S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆశ్చర్యంకన్నా అద్భుతం

నేను ఒక ప్రసిద్ధ పత్రికకు వ్యాసం రాశాను. మామూలుగానే పేజీ తయారయింది. సబ్‌ఎడిటర్ దాన్ని ఎడిటర్‌గారి ముందు ఉంచాడు. ఆ ఎడిటర్ పత్రికా రంగంలో గొప్ప పేరున్న మనిషి. శీర్షిక చూడగానే ముఖం ముడుచుకుని ‘ఏంటయ్యా ఇది?’ అన్నాడట. కానీ కింద బైలైన్ అంటే రచయిత పేరు చూచి ‘అబ్బో! ఇతనా! అయితే వదిలెయ్!’ అన్నాడట. ఈ సంగతి ఆ సబ్ ఎడిటర్ పట్టలేక నాకు చెప్పాడు. తమ సంపాదకునికి నాయందుగల గౌరవం, నమ్మకాలకు అతను సంతోషించాడని వేరుగా చెప్పనవసరం లేదు. ఇంతకూ సంగతేమిటంటే ఆ శీర్షికలో లియొనార్డో డావించి పేరు ఉంది. అప్పటివరకు ఆ పేరును అందరూ తెలుగులో డావిన్సీ అని రాసుకుంటున్నారు. కాని అది తప్పు. అసలయిన ఇటాలియన్‌లో పలకాలంటే అతని పేరు లియొనార్డో ద వించి. పోనీ మన ఇంగ్లీషు ప్రభావం కారణంగా లియొనార్డో డా వించీ అనాలి.
ఇంతకూ ఎవరీ లియొనార్డో? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం అంత సులభం కాదు. చాలా మంది అతని పేరు చెప్పగానే చిత్రకారుడు అంటారు. అతను మాత్రం బొమ్మలు గీసి ఊరుకోలేదు. రెక్కలు గట్టుకుని ఎగరడానికి ప్రయత్నించాడు. శాస్త్ర పరిశోధనలు చేశాడు. శరీరం కోసి లోపలి భాగాల బొమ్మలు గీశాడు. యంత్రాలు తయారుచేశాడు. శిల్పాలు మలిచాడు. సంగీతం, నాటకం, కథ, మిమిక్రీ, ఎన్ని చేయాలో అన్ని చేశాడు. అయితే ఇవన్నీ ఇప్పుడు చేస్తే అంత గొప్ప కాదు. నేను కూడా చాలా రకాల పనులు చేయగలను. చేస్తున్నాను. లియొనార్డో 1451లో పుట్టాడు. 1519లో గతించాడు. ఆ మధ్యలో అతను వీలయినన్ని అద్భుతాలు సృష్టించాడు. ‘రానున్న కాలంలో బండ్లను లాగడానికి జంతువుల అవసరం ఉండదు. అవి వాటంతట వేగంగా కదులుతాయి’ అన్నాడు ఆ కాలంలోనే లియొనార్డో. ఆర్కిటెక్ట్‌గా, వృక్ష పరిశోధకుడుగా, ఇంజనియర్, గణిత వేత్తగా కూడా ఈనాటికీ ప్రభావం కనబరిచే పనులను అతను అప్పట్లోనే చేశాడు. తెలివిగల వాళ్లు చాలా మంది ఉంటారు. లియొనార్డో లాగ తెలివిగల వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.
ఆ మధ్యన డా వించీ కోడ్ అని ఇంగ్లీష్‌లో ఒక నవల వచ్చింది. అది సంచలనాన్ని సృష్టించింది. అది సినిమాగా కూడా వచ్చింది. మతం గురించి అందరూ నమ్ముతున్న సంగతులను కొన్నిటిని కూప్పగూల్చే సంగతులు ఆ పుస్తకంలో ఉన్నాయి. దాన్ని బహిష్కరించాలి అన్న ఆలోచనలు కూడా పుట్టాయి. అందులో డా వించీ వేసిన ఒక చిత్తరువు కేంద్ర విషయంగా ఉంటుంది. మోనాలిసా అనే మాట చాలామంది విని ఉంటారు. అది ఒక అమ్మాయి బొమ్మ. అసలు చిత్రం పేరు లాగియకోండా! అది పారిస్‌లో ఉంది. మోనాలిసా చిరునవ్వు అసలు బొమ్మలో లేదని, అసలు బొమ్మలో ఉన్న కంఠహారం ఈనాటి పెయింటింగ్‌లో లేదని వాదాలున్నాయి. ఈ విషయంగా శాస్తప్రరంగా పరిశోధనలు కూడా జరిగాయి. నేను సైన్స్ సంగతులు అనే కాలమ్‌లో ఈ విషయంగా రాసిన వ్యాసాలు బాగా గుర్తున్నాయి.
