S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కిరాయి హంతకుడు

ఎడ్డీకి కోపం అదుపు తప్పింది. అతను లేచి తన కోటు జేబులోంచి పాయింట్ 38 కేలిబర్ స్మిత్ అండ్ వెస్సన్ రివాల్వర్ని బయటకి తీసి దాని గొట్టాన్ని వాగే అతని ఎడమ ముక్కులోకి పోనించాడు.
‘వెధవా. విను. నా వయసు డెబ్బై ఐదేళ్లు కావచ్చు. కాని నా చెవులు చక్కగా పని చేస్తున్నాయి. నువీ బార్లోకి వచ్చినప్పటి నించి నన్ను హేళన చేస్తున్నావు. నేను లేచి నీకు, నీ మిత్రులకి నా టేబుల్‌ని ఖాళీ చేసి ఇవ్వాలని నీ ఇష్టం వచ్చినట్లు నన్ను అవమానంగా మాట్లాడుతున్నావు. ఐనా నేను ఇవ్వను’
ఆ వెధవ మిత్రులు ముగ్గురూ వచ్చి ఎడ్డీకి వెనక నిలబడ్డారు.
‘మీరు ననే్నమైనా చేయదలుచుకుంటే గుండు మొదటగా మీ మిత్రుడి మెదడులోకి వెళ్తుంది. నా ముందుకి రండి’ ఎడ్డీ అరిచాడు.
వాళ్లు అతని ముందుకి వచ్చి నిలబడ్డారు. ఆ ముగ్గురూ కోపంతో కూడిన భయంతో ఎడ్డీ వంక చూశారు.
‘నేను ఈ బార్‌కి యాభై ఏళ్ల నించి వస్తున్నాను. ఇక్కడ నియమాలు మారవు. ఎవరు ముందు వచ్చి కూర్చుంటే ఆ టేబిల్ వాళ్లది. అవునా మేక్?’
గ్లాసులని తుడిచే లావుగా ఉన్న బార్ టెండర్ మేక్ ఎలాంటి భావాన్ని వ్యక్తం చేయకుండా చెప్పాడు.
‘అవును. డ్రింక్స్ తాగుతున్నంత సేపు ఆ టేబిల్ వారిదే’
‘విన్నారుగా? మీకీ నియమం నచ్చకపోతే తాగడానికి ఇంకో చోటికి వెళ్లండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి ముసలి కస్టమర్లని గౌరవించాలి. అర్థమైందా?’
మొహం ఎర్రబడ్డ ఆ యువకుడు అర్థమైందన్నట్లుగా చిన్నగా తల ఊపాడు. ఎడ్డీ రివాల్వర్‌ని వెనక్కి తీసుకున్నాక అతని ముక్కులోంచి రక్తం కారింది. తన రివాల్వర్ గొట్టానికి అంటిన రక్తాన్ని అతని తెల్ల షర్ట్ మీద సరిగ్గా గుండె దగ్గర ఇంటూ గుర్తు పెడుతూ తుడిచాడు. తర్వాత వెనక్కి వెళ్లాడు. ఆ యువకుడు తిరగబడితే అప్పుడే తిరగబడాలి కాబట్టి అప్రమత్తంగా చూశాడు. కాని అతను ఎడ్డీ చేతిలోని రివాల్వర్‌ని చూసి, ఆయన వంక క్రోధంగా చూస్తూ తన మిత్రులతో పాటు బయటకి నడిచాడు.
అక్కడున్న కొందరు వృద్ధులు చప్పట్లు కొట్టారు. ఎడ్డీ దాన్ని గుర్తించనట్లుగా బార్ కౌంటర్ దగ్గరికి వెళ్లి ఓ పెగ్ ఐరిష్ విస్కీ అడిగాడు.
‘వాళ్లు పోలీసులకి ఫోన్ చేయచ్చు’ మేక్ చెప్పాడు.
