సుస్వరానికి భూషణం శుద్ధమైన మనస్సు
Published Saturday, 19 August 2017మనసనేదే లేకపోతే మనిషి ఒక్క క్షణం ఉండలేడు. మనస్సును ‘కోతి’ అనీ, హంస అనీ, ఊయల అనీ, ఆకాశమనీ, పుష్పమనీ.. ఇలా ఎనె్నన్నో ఉపమానాలతో కవులు వర్ణిస్తారు.
మన ఋషులు ఈ మనస్సును జగత్తుకు ప్రతిరూపంగా చెప్పారు.
మనం ఆలోచించేదాన్ని బట్టే ఏదైనా.. జరిగే పనులన్నీ మన మనస్సును బట్టే.
మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నవాడే ఆనందం అనుభవిస్తాడని పెద్దలు చెప్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనసుకు సంబంధించిన విషయాలెన్నో చెప్పాడు.
ఇంద్రియాలు గుర్రాలనీ, మనస్సు ఆ గుర్రాలను నియంత్రించే పగ్గమనీ, శరీరమే రథమనీ అర్జునుడితో చెప్తాడు.
ధూర్జటి లాంటి ఎందరో శివభక్తులు ఈ మనస్సు చేసే మాయల్ని వర్ణించి చెప్పారు.
చంచలంగా తిరిగే మనస్సును కుదురుగా కట్టి కూర్చోపెట్టే బాధ్యతను కూడా పరమ శివుడి మీదే ఉంచాడు ధూర్జటి.
సంగీత సద్గురులైన త్యాగరాజు మనస్సునే కేంద్రంగా చేసుకుని పాడుకున్న కీర్తనలెన్నో. మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచంలో రెండు రకాల మనుషులు కనిపిస్తారు.
ఒకరు అహంకారం వారు.
మరొకరు వేదాంతం వారు.
మొదటివారు అహంకారాన్ని ముందు నడవమంటారు. దిశ లేకపోయినా దశంటూ వుంటే కొంతకాలం ఎదురు దెబ్బలు తగుల్తున్నా రెపరెపలాడుతూంటారు.
ఇంక వేదాంతం వారు నీడలా శ్వాసలు లెక్కపెడ్తూ వెంటాడుతూంటారు. తుది నిర్ణయం వేదాంతమే. అహంకారం వాళ్లు తెల్లబోయి కూర్చోవడమే. ప్రపంచ తత్త్వాన్ని అర్థం చేసుకోవడం ఒక ఎత్తు. అవగాహనతో ఆచరణతో సాధించడం మరో ఎత్తు.
ఒకటి వాక్కు చేసే పని.
రెండోది మనస్సు చేసే పని.
తనకంటే అధికుల ఔన్నత్యాన్ని సహించలేక పోవడం మాత్సర్యం.
ఎదుటి వాళ్లకు కష్టాలు రావాలే గాని తనకు మాత్రం రాకూడదనుకోవడం ‘ఈర్ష్య’. మనలో ఎదుటి వాళ్లు సుఖాలనుభవించకూడదనుకోవటం ‘అసూయ’.
తను చేసిన ధర్మకార్యాలు, ఎదుటి వాళ్లు డప్పు కొట్టి చెప్పాలనుకోవడం ‘దంభం’. తన ఐశ్వర్యంతో ఎవరూ సరిపోరనుకోవడం ‘దర్పం’.
ఇవన్నీ మనిషి మనసులో నుంచి పుట్టేవే. బయట నుంచి కాదు. అన్నం తినకుండా మారాం చేసే చిన్నపిల్లాడితో మాటాడినట్లుగా వుండే త్యాగరాజ కీర్తనలు ఎన్నో వున్నాయి. బహుశా ఇన్ని రకాల మనుషుల్నీ త్యాగయ్య చూసే వుంటాడు. అనుమానం లేదు. సంగీత రంగంలో కూడా భావ దారిద్య్రంతో బాధపడేవాళ్లున్నారు. ముక్కుమూసుకుని ఎక్కడో మూలగా అరణ్యాలలో తపస్సు చేసుకునే వారికి రాక్షసుల వల్ల బాధ తప్పిందా? మన ప్రక్కనున్న మనుషుల సంగతి కూడా అంతే.