ఆర్.వి.ఆర్. చంద్రశేఖరరావు గారు ప్రస్తుత కాలంలోని జ్ఞాని. ఆయన అంతర్జాతీయ స్థాయి పేరు పొందిన మనిషి. కంప్యూటర్లు, ఇంటర్‌నెట్ మరీ ఇంతగా రాని రోజుల్లో ఆయన ఒకసారి నా ఆఫీసుకు వచ్చారు. మేము పుస్తకాలు మొదలయిన సంగతులను గురించి బోలెడు మాట్లాడుకునే వాళ్లము. ఆయన వంటి వారితో మాట్లాడగలగడం నాకొక గౌరవంగా ఉండేది. రావుగారు వచ్చిన సమయానికి నేను కొత్తగా సంపాయించిన ఎన్‌సైక్లొపీడియా సీడీ చూస్తున్నాను. ఆయన ఆశ్చర్యంగా నా పక్కన కూర్చుని చూడసాగారు. విజ్ఞాన సర్వస్వాలు, బొమ్మలు, ధ్వనులు, విడియోలతో సహా అందుబాటులోకి రావడం అప్పట్లో ఒక వింత. ఏం ఆలోచిస్తున్నారో తెలియదు గానీ, రావుగారు ‘ఇందులో లాస్ట్ సప్పర్ అనే పెయింటింగ్ ఉంటుందా?’ అని అడిగారు. వెతికే వీలు ఉంది గనుక వెతికాను. చిత్రం దొరికింది. రావుగారు చిత్రం గురించి, దాన్ని గీసిన లియొనార్డో డావించీ గురించి బోలెడు సంగతులు చెప్పారు. సీడీలో వున్న సంగతులను చిన్నపిల్ల వానికి వలె ఉత్సాహంగా అడిగి చాలాసేపు చూచారు. ఇంతకూ లియొనార్డో వేసిన చిత్రాలలో మోనాలిసా కన్నా పేరుగల చిత్రం ఈ లాస్ట్ సప్పర్. అందులో ఏసుక్రీస్తు ఉంటాడు. అతనితోబాటు భోజనం బల్ల దగ్గర మరింత మంది (మొత్తం 12గురు అనుకుంటాను) ఉంటారు. బొమ్మలో ఏసు కుడిచేతి పక్కన ఒక ఖాళీ ఉంటుంది. అందులో ఉన్న మనిషి రూపాన్ని, తరువాత రంగుతో కప్పేశారని రావుగారు చెప్పడం గుర్తుంది. ఆ చిత్రం ఇప్పుడు ఇటలీలోని మిలాన్ నగరంలో ఉంది. దాన్ని చాలా భద్రత ఏర్పాట్ల మధ్యన ప్రదర్శనకు పెట్టారు. చూడదలుచుకున్న వారు టికెట్ కొని చాలాసేపు వేచి ఉండవలసి వస్తుంది. ఒక్కొక్కసారి పదిహేను నిమిషాల పాటు, ఒక గుంపును లోపలికి వదులుతారు. లోపల తేమ, వేడిమి నియంత్రణ ఏర్పాట్లు ఉంటాయి. ఏ కొంచెం తేడా వచ్చిన పెయింటింగ్ పాడయే అవకాశాలుంటాయి. కొన్నిసార్లు చూడవచ్చిన వారిని ఆదరబాదరగా బయటకు పంపడం కూడా జరుగుతుంది. ఈ చిత్రంలో ఎన్నో రహస్యాలు దాగి వున్నాయని అంటారు. డా వించీ కోడ్‌లో ఈ సంగతుల గురించి రాసినట్టున్నారు. జీసస్‌తోబాటు మేరీ మాగ్‌డలీన్ అనే ఆవిడ తోడుగా ఉండేదని, చిత్రంలో ఆమె రూపం, ఎమ్ అనే అక్షరం ఉండేవని అంటారు.
మిలాన్ రాకుమారుడు కోరిన మీదట లియొనార్డో ఈ చిత్రాన్ని గీశాడు. రాజకుమారుడు భోజనం చేసే బల్ల అటు చివరన గోడ మీద చిత్రం ఉంటుంది. అంతా కలిసి భోజనానికి కూర్చున్న భావం కలుగుతుంది. డావించీ ఈ బొమ్మను 1495లో మొదలుపెట్టి చిత్రించాడు. గోడ మీది గచ్చు ఆరేలోగా బొమ్మ వేయాలి. తైలవర్ణాలను వాడితే అవి సులభంగా ఆరడం లేదని తెలిసింది. అయినా 1498లో బొమ్మ ఎలాగో పూర్తయింది. పదహారవ శతాబ్ది మొదటి కాలంలో గోడలో తేమ చేరింది. తరువాత తలుపు పెట్టాలని గోడలో రంధ్రం వేయడంలో చిత్రం అడుగు భాగం కొంత పాడయింది. 1943 ప్రపంచ యుద్ధంలో ఆ భవనం నాశనమయింది. దాన్ని ఒకటికి రెండుసార్లు తిరిగి కట్టారు. ఇదంతా చెప్పడం ఎందుకంటే, ఒక కళాజీవి కష్టం గురించి ప్రపంచం పట్టించుకుంటుంది, పట్టించుకోదు అని అర్థంగావడానికి. మొత్తానికి లాస్ట్ సప్పర్ ఈనాటికీ అందరినీ ఆకర్షిస్తున్నది.
నాకు ఆసక్తి లేని విషయం లేదు, అని తరచు చెపుతూనే ఉంటాను. మొత్తానికి డా వించీ మీద పిచ్చి అభిమానం మొదలయింది. మైకేల్ ఆంజిలో గురించి కూడా అంతే ఆనందంతో చదివాను. బొమ్మలు చూచాను. ఆ మధ్యన ఒక పుస్తకం కవరు మీద లియొనార్డో గీసిన విట్రాలియన్ మాన్ చిత్రం వాడుకున్నాను. మగవాని శరీర సౌష్ఠవం గురించి కొలతలను చూపించే ఈ చిత్రం డా వించీ కళాఖండాలలో ఎంతో పేరు గలది. ఒక వలయంలో ఒక మనిషి శరీరం, గీతల బొమ్మగా ఉంటుంది. అతని కాళ్లు, చేతులు రెండు భంగిమలలో, అంటే మొత్తం నాలుగేసి ఉంటాయి. దుస్తులు లేని ఈ శరీరం బొమ్మ పుస్తకం మీద వేయడం బాగుండలేదని పుస్తకం ప్రచురించిన మిత్రులు అభిప్రాయం అభ్యంతరం తెలిపారు. నేను మంకుపట్టు పట్టాను. పుస్తకం ఆ బొమ్మతోనే వచ్చింది. లియొనార్డో డా వించీ మీద నాకుగల అభిమానానికి అదొక నిదర్శనం.
లియొనార్డో గురించి మొత్తంగా ఒక పుస్తకం రాయాలని మనసులో గట్టి కోరిక ఉంది. అందుకు తగిన సామగ్రి సేకరించి పెట్టుకున్నాను కూడా. ఎన్ని సంగతులు? ఎన్ని చిత్రాలు? డా వించీ తన డయరీలో తలకిందులు, కాదు, కుడి-ఎడమ తిరగేసిన పద్ధతిలో రాసుకునేవాడు. అవి అద్దంలో చూస్తే సరిగా కనిపించేవి. 1488లో లియొనార్డో ఒక ఎగిరే యంత్రాన్ని తయారుచేశాడు. అంతకు ముందే ఒక బోటు కట్టాడు. ఇతను తను గీసిన బొమ్మలలో ప్రయత్న పూర్వకంగా వేలిముద్రలను వదిలినట్లు ఆ మధ్యన కనుగొన్నారు. కొందరి తెలివి ఆశ్చర్యపరుస్తుంది. లియొనార్డో తెలివి అంతటితో ఆగదు!

కె. బి. గోపాలం