‘వాళ్లేం చేస్తారు? నన్ను అరెస్ట్ చేస్తారా? నాకు జైలంటే భయం లేదు. ఈ వయసులో జైలు ఓల్డేజ్ హోం లాంటిది. అన్నీ సమయానికి అందుతాయి.’
‘నువ్వు అతన్ని కాల్చనందుకు సంతోషం ఎడ్డీ. లేదా వాల్‌పేపర్ని మార్చాల్సి వచ్చేది’ మేక్ చెప్పాడు.
‘నీ కస్టమర్లు మళ్లీ రాకుండా చేసినందుకు సారీ మేక్. కాని వాళ్ల మాటల్ని వినలేక పోయాను’
‘నాకూ అలాంటి కస్టమర్లు వద్దు. పంపించి నాకు మేలే చేసావు’
ఎడ్డీ మరో పెగ్ గ్లాస్‌లో పోయించుకుని తన టేబిల్ దగ్గరికి వెళ్లాడు. అతని జాకెట్ చుట్టిన కుర్చీ ఎదురు కుర్చీలో కూర్చున్న ఒకామె కనిపించింది. ఆమె వయసు ఇరవై మూడు. దాదాపు పారిపోయిన ఆ యువకుల వయసే. ఎక్కువ మేకప్, వెండిచెవి పోగులు.
‘నేను జరిగింది చూసాను’ ఆమె మెచ్చుకోలుగా చెప్పింది.
ఎడ్డీ జవాబు చెప్పలేదు.
‘నువ్వు నా కోసం ఒకర్ని చంపాలి’ కొద్దిసేపాగి చెప్పింది.
ఎడ్డీ చుట్టూ చూశాడు. ఎవరూ తమ సంభాషణని వింటున్నట్లుగా లేరు. కాని దూరంగా ఉన్న దొంగ వస్తువులని కొనే ఫ్రేంకీ తమ వంకే చూస్తూ కనిపించాడు. ఎడ్డీ తన వైపు చూడగానే చూపు తిప్పుకున్నాడు.
‘నువ్వు తాగావా?’ ఎడ్డీ అడిగాడు.
‘లేదు. ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు’
‘నీ పేరు?’
‘లూసీ’
‘లూసీ. నేను కిరాయి హంతకుడ్ని కాను’
‘నీ దగ్గర రివాల్వర్ ఉంది. కొద్ది నిమిషాల క్రితం నువ్వు అతన్ని కాల్చి చంపడానికి కూడా సిద్ధపడ్డావు కదా?’
‘్భయపెట్టాను’
‘నువ్వు బార్ టెండర్‌తో జైలు వృద్ధాశ్రమం లాంటిదని చెప్పడం విన్నాను. ఎవర్నైనా చంపితే నువ్వు నష్టపోయేది ఏమీ లేదు’
‘దానర్థం నా జీవితంలోని ఆఖరి దశ కటకటాల వెనక గడపాలని కాదు’ ఎడ్డీ చెప్పాడు.
‘నువ్వు పట్టుబడతావని చెప్పానా?’
తను వినేది ఎడ్డీ నమ్మలేకపోయాడు. మేక్ వైపు తిరిగి తన గ్లాస్‌ని నింపమని సైగ చేసి ఆమెని అడిగాడు.
‘నీకేమైనా కావాలా?’
ఆమె తల అడ్డంగా ఊపి చెప్పింది.
‘నా హేండ్ బేగ్‌లో పదివేల డాలర్లు ఉన్నాయి’
‘పది వేల డాలర్లు నాకు దొరికితే నా చాలా సమస్యలు తీరుతాయి. అప్పుల్లోంచి బయటపడచ్చు. ఇరుకు గదిలోంచి మంచి గదిలోకి మారచ్చు’ అని ఎడ్డీ అనుకున్నాడు.
‘నీకంత డబ్బు ఎలా వచ్చింది?’ అడిగాడు.
‘వారసత్వపు డబ్బు. నా దగ్గర ఉన్నది అంతే. కాబట్టి ఎక్కువ అడగద్దు. నేను చెప్పింది చేస్తే అది నీకు ఇస్తాను’
‘నీ దగ్గర ఉన్న ఆఖరి సెంట్ దాకా ఖర్చు చేస్తున్నావంటే నీకది చాలా ముఖ్యమనుకుంటాను?’ ఎడ్డీ అడిగాడు.
‘అవును. అది జీవన్మరణ సమస్య’
‘ఎవర్ని చంపాలి?’ ముందుకి వంగి అడిగాడు.
‘చేస్తావా?’
‘నువ్వు నన్ను మళ్లీ జైలుకి పంపించే మఫ్టీలో ఉన్న పోలీస్ కాదని నాకేమిటి నమ్మకం?’
బదులుగా నవ్వి లూసి కాగితం మీద తన ఫోన్ నంబర్ని రాసిచ్చి చెప్పింది.
‘ఈ ఆఫర్ రేపీ సమయం దాకానే’
ఆమె వెళ్లగానే ఎడ్డీ ఆ కాగితాన్ని జేబులో ఉంచుకున్నాడు.
* * *
మర్నాడు మధ్యాహ్నం ఎడ్డీ బార్‌కి వెళ్తే మేక్ విచారంగా చెప్పాడు.
‘సారీ ఎడ్డీ. బార్ యజమాని నిన్ను రానివ్వద్దన్నాడు’
‘నిన్న జరిగిందానికా?’
‘కాదు. నువ్వు నీ బాకీ మొత్తం తీరిస్తే కాని నీకు డ్రింక్స్ ఇవ్వద్దన్నాడు’
ఎడ్డీకి తన మీద చల్లటి నీళ్లు కుమ్మరించినట్లుగా అనిపించింది.
‘ఇరవై ఏళ్లల్లో నేను ఎప్పుడైనా డబ్బు ఎగ్గొట్టానా?’ అడిగాడు.
‘నాకు అది తెలుసు.కాని నీకు అప్పు ఇవ్వద్దన్నాడు’
‘సరే. నేనింకో బార్ చూసుకుంటాను’
ఎడ్డీ కోపంగా బయటకి నడిచాడు. జేబులో చూసుకుంటే ఓ బాటిల్ కొనే డబ్బు లేదు. ఓ కాగితం చేతికి తగిలింది. తీసి చూస్తే దాని మీద ఓ ఫోన్ నంబర్ ఉంది.
* * *
గంట తర్వాత ఎడ్డీ లూసీని తన బిల్డింగ్ బయట కలుసుకున్నాడు. తను ఉండే గదిని ఆమె చూడటం ఆయనకి ఇష్టం లేదు. తర్వాత పోలీసులు ప్రశ్నిస్తే ఆమె తన గదికి వచ్చి వెళ్లిందని వాళ్లకి తెలీడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆమె తన జపనీస్ కార్లో ఆయన్ని ఎక్కించుకుని పోనిస్తూ చెప్పింది.
‘సగం డబ్బు తెచ్చాను. నీ కాళ్ల దగ్గర సంచీలో ఉంది’
ఎడ్డీ ఒంగొని దాన్ని అందుకోవాలనే కోరికని అదుపు చేసుకున్నాడు.
‘ఏదైనా బార్లో ఆగుదామా?’ అడిగాడు.
‘ఒద్దు. మనిద్దర్నీ ఎవరూ చూడటం నాకు ఇష్టం లేదు. మన మధ్య గల సంబంధం ఎవరికీ తెలీకూడదు’
‘మరి నిన్న రాత్రి? బార్లో కలిసాం కదా?’ ప్రశ్నించాడు.
‘అది కాకతాళీయం. మనిద్దరం అక్కడ కస్టమర్స్. ఇది చాలా తేలిక పని. లోపలకి నడిచి వెళ్లి అతన్ని కాల్చి చంపి, మళ్లీ నడిచి వెళ్లిపోవడమే. తర్వాత రివాల్వర్‌ని ఏదైనా నదిలో పారెయ్. పోలీసులు నిన్ను ఆ హత్యకి కనెక్ట్ చేయలేరు’
‘నేను ఇది చేస్తున్నానని ఎవరు చెప్పారు? అతనెవరో నాకు తెలీదు. అతన్ని ఎందుకు చంపాలి?’
ఆమె కారుని డెడ్ ఎండ్ స్ట్రీట్‌లోని ఎర్రటి ఇటుక రాళ్లతో కట్టిన ఓ భవంతికి కొద్ది దూరంలో ఆపింది.
‘అదే ఇల్లు. కింది అంతస్థు. కుడివైపు మూడో తలుపు’
ఎడ్డీ చూస్తే ఆ అపార్ట్‌మెంట్ కిటికీలు అన్నిటికీ తెరలు వేసి ఉన్నాయి. లోపలి టివి వెలుగు ఓ తెర మీద నృత్యం చేస్తోంది.
‘అతను ఎవరు?’ అడిగాడు.
‘నా బావ’ పళ్లు పటపట కొరికి చెప్పింది.
‘నీ కుటుంబ సభ్యుడేనా?’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘మా అక్క ఆ వెధవని నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వాడు ఆమెని కొడతాడు. ఉద్యోగం లేదు. డ్రగ్స్ వ్యాపారం. ఎంత చెప్పినా నా అక్క వాడిని వదలదు. ఓసారి గొంతు నులిమితే వాచడంతో స్ట్రా ద్వారా ఆహారం తీసుకుంది. ఏదో రోజు మా అక్కని చంపేస్తాడు’
‘అందుకనా?’
‘వాడు చాలా మంది చెడ్డవాళ్లకి అప్పున్నాడు. వాడి పేరు మెల్. కాబట్టి చంపితే అనుమానం వాళ్ల మీదకి వెళ్తుంది’
‘అతన్ని వదిలేయమని మీ అక్కకి చెప్పకపోయావా?’
‘చెప్పకుండా ఉంటానా? అది తెలిసి నేను వాళ్లింటికి వెళ్తే నన్ను చంపేస్తానని బెదిరించాడు. ఇప్పుడు మా అక్కని చూడాలంటే ఎక్కడో చూడాలి. లేదా కారు ఇక్కడ ఆపి మా అక్కకి ఫోన్ చేస్తే వచ్చి మాట్లాడుతుంది. అందువల్ల మెల్ చావాలి. ఆలోచించా కాని మా అక్క ఆనందం కోసం నాకు ఇంకో దారి కనపడలేదు. నేను మెల్‌ని ఎంతగా ద్వేషిస్తానో అందరికీ తెలుసు. కాబట్టి నేనా పని చేయలేను. పోలీసులు మొదటగా అనుమానించేది ననే్న. తెలిస్తే మా అక్క కూడా నన్ను క్షమించదు. కాని నువ్వా పనిచేస్తే...’
‘అర్థమైంది. నాకు, అతనికి సంబంధం లేదు. అతన్ని చంపే కారణం కూడా నాకు లేదు’
లూసీ చేత్తో దూరంగా ప్రవహించే నదిని చూపించి చెప్పింది.
‘వాడిని కాల్చి ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకుని ఆ రివాల్వర్‌ని అందులో పారేయ్. అది ముఖ్యం. లేదా పోలీసులు నీ రివాల్వర్ని పరీక్షిస్తే ఆ గుండు దాంట్లోంచే వచ్చిందని గ్రహిస్తారు. చాలామంది జైలుకి వెళ్లింది ఈ కారణంగానే.’
ఆమె కారుని యు టర్న్ తీసుకుని వెనక్కి పోనిస్తూ చెప్పింది.
‘నేను మా అక్కయ్యకి ఫోన్ చేసి పబ్లిక్‌లో మమ్మల్ని చాలామంది గుర్తించే చోటికి తీసుకెళ్తాను. నేను ఆమెని మళ్లీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే సమయానికి అది ఐపోవాలి’
‘ఇది మంచి పథకం. ఎప్పుడు?’ అడిగాడు.
‘రేపు రాత్రి’ చెప్పింది.
ఎడ్డీ వంగి నవ్వుతూ డబ్బు సంచీని అందుకున్నాడు.
* * *
ఎడ్డీ మర్నాడు బార్లోని మేక్‌కి తను చెల్లించాల్సిన మూడు వందల అరవై డాలర్ల బాకీని చెల్లించాడు. మేక్ ఐరిష్ విస్కీని గ్లాస్‌లో పోస్తూంటే చెప్పాడు.
‘ఒద్దు. చెప్పాగా. నేను మరో బార్ని చూసుకుంటానని. గుడ్ బై మేక్’
* * *
ఎడ్డీ ఆ సాయంత్రం మెల్ ఇంటి ప్రాంతానికి వెళ్లి దూరం నించి చూడసాగాడు. ఆ ఇంట్లోంచి బయటకి వచ్చినామె లూసీ కారు ఎక్కడం చూశాడు. సన్నగా ఉన్న అక్కకి లూసీ పోలిక లేదు. కారెక్కిన అక్కని లూసీ కౌగిలించుకున్నాక కారు వెళ్లిపోయింది. వాళ్లు ఎలిబీని సృష్టించుకోవడానికి వెళ్లిపోయారని అనుకున్నాడు.
ఎడ్డీ జాకెట్ జేబులోని రివాల్వర్ పిడిని పట్టుకుని డోర్ బెల్ బటన్ని నొక్కే ముందు గట్టిగా ఊపిరిని పీల్చుకుని వదిలాడు.
తలుపు తెరచుకుంది. మెల్ నోట్లో అంటించిన సిగరెట్ ఉంది. టి షర్ట్ మీద ఏదో పలికింది. అతని చేతుల మీద రంగురంగుల పచ్చబొట్లు, పాములు, చిరుత పులులు కనిపించాయి.
‘ఏం కావాలి ముసలాడా?’ అతను ప్రశ్నించాడు.
‘నీకో సమాచారం తెచ్చాను’ ఎడ్డీ చెప్పాడు.
‘ఏం సమాచారం?’
ఎడ్డీ సందేహించలేదు. జేబులోంచి రివాల్వర్‌ని తీసి మెల్ ఛాతీకి ఆనించి ట్రిగర్‌ని నొక్కాడు. వెంటనే మెల్ చేత్తో పొట్ట పట్టుకుని పిడికిలితో గుద్దినట్లుగా వెనక్కి తూలాడు. అతని నోట్లోంచి సిగరెట్ కింద పడిపోయింది.
‘మీ ఆవిడ నీకు గుడ్‌బై చెప్పమంది’
మరోసారి కాల్చగానే మెల్ నేలకూలాడు.

ఎడ్డీ ఇంటి తలుపు మూసి నది వైపు వేగంగా నడిచాడు.
* * *
మర్నాడు ఉదయం డోర్ బెల్ మోగితే ఎడ్డీకి మెలుకువ వచ్చింది. వెనీషియన్ బ్లైండ్స్‌లోంచి సూర్య కిరణాలు లోపలకి పడుతున్నాయి. ఎక్కువ తాగడంతో హేంగోవర్‌తో తల పగిలిపోతూంటే తూలుతూ తలుపు దగ్గరికి నడిచాడు.
బయట నిలబడ్డ లూసీని క్షణకాలం గుర్తు పట్టలేదు.
‘ఏమిటి?’ అడిగాడు.
‘వ్యవహారం పూర్తి కాలేదు’
ఆయనకి మిగిలిన డబ్బు సంగతి గుర్తొచ్చింది. ఆమెని లోపలకి రమ్మన్నట్లుగా సైగ చేశాడు. తలుపు మూసి ఆమె చేతిలోని సెమీ ఆటోమేటిక్ రివాల్వర్ తన పొట్టకి గురిపెట్టి ఉండటం చూసి నివ్వెరపోయాడు.
