S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీరనారికి వందనం

భర్తకు సైన్యం అంటే ఇష్టం..
ఆర్మీ యూనిఫాం అంటే పిచ్చి..
ఉగ్రవాదులను తరిమేయడమంటే అతడికి మరీ ఇష్టం...
దేశరక్షణే అతడి ధ్యేయం..
అలాంటి భర్తను పొందినందుకు స్వాతి మహాధిక్ పొంగిపోయేది...
అతడి ఆదర్శాలంటే ఆమెకు గౌరవం... కానీ...
ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఓ పెద్ద విషాదం.. ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో భర్త కల్నల్ సంతోష్ మహాధిక్ అమరుడయ్యాడన్న వార్తతో ఆమె కుప్పకూలిపోయింది. వారం.. పదిరోజులు.. నిరాశానిస్పృహలు ముంచేస్తున్న వేళ...ఓ నిర్ణయం తీసుకుంది. భర్త ఆశయాలను అమలు చేయాలనుకుంది. అతడికి ఇష్టమైన ఆర్మీ యూనిఫాం తనూ ధరించాలనుకుంది. సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంది. బాధ పిండేస్తున్నా...విధివంచించినా భర్త ఆశయాల సాధన కోసం గుండెను దిటవు చేసుకుని సైన్యంలో చేరింది... అలా చేసింది ఆమె ఒక్కరే కాదు... ఒక్కో అమర సైనికుడి భార్య మరో సైనికురాలిగా తయారవుతున్నారు... క్లిష్టమైన బాధ్యతలు స్వీకరిస్తున్నారు..తమ భర్తల్లా.. ఓ స్వాతి, ఓ నిధి దూబే..ఇలా ఎందరో వీర వనితలు తుపాకీ చేతబట్టారు. వారికి వందనం. ఈ ఇద్దరూ ఇటీవలే సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో బాధ్యతలు స్వీకరించారు. వారి కథ వింటే మన హృదయాలు కదలిపోతాయ.
స్వాతి కథ ఇదీ...
మహారాష్టల్రోని సతారా జిల్లాలో పొగర్వాడి గ్రామానికి చెందిన స్వాతి పూనె విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమె భర్త కల్నల్ సంతోష్ మహాధిక్ సైన్యంలో సేవలందించారు. కాశ్మీర్‌లో విధులు నిర్వహించారు. హజీనాకా అడవుల్లో తీవ్రవాదులతో జరిగిన కాల్పుల్లో అతడు వీరమరణం పొందాడు. 2015 నవంబర్‌లో కుప్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న జీవనయానం చెదిరిపోయింది. 36 ఏళ్ల వయసులో ఈ కష్టాన్ని ఆమె ఎదుర్కోవలసి వచ్చింది. ఏం చేయాలో పాలుపోని స్థితి స్వాతి మహాధిక్‌ది. భర్త సాధారణ సైనికుడు కాదు. లెఫ్టినెంట్. సాహసి. పౌరులను, దేశాన్ని రక్షించే విషయంలో ఎప్పుడూ చురుకుగా వ్యవహరించేవాడు. నీటిలో మునిగిపోయిన సహచరులను, పౌరులను ఎన్నోసార్లు రక్షించాడు. ఇక తీవ్రవాదులతో పోరాటంలో అతడు ఓ సింహమే. దురదృష్టవశాత్తు ఓ సంఘటనలో అతడు అమరుడయ్యాడు. ఆ విషయం తెలిసి స్వాతి తెల్లబోయింది. జీవితం సాగించడం ఎలాగో అర్థం కాలేదు. ఆర్మీ దుస్తులంటే భర్తకు ఎంత ప్రాణమో గుర్తు తెచ్చుకుంది. హాంగర్‌కు వేళ్లాడుతున్న భర్త యూనిఫామ్‌ను స్ఫూర్తిగా తీసుకుంది. సైన్యంలో చేరాలన్న ఆకాంక్షను అధికారులకు తెలిపింది. కానీ
ఎస్‌ఎస్‌బి పరీక్షలు రాయాలంటే గరిష్ట వయోపరిమితి 27 ఏళ్లు. కానీ ఆమెకు ప్రభుత్వం ప్రత్యేక సడలింపు ఇచ్చింది. 36 ఏళ్ల వయసులో, గుండెనిండా విషాదం నిండిపోయినా పరీక్షలకు సిద్ధమైంది. భర్త పోయిన మరుసటి సంవత్సరం పరీక్ష రాసింది. ఎంపికైంది. 11 నెలల కఠోర శిక్షణ పూర్తి చేసింది. పూనె విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన స్వాతి మహాథిక్ నిజానికి ఓ టీచర్‌గా పనిచేసేవారు. ఆటిజం సమస్యతో బాధపడేవారికి ఆమె టీచర్. ఆ వృత్తికి భిన్నమైన రంగంలోకి ఆమె అడుగుపెట్టాల్సి వచ్చింది. పనె్నండేళ్ల కార్తీక్, ఆరేళ్ల స్వరాజ్ పిల్లలను బంధువులకు అప్పగించి నిశ్చల హృదయంతో కవాతు ప్రారంభించింది. పూనె ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ విభాగంలో బాధ్యతలు స్వీకరించింది. ‘నా భర్తలా నేనూ ఏదో రోజు సైన్యంలో చేరాలని భావించా. సవాలుగా స్వీకరించా. ఎట్టకేలకు సాధించా. నా ఉన్నతాధికారుల స్ఫూర్తి, మార్గదర్శకత్వంలో నా భర్త ఆశయాలు సాధిస్తా’ అంటోంది స్వాతి. లెఫ్టినెంట్ హోదాలో చేరినా తన భర్తలా కల్నల్ స్థాయికి వెళ్లాలన్నది తన లక్ష్యమని ఆమె అంటోంది. ఆమె భర్త పారాట్రూపింగ్‌లో మంచి నిపుణుడు. నీటి అడుగున యుద్ధంలో రాటుదేలిన అధికారి. అతడి ప్రతిభను, త్యాగాన్ని గుర్తించిన ప్రభుత్వం మరణానంతర శౌర్యచక్ర అవార్డును ప్రకటించింది. కుమారుడిని పంచగని, కుమార్తెను డెహ్రాడూన్‌లోని బోర్డు స్కూళ్లలో చేర్పించి అత్త, తల్లికి బాధ్యతలు అప్పగించి తను శిక్షణకోసం చెన్నై చేరుకుంది. ‘నేను టీచర్‌గా పనిచేసేదానిని. భర్త మరణవార్త నన్ను అచేతనురాలిని చేసింది. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉండేదానిని. భర్త స్ఫూర్తితోనే నెమ్మదిగా కోలుకున్నా. నా బలహీనతనే బలంగా మార్చుకున్నా. కష్టపడి అన్నీ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. 40కేజీల బరువున్న బ్యాగులను వీపుపై పెట్టుకుని 40 కిలోమీటర్ల దూరం పరుగుపెట్టడం వంటి కఠిన శిక్షణ కార్యక్రమాలను ధైర్యంగా సాగించా. ఇంత కష్టమైన శిక్షణ ఎలా పూర్తిచేసుకున్నానో తెలుసా. కేవలం నా భర్త ఆశయం నెరవేర్చాలన్న దీక్షతోనే’ అంటోంది ఆమె. ‘్భవిష్యత్ యుద్ధాలు భిన్నంగా ఉంటాయని భావిస్తున్నా. వ్యూహాలు, సాంకేతికత ప్రాధాన్యం సంతరించుకుంటాయని ఆమె అంటున్నారు. మహిళలకు ఈ రంగంలో అవకాశాలు కల్పిస్తే మగవారికి దీటుగా, ధైర్యంగా, సాహసంతో విధులు నిర్వహిస్తారనడంలో సందేహమే అక్కర్లేదన్నది ఆమె భావన. యుద్ధ విభాగాల్లోనూ మహిళలకు అవకాశాలు కల్పించాలని ఆమె కోరుకుంటోంది. భవిష్యత్‌లో ఆ అవకాశాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆర్మీలో ఏ విభాగంలో చేరాలనుకుంటున్నారని ప్రశ్నిస్తే..్ఫలానా అని నేను కోరను, ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానంటూ ఆత్మవిశ్వాసంతో..స్వాతి. ‘్భర్తపోయినప్పడు నిరంతరం ఏడ్చేదానిని, అది బాధ తగ్గించేది. నిజానికి భర్తను తిరిగి తీసుకురాలేను. ఏదో ఒకటి చేసి ఆయన ఆశయాన్ని నెరవేర్చాలి. అదే దీక్షతో సైన్యంలో చేరా. అనుకున్నది సాధించా’ అంటోంది. అకాడమిలో చేరేముందు స్వాతి తన భర్తను గుర్తు చేసుకుంది. ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరైన స్వాతి కోచ్‌తో మాట్లాడుతూ తను శారీరకంగా ఫిట్‌నెస్‌తోనే ఉన్నానా అని అడిగింది. తన భర్తతో కలసి వాకింగ్ వెళ్లేటపుడు అతడితో పోటీపడలేకపోయిన విషయాన్ని గుర్తుచేసుకుంది. శరీరం నుంచి స్వేదం చిందేలా వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటామన్న భర్త మాటలు గుర్తుకువచ్చి చిరునవ్వుతో అకాడమీలో పనులు చురుకుగా చక్కబెట్టేదాన్నని స్వాతి చెప్పింది. విధి వంచించినా మొక్కవోని ధైర్యంతో సైన్యంలో చేరిన వీరనారీమణులు చాలామందే ఉన్నారు. నీతా దేశ్వాల్ కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. మేజర్ అమిత్ దేశ్వాల్ భార్య ఆమె. మణిపూర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో ఆయన అమరుడయ్యారు. ఈ సంఘటన జరిగేనాటికి ఆమెకు మూడేళ్ల పిల్లాడు ఉన్నాడు. విషాదం నుంచి నెమ్మదిగా కోలుకున్న తరువాత నీతా దేశ్వాల్ ఇండియన్ ఆర్మీ సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షలు రాయడానికి కోచింగ్ తీసుకుంది. తన భర్త అమిత్ దేశ్వాల్ ఏ సంస్థలో శిక్షణ పొందాడో అక్కడే చేరింది. పరీక్షలు రాసి అవకాశం చేజిక్కించుకుంది. ఆమెకు కుటుంబ సభ్యులు, సైనికాధికారులు పూర్తిగా అండగా నిలిచారు.
ఆత్మవిశ్వాసం.. నిధి దూబె సొంతం
స్వాతి మహాథిక్ కథ ఒకటైతే.. నిధి దూబే వ్యథ మరొకటి. చెన్నై ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకుని సైన్యంలో చేరిన మరో అమర సైనికుని భార్య నిధి. భోపాల్‌కు చెందిన నిధి దూబె 21 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయింది. ఆమె భర్త ముఖేష్ దూబె సైనికుడిగా సేవలందించేవాడు. గుండెపోటుతో 2009లో మరణించాడు. పెళ్లయిన తరువాత కేవలం ఐదారునెలలు మాత్రమే అతడితో కలసి జీవించిన నిధి 21 ఏళ్లకే భర్తను కోల్పోయింది. నాలుగు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె ఈ విషాదాన్ని భరించాల్సి వచ్చింది. మగబిడ్డ పుట్టిన తరువాత ఎమ్‌బిఎ చేయాలని నిర్ణయించుకుంది. ఇండోర్‌లో చదివి తరువాత ధనలోని ఆర్మీ స్కూలులో పాఠాలు బోధించేది. కొన్నాళ్లు గడచిన తరువాత అమరవీరుల భార్యలను సైన్యంలోకి తీసుకునేందుకు పత్రికాప్రకటన వచ్చింది. అది చూసిన నిధి దూబే ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది. ‘సైన్యంలో చేరాలన్నది నా ఆశయం. అందుకోసం ఏమైనా, ఎంతకష్టమైనా చేయాల్సిందే’ అని నిర్ణయించుకున్నానంది నిధి. 2014లో అలా నిర్ణయించుకుంది. నెలకు 8330 రూపాయల పెన్షన్ ఇవ్వడం అప్పుడే మొదలైంది. భర్తను గుర్తు చేసుకుంటూ ఆ మొత్తంతో శిక్షణకు సిద్ధమైంది. జీవితాన్ని చక్కదిద్దుకుని, దేశ రక్షణలో ఇమిడిపోవాలన్నది ఆమె కాంక్ష. తెల్లవారు జామున 4 గంటలకు లేచేది. పరుగు...నడక ఇలా వ్యాయామాలు కొనసాగేవి. పిల్లాడ్ని చదివించేది. హోంవర్క్ చేయించేది. మరోవైపు పరీక్షలకు సిద్ధమయ్యేది. సాయంత్రం జిమ్‌లో ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం శిక్షణ పొందేది. చివరకు అనుకున్నది సాధించిందంటారు రిటైర్డ్ బ్రిగేడియర్ ఆర్ వినాయక్ సతీమణి జయలక్ష్మి వినాయక్. జయలక్ష్మి నిధిని అనుక్షణం ప్రోత్సహించినవారిలో ఒకరు. ఆమె భర్త పనిచేసిన మహర్ రెజిమెంటర్ సెంటర్ అధికారులు ప్రత్యేక అనుమతితో పరీక్షలకు శిక్షణ పొందే అవకాశం దక్కించుకున్న నిధి చివరకు లెఫ్టినెంట్‌గా శిక్షణ పూర్తి చేసుకుని స్వాతితోపాటు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఒ విషయం చెప్పుకోవాల్సి ఉంది. అనుకున్నదే తడవుగా ఆమెకు అవకాశం రాలేదు. ఐదుసార్లు ఎంట్రన్స్ రాస్తే చివరి ప్రయత్నంలో ఆమె ఎంపికయ్యారు.
మహిళాశక్తి
దేశ రక్షణమంత్రిగా నిర్మలాసీతారామన్ బాధ్యతలు స్వీకరించిన రెండోరోజు ఆర్మీలోకి ఇద్దరు మహిళలు లెఫ్టినెంట్ హోదాలో బాధ్యతలు స్వీకరించారు. ఒకరు స్వాతి మహాథిక్. అమర సైనికాధికారి సతీమణి. మరొరకు నిధి దూబె. అమరజవాను భార్య. ఈ ఇద్దరూ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణ పొందారు. నిజానికి రక్షణ దళాలలోమహిళల చేరిక మనదేశంలో ఆలస్యంగా మొదలైంది. 1990లో తొలిసారిగా మహిళలకు కొన్ని పరిమితులతో రక్షణ దళాలలో చేరికకు అనుమతి ఇచ్చారు. 14 ఏళ్లపాటు మాత్రమే పనిచేసే వెసులుబాటు ఇచ్చారు. ప్రస్తుతం 13 లక్షల బలమైన సైన్యంలో 60 వేల మంది ఉన్నతాధికారులు ఉంటే వారిలో మహిళలు వందల సంఖ్యలోనే ఉన్నారు. ఆర్మీలో 1436, నేవీలో413, వాయుసేనలో 1331 మంది మాత్రమే మహిళలకు అవకాశం ఇచ్చారు. న్యాయస్థానాలలో పోరాటం తరువాత మాత్రమే వారికి అవకాశం వచ్చింది. ప్రత్యేక విభాగాల్లో పర్మినెంట్ పద్ధతిని మహిళలను నియమించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం 340 మంది మహిళలు అధికారుల హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యుద్ధ విమానాలు, సముద్రాలలో ఉండే యుద్ధ నౌకలు, యుద్ధ బలగాలు, ఆర్టిలరీ విభాగాల్లో మహిళలకు అనుమతి లేదు. అయితే అమెరికా, రష్టా టర్కీ, పాకిస్తాన్ సహా పలు దేశాల్లో ఫైటర్ పైలట్లుగా మహిళలు సేవలు అందిస్తున్నారు. యుద్ధ నౌకల్లో మహిళలకు కల్పించిన దేశాలూ ఉన్నాయి. మన పొరుగునే ఉన్న శ్రీలంక, మలేసియా, చివరకు బంగ్లాదేశ్ కూడా మహిళలను యుద్ధనౌకల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించాయి. అణుక్షిపణులు, అణు జలాంతర్గాముల్లో పనిచేసేందుకు మహిళలకు అవకాశం కల్పించిన దేశం అమెరికా. ప్రత్యక్ష యుద్ధక్షేత్రాల్లో మినహా మిగతా అన్ని రక్షణ దళ విభాగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తున్న దేశాల్లో అమెరికా, బ్రిటన్ ఉన్నాయి. తాజాగా మన ఆర్మీలో మిలటరీ పోలీసులుగా మహిళలకు అవకాశం కల్పించే దిశగా తొలి అడుగులు పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వ విధానాలపై ప్రకటనలు వెలువడ్డాయి. మిలటరీ పోలీసు విధులు సైన్యం విధులకు కాస్తంత భిన్నంగా ఉంటాయి. సైనికుల తరలింపు, సైనిక వాహనాల తరలింపు, నియమనిబంధనల విషయంలో సైనికుల ఉల్లంఘనలు, ఎస్టాబ్లిష్‌మెంట్ వ్యవహారాల పర్యవేక్షణ, యుద్ధ సమయాల్లో సైనికులు, పౌర పోలీసులతో వ్యవహారాల నిర్వహణ విభాగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తారన్నమాట.

-కృష్ణతేజ