సమాజంలోని మనుషుల మనస్తత్వాలను బాగా గ్రహించగలిగే తెలివితేటలు లేకపోతే మన మనుగడ కూడా కష్టం. ఎవరినీ శాసించలేం. నా మాటే చెల్లాలనుకోవడం అవివేకం. మనస్సును అదుపు చేసుకుంటూ ఎక్కడ ఏది ప్రస్తుతమో తెలిసి మసలుకుంటూ వుండాలనే త్యాగయ్య సందేశం ఎన్నో కీర్తనల్లో కనిపిస్తుంది మనకు.
‘చక్రవాకం’ రాగంలో త్యాగయ్యంటా డు. ‘మనసా ఎటులోర్తునే - నా మనవిని చేకొనవే!’
అ॥ ప॥ దినకర కుల భూషణుని దీనుడవై భజన చేసి
దినము గడుపు మనిన నీవు - వినవదేల గుణవిహీన॥
చ॥ కలిలో రాజస తామస గుణములు కలవాని చెలిమి
కలసిమెలసి తిరుగుచు మరి కాలము గడపకయే
సులభముగా గడతేరను - సూచనలను తెలియజేయు
యిలను త్యాగరాజు మాట వినవదేల గుణవిహీన॥
ఈ సృష్టిలో రెండు తరగతులుగా మనుషులుంటారు.
సరిగ్గా బ్రతకగలిగిన వారు మొదటి రకం. సరిగ్గా బ్రతకలేని వాళ్లు రెండో తరగతి.
సుఖంగా సక్రమంగా జీవించేవాళ్లలో రంధ్రానే్వషణ చేసేవాళ్లుంటారు.
పద్ధతిలో సరిగ్గా జీవించలేని వాళ్లను చూస్తే హేళనగా చూడాలనుకునేవాళ్లూ, వేళాకోళంగా మాట్లాడే వాళ్లూ ఉంటారు.
ఈ రెండూ ద్వేషం నుంచి వచ్చేవే. అందుకే శ్రీకృష్ణుడు ‘గీత’లో ఎప్పుడో చెప్పాడు.
ఇలా చేయండి. ద్వేషం మీ నుండి జారిపోతుంది. సరిగ్గా జీవించే వాళ్లతోనే.. స్నేహం చేయండి. (సత్సంగత్వే నిస్సంగత్వం)
వాళ్లలోని మంచి గుణాలను పైకి చెప్పనక్కర్లేదు. మనసులోనే అభినందించండి. ఆ భావన మీలో చెడు ఆలోచనలు రానివ్వదు.
మన భక్తి ఎలా ఉంటుందంటే, ఏ పని ఎలా చేయాలో నువ్వు తెలుసుకోవాలి సుమా! అని ‘పై వాడు’ చెబుతూనే ఉంటాడు. ‘ఏమో! ఏ పనీ చేయలేకపోతున్నాను. నువ్వు తలుచుకుంటే అసాధ్యముందా? నా పనులు కూడా కాస్త నువ్వే చేసి పెట్టరాదా? అంటాడు మనిషి.
కర్తవ్యం ఎలా చేయాలో అలా సక్రమంగా చేస్తే శక్తి పైవాడే అందిస్తాడు.
మన చుట్టూ తిరిగే మనుషుల మనస్తత్వాలను గమనించి నడవాలంటాడు త్యాగరాజు. ఓ మనిషి వున్నట్లు మరో మనిషి ఉండడు. ఒక మొక్క వున్నట్లు మరో మొక్క వుండదు.
ఈ విశ్వమంతా వైవిధ్యంతో నిండినదే. మన ప్రతి కదలికకూ ఒక అర్థం ఉంటుంది. యుక్తమైన రీతిలో దాన్ని మలుచుకుంటూ బ్రతకమని నిర్దేశించాడు. కాదు. గట్టిగా హెచ్చరించాడు. బాగుపడే యోగమే వుంటే, వినాలనే బుద్ధి కలుగుతుంది.
* * *
‘చెంబై వైద్యనాథ భాగవతార్’ కర్ణాటక సంగీత రంగంలో బాగా పేరున్న విద్వాంసుడు. సంగీత కళానిధి టి.వి.గోపాల కృష్ణ (మృదంగం - గానం) చలనచిత్ర నేపథ్య గాయకుడు పద్మభూషణ్ కె.జె.జేసుదాస్ ఈయన శిష్యులే.
‘మలయమారుతం’ రాగంలోని ఈ కీర్తన ఎన్నో దశాబ్దాల క్రితం చెంబై గ్రామఫోన్ రికార్డులో పాడారు.
మలయ మారుతానికీ, ఝంఝామారుతానికీ తేడా వున్నట్లే, చెప్పవలసిన విషయాన్ని ఎంతో అనునయంతో చెప్పేలా ఉంటుందీ రాగం.
సప్త స్వర సుందరులను దర్శించిన మహానుభావుడు త్యాగయ్య.
నిస్సంగత్వంతోనే బ్రతుకుతున్నా బ్రతుకంటే బాధల బందీఖానా’గా తలుస్తూ శ్రేయో మార్గాన్ని పట్టుకుని తరించాడు.
చెప్పవలసిన విషయాల్ని సూటిగా చెప్పడమే కాదు. సరళంగా చెప్పాడు. తన కోసం నాదాత్మకంగానే పాడుకున్నాడు.
ఆయన ఆత్మవిచారం తెలిసి, పదిమందీ ఆయన మార్గంలో నడిచి ఆ కీర్తనలు పాడుకుంటున్నారు.
* * *
ఏ పాటకైనా ఓ రాగమంటూ సహజంగా ఉంటుంది. ఈ రాగం ఎక్కడో ఆకాశాన్నుండి ఊడిపడదు.
పత్తి నుంచి చిన్నచిన్న ఒత్తులు ఎలా తయారౌతాయో, కీర్తనల నుండి రాగం అలా ఉత్పత్తి అవుతుంది. రాగం యొక్క పరిధి పెద్దది. ఒకటి రెండు కీర్తనలతో తృప్తిపడని వాగ్గేయకారులు ఒకే రాగంలో ఎనె్నన్నో కీర్తనలు రాశారు. ఒక కీర్తనకూ మరో కీర్తనకూ పోలికంటూ కనిపించదు. అదీ వారి ప్రజ్ఞ. కంటికి కనిపించే కీర్తనకూ కనిపించని రాగానికి ఎంతో తేడా ఉంది.
సంగీత జ్ఞానం కలిగి ప్రజ్ఞాప్రాభవాలున్న సద్గురువుల వల్ల మాత్రమే రాగసౌందర్యంలోని మర్మం తెలుసుకునే వీలుంటుంది.
గురువుకు చెప్పాలనిపించాలి.
శిష్యుడికి ఆ గురువు యందు గురి ఉండాలి. సంగీతం పట్ల భక్తి గౌరవాలుండాలి. ఈ ఇద్దరి వల్ల లోకోపకారం జరుగుతుందని దైవం కూడా భావించాలి. యోగ్యత ఒక్కటే సరిపోదు. యోగం కూడా ఉండాలి. బాగా పేరు తెచ్చుకున్న సంగీత విద్వాంసుల చరిత్ర పరిశీలించండి.
అందరూ గురు కటాక్షం పుష్కలంగా వుండబట్టే వెలుగులోకి వచ్చారు.
చెంబై వైద్యనాథ భాగవతార్ అప్పట్లో ఓ స్టార్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న మహా విద్వాంసుడు.
సంగీత కుటుంబంలో పుట్టిన చెంబై కేరళలోని పాల్‌ఘాట్ సమీపంలోని చెంబై జన్మస్థలం.
శుద్ధమైన మనస్సు సుస్వరంతో పండిత పామర జనరంజకంగా పాడిన చెంబైకు, అప్పట్లో బాగా పేరున్న విద్వాంసులు సహకార వాద్యానికి ఉవ్విళ్లూరే వారు లాల్‌గుడి, గోపాలకృష్ణన్, మణిఅయ్యర్, పళని, శివరామన్, ప్రముఖులు. ఇప్పటికీ కేరళలోని ముఖ్యమైన దేవాలయాల్లో సంగీత కచేరీలు విస్తృతంగా జరుగుతాయి. ఆ రోజుల్లోనే చెంబై కచేరీలు వినేందుకు సంగీత రసికులు ఎగబడేవారు.
అపారమైన మనోధర్మంతో పాడే రాగాలాపన అతి వేగంగా పాడే స్వరకల్పన వైద్యనాథ భాగవతార్ గానంలో ప్రత్యేక ఆకర్షణ.
చెంబై శిష్యుడైన జేసుదాస్ తన గురువు పేర త్రివేండ్రంలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి, ప్రతి ఏడూ సంగీతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
1927 సం.లోనే గ్రామఫోన్ రికార్డుల ద్వారా చెంబై గానంలో కలిదిత మవడంతో ఎనలేని ఖ్యాతి వచ్చింది.
1960 ప్రాంతాల్లో ఓసారి విజయవాడ స్టేషన్‌లో ఓ మూల కూర్చుని ఆయన సంధ్యావందనం చేసుకుంటున్న దృశ్యం నేను మరిచిపోలేనిది.
సంగీతం పట్ల సంప్రదాయాల పట్ల భక్తిగౌరవాలున్న విద్వాన్ మణి చెంబై.
ఎంతో నియమ నిష్ఠలతో సంగీతాన్ని అభ్యసించిన చెంబై చివరి వరకూ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
కచేరీలో శ్రీకృష్ణ కర్ణామృతం, రామకర్ణామృతం నుండి శ్లోకాలు విధిగా పాడే సంప్రదాయం ఆయనతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. తరువాత తరంలోని విద్వాంసులు చాలామంది ఆ సంప్రదాయాన్ని అనుసరించారు.
* * *
వేదాధ్యయనం, సంగీతాధ్యయనం రెండూ ఒకలాగానే ఉంటాయి. రెండింటికీ పునశ్చరణయే ప్రధానం. అనగనగ రాగమతిశయిల్లు’ అనే మాటకు ఇదే అర్థం.
పరమశివునికి తత్పురుష, ఈశాన, అఘోర, సద్యోజాత, వామదేవులనే పేర్లతో వున్న ఐదు ముఖాలున్నాయి.
తత్పురుషుడు తూర్పు వైపు, అఘోరుడు దక్షిణం వైపు, సద్యోజాతుడు పశ్చిమాన్ని, వామదేవుడు ఉత్తరాన్ని చూస్తూంటారు. ఈశానుడు నాలుగు ముఖాల మధ్యలో ఎత్తుగా ఉంటాడు.
అన్ని దిక్కులలో ఉండే ప్రాణుల్ని కనిపెట్టి చూస్తూ పరమేశ్వరుడు అధిపతిగా ఉంటాడని ఈ పంచ ముఖాలు సూచిస్తాయి.
మంత్రాధీనం దైవం అంటారు. సామవేదం నుండి పుట్టిన సంగీతం త్రిమూర్తులకు మహా యిష్టం. మంత్రానికి ఎంత శక్తి ఉందో సంగీతానికీ అంతటి శక్తి ఉంది.
సప్తస్వర సుందరులు ‘దేవతామూర్తులు’. అర్థ్భావం లేకుండా, ఏవో నాలుగు స్వరాలు తెలుసనుకుంటూ, ఎటువంటి అనుభూతీ లేకుండా యాంత్రికంగా పాడే సంగీతానికి ఈ దేవతలు లొంగరు. కనరు, వినరు. మూర్కొనరు. ‘నాభి హృత్కంఠరసన నాసాదులతో ధ్యానంతో అనుష్టిస్తేనే స్వాధీనవౌతారు.
ఎవరికైనా ఉత్తరం వ్రాయాలంటే అడ్రసు సరిగ్గా వివరంగా పిన్‌కోడ్ సహితంగా వుండాలి. ఫోన్ చేయాలంటే ఆ నంబర్ సరిగ్గా ఉండాలి. తప్పు నంబర్‌కు చేస్తే వచ్చే ప్రతిస్పందన మనకు తెలుసు.
సప్తస్వర సుందరుల విషయం కూడా అంతే. సంగీత పాటకులంతా (సింగర్స్) నాదోపాసకులు కారు. నాదోపాసన తెలిసిన గాయకులు వేరు. అటువంటి వారు అందరికీ సులభంగా దొరకరు.
*
చిత్రాలు.. చెంబై వైద్యనాథ భాగవతార్ సంగీత కచేరీ
*చెంబై వైద్యనాథ భాగవతార్‌తో జేసుదాస్