‘ఏమిటిది? నువ్వు చెప్పింది చేసాగా?’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘పని చక్కగా చేసావు. మెల్ పోయాడు. పోలీసులు నన్ను అనుమానించలేదు’ లూసీ చెప్పింది.
‘మీ అక్కని కూడా అనుమానించలేదు కదా?’
ఆమె చిన్నగా నవ్వింది.
‘ఆమె నా అక్క కాదు’
ఎడ్డీ ఆశ్చర్యంగా చూశాడు.
‘నా ఫ్రెండ్. ఆమె ప్రియుడు ఇప్పుడు పూర్తిగా నా వాడు. ఆ హత్య ఆమె చేసిందని పోలీసులు అనుమానించి అరెస్ట్ చేసారు’
‘ఐతే నువ్వు చెప్పిన కథంతా అబద్ధమా?’
‘చాలా భాగం నిజం. మెల్ చెడ్డవాడు. ఆమెని బాధించేవాడు. నా ప్రియుడికి ఈమె పరిచయం అవగానే.. మిగతాది నీకు అర్థమైంది’
ఎడ్డీ ఆమె చేతిలోని నల్లటి రివాల్వర్ వంక చూసి అడిగాడు.
‘మరి ఈ రివాల్వర్ ఏమిటి? నాకు సంబంధం ఉంది కదా? నన్ను అంతం చేస్తే మెల్ హత్యకి నిన్ను ముడిపెట్టే వ్యక్తి ఉండడనా?’
‘అవును. దినపత్రికలో చదివాక జరిగింది నువ్వు గ్రహిస్తావు’
ఎడ్డీలో కోపం తన్నుకు వచ్చి ఆమెని తిట్టాడు. ఆయన ఆవేశం తగ్గేదాకా లూసీ శాంతంగా వేచి ఉంది. తర్వాత అడిగింది.
‘నేను నీకు ఇచ్చిన ఆ డబ్బు ఎక్కడుంది?’
‘అది నా డబ్బు. నేను సంపాదించాను.’
‘పరలోకంలో నీకు దాని అవసరం లేదు. నాకివ్వు’
‘దాంట్లో చాలా భాగం ఖర్చు చేసాను. అప్పులు తీర్చాను’ చెప్పాడు.
‘దేని కోసం? లిక్కరా? అందుకే నువ్వు జీవించి ఉండకూడదు. తాగిన మత్తులో నువ్వు ఎక్కడో వాగుతావు’
ఎడ్డీ తల అడ్డంగా ఊపుతూ చెప్పాడు.
‘వాగను. అందువల్ల నాకే నష్టం’
కాని తను చెప్పేది ఆమె నమ్మడం లేదని గ్రహించాడు.
‘డబ్బు ఆ పరుపు కింద ఉంది’ చెప్పాడు.
ఆమె నలిగి, మాసిన ఆ పరుపు వంక అసహ్యంగా చూసి చెప్పింది.
‘నువ్వే తీసివ్వు’
ఎడ్డీ పరుపు కింద చేతిని చొప్పించి తడిమితే రివాల్వర్ పిడి తగిలింది.
లూసీ ఇచ్చిన డబ్బుతో గత రాత్రి బార్లో ఫ్రేంకీ నించి దాన్ని కొన్నాడు. మెరుపు వేగంతో వెనక్కి తిరిగి హేమర్ని వెనక్కి లాగి రివాల్వర్ గొట్టాన్ని లూసీ కళ్ల మధ్య గురిపెట్టాడు. ఆమె ఆ తాగుబోతు డబ్బిస్తాడని రిలాక్స్‌డ్‌గా ఉంది. ఈ ఆకస్మిక పరిణామాన్ని ఆమె ఎదురుచూడలేదు. కాల్చాలా? వద్దా అని లూసీ సందేహించింది కాని ఎడ్డీ సందేహించలేదు.
*
(స్టీవ్ బ్రీవర్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి