
-‘కర్మ’కి ప్రత్యామ్నాయ పదం అని భాష్యకారులు చెప్పారు.
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.క్రితం రోజు చెప్పింది 22వ సర్గ దాకా. హరిదాసు తప్పుగా 21వ సర్గ దాకా చెప్పానని చెప్పాడు.
2.ఈ రోజు 23వ సర్గే కాక, 24వ సర్గలోని 12వ శ్లోకం దాకా చెప్పాడు.
3.నేను నార చీరలు, జింక చర్మం, జటలు ధరించి అరణ్యానికి వెళ్తేనే కైకేయికి మనశ్శాంతి అని రాముడు చెప్పాడు. కాని హరిదాసు కేవలం అరణ్యానికి వెళ్తేనే మనశ్శాంతి అని చెప్పాడు.
4.అభిషేకానికి విఘ్నం కలిగినందుకు పిన్నమ్మని దూషించకు అని రాముడు చెప్పాడు. దీన్ని హరిదాసు చెప్పడం విస్మరించాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి