S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అపర కుబేరుడు

ఆలోచనలే అతడి పెట్టుబడి. ఉయ్యాల తొట్టెలో పడుకున్న వయసులో.. ఉన్నత విద్య చదివేటప్పుడు.. ఉద్యోగం చేసేటప్పుడు.. ఎప్పుడైనా సరికొత్త ఆలోచనలే అతడిని నడిపించాయి. కలల సాకారానికి ప్రయత్నించడంలోను అతడిది విభిన్న శైలి. అతడి తెలివికి దక్కిన మూల్యం అపర కుబేరుడిగా ఎదగడమే నంటూ.. జెఫ్ బెజొస్ జీవితాన్ని కళ్ల ముందు ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు.
-డి.లావణ్య (అనకాపల్లి)
పక్షం రోజులా?
ఆస్ట్రేలియాలో కొన్ని జీవులు తిన్నది అరగడానికి పక్షం పడుతుందని తెలిసి ఆశ్చర్యపోయాం. భూమికి 4వేల కాంతి సంవత్సరాల దూరంలో కనుగొన్న కొత్త గెలాక్సీకి మన జ్ఞానదేవత సరస్వతి పేరు పెట్టడం మనందరికీ గర్వకారణం. ‘అంతరిక్షంలో సరస్వతి’ విషయాలు అద్భుతం అనిపించాయి. గ్రిప్ కోసం కాళ్లు చేతులకు కేవలం మెగ్నీషియం కార్బొనేట్ పౌడర్ పూసుకొని ఎతె్తైన భవనాలు, నిట్టనిలువు కొండలు ఏ పరికరాలూ లేకుండా అవలీలగా ఎక్కేసే మన స్పైడర్‌మాన్ జ్యోతిరాజ్ విశేషాలు భలేగా ఉన్నాయి. విమర్శిస్తే నాయకులు ఆగ్రహిస్తారు గాని వారికి విమర్శ అనుకూల అంశమే అని వసంతకుమార్ చెప్పినది ఆలోచనీయమే. విమర్శ వల్ల నాయకుడు మెరుగుపడతాడు.
-బి.సోనాలి (సూర్యారావుపేట)
విశేష కృషి
‘అమృతవర్షిణి’ శీర్షికలో ఆంధ్ర దేశంలో భారతీయ సనాతన, సంగీత సంప్రదాయాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజలలో ఈ కళ పట్ల ఆదరాభిమానాలు పెంచేందుకు విశేష కృషి సల్పిన మహనీయుల గురించిన కథనం మమ్మల్నెంతగానో రంజింపజేసింది. తొలి సంగీత, నృత్య కళాశాలను విజయనగరంలో 1919లోనే ఏర్పాటు చేయడం ద్వారా ఎందరో అజరామరులైన కళాకారులను, లబ్దప్రతిష్టులైన విద్వాంసులను తెలుగుదేశానికి అందించిన అరుదైన ఘనత విజయనగర సంస్థానాధీశులకే దక్కుతుంది. అట్లే స్వతహాగా సంగీత, సాహిత్యాలపై వున్న మక్కువ కారణంగా కాకినాడలో 1904వ సం.లో సరస్వతీ గానసభను స్థాపించి, యావత్ రాష్టమ్రంతటా తన స్వంత ఖర్చులతో వందలాది సంగీత సభలను యజ్ఞం వలె నిర్వహించి ఆబాలగోపాలాన్ని రంజింపజేసిన ఘనత కొమ్మిరెడ్డి గారికి దక్కుతుంది. ఇప్పటికీ కొమ్మిరెడ్డి వారి స్ఫూర్తితో కాకినాడలో సంవత్సరంలో ముఖ్య పండుగలలో సంగీత కచేరీలు నిర్వహిస్తుండటం, వేలాది రసజ్ఞులైన శ్రోతలు వీటికి హాజరై సంగీత సాగరంలో ఓలలాడుతుండటం విశేషం. కొమ్మిరెడ్డి వారి కృషి గురించి ఇప్పటికీ సంగీత గురువులు తమ శిష్యులకు ప్రత్యేకంగా చెప్పడం విశేషం.
-ఎం.కనకదుర్గ (తెనాలి)
హుందాగా ఉంది
రాష్టప్రతి ముఖచిత్రంతో ఆదివారం అనుబంధంలో ఎంతో హుందాగా రూపొందింది. మన రాజకీయ నాయకులను ఆకాశానికి మొదటే ఎత్తివేసేత, వారి పురోగమనానికి అడ్డు తగులుతుందనేది వాస్తవం. ఇప్పటి రాజకీయ నాయకులెవ్వరూ దీనికి అతీతులు కారు. ‘అక్షరాలోచనలు’ అన్న శీర్షికకి చక్కటి న్యాయం జరుగుతోంది. కవితలన్నీ ఆలోచనామృతంగా ఉంటున్నాయి. అభినందనలు. తరగని నిధి పిల్లలకు బాగా నచ్చే రీతిలో చెప్పారు. అనువాద కథ ‘శిక్ష’ను మల్లాది చక్కగా నడిపారు. సంగీత విద్వాంసులు నిజంగా రసజ్ఞులు సంకల్ప సిద్ధులేకాక దైవకృపకు నోచుకున్నవారు. అట్టి వారిని సూరిబాబు గారు పరిచయం చేయడం అభినందనీయం.
-డా.శివభూషణం (కర్నూలు)
ఉన్నత పీఠంపై..
‘కవర్‌స్టోరీ’ -ఉన్నత పీఠంపై ఉద్దండుడు.. అంటూ నూతన రాష్టప్రతిగా ఎన్నుకోబడిన రామ్‌నాథ్ కోవింద్‌ను గూర్చి ఎంతో విలువైన సమాచారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. ‘సండే గీత’లో రెండు మంచి రోజులు కథనం బాగుంది. మనం ఎలా జీవించాలన్న అంశంపై చక్కటి వివరణ ఇచ్చారు. ‘గాయపడ్డ పిచ్చుక’ కథ చక్కటి నీతిని అందించింది.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
మంచి రోజు
మంచి రోజంతా ప్రత్యేకంగా ఉండదు. అన్నీ మంచి రోజులే. మనం ఉపయోగించుకున్న దాన్నిబట్టి, అది మంచి రోజుగా మారుతుందంటూ చెప్పిన ‘సండే గీత’ చక్కగా ఉంది. యోగ సాధకుల చెంత పొట్టి మేకలు చేసే చేష్టల వల్ల మానసిక ప్రశాంతత చేకూరడం, కాఫీ కప్పులో పైన తేలే మీగడకు రంగులు అద్ది చక్కని దృశ్యాలు సృష్టించడం అద్భుతంగా ఉన్నాయి. పేవ్‌మెంట్‌గాళ్లు జనాభా లెక్కల్లో కనబడని ఓటర్లు అన్నారు ‘చీకటి బతుకు’ కవితలో. కాని పేవ్‌మెంట్‌గాళ్లని బిచ్చగాళ్లని కూడా జనాభా లెక్కల్లో చేర్చుతారు. అంత నైరాశ్యం ఎందుకు? బిచ్చగాళ్లలో చాలామంది ఆదాయం సగటు వేతన జీవి జీతం కంటె ఎక్కువే అని ఒక సర్వే చెప్పింది.
-జె.జ్ఞానబుద్ధ (సిద్దార్థనగర్)
విలువ
జీవితంలో ఎవరు ఇష్టమై, పట్టుదలతో ఏది సాధిద్దామనుకుంటున్నారో దానికి తగ్గ వనరులను సమకూర్చుకోవాలి. అవి పుస్తకాలు కావచ్చు, బోధకులు కావచ్చు, పరిసరాల ప్రశాంత వాతావరణం కావచ్చు. ఇవన్నీ సమకూరినా కాలం అన్నిటికంటే ప్రధానమైనది. కాలం విలువ తెలిసిన వారు అపజయాన్ని చూడరు. రోజులో మనం వృధా చేసేది కాలానే్న. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అన్నీ సాధించినట్టే.
-ఎన్.ఆర్. (సికిందరాబాద్)
అక్షరాలోచనలు
ఈ శీర్షికన అందిస్తున్న కవితలు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను సంతరించుకున్నవే. మూలను వివిధ వస్తువులతో మైలపరచినా, దేవుడి బొమ్మ ఉన్న గోడ పవిత్రమైనదన్న భావన బలీయమైనదనీ, ప్రయాణం రసపూర్ణమని.. కవితలన్నీ రసరమ్యంగా ఉన్నాయి. నరజన్మకీ భక్తికీ ఉన్న లంకెకూ, ప్రాముఖ్యాన్ని సూరిబాబుగారు ‘అమృతవర్షిణి’లో సంగీతపరంగా చక్కగా వివరించారు. చారిత్రాత్మక కట్టడాలలో నిక్షిప్తమైన ప్రాముఖ్యతను ‘వారసత్వ విజయం’ చక్కగా వివరించింది. ‘నేలతల్లి’ కథ హృదయంగమంగా సాగింది. ‘పిలుపు’ కథ ఉత్కంఠభరితంగా ఉంది.
-సి.హెచ్. (కర్నూలు)